ఎలినినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వాతావరణ తాపాలు గణనీయంగా పెరగటంతో పాటు తీవ్ర వర్షాభావాల వల్ల ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలలో పంటభూములు బీటలు పడి ఇప్పటికే వేసిన వరి, మిరప, ప్రత్తి, శనగ, వేరుశనగ వంటి అనేక పంటలు ఎండిపోతూ, తీవ్రమైన నష్టాలకు గురైన పేద, మధ్య తరగతి రైతుల గుండెలు ఆగిపోతున్నాయి. ఈ దుస్థితికి కేవలం ప్రకృతి మాత్రమే కారణం కాదు. అందుబాటులోని పరిమిత నీటిని సద్వినియోగం చేసుకొనటంలోనూ, జలవనరుల ప్రాజెక్టు గేట్ల నిర్వహణలోనూ మన అధికార యంత్రాంగం తగినంత ముందు చూపును ప్రదర్శించక పోవుటలోనూ, పై రాష్ట్రాల నుండి మనకు రావలసిన సాగు నీటిని సమర్ధవంతంగా సాధించుటలోనూ, వర్షపు నీటిని ఒడిసిపట్టుటకు ఇంకుడు గుంటలు, చెక్‌డామ్స్‌ వంటి గత ప్రభుత్వాలు చేపట్టిన పథకాల ప్రోత్సాహాన్ని కొనసాగించుటలోనూ, డ్రిప్‌ ఇరిగేషన్‌ వంటి నీటి పొదుపు విధానాలను ప్రోత్సహించడంలోనూ మన ప్రభుత్వాల నిర్లక్ష్యాలు కూడా కారణమే! ముందు చూపు లేకుండా అతి ఉదారంగా 24 గంటల విద్యుత్‌ సరఫరా వంటి జనాకర్షక పథకాల వల్ల భూగర్భ జలాలు దుర్వినియోగమై రానున్న రోజుల్లో తీవ్రనీటి ఎద్దడికి మన పాలకులే కారకులౌతున్నారనుటలో అతిశయోక్తి లేదు.

ఈ సంవత్సరం ఇప్పటికే సుమారు 30-40 శాతం వరి సాగు ఉత్పత్తి క్షీణించి వరిగడ్డికి తీవ్ర కొరత ఏర్పడింది. రాబోయే వేసవికి ఈ సమస్య మరింత జటిలం కానుంది. ఆకలి, దాహాలు తీర్చుకొనుటకు అడవుల నుండి వన్యమృగాలు పంట భూములు, జనావాసాలలోకి ప్రవేశించి తీవ్రంగా ఆస్తి నష్టాలను, ప్రాణహానినీ కలిగించే ప్రమాదం కూడా ఉంది.  కనీసం పాడి, పశుపోషణ, జీవాల పెంపకం, పెరటికోళ్ల పెంపకరంగాలలో నైనా సామాన్య రైతులకు కొంతైనా ఊతం లభిస్తే, వారు కొంతమేరకైనా ఉపశమనం పొందగల్గుతారు.

ఒక్కొక్క పాడి పశువు ధర లక్ష రూపాయలు దాటుతున్న ఈ రోజుల్లో అన్నార్తితో పశువుల ఉత్పత్తిపాటు ప్రాణాలు నష్టపోకుండా పటిష్ఠమైన ప్రణాళికలను రూపొందించాలి. పోషణ లోపాల వల్ల కృంగి కృశించి మరణించే పశువులకు భీమా కంపెనీలు పరిహారాన్ని చెల్లించే అవకాశాలు కూడా అంతగా ఉండవని గ్రహించాలి. పశువుల మేతగా ఉపయోగపడే అరటి, మామిడి, నేరేడు, మారేడు, మునగ, అవిసె, మర్రి, రావి, సుబాబుల్‌ తదితర ఆకులను సైతం సేకరించి తాజాగా లేదా మాగుడు గడ్డిగా కూడా వినియోగించవచ్చును. కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల వ్యర్థాలను సైతం మంచి మేతగా మేపవచ్చు.

నీటి కొరత వల్ల పశువుల్ని, పాకల్ని శుభ్రపరచటం తగ్గుతుంది. కాబట్టి పొదుగువాపు తదితర ప్రమాదకరమైన అంటురోగాలు ప్రబలే అవకాశాలు ఎక్కువైతాయి. పెరుగుచున్న వాతావరణ వేడి వల్ల పచ్చిపాలు త్వరగా పులిసిపోయి, విరిగిపోయి, పాల ఉత్పత్తిదారులు మరియు పాలసేకరణ సంస్థలు నష్టాలను చవిచూడవలసి ఉంటుంది. ఈ విషయాలలో ప్రత్యేక చర్యలు కూడా అవసరమే. 

ఇక పశుపోషణ సమస్యల గురించి ఆలోచిస్తే, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటపొలాలు, బీళ్లు బీటలు బారి నేలతల్లి పచ్చదనాన్ని కోల్పోయిన దృశ్యాలు ప్రతి చోటా కనిపిస్తున్నాయి. గత ఖరీఫ్‌లో కూడా మన వరిసాగు విస్తీర్ణం చాలా ప్రాంతాలలో తగ్గిపోయింది. పైగా ఇప్పటి వరి వంగడాలన్ని పొట్టివి కావటం వల్ల, వాటి పరిమాణం తగ్గటమే కాక వాటిలో రసాయనాల సాంద్రత ఎక్కువగా ఉండి పశువులకు గతి లేక మేపవలసిన పరిస్థితి. వాస్తవానికి నాణ్యమైన వరి గడ్డిలో కూడా పశువులకు ఉపయోగపడే పోషక పదార్థాలు అంతంత మాత్రమే కూడా! ఎండుమేతల మీద ఆధారపడే పశువుల త్రాగునీటి అవసరాలు దాదాపు రెట్టింపుకు పెరుగుతాయని కూడా గ్రహించాలి. కాబట్టి ప్రస్తుతం నీటి ఎద్దడి, విద్యుత్‌ కోతల కారణంగా ప్రతి పాడి రైతూ కనీసం మూడు రోజులకు సరిపడే శుభ్రమైన త్రాగునీటిని నిల్వ చేసుకోగల్గితే చాలా మంచిది.

పచ్చిమేత: ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రతిరైతు పిల్లిపెసర, జనుము వంటి గ్రాసాల సాగును ప్రారంభించాలి. ఇందువల్ల మంచి పచ్చిమేత లబించుటతోపాటు రాబోయే కాలానికి భూసారాలు సైతం మెరుగౌతాయి.

సూపర్‌నేపియర్‌, పారా, మేతమొక్కజొన్న, మేతజొన్న, హెడ్జ్‌ ల్యూసర్న్‌, స్టైలో హెమాటా, సిరాట్రో, వెల్వెట్‌ బీన్స్‌ తదితర గ్రాసాలను బావుల క్రింద, సాగు చేయగల్గితే సొంత పశువుల అవసరాలు తీరటమేకాక, లాభసాటి ధరలకు ఇతరులకు కూడా విక్రయించి అదనపు ఆదాయాలు పొందవచ్చును. 

అత్యధికంగా విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు కలిగిన అవిసె, మునగ, సుబాబుల్‌, నేరేడు, మామిడి తదితర చెట్ల ఆకులు కూడా దూడలు పడ్డలతో పాటు పెద్దపశువుల పోషక అవసరాలను చాలా వరకు తీర్చగలవు.  కరవు కాలంలో పశువులకు హైడ్రోపోనిక్‌ గ్రాసాలు, అజొల్లా వంటి సాంప్రదాయేతర మేతలు ఎంతగానో ఉపయోగపడి, పాల ఉత్పత్తిని కాపాడగలవు.

కేవలం పశువుల పాకలలోపల, మిద్దెల మీద, వరండాలలో సైతం 100 చదరపు గజాల స్థలంలో ఏర్పాటు చేసిన అరలలో అమర్చిన వంద ట్రేలలో పెరిగే మొలకల గ్రాసాలు 8-10 పశువుల మేత అవసరాలను తీర్చగలవు. విత్తిన కేవలం 7-8 రోజుల్లోనే 8-10 అంగుళాల ఎత్తుకు దట్టంగా పెరిగే ఈ మొలకలలో పశువులకు అవసరమైన చాలా విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభ్యమై పశువుల పోషకాహార అవసరాలను చాలావరకు తీర్చగలవు. ఈ హైడ్రోపోనిక్‌ గ్రాసాలను పెద్ద పశువులతో పాటు పెరిగే దూడలు, పడ్డలు, గొర్రెలు, మేకలకు, కోళ్లకు కూడా మేపవచ్చును.

అధిక శాతం అంటే కనీసం 80-85 శాతం మొలకెత్తే సామర్థ్యం కలిగిన, మొక్కజొన్న, జొన్న, శనగ, ఉలవ, బార్లీ, ఓట్స్‌, గోధుమ, అలసంద వంటి గింజలను ఎంపిక చేసుకోవాలి. అరలలో అమర్చిన సుమారు 24”þ18”þ4” కొలతలు కలిగిన దృఢమైన ప్లాస్టిక్‌ ట్రేలలో తాలు గింజలను తొలగించి, శుద్ధిచేయబడిన గింజలను ట్రేకు అర కిలో చొప్పున, ఒక రోజు మూట కట్టి నానబెట్టిన గింజల్ని పరవాలి. వీటిని రోజుకు రెండుసార్లు తుంపర నీటితో గానీ, వాటర్‌ స్ప్రింక్లర్ల స్ప్రేలతో కానీ తడుపుతూ 8-9 రోజులు పెంచితే అట్టకట్టిన పచ్చటి మేత మొలకలు తయారౌతాయి. ఒక్కొక్క యూనిట్‌లో 4-5 వరుసలలో అమర్చిన 16-20 ట్రేల నుండి వరుస క్రమంలో గ్రాసాన్ని సేకరించి నేరుగా పశువులకు మేపవచ్చును. అత్యంత పుష్టివంతమైన ఈ మొలకల దాణాలు ఎండుమేతలతోపాటు వాడి ఖరీదైన సమీకృత దాణాలపై ఖర్చును చాలా వరకు తగ్గించుకోవచ్చు.

మన ప్రభుత్వాలు వెంటనే తమ పరిధిలోని పాడి రైతులకు హైడ్రోపోనిక్‌ గ్రాసాల ఉత్పత్తికి అవసరమైన సామాగ్రిని, విత్తనాలను సబ్సిడీ ధరలకు అందించి మేలు చేయగల్గితే పాల ఉత్పత్తిదారులకు సత్వర మేలు చేకూరగలదు. గోశాలలు, గోసదన్‌లు, పశు పునరావాస కేంద్రాలలో విస్తృద స్థాయిలో హైడ్రోపోనిక్‌ గ్రాసాల ఉత్పత్తిని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది.

అజొల్లా సాగు: పశువుల పాకలు ఇంటి ఆవరణలు  మిద్దెల మీద కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నీటి మడులలో వివిధ జాతులకు చెందిన ఫెర్న్‌ నాచును పెంచి మంచి పుష్టికరమైన మేతగా అన్ని పశువులకు మేపవచ్చును. ప్రత్యేకంగా ధృఢమైన నీరుఇంకని ధృఢమైన ప్లాస్టిక్‌ టార్పాలిన్‌తో ఏర్పాటైన 6’þ4’þ9” మడులలో సారవంతమైన నల్లరేగడి మన్నును ఆపైన మినల్‌ మిక్చర్‌ కలిపిన పశువుల పేడ గుజ్జు ఏర్పాటు చేసి, ఆపైన 4-5 అంగుళాలు నీటిని నింపి ఎంపిక చేసిన, నాణ్యమైన 1.0-1.5 కిలోల అజొల్లా విత్తనాన్ని పరచాలి. 8-10 రోజుల్లో జాగ్రత్తగా ఒక్కొక్క మడిలో నుండి 80 శాతం అజొల్లాను సేకరించి నీటితో శుభ్రపరచి, పశువులకు మేపవచ్చును. ఎనిమిది మడులను ఏర్పాటు చేస్తే వరుస క్రమంలో రోజుకు ఒక మడి నుండి సేకరించిన 6-7 కిలోల పచ్చిగ్రాసం (ఎండుమేతలతో మేపితే) ఒక పశువు అవసరాన్ని తీర్చగలదు. రోజుకు 20-25 కిలోల అజొల్లా మేత ఒక సాధారణ పాడి పశువు ఆహార అవసరాలను చాలా వరకు తీర్చగలదు. అదనంగా 2-3 కిలోల వరిగడ్డిని అందిస్తే సరిపోతుంది. ఖరీదైన దాణాల అవసరం కూడా దాదాపు సగానికి తగ్గిపోగలదు. అజొల్లా మడులను పశువులు, కుక్కలు, పకక్షుల నుండి కాపాడుట చాలా అవసరం. తీవ్రమైన ఎండ తగల కుండా కూడా చూడాలి. ప్రతినెలా మడులను మినరల్‌ మిక్చర్‌ కలిపిన శుభ్రమైన ఒకరోజు మాగిన పేడ గుజ్జుతో బలవర్ధకం చేయాలి. 4-5 నెలలకు ఒకసారి మడులలోని మట్టిని తొలగించి సేంద్రియ ఎరువుగా పంటలకు, తోటలకు వినియోగించుకోవచ్చు.

మాగుడు గడ్డి సైలేజి: వివిధ రకాల పచ్చిగ్రాసాలు, చెట్ల ఆకులు, చిక్కుడు, బీర, బెండ వంటి మొక్కల ఆకులు, కాండాలు, గుర్రపు డెక్క వంటి కలుపు మొక్కల్ని సేకరించి, వాటిలో తేమ శాతం 40 శాతానికి తగ్గేవరకు ఆరబెట్టి తేమ ప్రవేశించకుండా పటిష్టంగా ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ షీట్‌ పరచిన గోతులలో నింపి, గాలి చొరకుండా దట్టించి, పైన ప్లాస్టిక్‌ షీటును కప్పి, ఆపైన మట్టితో నింపి పేడతో అలికి నిల్వ చేస్తే మరింత పుష్టివంతమైన, సులువుగా జీర్ణమయ్యే పుష్టివంతమైన మేతగా మారి సంవత్సర కాలానికి పైగా నిల్వ ఉంటుంది.

యూరియా నీటితో మాగవేసిన గడ్డి: మాంసకృత్తులుగానీ, ఖనిజాలు, విటమిన్లు గానీ లేని వరిగడ్డి వంటి నాసిరకం పంట వ్యర్థాలను 4 శాతం యూరియా ద్రావణం మరియు మినరల్‌ మిక్చర్‌తో కలిపి గాలి సోకకుండా పది రోజులకు పైగా గట్టిగా దట్టించి నిల్వ చేస్తే ఈ వ్యవసాయ వ్యర్థాలలోని మాంసకృత్తుల శాతం పారా వంటి నాణ్యమైన పచ్చిమేతల స్థాయికి పెరుగుతుంది. దీనిని దూడలకు తప్ప ఇతర పశువులన్నింటికీ మేపవచ్చును.

పశుగ్రాసాల దిగుమతి: అవసరమైతే పొరుగు రాష్ట్రాల నుండే కాక విదేశాల నుండి కూడా బేళ్లుగా చేసిన ఎండుగ్రాసాలను దిగుమతి చేసుకుని మన రైతులకు సబ్సిడీ ధరలకు అందించుటకు ముందుగా తగిన ఏర్పాట్లు చేయాలి.

పశువుల పునరావాస కేంద్రాల ఏర్పాటు: ఆకలితో అలమటించి మృత్యువాత పడకుండా ఉండే పేదల పశువులకు కరవు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా ఉంది.

సక్రమమైన నిర్వహణలో ఉన్న గోశాలలకు, ధార్మిక సంస్థలకు అవసరమైన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వాలు అందించాలి. పశుగ్రాసాల కొరత తీరేవరకు పాడి పశువులు-పనిపశువుల పంపిణీ వంటి సంక్షేమ పథకాల అమలును నిలిపివేస్తే మంచిది.

పరిమితంగా లభ్యమయ్యే పచ్చిగ్రాసాలు వృథాకాకుండా మేత తొట్లు, గడ్డికోత మిషన్ల వంటి సాధనాలను సబ్సిడీ ధరకు, అవసరమైన వారికి ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి.

జలలభ్యత మీదనే మన విద్యుత్‌ సరఫరా చాలావరకు ఆధారపడ్డ విషయం అందరికీ తెలిసిందే. పశువుల నిర్వహణలో విద్యుత్‌ సరఫరా ఆధార పడినందున మరియు విద్యుత్‌ సరఫరావేళలు, విద్యుత్‌ ధరలు అందుబాటులోనూ, అనుకూలంగానూ ఉండనందున ప్రతిరైతు తన మిద్దెలు, పశువుల షెడ్ల మీద సోలార్‌ విద్యుత్‌ ప్యానళ్లను అమర్చుకొని నిరంతరం అతిచౌకగా విద్యుత్‌ను పొంది తమ అవసరాలు తీర్చుకోగలరు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను వినియోగించుకో వలసిందిగా సూచిస్తున్నాను.

డా. యం.వి.జి. అహోబలరావు,  హైదరాబాద్‌. 93930 55611