వాతావరణ మార్పులు, తగ్గిపోతున్న వ్యవసాయ భూమి, జనాభా వృద్ధిరేటుకు అనువుగా లేని వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల మరియు ఆర్థిక మందగమనం మొదలైనవి మానవ ఆహార భద్రత మరియు పోషకాహార భద్రత పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి పరిస్థితులలో చౌకగా, వాతావరణ మార్పులను తట్టుకోనే అత్యధిక పోషక విలువలు కలిగిన ఆహార పంటల వృద్ధి అవసరం ఎంతైనా ఉంది. చాలా దేశాలలో పోషకాహార లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల అధిక పోషణ వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ (జీవనశైలి వ్యాధులు) మరియు స్థూలకాయత్వం మరి కొన్ని చోట్ల రెండు పూటలా ఆహారం తినే పరిస్థితి లేక పోషకాహార లోపాలు స్పష్టంగా చూస్తున్నాము. ఇటువంటి పరిస్థితులలో భూమి మీద నివసిస్తున్న సమస్త మానవ కోటికి సమతుల్య ఆహారం, పోషణ వైవిధ్యం, పోషకార భద్రత మరియు ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఆహార ఉత్పత్తి పంటల సరళిని మార్చి పోషకాహార భద్రత వైపు అడుగులేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం గా చేసుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పరిస్థితులలో మన పెద్దలు సాగు చేసి తిన్నటువంటి జొన్నలు మరియు మిల్లెట్స్ పంటల సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు, విలువ జోడించుట, కాలంతో పరిగెత్తుతున్న రోజుల్లో వండుకోవడానికి మరియు తినడానికి అనువుగా ఉండే వివిధ రకాల ఆహార పదార్థాల తయారీ, మార్కెటింగ్ సదుపాయాలు మొదలైనటువంటి కార్యక్రమాలను ఉధృతం చేసి ప్రజలందరికీ ఆరోగ్యమైన ఆహారాన్ని వంట గదికి చేర్చడానికి ఎంతో కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇక్రిశాటు మిల్లెట్స్‌ను స్మార్ట్‌ఫుడ్‌గా పిలుస్తుంది ఎందుకంటే బలవర్ధకమైన పోషక విలువలను కలిగి ఉండడం వలన మానవులు ఆహారంగా తిన్నట్లయితే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మిల్లెట్స్ పండించడానికి ఎక్కువ ఎరువులు మరియు పురుగు మందుల అవసరం ఉండదు. పంట పండించే సమయంలో వాతావరణం లోనికి తక్కువ కర్బన ఉద్గారాలను మిల్లెట్స్ వాతావరణంలోకి వదులుతాయి. కావున ఇది మన వాతావరణానికి ముఖ్యంగా విశ్వానికి ప్రయోజనం చేకూరుస్తుంది. అంతేకాకుండా మిల్లెట్స్ పంట కాల వ్యవధి తక్కువగా ఉండడం వలన తక్కువ సమయంలో రైతుకు పంట చేతికి అందుతుంది. ఈ విధంగా రైతులకు కూడా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తాయి అందుకే మిల్లెట్స్‌ను స్మార్ట్ ఫుడ్స్‌గా పిలుస్తారు.

మన భారత ప్రభుత్వం 2023 వ సంవత్సరాన్ని ప్రపంచ మిల్లెట్ సంవత్సరముగా జరపాలని ఐక్యరాజ్యసమితిని కోరడం జరిగినది. తద్వారా ప్రపంచానికి భారతదేశం కేంద్రముగా మిల్లెట్స్ ఉత్పత్తి, విలువ జోడించుట మరియు వాణిజ్యం జరగాలని మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారత వ్యవసాయ పరిశోధన మండలి వారి మిల్లర్స్ రిసర్చ్ ఇన్స్‌స్టిట్యూట్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాష్ట్ర వ్యవసాయ శాఖ, హైదరాబాద్ చుట్టూ ఉన్న చిన్న మరియు మధ్య తరహా మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎంతో కృషి చేస్తున్నాయి
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ జొన్నలు, మిల్లెట్స్ మరియు ఇతర చిరుధాన్యాలను పోషకధాన్యాలుగా పిలవాలని మరియు వాటి సాగు విస్తీర్ణంతో పాటు వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలందరికీ విస్తృతంగా తెలియజేస్తూ ప్రపంచంలో భారతదేశం మిల్లెట్స్ హబ్‌గా మారి మన రైతులకు, ప్రజలకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య భద్రత కూడా ఉండాలని 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను మరియు రైతులను చైతన్య పరుస్తూ భవిష్యత్తు ఆహార భద్రతకు మరియు రైతు ఆర్థిక భద్రత పునాదులు వేయడానికి కృషి చేస్తున్నాయి.
ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్నప్పటికీ రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేయడం లేదు, మిల్లెట్స్ ను పూర్వకాలంలో పేదలు తినే వారు అనే అపోహ, వండడం సులభతరంగా లేకపోవడం, ప్రాసెసింగ్ యంత్రాలు అందుబాటులో లేకపోవడం, కనీస మద్దతు ధర, మార్కెట్ సదుపాయాలు అందుబాటులో లేకపోవడం వలన పోషక ధాన్యాల సాగు మనదేశంలో తగినంతగా లేదు.

మిల్లెట్స్ గురించి మీకు తెలుసా!
- ద నిన్నటి ముతక ధాన్యాలు నేటి పోషక ధాన్యాలైన మిల్లెట్స్ – అలనాడు పేదవాడి ఆహారం ఈరోజు అది అందరి ఆహారం
- మిల్లెట్ సాగులో చీడపీడల సమస్య తక్కువగా ఉంటుంది ఎందుకంటే అవి చాలా తెగుళ్లు మరియు వ్యాధులకు నిరోధకతను కలిగి ఉంటాయి. వివిధ రకాల వాతావరణ మార్పులను ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలుగుతాయి.
- ప్రపంచ మిల్లెట్స్ ఉత్పత్తిలో మన దేశం వాటా సుమారు 40.62%. 2020 – 21వ సంవత్సరంలో సుమారు 17.58 మిలియన్ మెట్రిక్ టన్నుల పోషక ధాన్యాలను మన దేశంలో ఉత్పత్తి చేయడం జరిగినది.
- 2015-16 సంవత్సరం నుండి 2020-2021 సంవత్సరం వరకు స్మాల్ మిల్లెట్స్ ఉత్పత్తి రెండింతలు అయినది.
- పోషక ధాన్యాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ మరోవైపు దురదృష్టవశాత్తు చిన్నపిల్లల్లో పోషకాహార లోపాలలో మన దేశం రెండో స్థానంలో ఉన్నది. సుమారు 32 శాతం చిన్నపిల్లలు వయసుకు తగ్గ బరువు లేరు, 36 శాతం మంది పిల్లలలో సరైన ఎదుగుదల లేదు. అంతేకాకుండా 15-49 సంవత్సరాల వయసు గల ఆడవారిలో 50 శాతానికి పైగా రక్తహీనత వంటి సమస్యలతో బాధపడుతున్నారు.
- చాలా రకాల మిల్లెట్స్ వరి, బియ్యం మరియు గోధుమల కన్నా మూడు నుండి నాలుగు రెట్ల కన్నా ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి. ముఖ్యంగా పోషక ధాన్యాలలో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థం మరియు ఖనిజ లవణాలు అధిక మోతాదులో లభ్యమవుతాయి. అందుకే చిరుధాన్యాలు లేదా పోషక ధాన్యాలను సూపర్ ఫుడ్స్‌గా పిలుస్తారు.
- దేశంలో పెరుగుతున్న పోషకాహార లోపాలను అధిగమించాలన్నా, జీవనశైలికి సంబంధించిన వ్యాధులను అరికట్టి ప్రజా జీవితాన్ని మెరుగు పరచాలంటే మిల్లెట్ సాగు మరియు మిల్లెట్స్‌ను రెగ్యులర్‌గా తినడం ఆచరణీయమైన పరిష్కార మార్గం.
- మిల్లెట్స్ తినడం ద్వారా శరీరానికి కావలసిన మంచి శక్తితో పాటు, పుష్కలంగా దొరికే పీచు పదార్థం మరియు నెమ్మదిగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు తద్వారా రక్తంలోనికి గ్లూకోస్ నెమ్మదిగా విడుదలవుతుంది. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్‌కు మరియు టైప్ (శిగిచీలి-2) 2 డయాబెటిస్ పేషెంట్స్‌కు మిల్లెట్స్ తినడం ద్వారా మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
- చిరుధాన్యాలను తీసుకోవడం ద్వారా కలిగే అదనపు ఆరోగ్య ప్రయోజనాలు ముఖ్యంగా వీటిలో అధిక మొత్తంలో పీచు పదార్థం, గ్లూటెన్ ఫ్రీ ప్రోటీన్లు, తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ మరియు ఇతర బయో యాక్టివ్ సమ్మేళనాలు కూడా అధికంగా ఉంటాయి.
- జొన్నలు మరియు చిరుధాన్యాలలో సగటు కార్బోహైడ్రేట్ల 56.88-72.97%, ప్రోటీన్లు 7.5-12.5% మరియు కొవ్వు పదార్థాలు 1.3-6.0% ఉంటాయి. అంతేకాకుండా అతి ముఖ్యమైన పీచుపదార్థం, విటమిన్లు మరియు ఖనిజ లవణాలు కూడా విరివిగా దొరుకుతాయి.
- వివిధ పరిశోధనలో మిల్లెట్స్ విరివిరిగా తినడం ద్వారా క్యాన్సర్, స్థూలకాయత్వం, మధుమేహం, గుండె సంబంధ సమస్యలు, ఉబ్బసం, జీర్ణక్రియ సమస్యలు, కిడ్నీలో రాళ్ల సమస్యలు, తలనొప్పి మరియు మైగ్రేన్ వంటి సమస్యలను తగ్గించుకోవడంతో పాటు వ్యాధుల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు.
- చిన్నపిల్లలకు, కిషోర్ బాల బాలికలకు మరియు గర్భిణీ స్త్రీలకు మిల్లెట్స్‌తో చేసిన బలమైన పోషకాహార పదార్థాలను తినిపించడం ద్వారా వారిలో ఎదుగుదల మరియు ఆరోగ్యం మెరుగుపడిందని ప్రయోగపూర్వకంగా వివిధ రకాల పరిశోధనా సంస్థలు నిరూపించాయి.
- పంట కోత అనంతరం మిల్లెట్స్ ను ప్రైమరీ ప్రాసెసింగ్ ద్వారా తినడానికి అనువుగాని బాగాలైన పొట్టు లేదా ఊక వంటి భాగాలను తొలగించి బియ్యంగా మార్చి వండుకొని తినడము లేదా పిండిగా మార్చి వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలో ముడి సరుకుగా వాడుతారు.
- ప్రైమరీ ప్రాసెసింగ్‌లో భాగంగా మిల్లెట్స్‌ను నానబెట్టడం, మొలకెత్తించి మాల్ట్ తయారు చేయడం, పెనం పైన వేయించడం, ఎండబెట్టడం, పాలిషింగ్ చేయడం మరియు మిల్లింగ్ చేసి పిండి, ఆటా మరియు రవ్వ వంటివి తయారు చేయడం.
- మిల్లెట్స్‌ను సెకండరీ ప్రాసెసింగ్ విధానంలో పులియబెట్టి ఇడ్లీ, దోస, పునుగులు, పొంగనాలు, వడ మరియు డోక్లా వంటి ఆహార పదార్థాలు, పార్బోయిలింగ్ పద్ధతి ద్వారా బియ్యము మరియు రవ్వ వంటి ఆహార పదార్థాలను తయారు చేయడం, ఇన్‌స్టెంట్ కుకింగ్ మీల్స్ ముఖ్యంగా ఉప్మా, కిచిడి, పొంగల్, పులిహోర, పెరుగన్నం, పాయసం, బిర్యానీ మరియు పలావ్ వంటివి తయారు చేయవచ్చు, పఫ్ఫింగ్ ద్వారా మురుముర్లు, అటుకులు మరియు వివిధ ఇండస్ట్రీలకు అవసరమైన మిల్లెట్స్ ఇంగ్రెడైంట్స్ (ముడి సరుకు) ద్వారా వివిధ రకాల తినుబండారాలు, సౌకర్యవంతమైన వంట గదిలో వండుకునే ఆహార పదార్థాలు ముఖ్యంగా నూడిల్స్, వర్మిసెల్లి, పాస్తా, సూప్ మిక్స్, బేకరీ మిక్సెస్, కుకీస్, బిస్కెట్స్, పాన్ కేక్స్, కేక్ మిక్సెస్ మరెన్నో సంప్రదాయ ఆహార పదార్థాలను తయారు చేసి మార్కెట్లో అమ్ముతున్నారు.
- 100 గ్రాముల మిల్లెట్స్ తినడం ద్వారా సుమారు 320 -370 కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది. ఇది మన దేశ జాతీయ పోషకాహార సంస్థ నిర్దేశించిన రోజుకు ఒక మానవుడు తీసుకునే శక్తి 2000 కిలో క్యాలరీలలో సుమారు 16-18.5%.
- ప్రధానమైన తృణధాన్యాలతో పోలిస్తే మిల్లెట్లలో పిండిపదార్థం లేని పాలీశాకరైడ్లు మరియు డైటరీ ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువగా ఉంటాయి.
- మిల్లెట్స్‌లో అధిక మోతాదులో పీచు పదార్థం ఉండడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను మన శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా జీర్ణకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర మరియు కొవ్వుల నియంత్రణ.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయం మరియు అనుబంధ రంగాల సంస్థలు,స్వచ్ఛంద సంస్థలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మరియు రైతు సంఘాలు మొదలైనవి మిల్లెట్స్ యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అందరికీ పోషక విలువలతో కూడిన ఆహారం లభించే విధంగా కృషి చేస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ మిల్లెట్స్ ఉత్పత్తి, ప్రాసెసింగ్ మరియు వాణిజ్యం విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని భావిద్దాం అది గుర్తు చేస్తూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరం 2023 శుభాకాంక్షలు.
ఎ. పోశాద్రి, ఫోన్: 94928 28965; యం. రఘువీర్, జి. శివచరణ్, యం. సునీల్ కుమార్, ఎ. రమాదేవి, వై. ప్రవీణ్ కుమార్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్ – 504002.

