గర్భసంచిలోని పిండానికి, తల్లికి మధ్య సంధానకర్తగా, తల్లి నుండి పోషకపదార్థాలను పిండానికి సరఫరా చేయడానికి మరియు పిండాన్ని రక్షించడానికి పిండం చుట్టూ ఏర్పడిన పొరను మాయ అంటారు. సాధారణంగా పశువు ఈనిన తర్వాత పిండం చుట్టూ ఏర్పడిన పొర నిరుపయోగమై తల్లి గర్భం నుండి వేరుపడి బయటకు రావడం జరుగుతుంది.

పశువు ఈనే సమయం సమీపించిన కొలది మాయ పరిపక్వత చెందుతుంది. పశువు ఈనిన తర్వాత పరిపక్వత చెందిన మాయను బయటకు విడుదల చేస్తుంది. పశువు ఈనే సమయానికి మాయ పరిపక్వత చెందక పోయినట్లయితే, ఈనిన తరువాత పశువు మాయను విడుదల చేయలేదు. రెండు లేక మూడు శాతం పశువులు మాయ వేయకపోవడం సాధారణ విషయంగా పరిగణించవచ్చు. 5 శాతానికి మించితే చూడిపశువుల యాజమాన్య పద్ధతులను పూర్తిగా పరిశీలించవలసి ఉంటుంది.

మాయవేయని పశువులను పరీక్షించినచో మానం ఉబ్బి, నొప్పిగా ఉంటుంది. నాడి మరియు శరీర ఉష్ణోగ్రత పెరుగుతాయి. పశువులు నీరసపడి మేత తినవు. పేడ వేసేటప్పుడు, మూత్రం పోసేటప్పుడు ముక్కుతాయి. పశువులు వెన్ను విరుస్తూ తరచుగా తోకను కదిలిస్తూ బాధపడుతూంటాయి. పాలదిగుబడి బాగా తగ్గుతుంది.

చూడిపశువులకు సరైన వ్యాయామం లేకపోవడం, పోషకాహార లోపం, కాల్షియం, సెలీనియం, అయోడిన్‌, విటమిన్‌ ఏ వంటి ఖనిజ లవణాలు మరియు విటమిన్ల తీవ్రమైన లోపాల వలన మాయ సరిగా వేయకపోవచ్చును. ఈనిన తరువాత ప్రతికూల పరిస్థితులలో గర్భకోశ చలనాలు సరిగా లేకపోవడం, హార్మోన్ల ఉత్పత్తిలో తేడాల వలన ఈనటం కష్టమవుతుంది. దానితోపాటు పశువు నీరసపడి బలహీనపడినప్పుడు మరియు ముసలితనం వల్ల పశువులు మాయ సరిగా వేయవు. ఈసుకొని పోయిన, నెలలు నిండకముందే ఈనిన పశువులలో మాయ పడకపోవడం అనేది సాధారణంగా కనిపిస్తుంది.

మాయ వేయని పశువుల్లో సాధారణంగా జ్వరం, పాలదిగుబడి తగ్గటం, క్రమంగా బలహీనపడటం, జనన మార్గంలో మంట, దుర్వాసనతో కూడిన రక్తం మరియు చీముకారటం వంటి లక్షణాలు గమనించవచ్చును. జ్వరం ఎక్కువగా ఉన్న పశువులలో మందుల ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు. కొన్ని సందర్భాలలో మాయపడని పశువులు చనిపోవడం కూడా జరుగుతుంది.

మాయ కోసం ఉపయోగించు ఔషధ మొక్కలు

  • నువ్వుల మొక్కల ఆకులను సుమారు 250 గ్రాములు 1000 మిల్లీలీటర్ల నీటిలో బాగా కలిపి పశువులకు త్రాగించినచో 1 నుండి 2 గంటల్లో మావి మాయమవుతుంది. 
  • నువ్వులు 100 గ్రాములు మరియు బెల్లం 100 గ్రాములు కలిపి బోలస్‌గా తయారు చేసి నోటి ద్వారా ఇవ్వాలి. 
  • బడా గోస్కర్‌ మొక్కను 200 గ్రాములు 1000 మిల్లీలీటర్ల నీటిలో నానబెట్టి బాగా కలిపి పశువులకు ఇవ్వాలి.

పదార్థాలు: ముల్లంగి- 1 పూర్తి గడ్డ దినుసు, బెండకాయ – 1.5 కిలోలు, బెల్లం – అవసరం మేరకు, ఉప్పు-కావల్సినంత.

తయారు చేసే విధానం: ప్రతి బెండకాయను రెండు ముక్కలుగా కత్తిరించాలి. దూడ పుట్టిన రెండు గంటల లోపు ఒక పూర్తి దుంప ముల్లంగిని ఆవుకు తినిపించాలి. ప్రసవించిన 8 గంటల తర్వాతకూడా మాయ నిలకడ కొనసాగితే 1.5 కిలోల తాజా బెండకాయలు, బెల్లం మరియు ఉప్పుతో కలిపి తినిపించాలి. ఒకవేళ ప్రసవించిన 12 గంటల తర్వాత కూడా మాయ నిలుపుదల కొనసాగితే బేస్‌కు చాలా దగ్గరగా ఒక ముడిని కట్టి, ముడి కింద రెండు అంగుళాలు కత్తిరించి వదిలేయండి. ముడి లోపలికి వెళ్ళిపోతుంది. నిలుపుకున్న ప్లాసెంటాను చేతితో తొలగించటానికి ప్రయత్నించవచ్చు. నాలుగు వారాల పాటు వారానికి ఒకసారి ఒక పూర్తి గడ్డ దినుసు ముల్లంగిని తినిపించినచో మాయ పడిపోయే అవకాశం ఉంటుంది.

బాంబుసియా వల్గారిస్‌ (ఆకు): బాంబుసియా వల్గారిస్‌ ఆకులను కుండాబార్బర్‌తో కలిపి మావిని బయటకు పంపండంలో సహాయపడుతుంది. ఆకులను ఎండబెట్టి నీటిలో కలిపి పశువులకు నోటి ద్వారా ఇవ్వటం వల్ల మాయని నివారించవచ్చు. 

వెర్నోనియా ఆమిగ్దాలినా (ఆకు): వెర్నోనియా ఆమిగ్దాలినా ఆకులు ఉప్పులో కలపడం ద్వారా ప్లాసెంటా నిలుపుదల చికిత్సకు ఉపయోగపడుతుంది. దీనిని పశువులకు నోటి ద్వారా ఇవ్వబడుతుంది.

రిసినస్‌ కమ్యూనిస్‌ (ఆకులు మరియు విత్తనాలు): రీజినల్‌ కమ్యూనిస్‌ యొక్క ఎండిన భాగాన్ని నీటిలో కలిపి ఆవుకు ఇవ్వవచ్చు. ఇది మావిని నివారించడానికి ఉపయోగపడుతుంది.

బ్రయోపిల్లం పిన్నటం (ఆకు): ఆకులు లేదా కాండం యొక్క రబ్బరు పాలు భాగాన్ని యురేరా పైప్సెలోడెండ్రంతో కలుపుకొని ఆవు గర్భాశయంలోకి పూస్తాము. ఇది మావిని నివారించడానికి ఉపయోగపడుతుంది.

డా. కె. కస్తూరి దేవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డా. బి. శ్రీను, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, డా. జె. తేజ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, పశువైద్య కళాశాల, మామునూరు, వరంగల్‌. ఫోన్‌: 9491870887