భూమిలోని పోషకాలు, లోపాలను తెలుసుకుని సాగుచేసినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. చాలా మంది సాగు సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో దిగుబడులు కోల్పోతున్నారు. తోచినట్లు సాగు చేయడం, ఏటా ఒకే రకమైన పంటలు వేయడం, ఇష్టానుసారంగా మందులు, ఎరువులు వినియోగించడం, తదితర కారణాలతో వ్యవసాయంలో అనుకున్నంతగా రాణించలేక పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ శాఖాధికారులు, సిబ్బంది రైతులకు చైతన్యం కలిగిస్తున్నారు. భూసార పరీక్షల ఆవశ్యకత, మట్టి నమూనా సేకరణ, పరీక్షల విధానం లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. మట్టి నమూనాలకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు.
నమూనాల సేకరణ విధానం
* భూమి రకాలను బట్టి 1 నుంచి 5 ఎకరాల వరకూ ఒక నమూనాను సేకరించవచ్చు. నమూనా సేకరించాల్సిన భూమి రంగు, ఎత్తు వాలును బట్టి చౌడు వంటి సమస్యలను కూడా దృష్టిలో ఉంచుకొని భాగాలుగా విభజించాలి.
* వేరు చేసిన భాగాలను వేరువేరు భూములుగా గుర్తించాలి. ప్రతి భాగం నుంచి వేరువేరు నమూనాలు సేకరించాలి.
* నమూనా తీయాల్సిన చోట చెత్తాచెదారం లేకుండా చేతితో పక్కకు తోయాలి. నాగలి సాలు పోయేంత లోతు ఆరు అంగుళాల లోతు వరకూ&ఙ ఆకారంలో తవ్వాలి. తవ్విన గుంతలో నుంచి అరకేజీ వరకూ మట్టి సేకరించాలి. మొత్తం మట్టిని కలిపి వాటిలో ఉండే రాళ్లు, వేర్లు, కొయ్యలు, చెత్తను శుభ్రం చేసుకోవాలి.
* మట్టి తడిగా ఉంటే నీడలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత మొత్తం మట్టిని నాలుగు భాగాలుగా ఉంచి రెండు భాగాలుగా తీసివేయాలి.
* మిగిలిన రెండు భాగాల్లో అరకేజీ వరకూ ఉంచుకోవాలి. ఈ మట్టిని శుభ్రమైన సంచిలో గానీ, గుడ్డ సంచిలో గానీ నింపు కోవాలి. రైతు పేరు, సర్వే నెంబర్, ఊరు, వంటి వివరాలు రాసి అందులో ఉంచాలి.
* నమూనాలు సేకరించాల్సిన పొలంలో గట్టు, నీడ, చవుడు వంటి ప్రదేశాలను గమనించాలి. చెట్ట నీడ, బురద ఉండే ప్రదేశాలు, తేమగా ఉన్న చోట నమూనాలు సేకరించకూడదు.
* పొలం గట్లు, ఎరువు కుప్పులు, పైరుకు దగ్గరగా నమూనాలు తీయకూడదు. సున్నం, బూడిద, రసాయన ఎరువులు వేసిన మూడు నెలల వరకూ తీయకూడదు.
ఆర్‌బీకే పరిధిలో నమూనాలు
ఉదాహరణకు కాకినాడ జిల్లాలో ప్రతీ రైతు భరోసా కేంద్రంలో రెండు మట్టి నమూనాలు సేకరించేలా వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది 836 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ 402 నమూనాలు సేకరించారు. మరో వారంలోపు మిగిలినవి సేకరించనున్నారు. ఆర్బీకేల వారిగా మట్టి నమూనాలను ఆయా సిబ్బంది సమీపంలోని భూసార పరీక్షా కేంద్రానికి పంపుతారు. వీటిని ప్రయోగశాలల్లో పరీక్షించాక ఫలితాలను రైతులకు కార్డులు రూపంలో అందిస్తారు. ఫలితాలను బట్టి పొలాల్లో నెలకొన్న సమస్యలు, అనుసరించాల్సిన పద్ధతులు, ఎరువుల మోతాదులు, ఇతర వివరాలను సంబంధిత వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలు తెలియజేస్తారు.
నేలను కాపాడుకోవాలి
ప్రస్తుత పరిస్థితుల్లో భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. నేల ఆరోగ్యంగా ఉంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం. మట్టి పరీక్షల ఆధారంగానే రైతులు పంటలు వేసుకుంటే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు కూడా బాగా తగ్గుతాయి. నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మట్టి నమూనాలు సేకరించే విధంగా చర్యలు తీసుకొంటున్నాం అని అంటున్నారు. \
– ఎన్ విజయ్‌కుమార్, కాకినాడ జిల్లా వ్యవసాయశాఖాధికారి

