సహజంగా గేదెలు ఏడాది పొడవునా ఎదకు వస్తాయి, కాని వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత వలన మరియు పచ్చిమేత లభ్యత తక్కువగా ఉండడం వల్ల ఎద లక్షణాలు రైతుకు ప్రస్ఫుటముగా కనపడక, రైతు గేదెలను సరైన సమయములో చూలి కట్టించలేకపోవుట వలన చూడి కట్టే శాతం చాలా తక్కువగా ఉంది, రైతులు ఆర్థిక నష్టాలకు గురి అవుతారు.

గేదెలలో యుక్తవయస్సు ఆలస్యముగా రావడం, మూగ ఎద, తక్కువ ఎద లక్షణాలు మరియు ఈనిన తరువాత చూడి కట్టించుకాలం ఎక్కువగా ఉండడం వలన గేదెలు తక్కువ సంతానోత్పత్తి సామర్థ్యం కలిగిన జంతువులుగా పరిగణించబడతాయి. గేదెలు వేసవిలో చూడి సరిగ్గా కట్టకపోవడానికి పలు కారణాలు మనం పేర్కొనవచ్చు. వాటిలో ముఖ్యమైనవి పోషకాహార లోపం, పర్యావరణ, హార్మోన్ల అసమతుల్యత మరియు యాజమాన్య లోపం.
వేసవిలో గేదెలు చూడి కట్టకపోవడానికి గల కారణాలు
1. వాతావరణము: ఆవులు కంటే గేదెలు యొక్క శరీరం మందంగా, నలుపు రంగులో ఉండడం మరియు స్వేద గ్రంథులు తక్కువగా ఉండటం వల్ల ఎక్కువ ఉష్ణతాపానికి గురవుతాయి. వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండడం వలన పొలాల నీటి కుంటలలోని మురికి నీరు ఎక్కువగా తాగుతాయి. దీనివలన జలగ పురుగుల బారిన పడి రక్తహీనత మరియు దీర్ఘకాలిక విరోచనాలతో బాధపడడం వల్ల శక్తిహీనతకు గురై, ఎద లక్షణాలు సరైన విధంగా చూపించలేవు.
2. పోషక ఆహార లోపము: వేసవిలో అధిక వేడి కారణంగా గేదెలు మేతను తక్కువగా తీసుకుంటూ ఉంటాయి. శరీరములో శక్తి నిలువలు, పొడి పదార్థాన్ని జీర్ణించుకొనే శక్తి మరియు మాంసకృత్తులకు శరీర శక్తికి ఉండే నిష్పత్తి తగ్గుతాయి. అసమతుల్య పోషకాల వలన అండాశయములు స్పందించే స్వభావం తగ్గుతుంది, అందువల్ల అండాశయ స్థబ్దత, అండోత్పత్తిలో వ్యత్యాసాలు సంభవించి పశువులు తిరిగి పొర్లుతుంటాయి.

వేసవిలో పచ్చిమేత కొరత వలన ఎండు గడ్డి ఎక్కువగా మేపుట వల్ల కూడా ఖనిజ లవణాల లోపాలు ఏర్పడి, పశువుల్లో తాత్కాలిక వంధ్యత్వం ఏర్పడుతుంది.
3. యాజమాన్య పద్ధతులు: గేదెలు సంవత్సరం పొడవునా ఎదకు వచ్చే స్వభావం ఉన్నప్పటికి, వేసవిలో పునరుత్పత్తి ప్రక్రియకు విఘాతం కలగడం వల్ల, ఈతల మధ్య వ్యవధి పెరుగుతుంది. సాధారణంగా ఆవులతో పోలిస్తే ఎద లక్షణాలు తక్కువగా చూపుతాయి, ఈ సమస్య వేసవిలో మరింత జటిలం అవుతుంది. చాలావరకు గేదెలు వేసవి కాలంలో మూగ ఎదను చూపుతాయి, ఎద లక్షణాలు అయినటువంటి అరవటం, ఇతర పశువులపై ఎక్కటం, పశుమానం నుంచి స్రావాలు కారటం, చిరు ఉచ్చపోయటం వంటి లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి, అంతేకాకుండా ఎదలక్షణాలు చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటాయి. వేకువజామున లేదా రాత్రి సమయంలో మాత్రమే ఎద లక్షణాలను చూపుతాయి. ఈ కారణాలు వల్ల రైతులు ఎదను గమనించలేకపోతున్నారు. అందువలన చూడి కట్టించడానికి అధిక సమయం పడుతోంది.
వేసవిలో యాజమాన్య పద్ధతులు
వేసవిలో యాజమాన్యం పద్ధతులలో మార్పు చేసుకొన్న ఎడల గేదెలను విజవంతముగా చూడి కట్టించవచ్చు. వేసవిలో పశువులను సూర్యుని యొక్క ప్రత్యక్ష కిరణాలు నుండి కాపాడుట అనునది ప్రధానమైన సమస్య. దీనిని అధిగమించాలంటే పశువులకు చెట్ల కింద నీడ కల్పించి, తరుచుగా చల్లని నీళ్లతో కడగాలి లేదా కొద్దిసేపు పశువులను చెరువులు లేదా కాలువ నీటిలో ఈత కొట్టించవలెను. పశువుల కొట్టాల చుట్టూ గోనె పట్టాలు కట్టి వాటిని తరచూ చల్లని నీటితో తడుపుతూ ఉన్నచో గేదెలకు చల్లని వాతావరణము కల్పించవచ్చు. పశువుల మేపు సమయమున ఎండ తీవ్రత నుండి కాపాడుటకు పశువులను ఉదయం మరియు సాయంత్రం సమయంలో మాత్రమే ఆరుబయటకు మేపుకు వదలవలెను. ఇలా చేయటం వలన పశువుల పునరుత్పత్తిపై ప్రతికూల ప్రభావమును తగ్గించవచ్చు మరియు పశువుల పాల దిగుబడిని పూర్తి సామర్థ్యం మేర సాధించవచ్చు.
ఎద లక్షణాలను గుర్తించే అవకాశము మెరుగుపరచడం
పశువు యొక్క ఎదను సరిగ్గా గుర్తించకపోవుట వలన ఈనిన తర్వాత చూడి కట్టే కాలాన్ని పెంచుతూ రైతుకు ఆర్థికంగా నష్టము చేకూరుస్తుంది. సాధారణ రోజుల్లో మనము గమనించే పశు ఎద లక్షణాలు వేసవికాలంలో అంతగా గమనించలేము కావున చల్లని సమయాలలో ముఖ్యంగా పొద్దున మరియు రాత్రుల సమయంలో రైతులు ఎక్కువగా గమనించాలి.

వేసవిలో గేదెలలో పునరుత్పత్తిపై ప్రతికూల ప్రభావమును తగ్గించుట మరియు మూగ ఎదలను సరిగ్గా గుర్తించుట వలన సరైన సమయంలో చూడిని కట్టించడం ద్వారా పాల దిగుబడిని పెంచుకొనవచ్చు. సరైన ఎదకు రాని పశువులలో ఎద చక్రం క్రమబద్ధీకరించుట అను విధానమును పాటించవచ్చు. ఈ విధానం వలన పశువులను మనకు అనుకూల సమయంలో ఎదకి తెప్పించవచ్చు. పశువు ఈనిన తరువాత 90 రోజులలో ఎదకు రాని ఎడల ఈ విధానమును పాటించినచో మంచి ఫలితాలను పొందవచ్చును. ఎక్కువ పశువులు ఉన్న రైతులు ఈ విధానమును అవలంబించుటవలన సంవత్సరం పొడుగునా పాల ఉత్పత్తిని సాధించవచ్చు. పాడి పశువు దాని పునరుత్పత్తి కాలంలో ప్రతి సంవత్సరం ఒక దూడ పుట్టేటట్లు చేయవచ్చు. ఈ విధంగా పశుసంపదను పెంచుకోవచ్చు. ఈ విధానమును ఆచరించే ముందు పశువులను మంద నుంచి విడిగా ఉంచాలి. పశువులు గర్భందాల్చలేదని నిర్ధారించుకోవాలి. వాటికి నట్టల నివారణ, సమీకృత దాణ మరియు లవణ మిశ్రమమును అందించాలి. ఏ విధమైన గర్భకోశ వ్యాధులు గాని లోపాలుగాని ఉండకూడదు.
ఎద క్రమబద్ధీకరణ పద్ధతులు
ఎద చక్రం క్రమబద్ధీకరించడానికి చాలా రకాల విధానాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా రెండు పద్ధతులను అవలంబిస్తాము.
1. జి.పి.జి. పద్ధతి
ఈ పద్దతిలో మొదటి రోజున 5 మి.లీ. రిసెప్టాల్, గైనారిచ్ (బుసరెలిన్ అసిటేట్) కండకు ఇవ్వాలి. ఆ తర్వాత ఆరు రోజులకు 5 మి.లీ. లుటాలైజ్ (డైనోప్రాస్ట్ ప్రోమితమైన్) లేదా 2 మి.లీ. క్లోప్రోస్టినాల్ గాని ఇవ్వాలి. ఒకరోజు వ్యవధితో మళ్లీ 5 మి.లీ. బుసరెలిన్ అసిటేట్ ఇవ్వాలి తరువాత రోజు రెండు పూటలా ఎద ఇంజక్షను చేయించాలి.
2. రెండు డోసుల ప్రొస్టాగ్లాండిన్
ఈ పద్ధతిలో రెండు సార్లు 5 మి.లీ. డైనోప్రాస్ట్ ప్రోమితమైన్ లేదా 2 మి.లీ. క్లోప్రొస్టినాల్ గాని పదకొండు రోజుల వ్యవధిలో ఇస్తారు. రెండవ డోసు ఇచ్చిన తరువాత 48-72 గంటలలో పశువు ఎదకు వస్తుంది. రెండు పూటలా ఎద ఇంజక్షను చేయించడం మంచిది, లేదా రెండవ డోసు ఇచ్చిన తరువాత 72 గంటలకు ఒక ఎద ఇంజక్షను మరియు 96 గంటలకు మరియొక ఎద ఇంజక్షన్ చేయించడం ఉత్తమం. ఎదచక్రం క్రమబద్ధీకరించుట పద్ధతిని పాటించడం వలన రైతు సకాలంలో పశువులను ఎదకు తెప్పించి చూడి కట్టించి ఆర్థికంగా లాభాన్ని పొందవచ్చు. రాత్రి సమయంలో మంచి మేతను అందించుట, పశువులకు ఉదయము, సాయంత్రము సమయంలో మాత్రమే మేపుకు విడువుట వలన పశువులపై ఎండ తీవ్రత ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా లేతగా ఉండే పచ్చి మేతను మాగుడు గడ్డిని, ఎండు చొప్పను తిన్నంత అందించుట వలన చల్లని నీటిని, లవణ మిశ్రమం అందించుట వలన ప్రత్యుత్పత్తి సామర్థ్యం వేసవిలో కూడా మెరుగుగా ఉంటుంది. సరైన పోషణ అందించుటతో పశువులలో ఎద లక్షణాలను మంచి వేసవిలో కూడా గమనించవచ్చు. పశువుల మేపులో ఉండే లవణములు మరియు శక్తి లోపాన్ని ప్రత్యేకమైన దాణా అందించుట వలన నివారించవచ్చు. రాత్రి సమయంలో పీచు ఎక్కువగా ఉండే మేతను ఇవ్వడం వల్ల దేహములో ఉత్పత్తి అయ్యే వేడి తీవ్రతను తగ్గించవచ్చు. వేసవిలో మేలైన యాజమాన్య పద్ధతులు ఉపయోగించి పశువులను చూడి కట్టించడం వల్ల సంవత్సరం పొడవునా పాల దిగుబడి ఉండడం వలన, రైతు ఆర్థికంగా మెరుగుపడతారు.
డా. బి. చంద్ర ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్; డా. చందన, M.V.Sc., ఫోన్: 80742 44537, ఎన్.టి.ఆర్. పశువైద్య కళాశాల, గన్నవరం, కృష్ణాజిల్లా, ఆంధ్రప్రదేశ్.

