పశువుల బీమా రైతుకు వరం

వెంకట సుబ్బయ్య రెండెకరాల చిన్న రైతు. వృద్ధాప్యం వల్ల సొంతంగా వ్యవసాయం చేయలేక, కౌలుకు ఇచ్చినా సమయానికి కౌలు సొమ్ములు వసూలయ్యే అవకాశాలు అంతంత మాత్రంగానే వుండుటవల్ల, ఆ భూమిని అమ్మి కొంత మనవరాలి పెళ్లికి ఖర్చు చేసి, మిగిలిన సొమ్ముతో రెండు పాడి గేదెలు కొని పాల ఉత్పత్తి విూద జీవనాన్ని సాగిస్తూ వున్నాడు. అయితే గత వేసవిలో సంభవించిన అగ్నిప్రమాదంలో ప్రేమగా పెంచుతున్న రెండుగేదెలూ అగ్నికి ఆహుతై పోగా ఆ పేద వృద్ధ దంపతుల జీవితాలు బజారున పడ్డాయి. అప్పుడు కానీ అతనికి పశువుల బీమా ఒకటి వుంటుందనీ, ఇలాంటి ప్రమాదాల వల్ల జరిగే నష్టాలకు పరిహారం లభిస్తుందనీ, ఆ పరిహారంతో మరో రెండు గేదెల్ని కొనుగోలు చేసి పాల ఉత్పత్తిని కొనసాగించవచ్చునని!

నాగయ్య, మల్లన్న, సుబ్బన్న ముగ్గురు సోదరులు. హర్యానాకు వెళ్లి ఆరు పాడిగేదెల్ని కొనుగోలు చేశారు. అక్కడి రైతుల సూచన మేరకు ఆ పశువుల్ని రవాణా బీమాతో మొత్తం బీమా చేశారు. అయితే దురదృష్టవశాత్తు వేగంగా హైవే మీద వస్తున్న ఈ వాహనాన్ని వేరొక వాహనం వెనుక నుండి ఢీకొట్టటం వల్ల డ్రైవర్‌, క్లీనరు, అటెండరుతో పాటు ఆరు పశువులూ ప్రాణాలు కోల్పోయి, ఈ విషయాన్ని ఫోను ద్వారా ఇన్సూరెన్సు కంపెనీకి తెలియపరచి, సమీపంలోని ఇంటర్నెట్‌ కేంద్రం ద్వారా కూడా ఇన్సూరెన్సు కంపెనీ వారికి తెలియపరచగా ఆ కంపెనీ వారి సమీప శాఖ అధికారులు స్థలానికి వచ్చిపశువులతో పాటు ప్రమాద దృశ్యాలను యజమానులతో కలిపి ఫోటోలు తీసుకుని, పశువైద్యుని చేత శవాలకు పోస్ట్‌మార్టములు చేయించి, తమ నివేదికని ఆంధ్రప్రదేశ్‌లోని ఇన్సూరెన్స్‌ కంపెనీ వారికి, యజమానుల సంతకాలు తీసుకున్న పత్రాలతో పంపారు. ఇది జరిగిన ఇరవై రోజులకు బీమా చేయించిన మొత్తానికి చెక్కులు ఆ యజమానులకు అందాయి.

* * * 

భర్తను కోల్పోయిన రమణమ్మ తన 50 సెంట్ల భూమిని విక్రయించి ఆ సొమ్ముతో రెండు గేదెల్ని కొని పాల ఉత్పత్తి ద్వారా జీవిస్తూ ఉంది. ఆమె తన ముర్రా గేదెలకు ఇన్సూరెన్సు కూడా చేయించింది. అయితే ఈ గేదెలు ఊరి సమీపంలోని కాలువ మీద నడిచే బల్లకట్టు తీగెలో రింగులు తిరిగిన కొమ్ము బిగుసుకు పోయి, నీళ్లలో మునిగి చనిపోయింది. ఈ విషయమై ఇన్సూరెన్స్‌ కంపెనీ వారికి వెంటనే ఫిర్యాదు కూడా చేసింది. కానీ పశువు చెవికి బిగించిన ఇన్సూరెన్స్‌ పోగు నాలుగు నెలల క్రితమే ఊడిపోయి అదృశ్యమైన విషయాన్ని ఇన్సూరెన్సు కంపెనీకి తెలియపరచని కారణంగా చనిపోయిన పశువుకు నష్టపరిహారం చెల్లించుటకు నిరాకరించారు.

* * * 

రంగయ్య ఏడాదికి ఇన్సూరెన్స్‌ చేయించిన తన గేదెను ప్రక్క గ్రామంలోని సుబ్బారావుకు ఆరు నెలల క్రితం విక్రయించాడు. నెలక్రితం సుబ్బారావు గొడ్ల పాకలో పాముకాటుకు ఇన్సూరెన్సు చేసిన గేదె మరణించింది. సుబ్బారావు ఇన్సూరెన్సు కంపెనీకి ఫిర్యాదు చేసి, పరిహారం కోసం కోరాడు. అయితే యాజమాన్య బదిలీ విషయాన్ని ముందుగా ఇన్సూరెన్స్‌ కంపెనీకి తెలియపరచనందువలన రంగయ్య, సుబ్బారావులకు ఎవరికీ నష్టపరిహారం చెల్లించబడలేదు.

* * * 

నాలుగేళ్ల క్రితం విస్తృతంగా వ్యాపించిన లంపీస్కిన్‌ డిసీజ్‌ కారణంగా మరణించిన మూడు ఆవులకు సుబ్బరామయ్యకు బీమా చేయించి మొత్తం లక్షాయాభై వేల రూపాయలు అవి మరణించిన నెలరోజుల్లో అందాయి.

* * * 

పాపారావు తన గేదెను ఇన్సూరెన్సు తన వూరి పాల కేంద్రం ద్వారా చేయించాడు. ఇన్సూరెన్సు చేయించిన 20 రోజులకు ఆ గేదె చనిపోయింది. చనిపోయిన గేదె చెవికి బిగించిన చెవి పోగును తీసుకొని ఇన్సూరెన్సు కంపెనీ శాఖకు వెళ్లగా ”మీరు కట్టవలసిన ప్రీమియం మొత్తం ఇప్పటి వరకు మాకు చేరలేదు. మీకు నష్టపరిహారం రాదు” అని స్పష్టం చేశారు. పాపారావు తన వూరి పాలకేంద్రంలో విచారించగా తన బీమాపత్రం- ప్రీమియం, ఇంకా పాల కేంద్రంలోనే ఉన్నట్లు తెలిసింది. దీనిపై గ్రామంలో పెద్ద రగడ జరిగింది.

* * * 

రామభద్రయ్య నిండు చూడి గేదె ఈనలేక తీవ్రంగా నొప్పులు పడ్తూ వుంది. దాని బాధ చూడలేక పొరుగున వున్న వెంకయ్య సాయం కోరగా, మరో నలుగురి సాయంతో చాలా మోటుగా గర్భంలో నుండి ఎటువంటి శుభ్రతా జాగ్రత్తలు తీసుకొనకుండా బలంగా దూడను బైటకు లాగారు. ఈ మోటుతనం వల్ల విపరీత రక్త సావ్రం జరిగి, దూడతో సహా తల్లి కూడా మృతి చెందింది. స్థానికంగా పట్టభద్రుడైన పశువైద్యుని సేవలు లభ్యమైనప్పటికీ, నాటు పద్ధతిలో దూడను బైటకు లాగే ప్రయత్నం చేయుట, యజమాని యొక్క నిర్లక్ష్యాన్ని చాటిన కారణంగా ఇన్సూర్‌ చేయబడిన ఈ పశువుకు కూడా నష్టపరిహారం లభించలేదు.

పైన పేర్కొన్న సంఘటనల్ని గమనిస్తే మనకు పశువుల బీమా అంటే ఏమిటో, దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటో తీసుకోవలసిన జాగ్రత్తల్ని పాటించకపోతే కలిగే నష్టాలేమిటో కొంతవరకు అర్థమౌతుంది.

పశువుల బీమా అంటే ఒక నిర్ణీత మొత్తాన్ని (ప్రీమియమ్‌)ను ఇన్సూరెన్సు కంపెనీ (ఇన్సూరర్‌)కు చెల్లించుట ద్వారా నిర్ణీత నిబంధనలను పాటిస్తూ, నిర్ణీత కాలంలో జరిగే ప్రాణ నష్టానికి, ఉత్పాదకతకు జరిగే నష్టాలకు ఇన్సూర్డ్‌ మొత్తానికి లోబడి నష్టపరిహారం పొందుటకు బీమా చేయించిన వ్యక్తిని బీమా కంపెనీకి మధ్య జరిగే పరస్పర ఒప్పందమని చెప్పవచ్చును. నిర్ణీత నమూనాలో వ్రాసుకున్న (ముద్రించబడిన) ఈ ఒప్పంద పత్రాన్ని బీమా పత్రంగా పేర్కొంటారు.

పశువు యొక్క మార్కెట్‌ విలువకు దగ్గరగా, కొన్ని పరిమితులకు లోబడి పశువు యొక్క బీమా సొమ్ము మొత్తం నిర్ణయించబడుతుంది. అందులో 3 నుండి 4 శాతం వార్షిక ప్రీమియం ఉంటుంది. ప్రభుత్వాలు, కొన్ని పాల సహకార సంఘాలు, ప్రైవేటు డెయిరీలు ఈ ప్రీమియం సొమ్ములో 30 నుండి 70 శాతం వరకు భరిస్తున్నాయి. ఒకేసారి మూడు సంవత్సరాలకు బీమా చేయిస్తే 25% రాయితీ లభిస్తుంది. పూర్తిగా శాశ్వత గొడ్డుతనాన్ని, శాశ్వత అంగవైకల్యం జరిగినప్పుడు, పశువైద్యుడు చేసిన నిర్ధారణ మేరకు 75 శాతం వరకు నష్టపరిహారం పొందాలంటే అదనంగా ఒక శాతం ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది.

వయస్సు పెరిగేకొద్దీ విలువలు పెరిగే దూడలు, పడ్డలకు వాటి మరణ సమయానికి వున్న విలువను చెల్లించే విధంగా కూడా ప్రత్యేక బీమా సదుపాయాలు కూడా వున్నాయి.

బీమా వల్ల ప్రయోజనాలు

1. శాస్త్రీయమైన క్రొత్త పద్ధతులలో పశువుల పెంపకాన్ని, పోషణను, నిర్వహణను ధైర్యంగా అమలు చేయుటకు బీమా భరోసా ఇస్తుంది.

2. బీమా చేయించే ముందు, ఒకవేళ పశువు మరణించిన తర్వాత జరిపే వైద్య పరీక్షలు, శవపరీక్షల వల్ల స్థానికంగా వున్న అనారోగ్యాలకు కారణాలు గుర్తించి, వ్యాధులు, సమస్యల నివారణకు పటిష్టమైన శాస్త్రీయ చర్యలు చేపట్టుటకు అవకాశం ఉంటుంది.

3. బీమా చేయించిన పశువు యొక్క గుర్తుల రికార్డు మరియు చెవిపోగుల ఆధారంగా తప్పిపోయిన, దొంగిలించబడిన పశువుల్ని గుర్తించుట సులభతరం అవుతుంది.

4. బీమా చేయించిన పశువుకు పట్టభద్రునిచే శాస్త్రీయ వైద్య పరీక్షలు, చికిత్సలు చేయించుట వల్ల నాటువైద్యాలు, మొరటు వైద్యాలపై ఆధారపడే అలవాటు తగ్గుతుంది.

5. బీమా చేయించే ముందు జరిపే గర్భకోశ పరీక్షల వల్ల గొడ్డుబోతు సమస్యల్ని గుర్తించి సకాలంలో సరియైన చికిత్సలు జరిపి వాటి ఉత్పాదకతను పెంచే అవకాశాలు ఉంటాయి. చూడివిగా గుర్తించబడిన పశువులు కబేళాల దారిపట్టకుండా నివారించవచ్చు.

బీమా నిబంధనలు

1. బీమా చేసే సమయానికి పశువు పరిపూర్ణ ఆరోగ్య స్థితిలో ఉన్నట్లు పట్టభద్రుడైన పశువైద్యుడు మాత్రమే నిర్ధారణ చేయాలి.

2. బీమా చేసిన ఆరోగ్య దృవీకరణ పత్రముతో పాటు చెల్లించవలసిన ప్రీమియం మొత్తం ఇన్సూరెన్సు కంపెనీకి అందిన 15 రోజుల తర్వాత మాత్రమే బీమా అమలులోకి వస్తుంది.

3. బీమా చేయబడిన పశువుకు సరియైన పోషణ, రక్షణ, ఆదరణ మరియు సకాలంలో వైద్య సదుపాయాలు అందినట్లు ఇన్సూరెన్సు కంపెనీ సంతృప్తి చెందినప్పుడే బీమా నష్టపరిహారం అందుతుంది. సకాలంలో టీకాలు వేయించుట, దూడలు, జీవాలకు డివార్మింగ్‌ చేయుట తప్పనిసరి.

4. ప్రమాదాలు, రోగాలు బారిన పడిన పశువులకు సత్వరమే పశువైద్య పట్టభద్రుని చేత వైద్య సేవలు అందించాలి.

5. ఉద్దేశపూర్వకంగా నిర్దయకు, క్రూరత్వానికి, వధకు గురైన పశువులకు పరిహారం లభించదు. అయితే సుదీర్ఘ బాధ నుండి మరియు ప్రమాదకరమైన అంటురోగాల బారి నుండి విముక్తి కలిగించే ఉద్దేశంతో పంచానామ జరిపిన తర్వాత జరిపే కారుణ్యవధకు గురైన పశువుకు పరిహారం అందవచ్చను.

6. బీమా కంపెనీ వారు నమోదు చేసుకున్న గుర్తుల్ని (కొమ్ముల కొలతలు) మార్చరాదు. చెవికి బిగించిన నెంబరు పోగును తొలగించరాదు. ఏ కారణం వల్లనైనా ఊడిపోయిన పోగు గురించిన సమాచారాన్ని వెంటనే వ్రాతపూర్వకంగా ఇన్సూరెన్సు కంపెనీకి తెలియపరచి, అందుకు ఆధారాలను జాగ్రత్తగా పదిలపరచుకోవాలి. బీమా చేయబడి మరణించిన పశువు యొక్క చెవిపోగు స్పష్టంగా కనిపించే విధంగా యజమాని మరియూ ఇద్దరు సాకక్ష్యులతో తీసిన ఫోటోను క్లెయిమ్‌ పరిష్కారం పూర్తయే వరకు భద్రపరచుకుంటే మంచిది.

7. బీమా చేయబడిన పశువును వేరొక వ్యక్తి, లేదా సంస్థకు బదిలీ చేసినా, విక్రయించినా, ఆ సమాచారాన్ని బీమా కంపెనీకి లిఖితపూర్వకంగా తగిన ఆధారాలతో తెలియపరచాలి.

క్లెయిమ్‌ చేయు విధానం: పశువు మరణించిన తర్వాత శవాన్ని కదల్చరాదు. వెంటనే ఈ విషయాన్ని సంబంధిత పశువైద్యునితో పాటు కంపెనీ వీరికి స్వయంగా లేదా ఫోనుద్వారా తెలియపరచుటతో పాటు వ్రాతపూర్వకంగా వాట్సప్‌, ఇమెయిల్‌ ద్వారా కూడా తెలియపరచాలి. 24 గంటల వరకు వేచి చూచిన తర్వాత స్థానిక పెద్దల సమక్షంలో పంచనామా జరిపి, వారితోపాటు పశువును చెవిపోగు స్నష్టంగా కనిపించే విధంగా ఫోటోలు తీసి చెవి పోగును జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. 24 గంటలలోగా పశువైద్యుడు వస్తే శవపరీక్ష జరుపుటకు ఆయనకు సహకరించాలి.

ఇన్సూరెన్స్‌ కంపెనీవారి నుండి అందిన నమూనా దరఖాస్తు, పశువైద్యుని ధృవీకరణ, వైద్య రికార్డులతో చెవిపోగును జత చేసి ఇన్సూరెన్సు కంపెనీ వారికి సమర్పించి రసీదును పొందాలి లేదా ఆధారాలను భద్రపరచుకోవాలి.

సరైన కారణం తెలుపకుండా ఏ క్లెయిమునూ తిరస్కరించే అధికారం ఇన్సూరెన్స్‌ కంపెనీ వారికి ఉండదు. ఒప్పందకాల పరిమితిలో పరిహారం చెల్లించని కంపెనీలపై అవసరమైతే నియమిత యాంబుట్స్‌మ్యాన్‌ లేదా వినియోగదారుల ఫోరం నుండి న్యాయ సహాయం పొందవచ్చు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రకృతి బీభత్సాలు రైతాంగం జీవితాలను ఆర్థికంగా ఛిద్రం చేస్తున్నందున, ప్రకృతి విపత్తుల వల్ల పాడి రైతు నష్టాలను కొంతమేరకైనా ఆదుకుంటున్న ”పశువుల బీమా – రైతుకు వరం” అని అందరూ గ్రహించాలి.           

డా. యం.వి.జి. అహోబలరావు, హైదరాబాద్‌. 93930 55611

Read More

పశువులలో కామెర్లు

సాధారణంగా పశువులలో వచ్చు కామెర్లనే ఇక్టిరస్‌ లేదా జాండీన్‌ అని కూడా అందురు. ఇది సాధారణంగా కాలేయవ్యాధులలో అతిప్రధానమైన లక్షణం. ఇది సాధారణంగా బైలిరుబిన్‌ అనునది రక్తంలో >2.0 mg/d గ్రా. ఉన్నపుడు కనిపించును. దీనివలన శ్లేష్మపొరలు, అన్నిరకాల కణజాలాలు మరియు కణజాల ద్రవాలు పసుపురంగులోనికి మారి కంటిలోని స్ల్కీరా యందు పసుపురంగు స్పష్టంగా కనిపించును. ఇది కాలేయ వ్యాధులు, రక్తంలోని ఎర్రరక్తకణాలు అధికంగా విచ్ఛిన్నమయినపుడు లేదా పైత్యరసము ప్రేగులోనికి చేర్చు నాళము మూతపడినపుడు లక్షణంగా కనిపించును.

సాధారణంగా జాండీస్‌ను మూడు రకాలుగా విభజించవచ్చును. ఇవి హీమోలైటిక్‌, టాక్సిక్‌ మరియు అబ్‌స్ట్రక్టీవ్‌ జాండీస్‌ రకాలు. హీమోలైటిక్‌ జాండీస్‌కు గల ముఖ్యమైన కారణాలు ఎర్రమూత్రవ్యాధి, ఎనాప్లాస్మోసిస్‌, ట్రిపనోసోమియాసిస్‌, ఈక్వైన్‌ వైరల్‌ ఎనీమియా, క్లాస్ట్రీడియల్‌ వ్యాధులు మొదలగునవి. ఈ వ్యాధుల కారణంగా అనేకమైన ఎర్రరక్తకణాలు ఒకేసారి విచ్ఛిన్నమై కామెర్లను కలుగజేయును. సాల్మొనెల్లా, లెప్టోస్పైరా, ఇన్ఫెక్షియస్‌ కెనైన్‌ హెపటైటిస్‌, పాష్పరస్‌ వంటి విషపదార్థాలు, క్రొటలేరియా వంటి విషపు మొక్కల కారణంగా కాలేయ కణాలు దెబ్బతిని నాశనము అగును. అందువలన వచ్చే కామెర్లను టాక్సిక్‌ జాండీస్‌ అందురు. పరాన్నజీవులు అగు ఫేషియోలా హెపాటికా, ఆస్కారిస్‌ లుంబ్రికాయిడిస్‌; గొర్రెలలో బద్దెపురుగులు; కొలాంజైటిస్‌, కోలిసిస్టైటిస్‌, ప్యాంక్రియాటైటిస్‌, పైత్యరస నాళికలోనికి చిన్నచిన్న రాళ్ళు చేరటం, కణితులు వంటి కారణాల వలన కలుగు కామెర్లను అబ్‌స్ట్రక్టీవ్‌ జాండీస్‌ అందురు. ఇది ముఖ్యంగా పై కారణాల వలన పైత్యరస నాళిక మూతపడుట వలనవచ్చును. కామెర్ల సమయంలో శ్లేష్మపొర కొన్నిసార్లు చర్మం పచ్చగా కనిపించును. మూత్రము చిక్కటి, పచ్చటి ద్రవములాగ రావటము; పాలు పసుపు రంగులోనికి మారటం పైన తెలిపిన విధంగా బైలిరూబిన్‌ మోతాదు పెరుగుట, క్రొవ్వు కలిగిన మలవిసర్జన చేయటం, ఆకలి మందగించుట లేదా అసలే లేకపోవటం, శరీర బరువు తగ్గటం, కుక్కలలో వాంతులు కలుగుట జరుగును. దీని నిర్ధారణ మూత్ర పరీక్ష (హే పరీక్ష), సీరం పరీక్ష (వాండెన్‌ బర్గ్‌ పరీక్ష) మరియు ఇక్టిరస్‌ ఇండెక్స్‌ (రోగి యొక్క ప్లాస్మా రంగును స్టాండర్డ్‌ పొటాషియం డైక్రోమేట్‌ ద్రవాలతో పోల్చి కనుగొనవచ్చును. చివరగా జాండీస్‌ యొక్క కారణాన్ని గుర్తించి, చికిత్స మరియు నివారణ చర్యలు చేపట్టి, విశ్రాంతి ఇచ్చి, క్రొవ్వు లేని, ఉప్పు లేని ఆహారం ఇచ్చినచో పశువులలో కామెర్లను నియంత్రించవచ్చు.   

డా. ఎం. జీవనలత (9490292468), అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్‌, 

డా. ఎం. కె. శ్రీకాంత్‌ (9652655255), పశువైద్యాధికారి, రాజేంద్రనగర్‌

Read More

పాడిపరిశ్రమలో సవాళ్ళు

సుస్థిర అభివృద్ధి, సాంకేతిక ముందంజ, వినియోగదారుల ప్రాముఖ్యతలే సూచికలుగా నేడు పాడిపరిశ్రమ అనేక సవాళ్ళు ఎదుర్కొంటూ ముందడుగు వేస్తోంది.

ప్రపంచ ఆహార వ్యవస్థలోనే తనదైన ప్రత్యేక ముద్ర వేస్తున్న పాడిపరిశ్రమ అటు వినియోగదారుల మారుతున్న అవసరాలు, పర్యావరణ సంరక్షణలే ప్రాతిపదికగా సాంకేతికత జోడిస్తూ, సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. సుమారు 55 సం|| క్రితం హైదరాబాద్‌లోని లాలాపేటలో నిర్మించిన విజయ పాల ఉత్పత్తుల కర్మాగారం కాకుండా, ఇటీవల రావిర్యాలలో రూ. 450 కోట్లతో నిర్మించిన మెగా డెయిరీ ఇందుకు నిదర్శనం. అయితే పాల ఉత్పత్తి, ఉత్పాదకతలపరంగానూ, పాడి పశువుల పరంగానూ ఎన్నో సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాశిలో ఎక్కువగా ఉన్న పశువుల ఉద్గారాలు, మీథేన్‌ వలన, పర్యావరణ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దానికై సమతుల ఆహారం అందిస్తూ, ఇట్టి ఉద్గారాలను తగ్గించవచ్చని గుజరాత్‌లో ఎన్‌డిడిబి క్షేత్ర స్థాయిలో నిరూపించింది. సమతుల ఆహారం పశువులకు అందించడం వలన 15-21% మీథేన్‌ వాయువులను నియంత్రించవచ్చు.

అలాగే, పశువుల పేడ విషయంలోనూ సరియైన నిర్వహణా పద్థతులు అవసరం. బయోగ్యాస్‌ ఉత్పత్తికై పేడ వినియోగం, మిగిలిన ‘స్లర్రీ’తో భూసారం పెంపొందించడం తప్పక చేపట్టాలి.

నానాటికీ తరిగిపోతున్న పశుగ్రాస భూములను సద్వినియోగం చేసుకోవాలి. ఉన్న భూమిలో పశుగ్రాసాల పెంపకం ప్రణాళికా బద్ధంగా చేపట్టాలి.

డెయిరీ ఫార్మ్‌ వ్యర్థాలతో సేంద్రియ శక్తి ఉత్పత్తి, ‘బ్రికెట్స్‌’ లాంటి ఇంధనాల ఉత్పత్తి చేయడం విలువ జోడింపుకు సహకరిస్తాయి.

నీటి సద్వినియోగం, నీటి నాణ్యత పరిరక్షణ ముఖ్యంగా వాననీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం, నీటిని పరిమితంగా వాడుకోగల యంత్రాల వినియోగం, పశువులు కడగగా విడుదలయ్యే నీటిని పశుగ్రాసాల పెంపకానికి వినియోగించడం అవలంబించాలి.

పెద్ద డెయిరీలలో పాల పొడి తయారీ ప్రక్రియలో ఆవిరి ఏర్పడుతుంది. దీనిని తిరిగి నీరుగా మార్చి, వివిధ అవసరాలకు వాడడం చేపట్టాలి. 

ముఖ్యంగా డెయిరీలలో నీటి దుబారాని అరికట్టాలి. నీటి మీటర్ల వినియోగం, ప్రతి షిఫ్ట్‌లో నీటి వాడకం పరిశీలించడం, నీటి వినియోగ నియంత్రణకు సహకరిస్తుంది.

పాల ఉత్పత్తి పెంపుదలకు అజొల్లా వినియోగం, అవిసె ఆకులను మేపడం, చెట్ల మధ్య పశుగ్రాసాల పెంపకం నేడు చాలా అవసరం.

పెద్ద డెయిరీ ఫారాల్లో రోబోటిక్‌ మిల్కింగ్‌ పార్లర్ల వినియోగం, పశువుల్లో పలు వ్యాధులను తట్టుకొనే జన్యువుల గుర్తింపు, అభివృద్ధి, సెక్స్‌డ్‌ సెమెన్‌ పరిజ్ఞానం, పిండమార్పిడి ప్రక్రియ లాంటి ఎన్నో సాంకేతికతలను ఎప్పటికప్పుడు ‘అప్‌డేట్‌’ చేసుకోవాలి.

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా బాదాం, పసుపు, సోయా, ఓట్స్‌ పాల తయారీ మార్కెటింగ్‌ చేయాలి. తక్కువ చక్కెర పానీయాలు, విటమిన్లతో పుష్టీకరించడం, క్లీన్‌ లేబెల్స్‌తో పాల ఉత్పత్తుల అమ్మకాలు, సాంప్రదాయ ఉత్పత్తులతో ఆధునిక ఉత్పత్తుల మేళవింపు, కొత్త రుచుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా, డెయిరీలు ఉత్పత్తులను తాజా, నాణ్యతతో, సరసమైన ధరలో అందించగలగాలి.

సాంకేతికతను ఆహ్వానించని ఏ డెయిరీ మనగలదు. వినియోగదారుని అభిరుచి మేరకు అడుగు వేసినపుడే పాడి పరిఢవిల్లుతుంది. రైతు కష్టం నిజం అవుతుంది.

– మధుసూదనరావు, ఉప సంచాలకులు, విజయ డెయిరీ, ఆదిలాబాద్‌, 9121160553

Read More

ఈనిన పశువులలో గర్భాశయ వాపు – నివారణ

ఆరోగ్యవంతమైన పశువులు ఈనిన తరువాత మొదటి పది రోజులవరకు ఎర్రటి స్రావాలు వేస్తూ క్రమముగా ఆ స్రావాలు పూర్తిగా ఆగిపోతాయి. కాని ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లు అయితే ఈనిన పశువులలో గర్భాశయము వాపుకు గురై మొదటి పది రోజులలో తెల్ల మట్టు వేయడం మనం ఎక్కువగా గమనించవచ్చు. ఈ వ్యాధి సంక్రమించిన పశువులలో గర్భాశయం వాపుకు గురై, దుర్వాసన కలిగి, ఎరుపు-గోధుమ రంగులో నీటి లాంటి లేదా జిగట, తెల్లని, చీము కలిగిన స్రావాలు యోని నుంచి ద్రవిస్తూ వుంటాయి, మరియు ఆరోగ్యం క్షీణించడం, పాల దిగుబడి తగ్గి, జ్వరంతో కూడిన లక్షణాలు కనబడతాయి. దీనివల్ల పశువులు ఎదకు ఆలస్యంగా రావడమేకాక, ఎదకు వచ్చినప్పుడు ఎన్నిసార్లు చూడి కట్టించినా చూడి కట్టవు. ఈ వ్యాధి ఈనిన తర్వాత 30 శాతం పశువులలో చూడవచ్చు. ఈ వ్యాధి చికిత్సకు 5000-7000 రూ. ఖర్చవుతుంది, అదే అశ్రద్ద వహించినచో పశువు ప్రాణానికే ప్రమాదము వాటిల్లవచ్చు. మరలా ఆ పశువుని ఇంకో పశువుతో భర్తీ చేయడానికి 75,000-90,000 రూ. ఖర్చవుతుంది.  అందువల్ల లక్షణాలను త్వరగా గుర్తించి తగు చికిత్స చేయించుకున్నట్టయితే  రైతు పాల ఉత్పత్తిని పెంచుకొని ఆర్థికంగా లాభం పొందవచ్చు.

కారణాలు

ఇది సాధారణంగా అసహజమైన మొదటి లేదా రెండవ థ ప్రసవాన్ని అనుసరిస్తుంది. ప్రత్యేకించి దూడ అడ్డం తిరిగినప్పుడు దూడను బయటకు తెచ్చే దీర్ఘకాలిక ప్రయత్నము లేదా యోనికి నష్టం వాటిల్లినప్పుడు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితికి  గర్భాశయ జడత్వం, ఈసుకొని పోవడం, ప్రేరేపిత లేదా అకాల కాన్పు, ఈనడం కష్టమవ్వడం, మెయ్య, ఈనిన వెంటనే సకాలములో మాయ వేయకపోవడం వంటివి కూడా ముఖ్య కారణములుగా పేర్కొనవచ్చు. వేలాడే మాయని లాగడం, బరువు కట్టడం వల్ల గర్భకోశం చిరిగి, రక్తస్రావమై పశువులకు ప్రమాదం సంభవిస్తుంది. సూక్ష్మజీవులు గర్భకోశంలోనికి వెళ్ళడం వల్ల వ్యాధి సోకి, ఆ పై  రక్తంలోకి చేరడం ద్వారా పశువు యొక్క ఆరోగ్యం క్షీణిస్తుంది. 

లక్షణాలు

వ్యాధి తీవ్రత  ఎక్కువగా వున్న పశువులలో గర్భాశయం ఎక్కువ  వాపుకి గురై, పశువులు ఎరుపు-గోధుమ రంగులో, జిగటగా మరియు దుర్వాసన కలిగిన మట్టు పోస్తుంటాయి. సాధారణంగా పశువులలో ప్రసవానతరం రెండు వారాలవరకు ఎర్రటి రంగులో, నీరులాంటి, ఎటువంటి దుర్వాసన లేని స్రావాలు సాదారణంగా గమనించవచ్చు. ఈ రెండింటి మధ్య తేడాను గమనించుకుంటూ ఉండాలి.  ఈనిన తర్వాత ఎర్ర మట్టు వేయడం సహజం, అదే ఎరుపు – గోధుమ రంగులో వచ్చినట్లైతే లోపల గర్భంలో ఇన్ఫెక్షన్‌ వున్నట్లు. ఈ వ్యాధిలో పశువులు జ్వరం కలిగి వుండి, నాడి వేగంగా కొట్టుకోవడంతో పాటు మేత సరిగా తీసుకోకపోవడం, శరీరంలో నీటి శాతం తగ్గి నీరసముగా ఉండడము, పారుడు వంటి లక్షణాలను చూపిస్తాయి. యోని మరియు మానం ఎరుపు రంగులోకి మారి, వాపుకి గురై వుండి, పిండం పొరలు తరచుగా గర్భాశయ గోడలకు గట్టిగా అతుక్కొని వున్నట్టయితే పశువు యొక్క ఆరోగ్యం పూర్తిగా విషమించిందని అర్థంచేసుకోవచ్చు. తరచుగా ఈ జబ్బున పడిన పశువులు పశువైద్యుడిని సంప్రదించేలోపు క్రింద పడిపోయి, మేత తీసుకోకుండా లేవలేని స్థితిలో వుంటాయి. ఈ ఇన్ఫెక్షన్‌ గర్భాశయము నుండి పొట్ట భాగంలోకి ప్రవేశించడం వలన ఆవు యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణించడం మొదలవుతుంది. తీవ్రమైన వ్యాధిని కలిగి లేవలేని స్థితిలో వున్న పశువుల రక్తంలో కాల్షియం తగ్గిపోవడం మరియు చనిపోయే అవకాశం ఉంటుంది.

చికిత్స 

మంచి పోషకవిలువలతో కూడిన సమతుల్య ఆహారంతో పాటు అత్యవసర చికిత్స చాలా అవసరం. వ్యాధి కారక క్రిములను చంపడానికి ప్రయత్నించడం కంటే పశువు  యొక్క శరీరధర్మానికి మద్దతివ్వడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, పశువు ఈనడానికి వెచ్చని మరియు సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి. ఈ పరిస్థితిలో మొదటి థలో స్రావాలను, మరియు నొప్పిని తగ్గించుటకు అవసరమైన చికిత్సను అందించాలి. కాల్షియం అవసరమైన వాటికి ఇవ్వడం, యాంటీబయాటిక్‌ సెన్సిటివిటీ టెస్ట్‌ చేయించి, ఫలితానుసారం చికిత్సను అందించాలి. వీలైనంత వరకు ఈనిన 45 రోజుల లోపు గర్భంలోకి మందులు ఎక్కించకుండా కండకు మాత్రమే వేసుకోవడం ఉత్తమం. 

ఈ పశువుల యొక్క ఆరోగ్య పురోగతిని  ఆకలిని తిరిగి పొందుట, పారడం ఆగిపోవుట  మరియు గర్భాశయం నుంచి వచ్చే స్రావాల యొక్క దుర్గంధం తగ్గి, దళసరిగా, మరింత స్పష్టంగా కోడిగుడ్డు సొనలా మారడం ద్వారా మనం గుర్తించవచ్చు. 

నివారణ

ఈ పరిస్థితిని నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. దూడ అడ్డం తిరిగినప్పుడు, లేదా గర్భాశయ జడత్వం మొదలగు  సమస్యలు గమనించినప్పుడు, దూడను లాగకుండా, దీర్ఘకాల ప్రయత్నాలు తగ్గించి, మానంకి ఎటువంటి నష్టం వాటిల్లకుండా, వెంటనే పశువైద్యున్ని సంప్రదించడం ఆవశ్యకం. ఈసుకుపోయిన వాటిని ఇతర పశువులనుంచి దూరంగా వుంచి, కారణాలను తెలుసుకొని తగు చర్యలను తీసుకోవాలి. 

పశువులు మాయ సరిగ్గా వేయకపోవడం వల్ల ఈ సమస్యని తరచుగా చూస్తాము. వేలాడే మాయని బలవంతముగా లాగడం లేదా బరువు కట్టడం వల్ల గర్భాశయము లోపల ఎక్కువ రక్తస్రావము జరిగి  పశువులు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈనిన తర్వాత 24 గంటల వరకు మాయవేయని పరిస్థితులలో డాక్టర్‌ గారి సలహా మేరకు  వైద్యం చేయించాలి. ఎక్స్‌ ప్లాంటా, రిప్లాంటా వంటి పౌడర్లను రోజు 50 గ్రా. నోటి ద్వారా  అందించుట వలన  గర్భకోశ చలనాలు పెరిగి మాయ దానికంతటకు అదే  పడిపోతుంది. పావు కేజీ నువ్వులు అర కేజీ బెల్లంతో కలిపి మూడు, నాలుగు రోజులు తినిపించాలి. యాంటీబయాటిక్స్‌ 3-5 రోజులు వాడుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఈ సమస్యని పూర్తిగా కాకపోయినా, కొంతవరకైనా నివారించవచ్చు. రోజుకి 50 గ్రా. ఖనిజలవణ మిశ్రమమును దాణాలో అందించాలి. 

మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్‌, అండవాహికలో చీము చేరడం, అండాశయ అతుకులు ఏర్పడడం, ఊపిరితిత్తులలో నీరు చేరడం, కాలేయం, మూత్రపిండాలు లేదా మెదడులో చీము గడ్డలు అభివృద్ది చెందడం వంటివి ఈ వ్యాధి  యొక్క పర్యవసానాలు. ఈ పరిస్థితి నుండి కోలుకున్న పశువుల యొక్క పునరుత్పత్తి శక్తి తగ్గే అవకాశం ఉంది, కాబట్టి వాటిని తదుపరి గర్భాశయం మరియు అండాశయంలో ఏదైనా మార్పులు లేదా వ్యాధుల కోసం పర్యవేక్షించుకోవాలి. ఏదైనా సమస్య తలెత్తినట్లయితే, వెంటనే పశువైద్యున్ని సంప్రదించి సకాలంలో తగిన చికిత్స చేయించుకోవాలి.

కె. గ్రీష్మా రెడ్డి, 8309205772, పి.హెచ్‌.డి. విద్యార్థిని, బి. చంద్ర ప్రసాద్‌, 9490724881, సహాయ అద్యాపకులు, పశు గర్భకోశ శాస్త్ర మరియు ప్రసూతి విభాగము, పశువైద్య కళాశాల, గన్నవరం

Read More

పాల ఉత్పత్తి తగ్గుట కారణాలు – పరిష్కారాలు

పాడి రైతులు సాధారణంగా ఎదుర్కొనే సమస్యలలో ముఖ్యమైనది పాల ఉత్పత్తి తగ్గిపోవడం! ఇందుకుగల కారణాలను తెలుసుకుని సకాలంలో దిద్దుబాటు చర్యలు తీసుకొనకపోతే పాల ఉత్పత్తి మరలా పూర్వస్థితికి పెరిగే అవకాశాలు మరింతగా తగ్గుతాయని ప్రతి పాడి రైతూ గ్రహించాలి. ఇందుకు ప్రతి పాడి పశువు యొక్క రోజువారీ (పూటవారీ) పాల ఉత్పత్తి మరియు వీలైతే వెన్న శాతాలను రికార్డు చేసుకునే అలవాటు చేసుకోగలిగితే మరింత మంచిది. ఈ రికార్డుల వల్ల పశువును విక్రయించినప్పుడు, కొనుగోలు చేసినప్పుడు సరియైన సమాచారం వల్ల పశువులకు మెరుగైన ధరలు పొందే అవకాశాలు ఉండగలవు.

పాల ఉత్పత్తి నిలిచిపోయినా, తగ్గిపోయినా ఆస్థితిని ‘ఎగలెక్షియా’ అని అంటారు. పాల ఉత్పత్తి తొలి మూడు ఈతలలో క్రమేపీ పెరుగుతూ ఆ తర్వాత 4-5 ఈతల వరకు స్థిరంగా అదే థలో కొనసాగి, వయసు మీరినప్పుడు క్రమేపీ తగ్గిపోతుంది. పాల దిగుబడి ఈనిన తొలి మూడు నెలల్లో క్రమంగా పెరిగి, ఆ తర్వాత 3-4 నెలలు నిలకడగా ఉండి, చూడి ఆఖరిథ చేరే నాటికి క్రమక్రమంగా తగ్గిపోతుంది. మంచి పాడి పశువు ఎక్కువ రోజులు గరిష్ట స్థాయిలో పాలను అందిస్తుంది. గరిష్ట స్థాయిలో బహు కొద్ది రోజులు మాత్రమే పాలనిచ్చి, ఆ తర్వాత వేగంగా దిగుబడిని తగ్గిస్తే అది లాభదాకమైన పాడి పశువు కాకపోవచ్చును. సాధారణంగా ఈ విధంగా వేగంగా ఉత్పాదక శక్తిని కోల్పోయే పశువులే ఎక్కువగా సంతలకు విక్రయానికి వస్తూ ఉంటాయి. ఈ విషయంలో పశువుల కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలి.

పాల ఉత్పత్తి చాలా సున్నితమైన జీవన ప్రక్రియ. వాతావరణం, మేత, నిర్వహణ, మానసిక వత్తిడి (దూడను కోల్పోవటం) అలవాటు పడిన నిర్వాహకుడు దూరం కావటం వంటి అనేక ప్రతికూలతలవల్ల కలిగే వత్తిళ్లు (స్ట్రెస్‌లు) పాల ఉత్పత్తితో పాటు చేపును కూడా తగ్గిస్తాయి.

ఎదకు వచ్చే సమయంలోనూ, చూడిథలోనూ పాల ఉత్పత్తికి దోహదపడే హార్మోన్ల స్థాయిలలో జరిగే మార్పులు కూడా పాల ఉత్పత్తిని తగ్గిస్తాయి. గర్భస్థ స్థితిలో పాల ఉత్పత్తికి అవసరమ్యే ప్రోటీన్లు, చక్కెరలు, మినరల్స్‌ మరియు విటమిన్స్‌ వంటి ధాతువులు గర్భాశయ అభివృద్ధికి మరియు గర్భస్థ పిండం ఎదుగుదలకు తరలిపోవుట వల్ల పాల ఉత్పత్తి క్షీణిస్తుంది. అనుభవం లేని కొందరు నిర్వాహకులు ఎదవల్ల తెల్లవారుఝామున ఎదలక్షణాలలో భాగంగా అరుస్తూ వుంటే, వాస్తవాన్ని గ్రహించకుండా నిద్రాభంగం కలిగించిందని హింసిస్తే, ఆ బాధ, ఆందోళనల వల్ల కూడా పాల ఉత్పత్తి మరింతగా క్షీణించవచ్చును.

చూడి ఆఖరి రెండు నెలలు పొదుగు వృద్ధికి కీలకమైనవి. ఈ థలో పాల గ్రంథులు, పాలనాడులు, పొదుగులోనే రక్త సరఫరా వ్యవస్థ వృద్ధి చెందవలసి ఉంటుంది. ఇందుకు అవసరమైన అదనపు పోషక పదార్థాలన్నీ పశువుకు అందటంతో పాటు వాటిని సమర్ధవంతంగా వినియోగించుకోగలిగి ఉండాలి. కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం వంటి ఖనిజాలు, విటమిన్‌ డి వంటి ఇతర ధాతువులు కూడా సరియైన పరిమాణంలోనూ, దామాషాలోనూ లభ్యమైనప్పుడే పశువుకు ఆశించిన స్థాయిలో వినియోగపడగలవు.

పొదుగు నుండి సులువుగా పాలు బైటకు రావడానికి వీలుగా రొమ్ములు నిక్కపొడుచుకుని వుండే స్థితిని చేపు అంటారు. దూడరొమ్ముల్ని కుడిచినప్పుడు, రొమ్ములు పొదుగు మరియు మడి భాగాలను సున్నితంగా ఆహ్లాదం కలిగించే విధంగా నిమిరినప్పుడు, ఈ స్పర్శ స్పందనల వల్ల మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలయ్యే ఆక్సిటోసిన్‌ అనే హార్మోనువల్ల రొమ్ములు నిక్కపొడుచుకుని పాలనాళాలు తెరుచుకుని పాల విడుదల సులభతరం కాగలదు. ఈ విధంగా ఏర్పడ్డ చేపుథ సాధారణంగా 4 నుండి 6 నిమిషాలు మాత్రమే కొనసాగి, ఆ తర్వాత క్రమంగా తగ్గిపోతుంది. పశువు ఆందోళనలకు, చికాకులకు లోనైతే ఇంతకంటే ముందుగానే చేపు ముగిసిపోయి, పాలను ఎగచేపుకోవచ్చు. కొన్ని తల్లులు తెలివిగా మధ్యలోనే ఎగచేపుకుని ఆ తర్వాత వదిలే దూడకు ఇవ్వడానికి మరల చేపుకు రావచ్చును. అందుకే పొదుగులోని మొత్తం పాలను 4-5 నిముషాలలో పిండుకోగల్గాలి. పాలను పిండే పద్ధతి పశువుకు బాధ కల్గించకుండా ఆహ్లాదంగానూ పొదుగుభారాన్ని తగ్గించే విధంగానూ వుండాలి. పాలు పిండే సందర్భంలో ఈగలు, దోమలు, గోమార్ల వల్ల అసౌకర్యాలు, సమీపంలో రణగొణధ్వనుల చికాకు లేకుండా చూసుకోవాలి. పొదుగు, రొమ్ముల మీద ఏర్పడ్డ స్వల్పగాయాలు, పుండ్లు, పగుళ్లు సైతం చేపుపై ప్రభావాన్ని చూపగలవు. 

బాలింత పశువుల్ని, రవాణాలో పశువుల్ని ఎక్కువ దూరాలు నడిపించి వత్తిడి కలిగించినా, ఎండ, చలి వంటి తీవ్ర వాతావరణ ప్రతికూలతలు ఏర్పడినా, కొన్ని పూటలు లేదా రోజులు పాలుపిండటం ఆపినా, పాల ఉత్పత్తి క్షీణిస్తుంది. రోజులో 30 లీటర్లకంటే ఎక్కువ పాలనిచ్చే ఆవులు, రోజుకు 20 లీటర్ల కంటే ఎక్కువగా పాలిచ్చే గేదెలకు వీలైతే మూడుసార్లు కూడా పాలు పిండటం మంచిది. ఇందువల్ల ఖాళీ అయిన పొదుగులో మరో 10-15 శాతం అదనంగా పాలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి.

వివిధ రకాల అనారోగ్యాలలో మనకు కనిపించే ప్రథమ లక్షణం- పాల ఉత్పత్తి తగ్గిపోవటం! అజీర్తి, కడుపు ఉబ్బరం, పారుడు, పొదుగువాపు, గర్భవాతం వంటి సందర్భాలలో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎదకు వచ్చిన పశువును చూడి కట్టించక పోయినా, ఏ కారణం వల్లనైనా చూడి నిలవక పోయినా, అండాశయం నుండి తయారైన కార్పస్‌ లూటియం అనే తాత్కాలిక గ్రంథి స్థిరపడిపోయి, దాని నుండి విడుదలయ్యే హార్మోను పాల ఉత్పత్తితో పాటు చేపును కూడా నిరోధించవచ్చును. దీనినే మనం నాలుగుశేర్లు లేదా నాలుక సేర్లు అని వ్యవహరిస్తారు. ఈ సమస్యను మంచి పోషణ మరియు కొన్ని బహుమూలికా మందులతో సులువుగానే పరిష్కరించుకోవచ్చును. అవసరమైతే నిపుణుడి సహాయం పొందాలి. రక్తంలో కాల్షియం శాతం తగ్గిపోయే పాలజ్వరం, చక్కెర శాతం తగ్గే కీటోసిస్‌ వంటి అనారోగ్య స్థితుల్లో పాలఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. మెయ్య దిగటం, ఈనిన తర్వాత మాయ గర్భంలోనే 24 గంటలకు మించి నిలిచిపోవటం వంటి సందర్భాలలో కూడా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది.

పాల ఉత్పత్తి – చేపులపై కొన్ని మందుల ప్రభావం!

వివిధ ఆరోగ్య సమస్యలకు వాడే యాంటిబయోటిక్స్‌, బాధనివారణ మందులు పాలఉత్పత్తి మీద ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. ముఖ్యంగా నోటి ద్వారా వాడే యాంటిబయోటిక్స్‌, సల్ఫామందుల వల్ల జీర్ణశక్తికి దోహదపడే పొట్టలోని మేలు చేసే సహజమైన బాక్టీరియా నశించుట వల్ల జీర్ణశక్తి తగ్గి పాల ఉత్పత్తి క్షీణిస్తుంది. కొన్ని సందర్భాలలో వాడే కార్టిజోన్‌ ఇంజక్షన్ల వల్ల పాల ఉత్పత్తి పూర్తిగా క్షీణించే పరిస్థితి కూడా రావచ్చు. ఇటువంటి కార్టిజోన్‌ మందుల్ని వాడక తప్పని పరిస్థితి ఏర్పడితే వాటిని పశువైద్యుని సూచనల మేరకు పరిమితంగా నిర్ణీత మోతాదులో మాత్రమే వాడి, థలవారీగా తగ్గిస్తూ నిలిపివేయాలి.

పొదుగు వాపు వ్యాధిని సకాలంలో గుర్తించి పూర్తిగా అదుపు చేయకపోతే పొదుగులోని పాలగ్రంథులు నశించి, వాటి స్థానంలో పీచు కండపెరిగి పొదుగు శాశ్వితంగా ధ్వంసమైపోయే ప్రమాదం ఉంది. గత ఈత ముగింపు థలో పొదుగులో నిలిచిపోయిన పాలలోకి ప్రవేశించిన సూక్ష్మక్రిములు, చూడి థలో మరింతగా వృద్ధి చెంది క్రమక్రమంగా పాలగ్రంథుల్ని ధ్వంసం చేసే ముప్పు ఉంటుంది. దీనిని నివారించడానికి ఈతలో ఆఖరిసారి పాలు పిండిన తర్వాత పొదుగు లోపలకు దీర్ఘకాలం పనిచేసే సమర్ధవంతమైన యాంటిబయోటిక్‌ను ఎక్కించటం మంచిది. దీనినే ‘డ్రై కౌథెరపీ’ అని అంటారు.

ట్రిపనసోమియాసిస్‌, బెబీసియోసిస్‌, థెయిలీరియోసిస్‌, మైకోప్లాస్మోసిస్‌ వంటి వ్యాధి కారక క్రిములు రక్తంలో ఉండి పైకి వ్యాధి లక్షణాలను కలిగించకపోయినప్పటికీ, ఈ క్రిములు రక్తకణాలపై చూపే విధ్వంస పరిణామాలు, విడుదల చేసే విషపదార్థాలవల్ల కూడా పాల ఉత్పత్తి తగ్గిపోవచ్చును. సకాలంలో సూక్ష్మదర్శినితో రక్తపరిశీలన చేసి ఈ వ్యాధి క్రిములను పూర్తిగా అదుపు చేయవలసి ఉంటుంది.

పోషణ: పశువు కనీస జీవిత అవసరాలను తీర్చుటకు, అది ఉత్పత్తి చేసే పాల పరిమాణంతో పాటు వెన్నశాతం, చూడిదైతే గర్భస్థ పిండం ఎదుగుదలతోపాటు గర్భం-పొదుగు, కటి అవయవాల వృద్ధికి అనుగుణంగా అదనంగా పరిపూర్ణమైన ఆహారాన్ని అందించవలసి ఉంటుంది. లేని ఎడల ఈ అత్యవసర అవసరాలకు తరలిపోయే పోషకాలు, పాల ఉత్పత్తికి లభ్యంకాక పాలఉత్పత్తి క్షీణించవచ్చును.

పశువుకు లభించే పచ్చిగ్రాసాలలో రెండు వంతులు చిక్కుడు జాతికి చెందని పారా నేపియర్‌ వంటి గ్రాసాలు రెండు పాళ్లు, చిక్కుడు జాతికి చెందిన బెర్సీమ్‌, ల్యూసర్న్‌ వంటి గ్రాసాలు ఒక పాలు, ముక్కలు చేసి రోజుకు 35 నుండి 45 కిలోలు పశువు శరీర తూకాన్ని బట్టి అందించాలి. రోజుకు 5-6 లీటర్ల పాల ఉత్పత్తికి ఇవి మాత్రమే సరిపోగలవు. అయితే నాణ్యమైన మేతలు అంతగా లభ్యం కానందున సుమారు 16 శాతం ప్రోటీన్లు, 65-70 శాతం ఇతర పోషకాలతో పాటు, తగినన్ని ఖనిజాలు, విటమిన్లు కలిగిన సమీకృత దాణాలను, జీవన మనుగడకు పశువుకు 1.0 నుండి 1.5 కిలోలు. అదనంగా ప్రతి కిలో ఆవుపాలకు 2.0 కిలోలు గేదెపాలకు 2.5 కిలోలు చొప్పున మేపవలసి ఉంటుంది. మేతల్ని-దాణాలను ఆకస్మికంగా మార్పు చేయకూడదు. ఈ మార్పు క్రమక్రమంగా థలవారీగా చేస్తే మంచిది. దాణాలో వంట సోడా 30-50 గ్రాములు కలిపి 4-5 రోజులు వాడవచ్చు. మునగ ఆకు, అవిసె ఆకు, బొప్పాయి కాయల్ని మేపుట ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది. 

పాలదిగుబడి పునరుద్ధరణ: సమస్యను గుర్తించిన వెంటనే నష్ట నివారణ చర్యల్ని చేపట్టాలి. పోషణ, నిర్వహణ లోపాలను వెంటనే సరిదిద్దాలి. కొన్ని ప్రసిద్ధ ఆయుర్వేద ఉత్పత్తి సంస్థలు అందించే బహుమూలికా మందులు, హోమియో మాత్రలు కూడా పాలఉత్పత్తి పునరుద్ధరణకు ఉపయోగపడుతున్నాయి. వీటిని పశువైద్య నిపుణుల సూచనల ప్రకారం వాడాలి.

పాలు నిలిచిపోయినప్పుడు, చేపు లేనప్పుడు, తొందరపడి చేపు ఇంజక్షను (ఆక్సిటోసిన్‌) చేయుట ఏ మాత్రమూ మంచిది కాదు. ఇందువల్ల పశువు శాశ్వతంగా గొడ్డుమోతుగా మారిపోవటమే కాక, ప్రజారోగ్యరీత్యా ఈ ఇంజక్షన్ల వాడకం నిషేధించబడింది. అంతర్గతంగా ఆక్సిటోసిన్‌ ఉత్పత్తిని ప్రేరేపించేందుకు సున్నితంగా పొదుగు, రొమ్ములు, బాహ్యజననేంద్రియాలపై మృదువైన మర్దన వంటి చర్యలు, ప్రేమ పూర్వకంగా చేసే నిమురు, అలవాటుపడిన ప్రశాంత స్థలంలో పాలుపిండటం, పాలుపిండే ముందు చేపుకు దూడల్ని వదలటంతో పాటు గంటలు కొట్టటం, మృదువైన సంగీతాన్ని వినిపించటం, పాలు పిండే స్థలాన్ని, మనుషుల్ని అలవాటు చేయటం (కంటిషన్డ్‌ రిఫ్లెక్స్‌) వంటి చర్యల్ని చేపట్టవచ్చు.

సాధారణంగా మన ప్రభుత్వాలు, బ్యాంకులు వారివారి సంక్షేమ పథకాల అమలును ఫిబ్రవరి-మార్చి నెలల్లో ముమ్మరం చేస్తాయి. ఇందుకు కేటాయించే నిధులు మార్చి నెలాంతంలో మురిగిపోవటం మరియు పంపిణీ లక్ష్యాలను మార్చి నెలాంతానికి నిర్దేశించడం కారణాలుకాగా, వేసవి తాపం, సుదూర ప్రాంతాల మధ్య పశువుల రవాణా, యాజమాన్యాల మార్పు వంటి కారణాల వల్ల లబ్దిదారులు ఆశించిన మేరకు పాలఉత్పత్తి జరుగదు. కాబట్టి పాడిపశువుల పంపిణీ పథకాలను జనవరి నెలాంతంలోగా ముగించాలని ప్రభుత్వ అధికారులకు ఒక అనుభవజ్ఞునిగా నా సూచన!     

డా. యం.వి.జి. అహోబలరావు, హైదరాబాద్‌. 93930 55611

Read More

నానాటికీ మొండిగా మారుతున్న వ్యాధికారకాలు పెరుగుచున్న యాంటిబయోటిక్‌ రెసిస్టెన్స్‌

విచక్షణా రహితంగా యాంటిబయోటిక్స్‌ వాడటం వల్ల మనుషులలోనే కాక పశువులు-పకక్షులు, కోళ్లు, చేపలలో కూడా అనేక వ్యాధుల్ని కలిగించే వందల రకాల బాక్టీరియా క్రిములు కాలక్రమంలో ఈ యాంటిబయోటిక్స్‌ను తట్టుకోగల శక్తిని పుంజుకుని, యాంటిబయోటిక్‌ రెసిస్టెన్సును పొంది మొండిగా మారిపోతున్నాయి. ఇందువల్ల ప్రజారోగ్యంతో పాటు, అనేక జంతువులు, చేపలు, రొయ్యల వంటి ఆక్వారంగంలోని జీవులు కూడా ప్రాణాలను కోల్పోతున్నాయి. క్షయ, ఆంథ్రాక్స్‌, బ్రూసెల్లోసిస్‌, గర్భవాతం, పొదుగువాపు, న్యుమోనియా మరియు అనేక నిర్ధిష్టత లేని అంటువ్యాధులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా సామర్థ్యాన్ని కోల్పోయిన యాంటిబయోటిక్స్‌ పనిచేయకపోవుటవలన ఏటా సుమారు 60 నుండి 70 లక్షల మంది మనుషులు ప్రాణాలు కోల్పోతున్నట్లు ఒక అంచనా! ఇక ఈ కారణంగానే మృత్యువాత పడుతున్న పశువులు, ఇతర జంతువుల గురించి సరైన అంచనా లేదు. గత నాలుగేళ్లుగా లక్షల ప్రాణాలను హరిస్తున్న కోవిడ్‌-19 మరియు లంపీస్కిన్‌ డిసీజ్‌లో విచక్షణా రహితంగా ఒకేసారి 3-4 రకాల యాంటిబయోటిక్స్‌ను వాడుట వల్ల ఈ ముప్పు మరింతగా ఎక్కువయింది. 

విశ్వప్రాణదాత సర్‌ లూరిస్‌పాశ్చర్‌ ఎనిమిదిన్నర థాబ్దాల క్రితం కనిపెట్టిన పెన్సిలిన్‌ గత కొన్నేళ్ల వరకు ప్రపంచవ్యాప్తంగా కొన్నివందల కోట్ల మానవ ప్రాణాలను గనేరియా, న్యుమోనియా మరియు కొన్ని వందల రకాల ఇతర బాక్టీరియా వల్ల వచ్చే అనేక వ్యాధులబారి నుండి కాపాడింది. ఇదే పెన్సిలిన్‌ పొదుగువాపు, న్యుమోనియా వంటి వ్యాధుల్ని కలిగించే స్ట్రెప్టోకాకస్‌, స్టెఫలోకాకస్‌ వంటి ఎన్నో రకాల ప్రాణాంతక బాక్టీరియాల బారి నుండి కూడా కాపాడింది. ఇంతటి మహోన్నతమైన పెన్సిలిన్‌తో పాటు ఆ తర్వాత మన తెలుగువాడైన డాక్టర్‌ యల్లాప్రగడ సుబ్బారావుగారు రూపొందించిన ఆరియోమైసిన్‌ అనే అత్యంత సమర్ధవంతమైన గ్రామ్‌ (-) మరియు గ్రామ్‌ (+) రకాల బాక్టీరియాను అదుపు చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రాణాలను కాపాడింది. అయితే ఈనాడు ఇదే ఆరియోమైసిన్‌ తన సమర్ధతను, ప్రాభవాన్ని కోల్పోయి కనుమరుగై పోయింది. ఇదే బాటలో క్లోర్‌టెట్రాసైక్లిన్‌, ఎరిథ్రోమైసిన్‌, ఎమాక్సీసిల్లిన్‌, స్ట్రెప్టోమైసిన్‌, క్లాక్సోసిల్లిన్‌, జెంటామైసిన్‌, సెఫటాక్సిమ్‌ మరియూ ఎన్నో రకాల సల్ఫా మందులు కూడా నానాటికీ నిర్వీర్యమైపోతూ, అత్యంత సమర్ధత అనుభవాలు కలిగిన వైద్యుల్ని సైతం నిస్సహాయుల్ని చేస్తున్నాయి. ఒకప్పుడు అద్భుతంగా పనిచేసిన టెర్రామైసిన్‌ (ఆక్సీటెట్రాసైక్లిన్‌) ఈనాడు ఏ మాత్రమూ నమ్మదిగిన స్థాయిలో లేదు.

ఈ దుస్థితికి తగిన విద్యార్హతలు, చిత్తశుద్ధి, నిబద్ధత లేని ప్రజావైద్యులు, పశువైద్యులతో పాటు, సరియైన అవగాహనలేని వైద్యసిబ్బంది, మిడిమిడి విజ్ఞానంతో పశువుల వైద్యాన్ని చేపడుతున్న కుహానా నాటువైద్యులు, డాక్టర్లతో పాటు ప్రజావైద్య మరియు పశువైద్యులు కూడా కారకులేనని చెప్పక తప్పదు. కొందరు పశుపోషకులు కావాలని అవసరం లేని అదనపు యాంటీబయోటిక్స్‌ను తమ పశువులకు వాడవలసిందిగా వైద్యుల మీద వత్తిడి తెస్తున్నారు. లేదా స్వయంగా మిడిమిడి పరిజ్ఞానంతో వాడుతున్నారు. వాస్తవానికి ఇటువంటి అరకొర పరిజ్ఞానుల వల్లనే జంతువులలోని బాక్టీరియా మొండిగా మారుతూ మనుషులలో కూడా ప్రవేశించి మొండి వ్యాధుల్ని కలిగిస్తున్నాయి.

ఇదే ధోరణి ఇంకా కొనసాగితే ప్రాణాంతక అంటురోగాలబారి నుండి మానవాళిని, జంతుజాలాన్ని రక్షించుట మరింత కష్టతరం కావచ్చు. చివరకు వ్యవసాయరంగంలో కూడా ఒక థలో ఈ యాంటి బయోటిక్స్‌ వాడకం పెరిగి, అదృష్టవశాత్తు ఇప్పుడు కొంత తగ్గింది. చేపల చెరువులలో వాడే యాంటిబయోటిక్స్‌ సైతం ఈ సమస్యను జటిలం చేస్తున్నాయి. 

మనుషుల్లో కోవిడ్‌-19, పశువుల్లో లంపీస్కిన్‌ డిసీజ్‌ వ్యాధులు ఉధృతంగా ప్రబలిన రోజుల్లో 3-4 రకాల యాంటిబయోటిక్స్‌ను అత్యధిక మోతాదుల్లోనూ లేదా నిర్దేశించిన మోతాదు కంటే తక్కువగా ఒకేసారి వాడటం. ఈ మందులు వాడిన తర్వాత మరణించిన రోగుల్ని సమర్ధవంతంగా దహనం చేయటం లేదా భూమిలో లోతుగా పూడ్చటం వంటి కనీస జాగ్రత్తల్ని సైతం పాటించకపోవడం వంటి చర్యలు కూడా కొంతవరకు యాంటిబయోటిక్‌ రెసిస్టెన్స్‌ సమస్య తీవ్రతకు కారణమయ్యాయి.

ఇటువంటి రెసిస్టెన్స్‌ కేవలం బాక్టీరియాలోనేకాక అనేక వైరస్‌, ఫంగస్‌ మరియు ప్రేగులు-ఇతర అవయవాలలో అనేక వ్యాధుల్ని కలిగించే పరాన్నజీవులలో కూడా కనిపిస్తూ ఉంది. అందుకే అనేక నట్టల మందులతోపాటు సర్రా, బెబీసియోసిస్‌ మరియు థెయిలీరియాసిస్‌ వంటి రక్త వ్యాధుల చికిత్సకు వాడే మందులు కూడా పూర్వపు సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. ఇప్పుడు డి.డి.టి., గమాక్సిన్‌ వంటి కీటకనాశకాలు కూడా సంతృప్తికరంగా పని చేయని విషయం మనం చూస్తూనే ఉన్నాము.

ఏవిధంగా ఈ రెసిస్టెన్స్‌ కలుగుతోంది?

వ్యాధిక్రిముల్ని సమర్ధవంతంగా నిర్మూలించలేని మోతాదులో వాడటం, వాడవలసినంత వ్యవధుల లోపల, కావలసినంత దీర్ఘకాలం పాటు పశువు శరీరంలో ఈ మందుల పరిమాణం లేకపోవటం, కల్తీ మందులు, కాలం చెల్లిన మందుల్ని వాడటం, ఒకేసారి అనేక మందుల్ని కలిపి వాడటం, రోగస్రావాలు, కృళ్లిపోయిన అవయవాలలో పెరిగిపోయే క్రిముల పట్ల అశ్రద్ధవహించటం వంటి చర్యలు అనేక బాక్టీరియాలు, ఇతర క్రిములలో రెసిస్టెన్స్‌ను పెంచుతున్నాయి. కాలం చెల్లిన యాంటిబయోటిక్స్‌ మందుల్ని చికిత్సలో మిగిలిన మందుల్ని బాధ్యతారహితంగా జలవనరులలోనూ, బహిరంగ ప్రదేశాలలో పెంచుట వల్ల కూడా ప్రకృతిలోని క్రిములు రెసిస్టెన్స్‌ను పొందగల్గుతున్నాయి. యాంటిబయోటిక్‌ అవశేషాలు కలిగిన జంతువుల మాంసాన్ని, వ్యర్థాలను కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులు తినడం వల్ల కూడా ఇన్ఫెక్షన్లతో పాటు, రెసిస్టెన్స్‌ సమస్య కూడా తలెత్తే ముప్పు ఉంటుంది. ఈ సమస్య జంతుప్రదర్శనశాలలోని మాంసాహార జంతువులలో ఎక్కువగా కనిపించవచ్చు. 

ఈ సమస్య నివారణ ఎలా?

సాధారణంగా ప్రతిజీవికీ అనేక రోగక్రిముల దాడి నుండి తమకుతామే సమర్ధవంతంగా ఎదుర్కోగలిగే సహజ శక్తి ఉంటుంది. అందుకే అనాదిగా ఏ యాంటిబయోటిక్‌ సాయం లేకుండా ఎన్నో ప్రాణులు బ్రతకగల్గుతున్నాయి. వైద్యుడు ఈ అవకాశాన్ని తెలుసుకుని, పశువు తనంతట తానుగా క్రిముల్ని ఎదిరించే అవకాశం కొంతవరకు ఇవ్వాలి. అవసరమైతే వ్యాధి నిరోధక శక్తిని పెంచే వెవామెజోల్‌ వంటి ఇంజక్షన్లతో చికిత్సను ప్రారంభించవచ్చు. అందుకని అనవసర జాప్యం చేయాలని చెప్పుట నా ఉద్దేశం కాదు. ఆకలి మందగింపు, అజీర్తి, నీరసం, దగ్గు స్వల్ప గాయాలు వంటి చిన్న సమస్యలకు సైతం యాంటిబయోటిక్స్‌ వాడవలసిన అవసరం ఉండకపోవచ్చు. వ్యాధి తీవ్రతను అర్థం చేసుకున్న తర్వాత వీలైతే రక్తం, స్రావాలు, పాలు, రసి, చీము నమూనాలలోని క్రిములు ఏ నిర్ధిష్టమైన యాంటిబయోటిక్‌కు లొంగుతాయో తెలిపే యాంటిబయోటిక్‌ సెన్సిటివిటీ పరిక్షలు జరిపిన తర్వాత నిర్దుష్టంగా పనిచేయగల యాంటిబయోటిక్‌ను ఎంపిక చేసుకోగల్గితే మంచిది. మన పశుచికిత్సలో పొదుగువాపు, గర్భవాతం క్రిములకు ఈ విధమైన నిర్ధారణ చాలామంచిది. ఇందువల్ల వేగంగా వ్యాధి నయం కావటమే కాక అనేక సందర్భాలలో వైద్య ఖర్చులు తగ్గి, ప్రాణాలకు, దాని ఉత్పాదకతను కూడా మేలు జరుగుతుంది. యాంటిబయోటిక్‌ సెన్సిటివిటీ టెస్టుల్ని వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించగల వ్యవస్థ చాలా అవసరం. 

తులసి, వెల్లుల్లి, వేప, పసుపు, కలబంద వంటి అందుబాటులో వుండే వృక్ష సంబంధిత ఔషధాలు అనాదిగా వాడుకలో ఉన్నప్పటికీ, వీటికి వ్యతిరేకంగా ఏ బాక్టీరియా రెసిస్టెన్స్‌ను పొందిన దాఖలాలు లేవు.

అర్హత కలిగిన వైద్యుడు లేదా మందుల ఉత్పత్తిదారుడు సూచించిన మోతాదులో, సూచించిన విధంగా, సూచించినన్ని రోజులపాటు మందుల్ని క్రమం తప్పకుండా వాడాలి.

పదేపదే యాంటిబయోటిక్స్‌ను, వైద్యుల్ని మార్చుట తగదు. చికిత్సకు వినియోగించిన మందులు, వ్యాధి లక్షణాలు, చికిత్సా వివరాల గురించి, దృఢమైన పుస్తకంలో (ఒక పాత డెయిరీలో) రికార్డు చేయించుకుంటే ఆ పశువుకే కాక, సాటి ఇతర పశువుల చికిత్స కూడా భవిష్యత్తులో సులభం కాగలదు.

పశువైద్య వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ విచక్షణా రహితంగా, అసమంజసంగా తాము వాడుచున్న లేదా సూచిస్తున్న యాంటిబయోటిక్స్‌ వల్ల పశుసంక్షేమానికే కాక ప్రజారోగ్యానికి, ప్రజల ప్రాణాలకు జరుగుతున్న హానిని గుర్తించి బాధ్యతతో వ్యవహరించాలి.          

డా. యం.వి.జి. అహోబలరావు, హైదరాబాద్‌. ఫోన్‌: 93930 55611

Read More

పశువులలో అంటువ్యాధులు – నివారణ చర్యలు

పశువులలో అంటువ్యాధులు ప్రబలడం వలన రైతులకు అనేక విధాలుగా నష్టములు కలుగుతుంటాయి. కాబట్టి వ్యాధి సోకిన తరువాత చికిత్స చేయించుటకు ఖర్చు పెట్టుటకు బదులు వ్యాధులు రాకుండా నివారణా చర్యలు చేపట్టడం ఎంతో లాభదాయకం. ఈ నివారణా చర్యలు 3 దశలలో చేపట్టాలి.

మొదటి దశలో వ్యాధికారక సూక్ష్మజీవులు పశువులకు సోకక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని ”బయో సెక్యూరిటీ” పద్ధతులంటారు. వాటిలో ముఖ్యమైనవి:

పశువుల ఫారం చుట్టూ బలమైన కంచె నిర్మించాలి. దానివలన బయట పశువుల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించవచ్చు. ఫారం గేటు దగ్గర ‘ఫుట్‌బాత్‌’లను ఏర్పాటు చేసుకోవాలి. ఫుట్‌బాత్‌ అంటే 4 అంగుళాలు లోతు కలిగిన సిమెంట్‌ తొట్టె వంటిది. దీనిలో ప్రతిరోజు క్లోరిన్‌, ఫినాయిల్‌ వంటి క్రిమిసంహారక మందులను ఉంచాలి. బయట నుండి ఎవరు వచ్చినా ఈ ఫుట్‌బాత్‌లో కాళ్ళు ముంచి రావాలి. దీని వలన బయట నుండి వ్యాధికారక క్రిములు లోపలికి రావు. పెద్ద ఫారాలలో బయట నుండి వచ్చే వాహనాలకు ‘వెహికల్‌ బాత్‌’ కూడా ఉంటుంది.                                                                              

ఏవైనా కొత్త పశువులను కొన్నప్పుడు వాటిని వెంటనే పాత పశువులతో కలుపరాదు. కొత్త పశువులను ఫారం బయట విడిగా కనీసం 30 రోజుల పాటు ఉంచాలి. దానిని ‘క్వారంటైన్‌’ అని అంటారు. దీని వలన పశువులలో అంతర్లీనంగా ఉన్న వ్యాధులు బయట పడే అవకాశం ఉంటుంది. మొదట 3 వారాలలో ఏ వ్యాధి బయట పడకపోతే, 22వ రోజున అన్ని పశువులకు క్షయ, జోన్స్‌ వ్యాధి, బ్రూసెల్లోసిస్‌ వ్యాధుల కొరకు పరీక్షించాలి. 23వ రోజు అంతరపరాన్న జీవుల నిర్మూలనకు డివార్మింగ్‌, 24వ రోజు గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు కలిసిన ‘ట్రయోవాక్‌’ టీకాను ఇచ్చి 30 రోజులు పూర్తైన తరువాత అన్ని పశువులు ఆరోగ్యంగా ఉంటే పాత పశువులలో కలపవచ్చు.

పశువులలో వ్యాధినిరోధక శక్తి పెంచే పద్ధతులు చేపట్టాలి. వీటిలో ముఖ్యమైనవి టీకాలు వేయడం. ఆయా ప్రదేశాలలో ఏటా వచ్చే వ్యాధులకు నెల ముందుగానే టీకాలు వేయించాలి. పశువుల ఫారానికి కనీసం 1 కిలోమీటరు దూరం చుట్టూ వ్యాధినిరోధక ప్రదేశం ఏర్పాటు చేయడం మంచిది. పశువులకు శాస్త్రీయ పద్ధతిలో సమతుల్యమైన ఆహారం, మంచి గృహవసతి అందించినచో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి రోగ నిరోధక శక్తి కలిగిన పశువులు సులభంగా వ్యాధులకు గురికావు.

ఇక వ్యాధి నివారణ చర్యలలో రెండవ దశ– వ్యాధికారక పశువులను గుర్తించి మంద నుండి వేరు చేయడం.

వ్యాధి సోకిన పశువులలో జ్వరం, ముక్కులు, కళ్ళ వెంట నీరు కారడం, నోటి నుండి విపరీతమైన చొంగ కారడం, పారడం, మేపు తినకపోవడం, నెమరు వేయలేకపోవడం. మిగిలిన పశువుల నుండి విడిపోయి వేరుగా నీరసంగా పడుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి పశువులను మంద నుండి దూరంగా ఉంచి చికిత్స చేయించాలి. వ్యాధి పూర్తిగా తగ్గినదని నిర్ధారించుకున్న తరువాత మాత్రమే మిగిలిన పశువులతో కలపాలి.

కొన్నిసార్లు పశువులలో వ్యాధులు ఉన్నప్పటికీ ఎటువంటి బాహ్యలక్షణాలు కనబడవు. బయట చూడడానికి ఆరోగ్యవంతమైన పశువులలాగే ఉంటాయి. వీటిని కారియర్స్‌ అంటారు. సాధారణంగా బ్రూసెల్లోసిస్‌, క్షయ, జోన్స్‌ వ్యాధి, ఐబిఆర్‌ అను వ్యాధులు కొన్ని పశువులలో అంతర్లీనంగా ఉండి మిగిలిన పశువులకు క్రమంగా వ్యాపిస్తూ ఉంటాయి. ఇటువంటి పశువులు చాల ప్రమాదకరం. కావున ప్రతి సంవత్సరం ఒక్కసారైన మందలో ఉన్న అన్ని పశువులను పై వ్యాధుల కొరకు పరీక్షించవలెను. ఒకవేళ ఏదైనా పశువు ఈ పరీక్షలలో పాజిటివ్‌గా నిర్ధారణ అయితే అటువంటి పశువును వెంటనే మంద నుండి తీసివేయాలి.

వ్యాధి నివారణలో మూడవ దశ– చనిపోయిన పశువులను నాశనం చేసే పద్ధతులు:

కొన్నిసార్లు అంటువ్యాధుల వలన పశువులు చనిపోవచ్చు. ఒకవేళ ఏదైనా పశువు అంటువ్యాధులతో చనిపోతే, రైతులు సాధారణంగా ఊరి బయట, రోడ్ల పక్కన, కాలువలలో పడవేస్తుంటారు. దీనివలన వ్యాధికారక క్రిములు సులభంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వ్యాపిస్తుంటాయి. కాబట్టి చనిపోయిన పశువులను వ్యాధికారక క్రిములతో సహా నాశనం చేయవచ్చు. సాధారణంగా పూడ్చి వేయడంతో కాని కాల్చడం వలన కాని వ్యాధికారక క్రిములను కళేబరంతో సహా నాశనం చేయవచ్చు.

పూడ్చి వేసే పద్ధతిలో పశువుల సైజును బట్టి కనీసం 6 అడుగుల లోతు గోతిని తీయాలి. పశువులతో పాటు ఆ ప్రదేశంలో పశువు తిన్న మేత, నీరు, 5 అంగుళాల వరకు మట్టి శుభ్రంగా తీసి గోతిలో వెయ్యాలి. వీటి మీద మట్టి, సున్నం, బ్లీచింగ్‌ పౌడర్‌ కలిపి పూడ్చాలి. పూడ్చునపుడు పై భాగాన ముళ్ళ కంచెలు వేస్తే కుక్కలు, నక్కలు కళేబరాన్ని తిరిగి తోడకుండా ఉంటాయి. ఫారంలో నేల సిమెంట్‌ కాంక్రీట్‌ అయితే క్రిమిసంహారక మందులతో శుభ్రం చేసి ఎండబెట్టాలి.

ఇక పశువును కాల్చే పద్ధతిలో పశువు శరీర సైజును బట్టి గోతిని తీయాలి. గోతి మీద ఇనుపరాడ్లు క్రాస్‌ (þ) ఆకారంలో  ఉంచాలి. దీని మీద కళేబరాన్ని ఉంచి క్రింద గోతిలో కట్టెలు పెట్టి మండించాలి. దీని వలన కళేబరం ఎటువంటి అవశేషాలు లేకుండా పూర్తిగా కాలిపోతుంది. నేడు పెద్ద పట్టణాలలో కళేబరాన్ని ఉపయోగించుకునే ప్లాంటులను నిర్మిస్తున్నారు. ఈ ప్లాంటులలో కళేబరం నుండి క్రొవ్వు, ఎముకలు మొదలైన వాటిని వేరు చేసి మిగిలిన వానిని పూర్తిగా కాల్చేస్తారు. పట్టణాల చుట్టుప్రక్కల రైతులు ఈ ప్లాంటులను వినియోగించుకోవచ్చు.

ఈ విధంగా వ్యాధి నివారణ చర్యలు మూడు దశలో చేపడితే అంటు వ్యాధులు ప్రబలకుండా, పశువులు చనిపోకుండా, పశువుల ఉత్పత్తి కోల్పోకుండా నివారించి పశువుల పెంపకం లాభసాటిగా చేయవచ్చు. 

డా. చంద్రావతి, ఎం.వి.ఎస్సీ, పిహెచ్‌.డి., సహాయ ఆచార్యులు, పాథాలజీ విభాగము, పశువైద్య కళాశాల, మామునూరు, వరంగల్‌

Read More

సమీకృత వ్యవసాయంలో పశుపోషణలో మెలవకులు

మన తెలంగాణ రాష్ట్రంలో పశువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ పాల ఉత్పత్తి తక్కువగా ఉండటానికి రెండు ముఖ్య కారణాలు కలవు. 1. నాశి రకము 2. పశు గ్రాసాల కొరత. మేలు జాతి పశువులకు సమృద్ధిగా పశుగ్రాసాలను ఇచ్చినపుడు వాటి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. రాష్ట్రంలో పచ్చిమేతల కొరత తీవ్రంగా ఉంది. మొత్తం సాగు భూమిలో 8% పశుగ్రాసాల సాగుకు వినియోగించాలి.

పశువులకు కేవలం ఎండుగడ్డి దాణా ఇవ్వటం వలన వాటికి కావలసిన పోషక పదార్థాలు దొరకవు. పచ్చి మేతలో ఉండే విటమిన్లు ముఖ్యంగా విటమిన్‌-ఎ పశువుల పునరుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, సక్రమంగా ఎదకు రావడానికి పాల ఉత్పత్తిని పెంచడానికి తోడ్పడుతుంది. పచ్చిమేత తినని పశువులలో ఈ లోపం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. తద్వారా ఉత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది.

పచ్చిమేతలో రెండు రకాలు: 1. కాయజాతి 2. ధాన్యపు జాతి పశుగ్రాసాలు. 

చిరుధాన్యాలు, వివిధ పచ్చగడ్డి రకాలను ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. ధాన్యపు జాతి మేతను పశవులకు ఎక్కువగాను, కాయజాతి మేతను తక్కువగాను మేపాలి. ఈ కాయజాతి, ధాన్యపుజాతి పశువుల మేతను 1:2 నిష్పత్తిలో మేపిన యెడల అవి పశువులకు సమీకృత ఆహారంగా ఉపయోగపడును. ధాన్యపు రకపు  మేతలు పశువులకు శక్తిని, కాయజాతి మేతలు మాంసకృత్తులు అందిస్తాయి. సాధారణంగా రోజుకు ఆవు / గెదెకు 35-45 కిలోల పచ్చిమేత అవసరం.

మంచి పశుగ్రాసము లక్షణాలు:

రుచిగా ఉండాలి. ఎక్కువ మాంసకృత్తులు కలిగి ఉండాలి. తక్కువ కాలంలో కోతకు రావాలి. ఎక్కువ దిగుబడి ఇవ్వాలి. నీటి ఎద్దడిని తట్టుకోవాలి. పంటను ఏ థలో కోసినా రుచిగా ఉండాలి, ఎటువంటి విష పదార్థాలు ఉండకూడదు. తెగుళ్లు తట్టుకొనే శక్తిని కలిగి ఉండాలి.

  • దాణాను రెండు సమభాగాలుగా చేసి ఉదయం, సాయంత్రం పాలు పితికే ముందు వేయాలి.
  • మనం రోజుకు ఇవ్వవలసిన గడ్డిలో సగభాగం ప్రొద్దున నీళ్లు త్రాగించిన తర్వాత మిగతా సగభాగం సాయంత్రం పాలు పితికిన తరువాత అందించవలెను. 

సాధారణ పశువులకు మేత: సాధారణంగా ఆవు / గేదెకి 35-45 కిలోల పచ్చిమేత, 6-7 కిలోల ఎండుగడ్డి 3 కిలోల దాణా అవసరము అవుతుంది.

సంకరజాతి పశువులకు మేత: సంకరజాతి పశువులకు – రోజుకు 6 నుండి 7 లీటర్ల పాలిచ్చే ఆవుకు పాలిచ్చే రోజుల్లో 20-25 కిలోల పచ్చిగడ్డి, 5-6 కిలోల ఎండుగడ్డి, 3-3.5 కిలోల దాణా అవసరం పడుతుంది.

పాడి పశువులకు పుష్కలంగా పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి. ప్రతి పాడి పశువుకు రోజు 35-45 లీటర్ల నీరు త్రాగటానికి అవసరం అగును. 

పశుగ్రాసంలో ఏకవార్షిక పశుగ్రాసాలు: జొన్న, మొక్కజొన్న, సజ్జ, అలసంద, బర్సీం, లూసర్న్‌

బహువార్షిక పశుగ్రాసాలు: హైబ్రిడ్‌ నేపియర్‌, పారగడ్డి, గినిగడ్డి, అంజన్‌ గడ్డి, స్టైలో హెమాటా, స్టైలో స్కాబ్రా వంటి పశుగ్రాసాలను పచ్చిమేతగా ఉపయోగించవచ్చు.

పశువుల దాణా మిశ్రమం: 100 కిలోల దాణా మిశ్రమాన్ని తయారు చేయడానికి కావలసిన దానా దినుసులు: జొన్నలు, మొక్కజొన్నలు – 30 కిలోలు, గోధుమ పొట్టు లేదా తవుడు – 32 కిలోలు, గానుగ పిండి 25 కిలోలు, బెల్లం మడ్డి – 10 కిలోలు, లవణ మిశ్రమం – 2 కిలోలు అవసరం అవుతువంది.

దాణా మిశ్రమాన్ని రోజుకు 6 నుండి 7 లీటర్ల పాలిచ్చే ఆవుకు 3-3.5 కిలోలు.

రోజుకి 6 నుండి 10 లీటర్ల పాలిచ్చే ఆవుకు 4-4.5 కిలోల దాణాను అందించినట్లయితే పాల దిగుబడి పెరుగుతుంది.

డా. కె. చిరంజీవి, డా. మహమ్మద్‌ అలిబాబా, డా. ఎం. గోవర్థన్‌, అన్‌ ఫామ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, రంగారెడ్డి, అఖిల భారత సమగ్ర వ్యవసాయ పద్ధతుల పరిశోధనా విభాగం, రాజేంద్రనగర్‌.

Read More

పశువులలో పాల జ్వరం – నివారణ

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక శాతం గేదెలు నిండుచూడిథలో ఉండి త్వరలో ఈనడానికి సిద్ధంగా ఉన్నాయి. పాడిపశువులకు ఇది చాలా క్లిష్టమైన సమయం. పాలు ఇవ్వడం లేదనే కారణంతో ఈథలో వీటి పోషణపట్ల అశ్రద్ధవహిస్తే, ఈనే సమయంలో ఎదురయ్యే సమస్యలతోపాటు ఆ తర్వాతి పాడి కాలంలో కూడా ఆశించిన స్థాయిలో పాల ఉత్పత్తిని పొందలేక యజమానులు తమకు తెలియకుండానే భారీ నష్టాలకు గురయ్యే ముప్పుఉండవచ్చు. నిండు చూడి థలో పోషకాహారలోపాలవల్ల ఎదురయ్యే సమస్యలలో పాలజ్వరము మరియు రక్తంలో చక్కెర శాతాలు క్షీణించుట వల్ల కలిగే కీటోసిస్‌ అనే వ్యాధులు చాలా ముఖ్యమైనవి. వీటికి అనుబంధంగా మెయ్యదిగుట, మాయ విసర్జన సకాలంలో జరుగకపోవుట, పుట్టేదూడలు బలహీనంగా తక్కువ శరీర తూకంతో జన్మించుట, తల్లుల నుండి దూడలకు సరిపడే జున్నుపాలను అందించకపోవుట వంటి ఇతర సమస్యలు కూడా ఎదురుకావచ్చు. పోషకాహార లోపం వల్ల ఎదురయ్యే ముఖ్యసమస్యలలో రక్తంలో కాల్షియం లోపం వల్ల వచ్చే పాల జ్వరము, చక్కెర హీనతవల్ల వచ్చే కీటోసిస్‌ వ్యాధులు ముఖ్యమైనవి. ఈ రెండు సమస్యలు ఈనే కొన్ని రోజుల ముందు నుండి ఈనిన తర్వాత కొన్ని రోజుల వరకు కనిపిస్తాయి. వీటి ప్రభావం తల్లుల పాల ఉత్పత్తితో పాటు, దూడల ఎదుగుదల విూద కూడా పడి రెండు తరాల ఉత్పాదకత విూద కనిపిస్తుంది.

పాలజ్వరము: వాస్తవనికి శరీర సాధారణ ఉష్ణోగ్రత 102-103 డిగ్రీల ఫారిన్‌హీట్‌ నుండి 96-98 డిగ్రీల కంటే తక్కువకు తగ్గిపోతుంది. శరీరం చల్లగా ఉండి, పశువు చాలా నీరసంగా ఉంటుంది. మెడ కండరాలలో పటుత్వం తగ్గుట వల్ల మెడను ముందుకు వంచి నేలవిూద ముట్టెను ఆన్చి ఉండటం, లేదా మెడను ప్రక్కకు ఛాతివైపు వంచి ముట్టె ఆన్చి ఉండటం కనిపిస్తుంది. పశువు ఎక్కువగా కూర్చొని ఉంటుంది. లేదా తీవ్రత పెరిగినప్పుడు అడ్డంగా పడిపోవటం జరుగుతుంది. నడ్డి ఆర్చివలె వంగి ఉంటుంది. పేడ గట్టిగా ఉండటం లేదా పూర్తి మలబద్ధకం కూడా ఉండవచ్చు. అధికపాలనిచ్చే పశువులలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.

రక్తనమూనా పరీక్షలో కాల్షియం పరిమాణం చాలా దిగువకు పడిపోయి కనిపిస్తుంది. ఆశించిన స్థాయిలో పాల ఉత్పత్తి ఉండదు.

చికిత్స: కాల్షియం బోరోగ్లూకొనేట్‌ ఇంజక్షను 350-450 మిల్లీలీటర్లు నెమ్మదిగా మెడసిరలోకి ఎక్కించాలి. సిరలోకి ఇంజక్షనుకు ప్రత్యామ్నాయంగా ఒక్కొక్క చోట చర్మం క్రిందకు 100 నుండి 120 మిల్లీలీటర్లు మెడప్రక్క చర్మం క్రిందకు కూడా ఎక్కించవచ్చును లేదా నోటి ద్వారా వినియోగించదగిన వివిధ కాల్షియం ఉత్పత్తులు ద్రవరూపంలో లభ్యమౌతున్నాయి. వాటిని ఉత్పత్తిదారులు లేదా పశువైద్యుల సూచనలమేరకు పట్టించవచ్చును. వీటితోపాటు బి-కాంప్లెక్స్‌ ఇంజక్షన్లు ఇస్తే పశువు నీరసం నుండి కొంతవరకు బయట పడుతుంది. ఆ తర్వాత నమ్మకమైన ఖనిజలవణ మిశ్రమాన్ని దాణాలో కలిపి వాడాలి. జొన్నలు-సజ్జలు-మొక్కజొన్నలు-రాగుల నూకను నువ్వుల పిండిని మడ్డికూడుగా వండి వరితవుడు లేదా గోధుమ తవుడుతో కలిపి వరుసగా 4-5 రోజులు రోజుకు 2 నుండి 3 కిలోలు దాణాగా మేపినా వెంటనే పాల ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఉంటాయి.

మునగ ఆకు, అవిసె ఆకు, తులసి, మారేడు వంటి ఆకులను మేతతో కలపి మేపితే పశువు త్వరగా మామూలు స్థాయికి వస్తుంది. పారా, నేపియర్‌, ల్యూసర్న్‌ వంటి మేలు జాతి పచ్చిమేతలు కూడా పాలజ్వరం ప్రభావాలను చాలా వరకు తగ్గించగలవు.

పాలజ్వరం నివారణ: ఈనడానికి రెండు నెలల ముందు నుండి పాలు పిండుట నిలిపివేయాలి. చూడి పశువుకు కూడా రోజుకు 20-30 గ్రాముల నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమాన్ని దాణాతో కలిపి మేపాలి. సవిూకృత దాణాను పశువు శరీర బరువును, ఇతర గ్రాసాల నాణ్యతలను గమనించి రోజుకు ఒకటి నుండి రెండు కిలోలు ప్రతి రోజూ మేపాలి. మేతలో తులసి, అవిసె, మల్బరీ, సుబాబుల్‌, మునగ వంటి ఆకుల్ని కలుపుట వల్ల చాలావరకు పోషకాహార లోపాలను నివారించవచ్చు.

చూడి థలో రెండు-మూడు నెలలకు ఒకసారి పరాన్నజీవుల నిర్మూలనకు అవసరమైన మందుల్ని లేదా కలబంద గుజ్జు, గాడిదగరప, పొట్ల ఆకులు, దానిమ్మ బెరడు మిశ్రమాలను బెల్లంతో కలిపి ముద్ద చేసి తినిపించవచ్చు. చూడి పశువులన్నింటికీ వేలంవెర్రిగా కాల్షియం ఇంజక్షన్లు చేయించుటకంటే నోటిద్వారా సహజసిద్ధమైన దాణాలు, మేతల్ని అందిస్తే సరిపోతుంది.

పైన పేర్కొన్న జాగ్రత్తల్ని పాటిస్తే పాలజ్వరంతోపాటు రక్తంలో చక్కెర హీనత వల్ల ఎదురయ్యే కీటోసిస్‌, మెయ్యదిగుటం, మాయ సకాలంలో విసర్జించకపోవుట, బలహీనమైన దూడలు జన్మించటం వంటి అనేక ఇతర సమస్యలు కూడా ఎదురుకావు.  

డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

Read More

గో-సంజీవని పుస్తకం అన్ని భాషలలో ముద్రించాలి

భారత పశుసంవర్ధక శాఖ కమీషనర్‌ డా|| అభిజిత్‌ మిత్ర

పాల ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది. ఆది నుంచి మనం పాడి-పంటలకు సమాన ప్రాముఖ్యతను ఇస్తూ జీవితాలను కొనసాగించాము. కాని, మధ్యలో వివిధ రకాల కారణాల వలన పాడిని కొంతవరకు అశ్రద్ధ చేయడం జరిగింది. ఈ విషయాలను గుర్తించిన అధికారులు, ప్రభుత్వాలు, నిపుణులు సరైన పరిష్కార మార్గాలను అన్వేషించి, కృషి చేసి పాడి పరిశ్రమ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టడం వలన ఫలితాలు ఆశాజనకంగా వచ్చాయి. దాని ఫలితమే పాల ఉత్పత్తిలో మనదేశం మొదటి స్థానాన్ని సాధించింది అని భారత పశుసంవర్ధక శాఖ కమీషనరు డా|| అభిజిత్‌ మిత్ర అన్నారు. 

రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 20న హైదరాబాదులో రెడ్‌హిల్స్‌లోని తెలంగాణా రాష్ట్ర వాణిజ్య, వ్యాపార మండలి సమావేశ మందిరంలో గో-పోషణతోపాటుగా హోమియో, ఆయుర్వేద, అల్లోపతి వైద్య విధానాలపై జరిగిన అవగాహన సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ… ఒకప్పుడు మన దేశంలో ప్రజల కంటే పశు సంపద ఎక్కువగా ఉండేది. పశువులలో ప్రత్యేకించి గోవులకు మనం అధిక ప్రాముఖ్యతను ఇచ్చేవారము. గోవును గోమాతగా కొలుస్తున్న దేశం మనది. మన సంస్కృతిలోనే గోవుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఆవుని పాలు ఇచ్చే జంతువుగానే పుస్తకాలలో రాసుకున్నాము. అందువలననే ఆవు గురించి చదివిన ప్రతిసారి మొదటగా ఆవు పాలు ఇచ్చును అని చుదువుకుని చివరగా ఆవు పేడను, మూత్రాన్ని కూడా ఇచ్చును అని చుదువుతున్నాము. కాని ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. ప్రస్తుతం ఆవు పాల కంటే మూత్రం మరియు పేడలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలసిన పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల విష రసాయనాల వలన నేలలో సేంద్రియ పదార్థం తగ్గి, సూక్ష్మజీవుల సంఖ్య తగ్గి నేలలు జీవం కోల్పోయాయి. అందుకే రైతులకు పంటల సాగు లాభదాయకంగా లేకుండా పోయింది. ఇందుకు పరిష్కారం మన గోవులోనే ఉంది. ఆవు పేడ మరియు మూత్రాలలో పంటలకు ఉపయోగపడు వివిధ రకాల పోషకాలు, లవణాలు, సూక్ష్మజీవులు ఉన్నాయి కనుక వీటిని భూమికి అందించగలిగితే మన భూములు తిరిగి పూర్వ వైభవాన్ని పొందగలవు.

ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకు మన దేశీయ గోజాతుల పేడ, మూత్రాలు పరిష్కారం చూపించగలవు కాబట్టి మనం ఆవు గురించి చర్చించేటప్పుడు మొదటగా పేడ, మూత్రాల గురించి చర్చించుకొని చివరగా పాల గురించి చర్చించుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

గోవులను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిపై ఉంది. పాడి పరిశ్రమతోనే ఆర్థిక స్వాలంబన, జాతి వృద్ధి, ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందనే విషయం అక్షర సత్యం. ఇన్ని రకాలుగా ప్రయోజనాలు ఉన్న పాడిపరిశ్రమను కాపాడడములో పశువైద్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పశువైద్యంలో వివిధ రకాల పద్ధతులు అంటే ఆయుర్వేదం, హోమియోపతి, అల్లోపతి, చిట్కా వైద్యం.. లాంటి ఎన్నో పద్ధతులను ప్రతి ఇంటికి చేర్చగలిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ రకాల పశువైద్య పద్ధతులను పాడి రైతు ముంగిట చేర్చడములో గో-సంజీవని పుస్తకం ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు కాబట్టి గో-సంజీవని పుస్తకం భారత దేశంలోని అన్ని భాషలలో ముద్రించవలసిన అవసరం ఎంతైనా ఉందని, తన మాతృభాష బెంగాళీలో ముద్రించినపుడు తనకు ఎంతో సంతోషం అని డా|| అభిజిత్‌ మిత్రా అన్నారు. ఈ కార్యక్రమంలో డా|| పున్నియ మూర్తి, ఆంధ్రప్రదేశ్‌ పశువైద్య విశ్వవిద్యాలయం డీన్‌ డా|| వీరభద్రయ్య, డా|| కృష్ణమాచారి, డా|| కృష్ణారెడ్డి, తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డా|| ఎస్‌. రాంచందర్‌లతో పాటు రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా|| యడ్లపల్లి వేంకటేశ్వరరావు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేకమంది గోశాలల నిర్వాహకులు, గో-ప్రేమికులు, పశువైద్యులు, సేంద్రియ రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి 7 వేల రూపాయల విలువగల హోమియో మందుల కిట్‌ను ‘గోయల్‌ వెట్‌ ఫార్మా’ వారు ఉచితంగా అందజేయడం జరిగింది.

గోసేవలో భాగస్వాములము కావడము మా అదృష్టంగా భావిస్తున్నాము

– ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, రైతునేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ వై. వేంకటేశ్వరరావు

మన దేశ ఆయువు పట్టు అయిన వ్యవసాయ రంగంలో కొనసాగడంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రధాన భూమిక అయిన పశుసంపద అదీను మన దేశీయ గో-జాతుల సేవలో తాము భాగస్వాలము కావడము మా అదృష్టంగా భావిస్తున్నాము. 2017వ సంవత్సరము గో-సంజీవని పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. పశుపోషకుల నుంచి, రైతుల నుంచి, గో-ప్రేమికుల నుంచి, పశువైద్యుల నుంచి, గో-సంజీవని పుస్తకానికి మంచి స్పందన వచ్చింది. కాలానుగుణంగా వచ్చే మార్పులను కూడా ఈ వపుస్తకంలో పొందుపరిస్తే ఇంకా ప్రయోజనకారిగా ఉంటుందని భావించి కొన్ని ఉపయోగకర మార్పులతో నూతనంగా మరలా ముద్రించడము జరిగింది. నూతన ముద్రణ కూడా అందరికి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. గో-సంజీవని పుస్తకం నూతన ముద్రణలో ప్రముఖ పాత్ర పోషించిన డా|| ములగలేటి శివరాం మరియు వారి బృందానికి కృతజ్ఞతలు. ఈ పుస్తకం ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ప్రముఖుల అభీష్టం మేరకు గో-సంజీవని పుస్తకాన్ని ఇతర భాషలలో ముద్రించటానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తానని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ వై. వేంకటేశ్వరరావు అన్నారు. 

గో-సంజీవని పుస్తకం నూతన ముద్రణ ఆవిష్కరణ

రైతునేస్తం పబ్లికేషన్స్‌ ద్వారా గతంలో ముద్రించిన గో-సంజీవని పుస్తకంలో సమాయనుకూలంగా వచ్చిన మార్పులనుచేర్చి ముద్రించిన గో-సంజీవని నవీకరించిన పుస్తకాన్ని ఈ సదస్సులో ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

Read More