అనాదిగా మన ప్రధాన వృత్తి వ్యవసాయం. ఎప్పటి నుంచో మన రైతులు వివిధ రకాల పంటలు పండిస్తూ ప్రజల ఆకలిని తీరుస్తూ తమ సాగుని కొనసాగిస్తూ వస్తున్నారు. వివిధ రకాల పద్ధతులు పాటిస్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటూ స్వేదం చిందించి సేద్యం చేస్తూ అందరి ఆకలిని తీర్చుతున్నారు గాని తమ ఆకలిని సక్రమంగా తీర్చుకోలేకపోతున్నారు. ఎక్కువమంది రైతులు పంటల సాగులో నష్టాలను చవిచూస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోతూ పెళ్ళాం పుస్తెలను తెగనమ్ముతూ సాగుని కొనసాగిస్తున్నారు. అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మన ఆకలిని తీర్చే అన్నదాతలు లోకాన్ని విడిచి, కుటుంబ సభ్యులను అనాధలను చేస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితులకు కారణాలు ఏమిటి? రైతుల సమస్యలకు పరిష్కారాలు దొరకవా? అని ఆలోచించి ఇలాంటి సమస్యలకు పరిష్కార మార్గాలు కావాలంటే వ్యవసాయంలో మెరుగయిన పద్ధతుల గురించి కక్షుణ్ణంగా అధ్యయనం చేసి పరీక్షించి క్షేత్రస్థాయిలో విజయం సాధించే అంశాలను రైతు లోగిళ్ళకు చేర్చగలగాలి. ఆవిధంగా చేసినపుడే మన రైతు మనుగడ సాగించగలడు. లేనట్లయితే మన భవిష్యత్తు అంధకారమే అనే విషయం అక్షర సత్యం. ఈ విషయాన్ని గ్రహించి రైతుబిడ్డగా తనవంతు బాధ్యత నిర్వర్తించాలనే తలంపుతో మెరుగయిన వ్యవసాయ పద్ధతుల పరిశోధనలో ముందుకు సాగుతున్నారు మన రైతునేస్తం జిట్టా బాల్‌రెడ్డి.
బాల్‌రెడ్డిది వ్యవసాయ నేపథ్యం. పరిస్థితుల ప్రభావం మరియు వివిధ రకాల కారణాల వలన బాల్‌రెడ్డి జీవితం అనేక మలుపులు తిరిగి ప్రస్తుతానికి వ్యవసాయ పరిశోధనలో స్థిరపడింది. యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరిలోని ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి తన పరిశోధనలకు వేదిక అయ్యింది. ఈ క్షేత్రానికి అమేయ కృషి వికాస కేంద్రం అని నామకరణం చేసి, అనేక ప్రయోగాలకు వేదిక చేసుకుని వివిధ రకాల పంటలు పండిస్తూ వస్తున్నారు. ఈ యజ్ఞంలో తన అర్ధాంగి జ్యోతిరెడ్డిని కూడా భాగస్వామిని చేసి మహిళలు తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు, మనం ఏరంగంలో ఉన్నా కూడా కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అని తెలియచెబుతున్నారు. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయంలో అదీను సేంద్రియ వ్యవసాయంలో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి. కుటుంబ సభ్యుల సహకారం లేనిదే సేంద్రియ వ్యవసాయం ముందుకు సాగదని బాల్‌రెడ్డి వివరించారు.

ప్రస్తుతం మన రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పెట్టుబడులు పెరగడం. పెట్టుబడులు పెరగటానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు వ్యవసాయం చేసే ప్రతి రైతూ పాడి పశువులను పోషిస్తూ పాడి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందుతూ పశువ్యర్థాలను పంటలకు అందిస్తూ నాణ్యమైన దిగుబడి పొందుతూ ఉండేవారు. కాని రాను రాను వివిధ రకాల కారణాలు, వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టడం వలన రైతులు పాడిపశువులకు దూరం జరిగి పూర్తిగా రసాయనాలమీదనే ఆధారపడి పంటలు సాగు చేయటానికి అలవాటు పడ్డారు. విచక్షణా రహితంగా రసాయనాలు ఉపయోగించడం వలన పంటలపై చీడపీడల ప్రభావం పెరిగింది. వీటి నివారణకు తిరిగి రసాయన పురుగు మందులు లాంటి వాటి కోసం మరలా ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ విధంగా పంటల సాగు ఖర్చు ఏఏటికాయేడు పెరుగుతూ వస్తుంది. దీనికి పరిష్కారం రైతులు రసాయనాలకు దూరం జరిగి తిరిగి పశుపోషణ చేపట్టి పశువ్యర్థాలను మరియు వివిధ రకాల సేంద్రియ పద్ధతులను ఉపయోగిస్తూ పంటల సాగు కొనసాగించడమే కాబట్టి బాల్‌రెడ్డి ఆ దారిలో నడుస్తూ గత 10 సంవత్సరాలకు పైగా ఈ క్షేత్రంలో ఏ విధమైన రసాయనాలు వినియోగించకుండా పూర్తి ప్రాకృతిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ వస్తున్నారు. ఇందుకుగాను పాడి పశువులను కూడా పోషిస్తూ వాటి వ్యర్థాలను తన పంటల సాగులో వినియోగిస్తూ వస్తున్నారు. ఈ పద్ధతిలో రసాయనాలకు దూరం జరగడం జరిగింది కానీ పశువుల ఎరువు మరియు జీవామృతం లాంటి వాటిని మొక్కలకు అందించాలంటే కూలీలపై ఆధారపడవలసి వస్తుంది. కూలీ రేట్లు పెరగటంతో పాటు కొంతమంది కూలీలు గోవు వ్యర్థాలతో తయారు చేసిన జీవామృతం లాంటి వాటి వాసన భరించలేక పనికి దూరంగా ఉంటున్నారు. దానికి పరిష్కారంగా మానవ వనరుల వినియోగం లేకుండా జీవామృతం లేక ద్రవ సేంద్రియ ఎరువులను భూమికి అందించటానికి సులువైన పద్ధతిని పరిశోధించి అమలు పరుస్తున్నారు. ఈ పద్ధతి వలన ఒక దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లు కూలీల ఖర్చు తగ్గడముతో పాటు, కూలీల అవసరం లేకుండా చేయడం మరియు ఎరువుల యొక్క వృథాని తగ్గించడం జరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరగడం బాల్‌రెడ్డి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఈ పద్ధతికిగాను వారు 12000 లీటర్ల సామర్ధ్యం గల కుంటను తవ్వించి ఆ కుంటలో నీరు ఇంకకుండా నల్లరంగు ప్లాస్టిక్ పట్టాను పరచారు. ఆవు మూత్రం, ఆవుల పాక కడిగిన నీటిని ఒక పంపు సహాయంతో ఈ కుంటలోకి వచ్చేలా ఏర్పాటు చేసుకుని అందులో నీటిని, పేడను మరియు ఇతర పదార్థాలను కలిపి పంటలకు అందిస్తుంటారు. పంటలకు అందించటానికి కూడా మానవ వనరుల వినియోగం లేకుండా మాములుగా పంటలకు నీటిని అందించే పైపుకి అనుసంధానం అయ్యి జీవామృతం మరియు నీరు కలిసి వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకున్నారు. (ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కొరకు బాక్స్ చూడగలరు), మానవ వనరులతో పాటు ప్రస్తుతం రైతులు ఉపయోగించే రసాయనిక పురుగు మందులు కూడా సాగు పెట్టుబడులను పెంచుతున్నాయి. విచక్షణా రహితంగా రసాయనాలు ఉపయోగించడంతో పాటు సారం లేని నేలలో పెరిగిన మొక్కలో రోగనిరోధక శక్తి లోపించడం వలన పంటలపై చీడపీడల ప్రభావం పెరిగి రసాయనాలు ఉపయోగించే కొలది చీడపీడలు నిరోధక శక్తిని పెంచుకుని ఎంత ఖర్చు పెట్టి రసాయనాలు ఉపయోగించినా కూడా చీడపీడలు నివారించలేకపోవడం లాంటి పరిస్థితులు రైతులకు ఎదురవుతున్నాయి. ఇందుకు ఉదాహరణగా ఇటీవల మిరప రైతులు ఎదుర్కొన్న నల్ల తామర పురుగు. మిరప రైతులను నల్ల తామర పురుగు విపరీతంగా ఇబ్బందులకు గురి చేసింది. కొంతమంది రైతులు వీటిని నివారించలేక పంటను వదలి వేసుకున్నారు. ఇలాంటి సమస్యలకు హోమియో మందులు పనిచేస్తాయి అని గ్రహించి తాను సాగు చేసే పంటలపై హోమియో మందులు పరీక్షించి విజయం సాధించిన తరువాత తోటి రైతులకు తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం అనేకమంది మిరపతో పాటు ఇతర పంటల సాగు చేసే రైతులు బాల్‌రెడ్డి సలహాల మేరకు హోమియోమందులు ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో తమ పంటలను చీడపీడల నుండి రక్షించుకున్నారు అని బాల్‌రెడ్డి వివరించారు. ఈ హోమియో మందులు రైతులు ఎవరికి వారు వారికి అందుబాటులో ఉన్న హోమియో దుకాణాల నుంచి నాణ్యమైనవి కొనుగోలు చేసుకుని ఉపయోగించవచ్చు. కాని మోతాదు మాత్రం తప్పనిసరిగా పరిమితులకు లోబడే వినియోగించాలి. మోతాదు పెంచినట్లయితే పంట నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి హోమియో మందుల వివరాలు మరియు మోతాదు వివరాలు ఆయనను సంప్రదించి నిర్ధారించుకోవాలని బాల్‌రెడ్డి రైతులను కోరుతున్నారు

రైతులు పెట్టుబడులు తగ్గించడంతో పాటు సంవత్సరం పొడవునా పంట దిగుబడులు అందుబాటులో ఉన్నట్లయితే రైతులకు ఆదాయం పెరుగుతందని గ్రహించారు బాల్‌రెడ్డి. అటువైపు ఆలోచించి పండ్ల మొక్కలను ఉదాహరణగా తీసుకుంటే మామిడి, బత్తాయి లాంటి పండ్లు సంవత్సరములో కొన్ని నెలలు మాత్రమే పంట దిగుబడి వచ్చే రకాలు ప్రస్తుత మన రైతులు సాగు చేస్తున్నారు. దానికి పరిష్కారంగా వియత్నాం, మలేషియా, ఫిలిప్పెయిన్స్ మొదలగు దేశాలలో అందుబాటులో ఉండే పండ్ల మొక్కలు సంవత్సరం పొడవునా పంట దిగుబడిని ఇచ్చే వాటిని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తెప్పించి తమ పరిశోధనా క్షేత్రంలో పరిశీలిస్తున్నారు. పరిశోధించి అన్ని అంశాలు అనగా దిగుబడి, రుచి, నేల అనుకూలత, చీడపీడలను తట్టుకునే గుణం లాంటి వాటిని ప్రత్యక్షంగా తమ క్షేత్రంలో పరిశీలించి అన్నీ అనుకూలంగా ఉంటేనే రైతులకు అందచేస్తూ ఏ అంశంలోనైనా తనకు నమ్మకం కుదరకపోతే ఆ రకాన్ని తన క్షేత్రానికే పరిమితం చేస్తూ రైతులకు చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని బాల్‌రెడ్డి వివరించారు. కుటుంబ సభ్యుల సహకారంతో పంటలసాగు, పశుపోషణని కొనసాగిస్తూ మెరుగయిన వ్యవసాయ పద్ధతుల పరిశోధనలో చిత్తశుద్ధితో బాల్‌రెడ్డి కృషి చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరిన్ని వివరాలు 8978221966 కి ఫోను చేసి తెలుసుకోగలరు.
ఖర్చు లేకుండా జీవామృతాన్ని పంటలకు అందించే పద్ధతి
ప్రకృతి వ్యవసాయంలో మన దేశీయ గోవులు, ఆగోవుల వ్యర్థాలతో తయారు చేసుకొనే జీవామృతం లాంటివి ప్రముఖపాత్రను పోషిస్తున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఈ జీవామృతంలో పిండి, ఆవుపేడ మొదలగునవి కలుపుతారు, కాబట్టి వడకట్టడం ఇబ్బందులతో కూడుకుని ఉంది. కాబట్టి జీవామృతాన్ని పంటలకు అందించాలంటే రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది రైతులు కూలీల సహాయంతో మొక్కల పాదులలో పోయిస్తున్నారు. కాలువల ద్వారా నీటిని అందించే రైతులుకు పెద్దగా ఇబ్బంది ఉండదు కాని రెయిన్‌గన్, స్ప్రింక్లర్స్, డ్రిప్పు ద్వారా పంటలకు నీటిని అందించే రైతులు జీవామృతం మొక్కలకు అందించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి రైతులు మరియు తన సౌకర్యార్థం బాల్‌రెడ్డి ఒక పద్ధతిని అమలు పరుస్తున్నారు. తాను కూడా పంటలకు నీరు అందించటానికి డ్రిప్పు వ్యవస్థని ఉపయోగిస్తున్నారు కాబట్టి కొత్త పద్ధతి గురించి శోధించి ఏలాంటి ఇబ్బంది లేకుండా జీవామృతం పంటలకు అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకుగాను సుమారు 6 అడుగుల లోతులో 12000 లీటర్ల సామర్థ్యం గల చిన్న కుంటను తవ్వించి ఆ కుంటలో అడుగు భాగాన నీరు ఇంకకుండా ప్లాస్టిక్ షీట్ పరిచారు. మాములుగానే బాల్‌రెడ్డి పంటలకు నీటిని అందించడానికి ఫారమ్ పాండు తవ్వుకున్నారు. ఈ ప్రాతంలో నీటి లభ్యత సక్రమంగా ఉండదు కాబట్టి బోరు నుంచి నేరుగా డ్రిప్పుద్వారా పంటకు అందించడంలో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఫారమ్‌పాండు తవ్వించి అందులో ప్లాసిక్ షీటు పరచి బోర్ల నుండి ఫారమ్ పాండ్‌లోకి నీటిని నింపి ఫారమ్ పాండులోని నీటిని మోటారు సహాయంతో పంటలకు డ్రిప్పు ద్వారా పంపిస్తుంటారు. జీవామృతం టాంకులో అందుకు అవసరమయిన పదార్థాలను కలిపి జీవామృతం తయారు చేసుకుంటారు. ఈ జీవామృతం ఫిల్టరు అవటానికి వీలుగా 4 లేదా 5 వరుసల నైలాన్ మెష్‌ను ఫుట్‌వాల్‌కి చుట్టి ఆ ఫుట్‌వాల్‌ని జీవామృతం టాంకులో వదులుతారు. ఈ ఫుట్‌వాల్ జీవామృతం ట్యాంకులో అడుగువరకు వెళ్ళకుండా ఎంతలోతులో ఫుట్‌వాల్ ఉండాలో అంత పొడవు తాడు కట్టి ఆ తాడు చివర రెండు ప్లాసిటక్ డబ్బాలను కట్టి ఫుట్‌వాల్‌ని జీవామృతం ట్యాంకులో వదులుతారు. ఆ ఫుట్‌వాల్‌కి కట్టిన ప్లాస్టిక్ డబ్బాలు జీవామృతం ట్యాంకులో పైన తేలుతూ ఫుట్ వాల్‌ను అడుగు వరకు చేరకుండా ఆపుతాయి కాబట్టి అడుగున పేరుకున్న మడ్డి (దీనిని తరువాత మొక్కల పాదులలో లేదా నేలకు అందిస్తుంటారు) అలానే ఉంటూ పైన ఉన్న జీవామృతం మాత్రమే ఫుట్‌వాల్‌కి అమర్చిన పైపు ద్వారా పంటలకు నీరు అందించే ట్యాంకులో అమర్చబడిన పైపుకు అనుసంధానం చేయబడుతుంది. ఈ మధ్యలో ఒక వాల్‌ని కూడా అమర్చి అవసరము లేకుంటే వాల్‌ని మూసివేస్తే జీవామృతం వెళ్ళకుండా కేవలం నీరు మాత్రమే వెళ్ళేలా ఏర్పాట్లు చేసుకున్నారు. పంటకు నీటిని అందించే సమయంలో నీటితో కలిసి పీడనశక్తి ద్వారా జీవామృతం కూడా వెళుతుంది కాబట్టి జీవామృతం యొక్క వినియోగ శక్తి మెరుగవడంతో పంటలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పంటలు ఆరోగ్యంగా పెరుగుతున్నాయి. జీవామృతంతో పాటు కోడి ఎరువు మరియు ఏవిధమైన సేంద్రియ లేదా ప్రకృతిసిద్ధమైన ఎరువులను మనుషుల సహాయం అవసరం లేకుండా ఈ పద్ధతి ద్వారా పంటలకు పంపించడం వలన ఖర్చు తగ్గిస్తున్నాయని, ఈ పద్ధతిని చాలామంది రైతులు అనుసరిస్తూ తమ సాగు ఖర్చు తగ్గించుకుంటున్నారని బాల్‌రెడ్డి వివరించారు.
