‘రైతునేస్తం’ శిక్షణలో వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు డా|| కె. రామచంద్రం
హరితవిప్లవం పేరుతో అప్పటి పరిస్థితులకు అనుకూలంగా వ్యవసాయంలో రసాయనాలు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో ఉన్న వ్యవసాయ పద్ధతులు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార పదార్థాలను అందించలేక పోవడంవల్ల ప్రజలు ఆకలితో అలమటించ వలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ విపత్కర పరిస్థితుల నుండి బయట పడడానికి వ్యవసాయంలో రసాయనాలు, అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశ పెట్టి ప్రజల ఆకలిని తీర్చగలిగారు. కాని వివిధ రకాల కారణాల వలన రైతులు విచక్షణా రహితంగా రసాయనాలు వాడడానికి అలవాటు పడడం వలన పెట్టుబడులు పెరిగి పంటల సాగు గిట్టుబాటు కాకపోవడంతో పాటు విచక్షణా రహిత రసాయనాల వాడకం వలన నేల, నీరు, గాలి, వాతావరణం కలుషితమై ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ సమస్యలన్నింటికి పరిష్కారం సేంద్రియ సాగే అని జులై 9న నాబార్డు సహకారంతో ‘రైతునేస్తం’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికారాబాదు జిల్లా కొత్తగడి గ్రామంలో మోహన్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు, పంట ఉత్పత్తులకు విలువ జోడిరపుపై జరిగిన అవగాహన సదస్సులో వ్యవసాయ శాఖ విశ్రాంత అదనపు సంచాలకులు కె. రామచంద్రం అన్నారు. కార్యక్రమంలో సేంద్రియ రైతులు నారాయణ, మనోహరాచారి, మోహన్రెడ్డిలతో పాటు ‘రైతునేస్తం ఫౌండేషన్’ మేనేజరు ప్రసాదరావు పాల్గొన్నారు.
సేంద్రియ సాగు ఆవశ్యకత, సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాల తయారీ విధానం, వాటి ఉపయోగాలను మనోహరాచారి వివరించారు. కంది సాగు, కందిలో అంతర పంటల విధానం, కందులకు విలువ జోడిరచి కందిపప్పుగా అమ్మి తన సేంద్రియ సాగును లాభాల బాటలో నడిపిస్తున్న నారాయణ తన అనుభవాన్ని వివరించారు. దొండ, బొప్పాయి పంటల సాగు పద్థతులను క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా చూపిస్తూ రైతు మోహన్ రెడ్డి వివరించారు. వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపునకు సంబంధించిన సమాచారాన్ని, యంత్ర పరికరాల వివరాలను రైతునేస్తం ఫౌండేషన్ మేనేజరు ప్రసాదరావు వివరించారు. అనంతరం శిక్షణకు హాజరైన రైతులకు సర్టిఫికెట్లను అందజేశారు.

