2023-24 సంవత్సరంలో భారతదేశంలో పత్తి ఉత్పత్తి 295.1 లక్షల బేళ్ళకు తగ్గుతుందని ప్రభుత్వ, వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత 15 సంవత్సరాల్లో ఇదే కనిష్ట స్థాయి ఉత్పత్తిగా నమోదవుతుందని ఈ అంచనాలు తెలుపుతున్నాయి. 2013-14లో దేశంలో 398 లక్షల బేళ్ళ ఉత్పత్తయింది. అత్యధికంగా ఆ సంవత్సరంలో 117 లక్షల బేళ్ళ పత్తి విదేశాలకు ఎగుమతి అయింది. ఇటీవలికాలంలో 2021-22లో 338 లక్షల బేళ్ళ పత్తి గరిష్టంగా ఉత్పత్తయింది. 2022-23లో ఉత్పత్తి 336 లక్షల బేళ్ళకు తగ్గగా, 2023-24లో 300 లక్షల బేళ్ళ కన్నా తక్కువ స్థాయికి దిగజారటం ఆందోళన కలిగిస్తున్నది. 2022లో పత్తిధర క్వింటాలుకి రూ. 8,000 నుండి రూ. 10,000 మధ్య కదలాడింది. ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో ధరలు మరింత పెరుగుతాయని రైతులు ఆశించారు. కాని 2023 నవంబరు నుండి ప్రారంభమైన సీజనులో ధరలు కనీస మద్దతు ధర కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మధ్య పింజ పత్తికి క్వింటాలుకి రూ. 6620, పొడుగు పింజ పత్తికి రూ. 7020 గా కనీస మద్దతు ధరలుగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. వర్షాల వల్ల తడిసి, తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తికి క్వింటాలుకి రూ. 5000 నుండి రూ. 6000 కన్నా ఎక్కువ ధరలు లభించటం లేదు. తేమ శాతం తక్కువగా ఉండి, నాణ్యమైన పత్తికి కూడా కనీస మద్దతు ధరల కన్నా ఎక్కువ ధరలు లభించటం లేదు.

అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి
ప్రపంచ వ్యాప్తంగా కూడా పత్తి ఉత్పత్తిలో స్తబ్ధతే నెలకొన్నది. గింజ తీసిన పత్తి ఉత్పత్తి 2017-18లో అత్యధికంగా 27 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది. 2018-19 లో 25.98 మిలియన్ మెట్రిక్ టన్నులు, 2019-20లో 26.13 మిలియన్ మెట్రిక్ టన్నులు, 2020-21లో 24.32 మిలియన్ మెట్రిక్ టన్నులు, 2021-22లో 26.44 మిలియన్ మెట్రిక్ టన్నులుగా పత్తి ఉత్పత్తి అంచనా వేశారు. 2022-23లో 23.5 మిలియన్ మెట్రిక్ టన్నులు, 2023-24లో 23.4 మిలియన్ మెట్రిక్ టన్నులు పత్తి ఉత్పత్తయినట్లు అంతర్జాతీయ పత్తి సలహా కమిటీ ప్రకటించింది. గత ఆరేడేళ్ళగా పత్తి ఉత్పత్తిలో ప్రగతి లేనట్లుగా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఐతే పత్తి వినియోగంలో కూడా తగ్గుదల కనిపిస్తున్నది. 2021-22లో పత్తి వినియోగం 25.18 మిలియన్ మెట్రిక్ టన్నులుగా నమోదైంది. అది 2022-23లో 23.79 మిలియన్ మెట్రిక్ టన్నులకు తగ్గింది. వరుసగా రెండు, మూడేళ్ళుగా ఉత్పత్తి కన్నా వినిమయం తక్కువగా ఉండటం వల్ల ఎంతో కొంత నిల్వలు పెరుగుతున్నాయి. వినిమయం తగ్గటానికి వివిధ దేశాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కొంత కారణమైతే, కృత్రిమ దారాల వినిమయం పెరగటం, నూలు దారాలతో కృత్రిమ దారాలను కలిపి వాడటం కూడా కారకాలే. మన దేశంలో బట్టలకు వాడుతున్న దారాల్లో 73 శాతం వాటా నూలు దారాలదే. కృత్రిమ దారాల వాటా 27 శాతం మాత్రమే. కాని ప్రపంచ స్థాయిలో చూస్తే 62 శాతం వాటా నైలాన్, పోలియెస్టర్, ఏక్రిలిక్, రేయాన్ వంటి కృత్రిమ దారాలదే. 38 శాతం వాటా మాత్రమే నూలు దారాలది. శీతోష్ణ స్థితుల్లో ఉండే తేడాల వల్ల వివిధ దేశాల్లో నూలు దారాలు, కృత్రిమ దారాలు, ఉన్ని, తోలు, పట్టు వంటి వివిధ మూలపదార్థాల నుండి బట్టలు తయారవుతున్నాయి. వచ్చే ఐదారేళ్ళలో నిపుణుల అంచనాల ప్రకారం నూలు దారానికి గిరాకీ సాలీనా 2.7 శాతం పెరుగుతుందనీ, కృత్రిమ దారాలకు గిరాకీ మాత్రం సాలీనా 7.4 శాతం చొప్పున పెరుగుతుందనీ తెలుస్తున్నది. 2022లో యుక్రెయిన్-రష్యాల యుద్ధం మొదలైన తర్వాత ముడిచమురు ధరలు బారెల్‌కి 100 డాలర్లు దాటాయి. అప్పుడు ముడి చమురు నుండి తయారయ్యే కృత్రిమ దారాలు ధరలు కూడా పెరిగాయి. వాటికనుగుణంగానే నూలు ధరలు కూడా పెరిగాయి. అందువల్లనే పత్తికి గిరాకీ తగ్గి, వినిమయం తగ్గి ఉండవచ్చు. 2023లో ముడి చమురు ధరలు 75 డాలర్లకు తగ్గటంతో కృత్రిమ నూలు ధరలు, పత్తి నూలు ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి ధరలు కూడా మందగించాయి.
ఉత్పాదకతలో ప్రతిష్ఠంభన
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు పత్తిని 43 లక్షల హెక్టార్లలో సాగు చేసేవారు. హెక్టారుకి 132 కిలోల సగటు దిగుబడితో 23 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. 2013-14 కల్లా ఉత్పత్తి 17 రెట్లు పెరిగి 398 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. పత్తి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. దిగుబడులు కూడా నాలుగైదు రెట్లు పెరిగాయి. 1970వ థకంలో సంకరజాతి పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చాయి. 1980-81లో కూడా పత్తి సగటు దిగుబడి హెక్టారుకి 169 కిలోలే. అప్పటికి సంకర జాతి రకాలు కేవలం ఐదు శాతం విస్తీర్ణంలోనే సాగయ్యాయి. 2000-01 నాటికి 45 శాతం పత్తి విస్తీర్ణంలో సంకర పత్తి రకాలు సాగయ్యాయి. అప్పటికి పత్తి దిగుబడులు హెక్టారుకి 308 కిలోలకు చేరుకున్నాయి. 21వ శతాబ్దం ప్రారంభంలో ‘బాసిల్లస్‌తూరెంజెన్స్’ (బి.టి.) జన్యువుని సంకర రకాల్లో ప్రవేశ పెట్టటం మొదలైంది. బి.టి. సంకర రకాలను రైతులు బాగా ఆదరించడంతో 2007-08 కల్లా సగటు దిగుబడులు హెక్టారుకి 580 కిలోల వరకు పెరిగింది. 2013-14 కల్లా పత్తి విస్తీర్ణంలో 97 శాతం వరకు బి.టి. సంకర రకాలను సాగు చేసారు. హెక్టారుకి 565 కిలోల సగటు దిగుబడితో పత్తి ఉత్పత్తి గరిష్టంగా 398 లక్షల బేళ్ళకు చేరింది. సంకర జాతి రకాలకు అధిక దిగుబడినిచ్చే శక్తి ఉంది. అయితే పత్తి పంటకు కాయతొలిచే పురుగుల బెడద ఎక్కువగా ఉండేది. సంకర జాతి రకాల్లో బి.టి. జన్యువుని ప్రవేశపెట్టటం వల్ల కాయతొలిచే పురుగులను చాలావరకు నియంత్రించటం సాధ్యపడింది. పురుగు మందుల ఖర్చు కూడా గణనీయంగా తగ్గింది. అయితే రసం పీల్చే పురుగులపై ఇప్పటికీ రసాయనాలను వాడుతున్నారు. అలాగే బి.టి. జన్యువు ప్రభావం 90 రోజుల వరకే ఉంటుంది. ఆలస్యంగా పంటనాశించే గులాబీ రంగు కాయతొలిచే పురుగులపై బిటి జన్యువు ప్రభావం తక్కువగా ఉంటుంది. వాటి నివారణకు పురుగు మందుల వాడకం తప్పటం లేదు. అయినా కూడా గులాబీ రంగు కాయతొలిచే పురుగుల వల్ల నష్టం తప్పటం లేదు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో గులాబీరంగు కాయతొలిచే పురుగు బెడద తీవ్రంగా ఉంది. గత పది సంవత్సరాలుగా పత్తి సాగులో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదీ అందుబాటులోకి రాలేదు. హెక్టారు దిగుబడులు 500 కిలోలకు అటూఇటూ కదలాడుతున్నాయి. ఇక పత్తి ఉత్పత్తి పత్తి సాగు విస్తీర్ణంపైన, ప్రకృతి వైపరీత్యాలు, చీడపీడల తాకిడి పైన ఆధారపడుతున్నది.
తెలుగురాష్ట్రాల్లో పత్తి సాగు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013-14 నాటికి పత్తిసాగు 23.89 లక్షల హెక్టార్లలో జరిగింది. హెక్టారుకి 555 కిలోల సగటు దిగుబడితో 78 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. 2014-15లో తెలంగాణాలో 17.13 లక్షల హెక్టార్లలో పత్తి సాగయింది. హెక్టారుకి 501 కిలోల సగటు దిగుబడితో 50.5 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి సాగు 8.21 లక్షల హెక్టార్లలో జరిగింది. 549 కిలోల హెక్టారు సగటు దిగుబడితో 26.5 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. 2021-22లో తెలంగాణాలో పత్తి సాగు 23.59 లక్షల హెక్టార్లలో జరిగింది. 432 కిలోల సగటు దిగుబడితో 59.95 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. ఆంధ్రప్రదేశ్‌లో పత్తి సాగు 6.06 లక్షల హెక్టార్లకు తగ్గింది. హెక్టారుకి 450 కిలోల దిగుబడితో 16.04 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయింది. రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణాలో పత్తిసాగు పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తగ్గింది. దేశపు సగటు దిగుబడి తగ్గినట్లుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పత్తి దిగుబడులు తగ్గాయి. 2022-23, 2023-24లో కూడా ఈ రెండు రాష్ట్రాల్లోనూ పత్తి సాగు ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైంది. 2021-22లోనూ, 2022-23లోనూ పత్తికి మెరుగైన ధరలు లభించడం వల్ల పత్తి సాగుపట్ల ఆసక్తి పెరిగింది. కాని వర్షాభావం వల్ల కొన్ని థల్లోనూ, అధిక వర్షాల వల్ల మరికొన్ని థల్లోనూ పత్తి పంట దెబ్బతిన్నది. సగటు దిగుబడులు 500 కిలోలలోపే ఉన్నాయి. ఈ సంవత్సరం ధరలు కూడా తగ్గటంతో చాలామంది రైతులు నష్టపోయే అవకాశం కనిపిస్తున్నది. ఈ సంవత్సరం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాపై సేకరణ బాధ్యతలు పెరిగాయి. తెలంగాణాలో నల్గొండ, ఆదిలాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో పత్తిసాగు ఎక్కువగా కేంద్రీకృతమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో పత్తి సాగు ఎక్కువగా జరుగుతున్నది. ఈ జిల్లాలన్నిటిలోనూ రెండొంతుల విస్తీర్ణంలో పత్తిని వర్షాధారంగానూ, ఒకవంతు విస్తీర్ణంలో నీటి వసతితోనూ సాగు చేస్తున్నారు. 2022-23లో తెలంగాణాలో 20.25 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగినట్లు అంచనాలున్నాయి. 58.54 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తయినట్లు అంచనా వేసారు. ఆంధ్రప్రదేశ్‌లో 2022-23లో 6.02 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరిగినట్లు, 17.85 లక్షల బేళ్ళ పత్తి ఉత్పత్తి అయినట్లు అంచనాలున్నాయి. 2023-24లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పత్తి ఉత్పత్తి తక్కువగా ఉండవచ్చని ప్రాథమిక అంచనాలున్నాయి.
సాపేక్షికంగా తగ్గిన పత్తి ధర
సాంకేతిక అభివృద్ధి కారణంగా వస్తువులు, సేవల వాస్తవ ధరలు తగ్గటం సహజంగా జరుగుతున్నది. కంప్యూటర్ల వాస్తవ ధరలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు సంపన్నులు మాత్రం వాడగలిగిన సెల్‌ఫోన్లను ఇప్పుడు పేద ప్రజలు కూడా వాడగలుగుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల విషయం కూడా అంతే. ప్రస్తుత ధరల్ని ద్రవ్యోల్బణ సూచీతో భాగిస్తే వచ్చే వాస్తవ ధరలు వరి, గోధుమ, పప్పులు, వంట నూనెల వంటి ఏ వ్యవసాయ ఉత్పత్తి విషయంలోనైనా తగ్గటం మన అనుభవంలో అర్థమవుతుంది. అయితే ఏ పంట సాగులో దిగుబడులు పెరిగి, వాస్తవ ఉత్పత్తి వ్యయం తగ్గుతుందో ఆ పంట ఉత్పత్తి ధరలు బాగా తగ్గుతున్నాయి. కోడిగుడ్డు ఉత్పత్తి వ్యయం బాగా తగ్గటం వల్ల, దాని వాస్తవ ధర వేగంగా తగ్గి, అందరికీ అందుబాటులోకి రావటం మనందరి అనుభవం. అమెరికన్ మార్కెట్‌లో గత 50 సంవత్సరాల్లో ముఖ్య ఉత్పత్తుల ధరల్లో వచ్చిన మార్పుల్లో పత్తి వాస్తవ ధరలు బాగా తగ్గినట్లు తెలుస్తున్నది. 1973లో మొక్కజొన్న ధర బుషెల్‌కు 2.17 డాలర్లుగా ఉండేది. అది 2012లో గరిష్టంగా 6.92 డాలర్లకు చేరి, 2024లో 4.55 డాలర్లుగా ఉంది. 50 సంవత్సరాల్లో దాని ధర 2.09 రెట్లు పెరిగింది. మరో ముఖ్యమైన పంట సోయాచిక్కుడు ధర బుషెల్‌కు 1973లో 6.95 డాలర్లుగా ఉండేది. అది 2012లో గరిష్టంగా 14.62 డాలర్లకు చేరి, 2024లో 12.42 డాలర్లుగా ఉంది. 50 సంవత్సరాల్లో దాని మార్కెట్ ధర 1.79 రెట్లు పెరిగింది. పత్తి ధర 1973లో పౌండుకి 60 సెంట్లుగా ఉండేది. అది 2011తో గరిష్టంగా 1.36 డాలర్లకు చేరి, 2024లో 81 సెంట్లుగా ఉంది. పత్తి మార్కెట్ ధర 50 సంవత్సరాల్లో 1.35 రెట్లు మాత్రమే పెరిగింది. మొక్కజొన్న, సోయాచిక్కుడు, పత్తి వాస్తవ ధరలు బాగా తగ్గాయి. కాని ఈ మూడింటిలో పత్తి ధర అన్నిటి కన్నా బాగా తగ్గింది. పత్తి సాగులో వచ్చిన సాంకేతిక మార్పులు వినిమయదారులకే లాభించాయి కాని రైతులకుకాదు. అమెరికాలోనైనా, చైనాలోనైనా, పశ్చిమాఫ్రికాదేశాల్లో ఐనా, భారత్, పాకిస్తాన్‌లలో ఐనా పత్తిని పండిస్తున్న రైతులకు అరకొరా లాభాలు, అప్పుడప్పుడు నష్టాలే మిగులుతున్నాయి. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో గిరాకీ, సరఫరాల సమతుల్యతను బట్టి ధరలు నిర్ణయించబడతాయి. కాని ఇప్పుడు సరఫరా తగ్గినా చైనా వంటి దేశాలు పత్తి దిగుమతిని తగ్గించటం వల్ల గిరాకీ లేక మార్కెట్‌లో మాంద్యం కనిపిస్తున్నది. చైనాలో పత్తి వినియోగం ఎక్కువ కనుక పత్తిని దిగుమతి చేసుకొని నిల్వ పెట్టుకుంటుంది. కాని ఆ దేశం ప్రస్తుతం ఎదుర్కుంటున్న ఆర్థిక సమస్యల వల్ల పత్తి దిగుమతుల్ని పరిమితం చేసింది. చైనా తర్వాత బంగ్లాదేశ్, వియత్నాం, టర్కీ, ఇండోనేషియాలు పత్తిని దిగుమతి చేసుకునే దేశాలు. పత్తిని ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా, బ్రెజిల్, ఉజ్బెకిస్తాన్, పశ్చిమాఫ్రికాలోని బుర్కినాఫాసో, బెనిన్, కామేరూన్ వగైరా దేశాలతో పాటు ఇండియా కూడా ఉంది. భారత్‌లో ఉత్పత్తి తగ్గుతున్నట్లుగా కాక ఇతర దేశాల్లో మెరుగైన పరిస్థితులుండటం వల్ల కూడా మార్కెట్‌లో ధరలు పెరగకపోతుండవచ్చు. ఏదైనా రెండు మూడు నెలలు గడిస్తే గాని పత్తి మార్కెట్‌లో కదలిక ఉండకపోవచ్చు. కాని ఈలోగా చాలామంది రైతులు తెగనమ్ముకోవాల్సిరావచ్చు.
పత్తిసాగులో లాభ, నష్టాలు
పత్తి మార్కెట్ ఎప్పుడూ అనిశ్చితికి పెట్టింది పేరే. జూదప్రియులకు కాటన్ మార్కెట్ ఆడటం ఇష్టమైన వ్యాపకం. ‘ఓపెనింగ్’, ‘క్లోజింగ్’ ధరలపై పెట్టే పందాలతో తలకిందులైన కుటుంబాలు వేల సంఖ్యలో ఉంటాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలోని నల్లనేలల్లో పండించే పత్తిని ఇంగ్లాండ్ తరలించటానికే బ్రిటిష్ కాలంలో రైలు మార్గాలను నిర్మించారనే వాదం కూడా ఉంది. బొంబాయి నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి అక్కడ ఏర్పడిన నూలు మిల్లులే కారణంగా చెబుతారు. పత్తి నుండి గింజను వేరు చేయటం, బేళ్ళగా నొక్కి, రవాణా చేయటం, పత్తి నుండి నూలు దారం తీయటం, దారం నుండి బట్టలు నేయటం, బట్ట నుండి దుస్తులు తయారు చేయటం, వాటిని దేశవిదేశాల్లో అమ్మటం అన్నీ వాణిజ్యీకరణకు దోహదపడ్డాయి. స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మాగాంధీ రాట్నం వడకటం, ఖాదీ బట్టల తయారీ దేశభక్తికి చిహ్నాలుగా నిలిచాయి. పత్తి సాగు సాంప్రదాయకంగా వర్షాధారంగా నల్ల నేలల్లో ఎక్కువగా జరిగేది. నీటి వసతిని కల్పించడం, సంకర జాతి రకాలను వాడటం వల్ల పత్తిసాగు కూడా ఒక వాణిజ్య కార్యక్రమంగా మారింది. 50 సంవత్సరాల క్రితం గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీగా పెట్టుబడి పెడుతూ, సస్యరక్షణను ఒక క్రమ పద్ధతిలో చేస్తూ వ్యవసాయాన్ని ఒక జూదంగా మార్చారు. స్వంత భూమితో పాటు పొలాల్ని కౌలుకి తీసుకొని, వాణిజ్య స్థాయిలో పత్తి సాగుని విస్తరించారు. రైతులే కాకుండా ఉద్యోగులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు కూడా పత్తిసాగులో పెట్టుబడులు పెట్టారు. ఏ ఇద్దరు కలిసినా ‘పత్తి వేశావా?’ అనే పలకరింపు సర్వసాధారణంగా ఉండేది. కొందరు లాభించగా, మరికొందరు నష్టపోయారు. తెల్లదోమ, కాయతొలిచే పురుగుల ఉధృతి పెరిగి కొన్ని సంవత్సరాల్లో పత్తి సాగు చేసిన రైతులంతా భారీగా నష్టపోయారు. వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పత్తి సాగు నల్లనేలల నుండి ఎర్రనేలలకు, ఇసుక నేలలకు కూడా పాకి, వాతావరణం, మార్కెట్ అనుకూలిస్తే లాభాలొచ్చాయి. లేకుంటే నష్టాలొచ్చాయి. బి.టి. పత్తి రకాలు వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలపాటు రైతులు కుదుటపడ్డారు. కాని మళ్ళీ కొత్త పురుగులు, రోగాలు ప్రబలుతున్నాయి. అనావృష్టి, అతివృష్టి ప్రతి సంవత్సరం ఏదో ప్రాంతంలో విలయతాండవం చేస్తున్నాయి. ఎన్నో ఉపద్రవాలు, అనిశ్చితి పరిస్థితుల్లో రైతులు ఆశాభావంతో పత్తిని సాగు చేస్తున్నారు. ఒక క్వింటాలు పత్తి ఉత్పత్తి వ్యయం రూ. 6000 నుండి రూ. 9000 వరకు వివిధ రాష్ట్రాల్లో భిన్నంగా ఉంది. కాని పత్తి ధరలు రూ. 7000 లకు అటూఇటూగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలామంది రైతులు నష్టపోతున్నారు. ధరలు రూ. 8000 నుండి రూ. 10,000 వరకు ఉంటాయనే ఆశాభావంతో రైతులు సాగు చేసారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా క్రియాశీలకంగా కొనుగోళ్ళు చేస్తేనే ప్రస్తుతం ఉన్న ధరలైనా నిలుస్తాయి. రెండు మూడు నెలలు నిలవ చేస్తే క్వింటాలు ధర రూ. 8000లు దాటవచ్చు. చాలా కొద్దిమంది రైతులే తమ పంటను నిల్వ చేసుకునే స్థితిలో ఉన్నారు. పత్తిరైతులు నష్టపోవటం ఇది మొదటిసారే కాదు, చివరి సారీ కాదు. భవిష్యత్‌లో ధరలు పెరుగుతాయనీ, రైతులు నిలదొక్కుకుంటారనీ ఆశిద్దాము.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్ & కన్సల్టెంట్ ఇక్రిసాట్), ఫోన్: 83098 59517, 70328 11608

