భారత్‌లో 1.4 బిలియన్ల జనాభా పోషక అవసరాలను తీరుస్తున్న పాల ఉత్పత్తి, ఉత్పత్తి పరంగానూ, ఉద్యోగ అవకాశాల కల్పన పరంగానూ అగ్రగామిగా ఉంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో 24% మన దేశంలోనే జరుగుతుండటం, గమనార్హం. అదేవిధంగా, బియ్యం ఉత్పత్తిలో 2వ స్థానం, గోధుమ 2వ స్థానం, చెరకు 1వ స్థానం, గుడ్ల ఉత్పత్తిలో 2వ, దినుసుల ఉత్పత్తిలో 1వ, పప్పు దినుసుల ఉత్పత్తిలో 1వ, తృణధాన్యాల ఉత్పత్తిలో 1వ స్థానంలో భారత్ నిలిచింది.
ప్రపంచ పాల ఉత్పత్తిలో 24% వాటానిస్తూ, 91 మిలియన్ల రైతుల ద్వారా, 310 మిలియన్ల పాడి పశువుల నుండి, 56% ఆవు, 44% గేదె పాల ఉత్పత్తి చేస్తూ, భారత్ తనదైన విశిష్ట స్థానాన్ని పదిల పరచుకుంటోంది.
పాడి పరిశ్రమ ద్వారా మహిళా సాధికారిత, పశుసంక్షేమం, ఉపాధి కల్పన, గ్రామీణాభివృద్ధి అనే నాలుగు స్తంభాలు చెక్కు చెదరకుండా ప్రత్యేకత చాటుతున్నాయి.
ముఖ్యంగా ఈ రంగంలో –
- పాల ఉత్పాదకత
- పశుజనాభాకన్నా నాణ్యతాగల పశువుల సంఖ్య పెరుగుదల
- కృత్రిమ మేధా పరిజ్ఞానం
- వ్యవస్థీకృతరంగ ప్రగతి
- విలువ జోడింపు
- డెయిరీ ప్రొటీన్ల వాడకం ద్వారా పోషణ
- వర్తులాకార అభివృద్ధి
- డెయిరీ ఉత్పత్తుల ఎగుమతి లాంటి రంగాల్లో విస్తృతమైన వ్యాపార అవకాశాలు ఉన్నాయి.
పాల ఉత్పాదకత పెంపుదల
ఈ రంగంలో జన్యు అభివృద్ధి, సెక్స్ సార్టెడ్ సెమెన్, ఐవిఎఫ్ లాంటి ప్రక్రియల ద్వారా మరింత పాల ఉత్పాదకతకు మార్గాలు అవసరం. పశుగ్రాసాలు, దాణా, మాగుడు గడ్డి, పశుగ్రాస సద్వినియోగానికి చర్యలు, పాడి పశువుల ఫారాల నిర్మాణం, పశుసంక్షేమం, పశు సంవర్థనం, పనివారల నిర్మాణాత్మక నైపుణ్యాల వినియోగం లాంటి అంశాలపై అధ్యయనం, సలహాలు, వ్యాపార అవకాశాలకు బాటలు వేయగలవు.
నాణ్యమైన పశువుల సంఖ్య పెంచుకోవలసిన అవసరం నేడు ఎంతైనా ఉంది. పశు ఆరోగ్యపరంగా, సత్వర పశురోగ నిర్ధారణ, పొదుగువాపు నివారణ, టీకాలను ఇప్పించడం, పొదుపుతో కూడిన పశుగ్రాస వినియోగం, పశు ఆహార సమతుల్యత, పశు ఆహార సద్వినియోగం, ఎద నిర్ధారణ, గర్భకోశ వ్యాధుల నివారణ, ఒత్తిడికి దూరంగా పశువుల పెంపకం, పాల ఉత్పత్తి, లీటర్ పాల ఉత్పత్తికి అయ్యే వ్యయం, పశువుల జీవనకాలం లాంటి అంశాలు ముఖ్యమైనవే.
డెయిరీ ఫారాల్లో సెన్సర్ల వినియోగం, యాప్ ల వినియోగం, కృత్రిమ మేధతో యాంత్రీకరణ నేటి రోజుల్లో అవసరమవుతున్నాయి.
విలువ జోడింపులో భాగంగా, జున్ను, యోగర్ట్, వే ఉత్పత్తులు, దేశీ ఉత్పత్తులు, లాక్టోజ్ రహిత ఉత్పత్తుల వినియోగ విస్తృతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి.
డెయిరీ ప్రొటీన్ల వినియోగం ఇప్పుడు క్రీడాకారులకే కాక, అందరూ ఆమోదించే ముఖ్య పోషన వనరుగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా డెయిరీ ఉత్పత్తుల ద్వారా ప్రొటీన్లు అందేలా ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌లో అవకాశాలు మెండుగా ఉన్నాయి.
వర్తులాకార ఆర్థిక వ్యవస్థ దిశగా నేడు పాడిపరిశ్రమ అడుగులు వేస్తోంది. బయోగ్యాస్ ఉత్పత్తి, బయో సిఎన్జి, కార్బన్ క్రెడిట్లు, సేంద్రియ ఎరువులు, వ్యర్థ జలాల పునర్వినియోగం, శక్తి పునరుత్పాదకతల్లో అవకాశాలు వెతుక్కోవచ్చు.
ఇక ఎగుమతుల విషయానికి వస్తే, పాల పొడి, వెన్న, నెయ్యి మార్కెట్ ఆసియా, ఆఫ్రికా, రష్యాలలో విపరీతంగా ఉంది. కాగా, ఆహార భద్రత పరంగా విషయాలు పరిమితులు విధిస్తున్నాయి. ప్రపంచంలో పాల ఉత్పత్తిలో 1వ స్థానంలో ఉన్నా, ఎగుమతుల్లో 1% కన్నా తక్కువ ఉండటం గమనార్హం.
రాబోవు దశాబ్దంలో విశ్వవిపణి భారత్ నుండి - పాల ఉత్పాదకత, అధిక ప్రోటీన్ల ఆహార ఉత్పత్తులు, విలువ జోడింపు, రైతు ఆధారిత అభివృద్ధి జరిగే విషయాలపై ఎన్నో ఆశలతో ఎదురు చూస్తోంది. రైతుస్థాయిలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి, పాల నాణ్యత పరిరక్షణకై ప్రోత్సాహకాలు, వివిధ దశల్లో పాల నిర్వహణ, వృత్తిపరమైన అంకిత భావం ఉంటేనే పాడి రైతుకు పాల ఉత్పత్తి లాభసాటిగా నిలుస్తుంది. ఆ దిశగా, రైతాంగం కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాక, ప్రభుత్వం, పాడి పరిశ్రమకు ఇతోధిక సహకారం అందిస్తేనే, సహకార డెయిరీలు రైతుకు న్యాయం చేయగలుగుతాయి.
- మధుసూదనరావు, జనరల్ మేనేజర్, విజయ డెయిరీ, హైదరాబాద్. ఫోన్: 9121160553

