తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న ప్రధాన ఆహార పంట వరి. ఈ మధ్య కాలంలో వరిని సేంద్రియ పద్ధతిలో సాగు చేయటానికి రైతాంగం ఆసక్తి చూపుతున్నారు. దీని ద్వారా రసాయనిక ఎరువులు, పురుగు/తెగుళ్ళ మందుల వినియోగం తగ్గించి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మరియు నేలలను అందించడమే ముఖ్య ఉద్దేశం. సేంద్రియ వరి సాగులో చీడపీడల యాజమాన్యంలో వివిధ పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ, గత కొన్ని సంవత్సరాలల్లో చేసిన పరిశోధనల ఆధారంగా, అధిక దిగుబడులు సాధించడానికి ఈ క్రింది పద్ధతులను అవలంభించండి.
కాండం తొలుచు పురుగు
- నారు కొనలను త్రుంచి నాటుకొన్నట్లయితే గుడ్ల సముదాయాన్ని నివారించడం ద్వారా కాండం తొలుచు పురుగును నివారించు కోవచ్చు, అధికంగా ఉన్న నారును నేలలో కలిపి వేయాలి.

- పురుగు ఉధృతి తెలుసుకోవడానికి మరియు నివారణకు ఎకరానికి 40 చొప్పున పక్షి స్థావరాలు, 8 చొప్పున లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి.
- పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి.
- ట్రైకోగ్రామా జపానికం అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 40,000 గ్రుడ్ల సముదాయం ఉన్న కార్డులను మూడు దఫాలుగా నాటిన 20 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకొన్నట్లయితే కాండం తొలుచు పురుగును సమర్ధవంతంగా నివారించుకోవచ్చును.
- పశువుల పేడ (5 కిలోలు), పశువుల మూత్రం (5 లీటర్లు) 4 రోజులు మురుగ బెట్టిన తర్వాత 150 గ్రాముల సున్నం కలుపుకొని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేసుకోవాలి (లేదా)
- ఆవుమూత్రం, పచ్చిమిర్చి మరియు వేప ఆకుల కషాయం ఎకరానికి 3-4 లీటర్ల కషాయం 100 లీటర్ల నీటిలో కలుపుకొని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా కాండంతొలుచు పురుగును నివారించవచ్చు (10 లీటర్ల మూత్రానికి, ఒక కిలో పచ్చిమిరపకాయల ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తరువాత గుడ్డతో వడగట్టి 3-4 దఫాలుగా వాడుకోవచ్చును).
ఆకుముడత
- వేసవి దుక్కులు చేయడం ద్వారా సుప్తావస్థలో ఉన్న పురుగు గుడ్ల సముదాయాన్ని మరియు కలుపు విత్తనాలను నిర్మూలించవచ్చు.
- వేప నూనె (1500 పి.పి.యం) లీటరు నీటికి 5 మి.లీ. కలుపుకొని నాటిన 20 మరియు 30 రోజులకు పిచికారి చేసుకవాలి (లేదా)

- ఆవు మూత్రం, సీతాఫలం ఆకులు మరియు వేప ఆకుల కషాయం ఎకరానికి 2-3 లీటర్లు, 100 లీటర్ల నీటిలో కలుపుకుని మొక్కలపై పిచికారీ చేయడం ద్వారా ఆకు ముడత నివారించవచ్చు (10 లీటర్ల మూత్రానికి 2 కిలోల సీతాఫలం ఆకుల ముద్ద, 5 కిలోల వేపాకుల ముద్దను చేర్చి ఉడికించి చల్లార్చిన తర్వాత గుడ్డతో వడగట్టి 3-4 దఫాలుగా వాడుకోవచ్చు)
- బాసిల్లస్ తురంజెన్సిస్ లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలుపుకొని నాటిన 30-40 రోజుల మధ్యలో పిచికారీ చేసుకొన్నట్లయితే ఆకుముడతను నివారించుకోవచ్చు.
- ట్రైకోగ్రామా అనే గుడ్డు పరాన్న జీవిని ఎకరానికి 20,000 గ్రుడ్ల సముదాయం ఉన్న కార్డులను మూడు దఫాలుగా నాటిన 15 రోజుల నుండి పొలంలో విడుదల చేసుకొన్నట్లయితే ఆకుముడతను సమర్ధవంతంగా నివారించుకోవచ్చును.
దోమ పోటు
- తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, కృష్ణవేణి, భావపురి సన్నాలు మరియు శ్రీధృతి రకాలను ఎంచుకోవాలి.
- దోమపోటు నివారణకు కాలి బాటలు తీయడం (ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు తీసుకోవాలి), పొలానికి వైకల్పికంగా నీరు కట్టడం మరియు ఆరబెట్టడం చేయాలి.
- మెటారైజియం లేదా బవేరియా లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలుపుకొని రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. వేప నూనె లీటరు నీటికి 5 మి.లీ. చొప్పున కలుపుకొని పిచికారి చేసుకొన్నట్లయితే నివారించుకోవచ్చు.
- ఉదయం పూట వరి తవుడుతో (5-10 కి.) పాటు వేప నూనె ఒక లీటరు కలుపుకొని పొలంపై చల్లుకున్నట్యలితే దోమను కొంతవరకు తగ్గించుకోవచ్చు.

- ఆవు మూత్రం, తూటికాడల కషాయం మొక్కల మొదళ్ళపై పడేటట్లు పిచికారి చేసుకోవడం ద్వారా దోమను నివారించవచ్చు (15 లీటర్ల మూత్రానికి, 10 కిలోల తూటికాడల ముద్దను చేర్చి ఉడికించి చల్లారిన తరువాత 100 లీటర్ల నీటిలో కలుపుకొని వాడుకోవచ్చు).
ఆకు నల్లి/కంకి నల్లి, కంపు నల్లి, ఉల్లికోడు, పచ్చ దీపపు పురుగులు
- ఉల్లికోడును తట్టుకొనే రకాలైన కావ్య, దివ్య, ఎర్రమల్లెలు, పోతన మరియు శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను నాటుకోవాలి.

- నివారణకు ఎకరానికి 600 మి.లీ. వేపనూనె (3000 పి.పి.యం) పిచికారి చేయాలి.
అగ్గి తెగులు, పొడ తెగులు, దుబ్బుకుళ్ళు, గోధుమ రంగు మచ్చ
- తట్టుకునే రకాలైన సోనామసూరి, సోమశిల, విజేత, తరంగిణి, నెల్లూరు సోన వంటి రకాలను ఎంచుకోవాలి.
- పొలంలో మరియు పొలం గట్లపై కలుపు లేకుండా చూసుకోవాలి.
- సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున లేదా లీటరు నీటికి 20 గ్రాముల చొప్పున కలుపుకొని లేదా లీటరు నీటికి 30 మి.లీ. పంచగవ్య ద్రావణాన్ని కలుపుకొని 20 నిముషాలపాటు విత్తనాన్ని లేదా నారును శుద్ధి చేసుకోవాలి.
- లీటరు నీటికి 30 మి.లీ. పశువుల మూత్రాన్ని కలుపుకొని 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.
- ఎకరానికి 2 కిలోల చొప్పున సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ నేలకు వేసుకోవాలి.
- పచ్చిరొట్ట పంటలను నేలలో కలియ దున్నుకోవాలి.
కాండంకుళ్ళు, దుబ్బుకుళ్ళు తెగులు
- నీటిని ఎప్పటికప్పుడు బయటకు తీసివేయడంతో పాటు మురుగునీరు పొలంలో లేకుండా చూసుకోవాలి.
- సేంద్రియ ఎరువులను నేలకు అందించడం ద్వారా తెగులు ఉధృతి తగ్గించవచ్చు.
- మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం మిశ్రమంతో తగ్గించవచ్చు (ఒక కిలో మారేడు ఆకులు తీసుకొని 5 లీటర్ల నీటిలో ఉడకపెట్టి చల్లారిన తర్వాత 5 లీటర్ల పశువుల మూత్రం మరియు 100 గ్రాముల సున్నం కలుపుకొని, దీనిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారి చేయాలి).
ఆకు ఎండు తెగులు
- తట్టుకునే రకాలైన ఇంద్ర, అమర, పుష్యమి, స్వర్ణ, అక్షయ వంటి రకాలను ఎంచుకోవాలి.
- 10 లీటర్ల నీటికి 100 మి.లీ. వర్మీవాష్, 50 మి.లీ. పశువుల మూత్రం కలుపుకొని పంటపై పిచికారీ చేసుకోవాలి (లేదా)

- పశువుల పేడ, ఇంగువ ద్రావణాలను (10 శాతం) పిచికారీ చేయడం ద్వారా ఎండు తెగులును నివారింవచ్చును (5 కిలోల పశువుల పేడ, 5 లీటర్ల మూత్రంతో పాటు 500 గ్రాముల బెల్లాన్ని కుండలోకి తీసుకొని 5 రోజుల పాటు కలుపుకొంటూ 5వ రోజు 100 గ్రాముల ఇంగువను కలపాలి. 10 లీటర్లకు 100 లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి)
- ఒక పొలం నుండి వేరొక పొలానికి నీరు పెట్టడం ఆపి వేయాలి.
- పొలంగట్లపై పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి.
అగ్గితెగులు
- తెగులు సోకిన మొక్కలను పీకి వేసి పైపాటుగా సేంద్రియ ఎరువులు వాడుకోవాలి.
- మజ్జిగ (1 లీటరు), పశువుల మూత్రం (1 లీటరు) 8 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.

- వరిలో వచ్చే చాలా రకాల తెగుళ్ళను మారేడు ఆకులు మరియు పశువుల మూత్రం మరియు 100 గ్రాముల సున్నం కలుపుకొని, దీనిని 100 లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరా పొలానికి పిచికారీ చేయాలి).
పురుగు, తెగుళ్ళ వ్యాప్తి నివారణకు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు
- వేసవి దుక్కులు తప్పనిసరిగా చేసుకోవాలి.
- నిరోధకశక్తి గల రకాలను ఎంచుకోవాలి.
- మంచి విత్తనాన్ని ఎంచుకోవాలి.
- విత్తనశుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి.
- పంట అవశేషాలు పూర్తిగా కలిసిపోయేలా దమ్ము చేసుకోవాలి.
- నారు కొనలను త్రుంచి నాటుకోవాలి.
- ప్రతి రెండు మీటర్లకు 20 సెం.మీ. కాలిబాటలు తీసుకోవాలి.
- లింగాకర్షక బుట్టలతో పురుగు ఉధృతి తెలుసుకోవాలి.
- వరి దుబ్బులు నేలలో కలిసేలా లోతు దుక్కి చేసుకోవాలి.
- పొలం గట్లపై బంతి, అలసందలు, నువ్వులు వంటి మొక్కలను పెంచి దోమ పరాన్న జీవులను రక్షించుకోవాలి.
- ఒక పొలం నుండి వేరొక పొలానికి నీరు పెట్టడం ఆపివేయాలి.
- పొలం గట్లపై పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి.
డా. కిరణ్ కుమార్ రెడ్డి (పంట ఉత్పత్తి విభాగము), డా.ఎస్. లోకేష్ బాబు, శాస్త్రవేత్త (విస్తరణ విభాగం), డా. విజయ్ కుమార్ నాయక్ (సస్య రక్షణ విభాగము), హరిసాదు, శాస్త్రవేత్త (మత్స్య విభాగం), డా. ఆర్. సుజాత, శాస్త్రవేత్త (గృహవిజ్ఞానం), డా. లలిత శివ జ్యోతి, ప్రోగ్రాం-కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, నెల్లూరు. ఫోన్: 99485 42942

