వేసవిలో పశువుల సంరక్షణ చాలా అవసరం. ప్రస్తుతం రోజురోజుకీ వేసవి తాపం పెరిగిపోతున్నది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనివలన పశువులు వడదెబ్బకు గురవుతున్నాయి. దీనివలన పాల దిగుబడి తగ్గిపోతుంది. రొప్పుతూ మేత మేయక, శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగి, రోగ నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనివలన రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, దేశ ఆర్థిక ప్రగతికి నష్టం వాటిల్లుతోంది. అందుకు వేసవిలో సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పశువులను సంరక్షించుకోవటంతో పాటు, పాడికి రక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాం.
వేడి ఒత్తిడి – ప్రభావం: పశువులు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. ముఖ్యంగా ఆవుల కంటే గేదెలు ఉష్ణ తాపానికి ఎక్కువగా గురవుతాయి. ఎందుకంటే గేదెల్లో నల్లని శరీరం వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది మరియు చెమట గ్రంధులు తక్కువగా ఉంటాయి. దేశీయ ఆవులు, సంకర జాతి ఆవులు మరియు విదేశీ జాతి ఆవులు కంటే ఎక్కువ వేడిని తట్టుకోగలవు. ఎందుకంటే దేశీ ఆవులు తక్కువ వేడి ఉత్పత్తి చేస్తాయి మరియు వేడి కోల్పోయే అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత ఒక్కోసారి 110 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు పెరగటం, వాతావరణ ఉష్ణోగ్రత (అనుకూల ఉష్ణోగ్రతలు 24-260బీ సంకరజాతి ఆవులకు, 330బీ దేశి ఆవులకు మరియు 360బీ గేదెలు) పెరగడం వలన అంతర్గత ఉష్ణోగ్రత సరిగ్గా సమతుల్యంలో ఉండక పెరుగుతుంది. దీనివలన చెమటలు, నోటి నుండి చొంగ ధారాళంగా కారుతుంది. నోటిద్వారా శాసించటం (పాంటింగ్). విశ్రాంతి లేకపోవడం. ముట్టె ఎండిపోతుంది. ఎక్కువ దాహానికి గురవుతాయి. మరీ ముఖ్యంగా మేతను సరిగా తినకపోవడం జరుగుతుంది. దీని వలన శరీరంలో గ్లూకోజు నిల్వలు తరిగిపోయి పశువులు క్రమంగా నీరసించి, బలహీనపడతాయి. ఒక్కొక్కసారి అపస్మారక స్థితికి చేరుకొని మరణిస్తాయి. గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో (కోస్తా జిల్లాలు) ఉష్ణోగ్రత ప్రభావానికి పశువులకు వడదెబ్బ తగులుతుంది. దీనివలన ఆవులు మరియు గేదెలు ఎండ తీవ్రతకు గురై పాల దిగుబడి తగ్గిపోతుంది. పాలలో వెన్న శాతం, మాంసకృత్తులు శాతం తగ్గుతుంది. పశువులు త్వరగా పొదుగు వాపు లాంటి వ్యాధుల బారిన పడతాయి. పునరుత్పత్తి సామర్ధ్యాన్ని కోల్పోతాయి. పెరుగుతున్న పశువులలో బరువు పెరుగుదల తగ్గుతుంది. ఎద లక్షణాలు తక్కువగా కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి క్షీణించి పోయి, ట్రీపనోసో మీయాసిస్, ఫైలేరియాసిస్ మరియు మైక్రోఫైలేరియా వంటి వ్యాధులకు గురవుతాయి. కొన్ని సందర్భాల్లో పశువుని కోల్పోవలసి వస్తుంది. దీని ప్రభావం రైతు ఆర్థిక పరిస్థితిపై పడుతుంది.హార్మోన్ల సమతుల్యత కోల్పోయి సరైన సమయంలో ఎదకు రాక పోవడం జరుగుతుంది మరియు ఈతల మధ్య వ్యవధి పెరిగి రైతులకు నష్టం వాటిల్లుతుంది.
యాజమాన్య పద్ధతులు:
దేశవాళి ఆవులు వేసవిని, ఎండలను తట్టుకుంటాయి. కాబట్టి గేదెలకు మరియు సంకరజాతి ఆవులకు వేసవి నుండి రక్షణ కల్పించాలి. ముఖ్యంగా గాలిలో తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పశువులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం.
గృహవసతి – సంరక్షణ:
ఎండ నుండి పశువులను రక్షించాలంటే వాటిని ఎల్లప్పుడూ చల్లగా చెట్ల నీడలో కట్టి పెట్టాలి. పశువుల షెడ్ల చుట్టూ నీడనిచ్చే చెట్లను పెంచడం చాలా మంచిది ఎందుకంటే పశుగ్రాసాల్లా ఉపయోగపడతాయి. కొన్ని సందర్భాల్లో చెట్ల నీడ అందుబాటులో లేని పరిస్థితుల్లో పశువులను పై కప్పు గల పాకలో పెట్టటం మంచిది. గృహ వసతి అనేది ఎండ తీవ్రత నుండి రక్షణ కల్పించే విధంగా అనువుగా ఉండాలి. పశువుల పాకలు ఎత్తయిన ప్రదేశంలో గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఉండాలి. పాకల ఎత్తు 9-15 అడుగుల ఎత్తు ఉండేలా చూసుకోవాలి. పశువుల షెడ్లలో పైకప్పు రేకులతో ఉంటే దానిని వరిగడ్డి తో గాని తాటాకులతో గాని కప్పడం మంచిది. దాన్ని తరచుగా నీటితో తడుపుతూ ఉంటే మంచిది. పశువుల షెడ్ల చుట్టూ చాపలు మరియు గోతాములతో కప్పి మధ్యాహ్న సమయంలో నీటితో తడపడం వలన పాకలు, షెడ్లు చల్లగా ఉంటాయి మరియు సూర్యరశ్మి నేరుగా పడకుండా చేస్తూ చల్లని వాతావరణ పరిస్థితులను సమకూరుస్తాయి. షెడ్లలో ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఫ్యాన్లు షెడ్లలోని తేమ మరియు వేడిని సమతుల్యం చేస్తాయి. షెడ్లలో ఎల్లప్పుడూ నీటిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

ఎందుకంటే నీరు ఎక్కువగా తాగిన కొద్ది శరీరంలో వేడి తగ్గిపోతుంది. పగటిపూట గేదెలను రెండు మూడుసార్లు నీటితో కడగటం మంచిది. అదేవిధంగా గేదెలను మధ్యాహ్నం 2-3 గంటలు చెరువులో ఉండటం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల పశువులను వేడి తాపం నుండి కాపాడుకుని, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు పాల ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్థ్యాన్ని సక్రమంగా ఉంచుకోవచ్చు.

అధిక వేడి తాపం వలన పశువులు వేసవికాలంలో ఎక్కువగా ఆహారం మరియు మేతను తీసుకోలేవు మరియు జీర్ణ వ్యవస్థ సన్నగిల్లుతుంది. దీనివల్ల పాల దిగుబడి మరియు పునరుత్పత్తి సామర్థ్యం క్షీణిస్తుంది. అందువలన వేసవిలో పశువుల పోషణ ఎంతైనా అవసరం.
పశువులను ఉదయం 10 గంటల లోపు మరియు సాయంత్రం నాలుగు గంటల తర్వాత మేతకు పంపడం అనువైన సమయం. మిట్టమధ్యాహ్నం 11 నుంచి 3 గంటల లోపు మేపుకు పంపినట్లయితే, వేసవి తాపానికి గురై వడదెబ్బ తగిలే ఆస్కారం ఉంది. ముఖ్యంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. పశువులు వేసవిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువగా జీర్ణించుకోలేవు. కాబట్టి వాటిని తగ్గించి, శక్తినిచ్చే పిండి పదార్థాలు అయినటువంటి గంజి, జావ లాంటి పదార్థాలు ఎక్కువగా ఇవ్వడం మంచిది. ఇది గేదెలలో మరీ ముఖ్యం. అధిక వేడి వలన శరీరంలో జీర్ణక్రియ సరిగ్గా జరగదు. దీని వల్ల జీర్ణరసాలు తగిన మోతాదులో ఉత్పత్తి కావు. అందువల్ల పశువులను రోజుకు రెండు మూడు సార్లు నీటితో కడిగి నట్లయితే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా జావ, మినరల్ మిక్చర్, ఉప్పుకలిపిన ద్రావణం తగిన మోతాదులో మిశ్రమ దాణతో కలిపి ఇవ్వటం మంచిది.
విటమిన్ ఏ సరైన మోతాదులో శరీరంలో ఉన్నట్లయితే, పశువులు వేసవిలో ఉష్ణోగ్రతను సమర్థవంతంగా తట్టుకుంటాయి. విటమిన్ ఎ, ఒక పశువుకి ఒక రోజుకి 1 గ్రాము చొప్పున అందించాలి. ఈ విధంగా ఎనిమిది నుంచి పది రోజులు నెలకి అందించాలి. వేసవిలో పొటాషియం లవణాలు ఎక్కువగా అవసరమవుతాయి. అందువలన పొటాషియం క్లోరైట్ లవణాన్ని అందించాలి.
వేసవిలో పశువులు పచ్చిమేతను మాత్రమే తింటాయి. ముఖ్యంగా సంకరజాతి ఆవులు, విదేశీ ఆవులు పచ్చిమేత లేనిదే వేడిని తట్టుకోలేవు. పాల దిగుబడిని బట్టి దాణాను పశువులకు ఇవ్వాలి. పశుగ్రాసాలను చాప్ కట్టర్‌తో అంగుళం సైజులో కత్తిరించి మేపాలి. దీని వలన మేత వృధా కాకుండా ఉంటుంది. పచ్చిమేతను పగటిపూట, ఎండు గడ్డిని రాత్రిపూట ఇవ్వడం మంచిది. కొన్ని సందర్భాల్లో పచ్చిమేత లేనప్పుడు, ఖనిజ లవణాలు, మిశ్రమ దాణాలను ఇచ్చి అధికంగా మేపాలి. ఈవిధంగా సమృద్ధిగా వేసవిలో పోషణ ఇవ్వడం వలన పశువులు ఆరోగ్యంగా ఉండి, పాల దిగుబడి సాఫీగా సాగుతుంది.
ఆరోగ్య సంరక్షణ:
ఎండ తాపానికి గురైన వెంటనే పశువులను నీడలో చెట్టు కింద ఉంచటం మంచిది. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేటట్టు చూసుకోవాలి. శరీరంపై చల్లని నీటిని చల్లాలి. గ్లూకోజ్ సెలైన్, సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని ఎక్కించాలి. వేసవిలో ఎండ వేడికి రోగనిరోధక శక్తిని కోల్పోతాయి. దీని వలన జబ్బ వాపు వ్యాధి, గొంతువాపు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. అందువలన వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వటం మంచిది. రెండు 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. అలాగే అంతర పరాన్నజీవుల కోసం నట్టల నివారణ మందులు వేయించాలి. పరిశుభ్రమైన నీటిని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలి. దాహానికి బురద నీరు, అపరిశుభ్రమైన నీరు త్రాగి పారుడు వంటి జీర్ణకోశ వ్యాధులకు ఆస్కారం ఉంది. అందువలన మనమే మంచినీటి కుంటలను పశువులకు అందుబాటులో ఉంచాలి. ఎప్పటికప్పుడు పాకలను శుభ్రం చేస్తూ ఉండాలి.
వేసవి కాలంలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రత, వేడి గాలులు వీచడం వలన పాడి పశువులు తీవ్ర అనారోగ్యానికి, అసౌకర్యానికి లోనుకావడం జరుగుతుంది. దీనివలన వాటి ఉత్పత్తి మరియు పునరుత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. కావున మన రైతాంగం పైన ఉదహరించిన యాజమాన్య పద్ధతులను వేసవిలో చేపట్టినట్లయితే పశువులను సంరంక్షించడమే కాకుండా, పాడికి రక్షణ కల్పించి, దేశం ఆర్థికంగా మెరుగుపడుతుంది.
డా. యు. వినోద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా. జి. సుష్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్; డిపార్ట్‌మెంట్ ఆఫ్ అనిమల్ జెనిటిక్స్ అండ్ బ్రీడింగ్, పశు వైద్య కళాశాల, తిరుపతి. ఫోన్: 9492298321
