హిందూ సాంప్రదాయంలో అనాదిగా పితృకర్మల సందర్భంగానూ, పర్వదినాల సందర్భంగానూ మరియు దేవతలకు మొక్కుబడిగానూ గోవులను పేద బ్రాహ్మణులకు దానం ఇచ్చే ఆచారం కొనసాగుతూ ఉంది. అదే విధంగా గ్రామాలలోని తమ పితృదేవతల పేరిట ఆంబోతులను గ్రామఆస్తిగా దానం చేస్తూ వదిలే సాంప్రదాయం ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది. ఈ ఆంబోతు స్వేచ్ఛగా ఎవరి పొలాలలోకి ప్రవేశించి మేసినా, కొంత నష్టం చేసినా గ్రామ కట్టడిగా ఎవరూ అభ్యంతరం చెప్పేవారు కాదు. ఒకనాడు అనేక గ్రామాలలో 3-4 బ్రాహ్మణ కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఉంటూ, పేదరికంలో ఉండి కొన్ని సందర్భాలలో ఆ కుటుంబాలలోని పిల్లలకు, వృద్ధులకు కూడా సరిపడిన పాలు ఉండేవి కావు.ఇటువంటి పేదలకు గ్రామ పెద్దల నుండి దానంగా అందిన గోవులు గృహావసరాలను తీర్చడమే కాక, దేవాలయ పూజారుల ద్వారా దేవతార్చనకు, ప్రసాదాల తయారీకి కూడా వినియోగపడేవి. అదనపు పాల విక్రయం ద్వారా కొంత ఆదాయం కూడా లభించేది. ఇందుకు గ్రామ పెద్దలు బ్రాహ్మణులు, పూజారుల వద్ద ఉన్న గోమాతలకు అవసరమైన మేతను కూడా ఉచితంగా అందించేవారు. అదేవిధంగా గత ఐదు థాబ్దాలుగా మన గ్రామాలకు కృత్రిమ గర్భోత్పత్తి సదుపాయాలు విస్తరించినందున అంతకు ముందు గ్రామాలలో వదిలే ఆంబోతుల వల్ల కలిగే పశుసంతతి కంటే మెరుగైన సంతతి జన్మించే అవకాశాలు ఏర్పడ్డాయి. అంతేకాక పూర్వపు కమతాలు విభజనలు పంపిణీల కారణంగా బాగా కుదించుకుపోవుట మరియు సేద్యపు ఖర్చులు అనేక రెట్లు పెరిగిపోవుట వల్ల, ఆంబోతులు తమ పొలాల మీద పడి ధ్వంసం చేస్తే ఆ నష్టాన్ని భరించే శక్తిని కోల్పోయి, ఈ ఆంబోతుల పట్ల విముఖతను చూపుతున్నారు. కొన్ని సందర్భాలలో హింసించి తరుముతూ చంపటానికి సైతం వెనుకాడటం లేదు. కీటకనాశక రసాయనాలు జల్లిన పైర్లలోకి ప్రవేశించిన వృషభరాజులు పొలాలలోనే మరణిస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం గోదానం పొందిన బ్రాహ్మణులు, పురోహితులు, అర్చకులు సైతం గోపోషణకు అవసరమైన కనీస వసతి – మేత- నిర్వహణ అవసరాలను సమకూర్చలేక వారి కుటుంబ అవసరాలకు ఇతరుల నుండి పాలను కొనుగోలు చేయుటకే మొగ్గు చూపుతున్నారు ఈ పరిస్థితి చిన్న చిన్న గృహాలలో నివసించే దానగ్రహీతలలో ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాలలో చిన్న అపార్ట్‌మెంట్లలో నివసించే దానగ్రహీతలకు కనీసం ఒక చిన్న పుంగనూరు గోవును సైతం పెంచుట అసాధ్యం. అయితే మనం వీరికి గోదానాలు చేస్తూనే ఉన్నాము. మొన్న కోవిడ్ సందర్భంలో అనూహ్య స్థాయిలో సంభవించిన మరణాల వల్ల గోదానాల సంఖ్య విపరీతంగా పెరిగింది. అయితే ఈ గోదానాలన్నీ ఒక తంతు మాత్రంగానే కొనసాగి, దానాన్ని స్వీకరించిన వెంటనే ఆ గోవును వేరొకరికి విక్రయించటమో, బదిలీ చేయటమో జరుగుతోంది తప్ప గోదానం యొక్క అసలు య్రోజనం కనిపించడం లేదు. ఇది గోవును దానంగా పొందిన బ్రాహ్మణుని ప్రమేయం లేకుండా లేదా అతనికి తెలియకుండానే ఈ గోవులు ఒక థలో కబేళాలకు తరలిపోతూ హిందువుల మత విశ్వాసానికి మనోభావాలకు, దాన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా తీవ్రమైన అపచారాలకు బలి అవుతున్నాయి.
మరొకవైపు మన పట్టణ పరిసరాలు, గ్రామాలలో అనేక స్వచ్ఛంద సంస్థలు, ధార్మిక సంస్థలు, గోప్రేమిక సంఘాలు అనేక గోశాలలను నిర్వహిస్తున్నాయి. వీటిలో అనాధ గోవులు-దూడలు-ఇతర వృద్ధ, వికలాంగ పశువుల సంఖ్య నానాటికీ పెరిగిపోతూ ఉన్నాయి. వీటికి సరియైన మేతల్ని, దాణాల్ని అందించలేక నిర్వాహకులు సతమతమౌతూ ఉన్నారు. దినదినానికీ పెరుగుతున్న గోసంతతికి అవసరమైన కనీస వసతి సౌకర్యాలు కూడా కుదించుకుపోతున్నాయి. హేతుబద్ధతలేని కొన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాల కారణంగా ఈ గోశాల నిర్వాహకులు తీవ్రమైన కూలీల సమస్యను కూడా ఎదుర్కొంటున్నారు. మనం పితృదేవతల పేర ఈ గోమాతల అన్నార్తిని తీర్చడానికి ధన రూపంగానూ, గ్రాసాల రూపంగానూ అందిస్తే, భారీ ఖర్చుతో పితృకార్యాల (దినాలు, తద్దినాలు, సంవత్సరికాలు) సందర్భంగా చేసే గోదానాల కంటే గోవుల ఆకలిని తీరుస్తూ, వాటికి మెరుగైన సౌకర్యవంతమైన జీవనాన్ని అందిస్తే మంచిది. ఇది పసుపు, కుంకుమలు అద్ది పూలమాలలతో గోవుల్ని పూజించుట, గోవుల చుట్టూ ప్రదక్షిణలు చేయుట కంటే మెరుగైన పుణ్యకార్యమని నా అభిప్రాయం. గోపూజల సందర్భంగా గోవుకు అందించే మేతలు, పళ్ళు, ఫలహారాలలో గానీ, పూలదండలలో గానీ ఎటువంటి ప్లాస్టిక్ మరియు తగరాలు, దారాలు వంటి హానికరమైన పదార్థాలు కలవకుండా జాగ్రత్త వహించండి. మన హిందూ సాంప్రదాయంలో జరిగే తద్దినాలు, స్మారకాలు సందర్భంలో భారీ ఖర్చుతో ఏర్పాటు చేసే భోజనాలు, తదితర ఏర్పాట్లతో పాటు దానమిచ్చే గోవుల కొనుగోలుపై వెచ్చిందలచిన సొమ్ములో కనీసం ఒక పదోవంతు వ్యయాన్ని అయినా మేతల రూపంలోగానీ, విరాళాల రూపంలోకానీ తమకు సమీపంలోని నిజాయితీతో, సమర్థతతో, గోప్రేమికుల నిర్వహణలో నడుస్తున్న గోశాలలకు విరాళంగా అందించవచ్చును. స్తోమతను బట్టి గోశాలలో అదనపు షెడ్లు, ఫ్యాన్లు, నీటి తొట్టెలు వంటి అదనపు నిర్మాణాలను తమ పెద్దల పేర ఏర్పాటు చేయవచ్చు. స్థోమత అవకాశాలను బట్టి పశుగ్రాసాల సాగుకు గోశాలలకు భూదానం చేయవచ్చును.
పై అంశాల ఆధారంగా గోశాలలలోని గోమాతల ఆకలిని, బాధలను తగ్గించగల్గితే అంతకంటే పుణ్యకార్యం వేరొకటి ఉండదని నా నమ్మకం. అందుకే గోదానం కన్నా గోవుకు దానమే మిన్న అని అంటాను. మరి మీరేమంటారు.
డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

