రొయ్యల మేత సహా ఆక్వా రంగానికి సంబంధించిన నిర్ణయాలు రైతులు, భాగస్వామ్య పక్షాలతో సంప్రదించిన తర్వాతే తీసుకునేలా చూడాలని భారత రొయ్య రైతుల సమాఖ్య అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు కోరారు. మేత తయారీకి వాడే ముడిసరకుల ధరలపై కేంద్రం జోక్యం కోరుతూ సీఎం చంద్రబాబు లేఖ రాయడంపై కృతజ్ఞతలు తెలిపారు. మేత ధరల పెరుగుదలతో రైతుల మనుగడ, ఆక్వా సాగుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. ప్రభుత్వ జోక్యంతోనే మేత ధరల పెంపును 15వ తేదీ వరకు తయారీదారుల సంఘం వాయిదా వేసిందని వెల్లడించారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో అమలవుతున్న పీఎండీఎస్, ఏ గ్రేడ్, ఏటీఎం, కిచెన్ గార్డెన్, బీఆర్సీ సెంటర్ వంటి నమూనాలను కృష్ణాజిల్లా రెడ్డిగూడెం మండలంలోని గ్రామాల్లో ఏఎన్ఆర్ఎయూ, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సీటీ, ఐఐఎంఆర్ శాస్త్రవేత్తల బృందం సోమవారం పరిశీలించింది. ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే 9 రకాల సార్వతిక సూత్రాలను శాస్త్రవేత్తలకు చూపించారు.
ఈనెల 30వ తేదీ ఉదయం 10 గంటలకు ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత కోటా బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్) కోర్సులలో సీట్ల భర్తీకి వాక్ ఇన్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సిహెచ్. విద్యాసాగర్ ప్రకటించారు. అదేరోజు అనగా 30వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ కోర్సు బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం వాక్ ఇన్ కౌన్సిలింగ్ జరగనుందని రిజిస్ట్రార్ తెలిపారు. రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ విభాగంలో ఈ రెండు కౌన్సెలింగ్ లు నిర్వహించనున్నట్లు డాక్టర్ విద్యాసాగర్ వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధృవపత్రాలు మరియు వెబ్ సైట్ లో సూచించిన రుసుమును తీసుకొని కౌన్సిలింగ్ కు హాజరుకావాలని ఆయన సూచించారు. పూర్తి వివరాల కొరకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.pjtau.edu.in ను సందర్శించగలరని రిజిస్ట్రార్ డాక్టర్ జి.ఇ.సిహెచ్. విద్యాసాగర్ తెలిపారు.
ఆక్వా రంగంలో 30% వృద్ధి సాధించాలని.. కలెక్టర్లు దీనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘2014-19 మధ్య రాష్ట్రంలో ఆక్వాకు స్వర్ణయుగమే. కొన్ని కారణాల వలన మన మార్కెట్‌ను ఇతర దేశాలు ఆక్రమించాయి. ఆక్వా రంగంలో మళ్లీ మనం పురోగమించాలి’ అని సూచించారు. మత్స్య, పశు సంవర్థక రంగాలపై సమీక్ష సందర్భంగా చంద్రబాబు పలు సూచనలు చేశారు.మీరేం కమిషనరయ్యా? నాణ్యమైన సీడ్ దొరకక రైతులు కోల్‌కతా నుంచి సీడ్ తెచ్చుకుంటున్నారని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ప్రస్తావించగా.. చంద్రబాబు సంబంధిత అధికారులను ప్రశ్నించారు. చెరువుల టెస్టింగ్ ఇతర విషయాలపై మత్స్యశాఖ కమిషనర్ డోలా శంకర్ ఇచ్చిన సమధానంపై ఆయన సంతృప్తి చెందలేదు. ‘మీరు చేసే కార్యక్రమాలు కలెక్టర్లకే తెలియడం లేదు. రైతుల్లోకి ఇంకేం తీసుకెళ్తారు? మీరేం కమిషనర్‌య్యా’ అని అసహనం వెలిబుచ్చారు. వచ్చే సమావేశానికి పూర్తి సన్నద్ధతతో రావాలని సూచించారు.
‘సదర్’ అనగానే దున్నరాజుల విన్యాసాలు… యాదవులు తమ జీవనాధారమైన ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలతో వేడుక జరిగే ప్రాంతానికి వచ్చి చేసే సందడి.. దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం, దున్నలపై నిలబడి హాకీ కర్రతో చేసే నృత్యాలు ప్రధానాకర్షణ. దీపావళి రెండోరోజున హైదరాబాద్‌లో ‘సదర్’ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఐక్యతను చాటుతారు.*మొదలైంది ఇలా…* సుమారు 80 ఏళ్ల క్రితం దివంగత సలంద్రి న్యాయం చౌదరి మల్లయ్య యాదవ్ సదర్ వేడుకలను ప్రారంభించారు. నారాయణగూడ వైఎంసీఏ కూడలిలో ఇది మొదలైంది. ఆ తర్వాత మల్లయ్య యాదవ్ కుటుంబ సభ్యులు, పూర్వీకులు ఏ సంప్రదాయాన్ని అనుసరించారో దాన్నే నేటికీ పాటిస్తున్నారు. కాచిగూడ, నింబోలిఅడ్డ, ఖైరతాబాద్, సైదాబాద్, మారెడ్‌పల్లి, పాతబస్తీలలో కూడా సదర్ సందడి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశీ ప్రతినిధులు కూడా దున్నరాజు విన్యాసాలు వీక్షించడానికి వస్తుంటారు. పంజాబ్, హరియాణ, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా దున్నరాజులను తీసుకొస్తారు. ఈసారి హరియాణ నుంచి ముర్రా జాతికి చెందిన 3 వేల కిలోల భారీకాయంతో ఉండే ‘ఘోలు-2’ దున్నరాజు వచ్చాడు. ప్రపంచంలో ఎత్తైన దున్నరాజు బాహుబలి (స్కంద సినిమా ఫేం), చేతక్ మహారాణా ప్రతాప్, వీరా మిల్క్ టీత్ ఛాంపియన్ ఇలా మరెన్నో మేలిమిజాతి దున్నరాజులు కనువిందు చేయనున్నాయి.
తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేషియా పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియా దేశ వ్యవసాయ శాఖా మంత్రి వర్యులు మహ్మద్ బిన్ సాబుతో వారి కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణాలో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్ నెలకొల్పడానికి మరియు పెట్టుబడులకు ముందుకు రావాల్సిందిగా కోరారు. ఫెల్డా చైర్మన్ అహ్మద్ షాబేరి చీక్ మరియు ప్రతినిధులతో సమావేశమై ఆయిల్ పామ్ రంగంలో వారు సాధించిన ప్రగతిని, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ పామ్ రైతులకు ప్రయోజకరంగా వుండే పద్ధతులపై చర్చించారు. మలేషియాలో భారత హై కమిషనర్ బి.ఎన్. రెడ్డి గారి ఆహ్వానం మేరకు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యాంత్రీకరణకు సంబంధించి తెనాసియా ప్రైవేట్ లిమిటేడ్ (Palmpro) కంపెనీని సందర్శించి, వివిధ రకాల యంత్రాలు, పనిముట్లు, వాటి పనివిధానంను పరిశీలించారు.
నాగార్జున సాగర్, కృష్ణాడెల్టా కాలువలకు ఖరీఫ్ పంట సాగుకు అవసరమైన నీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం సమృద్ధిగా నీళ్లు వస్తున్నందున నారుమళ్లు వేసుకోవాలని మంత్రి రైతులకు సూచించారు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఇప్పటికే నిండింది. మరో రెండు మూడు రోజులలో నాగార్జున సాగర్ కూడా నిండుతుంది. చివరి ఆయకట్టుకు నీళ్లు అందేలా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, సాగర్ కాలువల కింద ఉన్న జలాశయాలు, చెరువులు అన్నింటినీ నీటితో నింపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి సేద్యం ప్రపంచానికే ఆదర్శం అని రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రకృతి సేద్య కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుల్బెంకియన్ అవార్డు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. పంటల బీమాకు సంబంధించి రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా మెరుగైన పథకాన్ని అమలు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఖరీఫ్ ధాన్యం సేకరణకు ఇబ్బంది లేకుండా మార్క్‌ఫెడ్ ద్వారా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి రూ. 3,200 కోట్ల రుణాన్ని తీసుకునేందుకు హామీ ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రాజేంద్రనగర్‌లోని గ్రామీణాభివృద్ధి సంస్థలో తెలంగాణాలోని అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యాన అధికారులతో వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పెండింగులో ఉన్న రైతుబీమా క్లెయిమ్‌ల పరిష్కారం గురించి, ఆయిల్‌పామ్ ప్రాజెక్ట్‌పై క్షేత్రస్థాయిలో సమన్వయం గురించి చర్చించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా పంటరుణాల మాఫీ, రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలకు వచ్చే మూడు నెలలలో 50 వేల నుంచి 60 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించనుందని మంత్రి తెలియజేశారు. ఎరువుల నాణ్యత, విత్తన నాణ్యత, భూసార పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన సమీకృత ప్రయోగశాలల భవన సముదాయాన్ని మంత్రి ప్రారంభించారు.
మామిడిని సాగు చేసే రైతులు పూత ప్రారంభమైనప్పటినుండి పురుగులు తెగుళ్ల యాజమాన్యం మరియు పోషకాల యాజమాన్యంను సరైన సమయంలో చేస్తూ అధిక దిగుబడి మరియు నాణ్యమైన దిగుబడిని పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. కాని కోత అనంతరం తగిన శ్రద్ధ తీసుకోకపోవడం వలన తర్వాత సంవత్సరం దిగుబడిపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మామిడి కోత తర్వాత నిర్లక్ష్యం చేయకుండా రైతులందరూ సరైన యాజమాన్యం చేపట్టాలి.
మామిడి తోటల్లో కోత అనతరం తీసుకోవలసిన చర్యలు
1. కొమ్మ కత్తిరింపులు
మామిడిలో పూత రావటం అనేది వాతావరణంతో పాటు కొమ్మల వయస్సుపై కూడా ఆధారపడి ఉంటుంది. పూత వచ్చే సమయానికి కొమ్మలవయస్సు దాదాపు 4-5 నెలలు ఉండాలి. అంతకన్నా తక్కువ వయస్సు ఉన్న కొమ్మలపై పూత రాదు. కాబట్టి కాయ కోత వెంటనే కత్తిరింపులు చేస్తే కొత్త చిగుర్లు పెరిగి పూత వచ్చేటప్పటికి కొమ్మల వయస్సు పూత రావటానికి అనువుగా ఉంటుంది.
కొమ్మ కత్తిరింపులను కాయ కోత చేపట్టిన నెల రోజుల తర్వాత మొదలు పెట్టాలి. కాయలు పెరిగిన పూత కాడలను తొలగించి అక్కడనుండి కొమ్మలను కనీసం 10-15 సెం. మీ. వెనక్కి కత్తిరించాలి. అలాగే బాగా కిందకు వేలాడిన కొమ్మలను తీసేయాలి. చెట్టు లోపలి భాగంలో అడ్డదిడ్డంగా ఒకదానిపై ఒకటిగా పెరిగిన కొమ్మలను తీసివేస్తే చెట్టు లోపల భాగాలలో గాలి, వెలుతురు ప్రసరణకు అనువుగా ఉంటుంది. అదేవిధంగా చెట్టు లోపల భాగంలో నిటారుగా పెరిగే 2-3 కొమ్మలను (గొడుగు కొమ్మలు) కత్తిరించాలి. కత్తిరింపులు చేసినపుడు కొమ్మలు చీలిపోకుండా జాగ్రత్తగా కత్తిరించాలి. అయితే కాపుకు వచ్చిన చెట్లలో 25% కన్నా ఎక్కువ కొమ్మలు కత్తిరిస్తే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే తెగులు సోకిన కొమ్మలు, ఎండిన కొమ్మలు ఉంటే తీసివేయాలి. కత్తిరించిన కొమ్మలకు శిలీంద్రాలు, బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు సోకకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి.
కత్తిరింపుల వలన లాభాలు
చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకి దిగుబడి పెరుగుతుంది.
తోటలో అంతర కృషి పనులు చేయటానికి అనువుగా వుంటుంది
నాణ్యమైన పండ్ల ఉత్పాదకత పెరుగుతుంది
చెట్టు ఎత్తును అదుపులో ఉంచుకోవచ్చు
ప్రతి సంవత్సరం నిలకడగా కాపు కాస్తుంది.
చీడ పీడల బెడద తగ్గుతుంది.
2. ఎరువుల యాజమాన్యం
కోత తర్వాత చెట్టు తన ఆహార నిల్వలను కోల్పోతుంది కాబట్టి కోత అనతరం తప్పనిసరిగా చెట్టుకు పోషకాలు అందించాలి. కొమ్మ కత్తిరింపులు చేపట్టిన వెంటనే ప్రతి చెట్టుకు వయస్సును బట్టి సిఫార్సు చేసిన ఎరువులను వేసుకోవాలి. కాపుకు వచ్చిన తోటల్లో కత్తిరింపులు తర్వాత తొలకరి వర్షాల సమయంలో ఎరువులు వేసుకొంటే మొక్కకి పోషకాలు అందుతాయి ఒక వేళ వర్షాలు లేనట్లయితే నీటి తడులు ఇచ్చుకోవాలి. ఎరువులను తొలకరిలో అంటే జులై – ఆగష్టు నెలల్లో చెట్లు పాదుల్లో సమంగా చల్లి నేలలో కలిసేలా తిరగబెట్టాలి. వర్షపాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎరువులను వర్షాకాలం మొదట్లో ఒకసారి మరలా వర్షాకాలం చివర్లో రెండవసారి వెయ్యాలి. వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాల్లో వర్షాకాలం చివర్లో ఒకేసారి వేసుకోవాలి.
పది సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి చెట్టుకు 1 కిలో నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాష్ ను ఇచ్చే ఎరువులను వేయాలి. సేంద్రియ ఎరువులు మరియు జీవన ఎరువులను ఎక్కువగా వేసుకొంటే మంచిది. సేంద్రియ ఎరువులు చెట్టుకు 50 కిలోల పశువుల ఎరువు లేదా వర్మీ కంపోష్టు 20 కిలోలు తో పాటు 1 కిలో వేపపిండి, 250 గ్రా. చొప్పున అజిటోబాక్టర్ లేదా అజోస్పైరిల్లం ను 25 0 గ్రా. ఫాస్ఫోబాక్టర్, 100 గ్రా. ట్రైకోడేర్మావిరిడిని కూడా వేసుకోవాలి.
మామిడిలో సూక్ష్మపోషకాల లోప లక్షణాలు కనిపిస్తే కొత్త చిగుర్లు వచ్చిన తర్వాత 5 గ్రా. జింక్ సల్ఫేట్, 2 గ్రా. బోరాన్, 2 గ్రా. ఫెర్రస్ సల్ఫేట్, 2 గ్రా. కాల్షియం సల్ఫేట్‌ను 1 లీటరు నీటికి కలిపిన ద్రావణాన్ని 15 రోజుల వ్యవధితో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొక్కలకు అందించే పోషకాలను సేంద్రియ ఎరువుల రూపంలో అందిస్తే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి.
3. కలుపు యాజమాన్యం
మామిడిలో కోత తర్వాత వర్షాలు పడి కలుపు సమస్య ఎక్కువుగా వుంటుంది. కలుపును ఎప్పటికప్పుడు నివారిచుకోవాలి. లేకపోతే మామిడిని ఆశించే చాలా పురుగులు కలుపు మొక్కలపై నివాసం ఏర్పరుచుకొని వాటి జీవిత చక్రాలు పూర్తి చేసుకొని మామిడిపై ఆసిస్తాయి. కలుపును సమర్ధవంతంగా నివారిచాలంటే తొలకరి వర్షాలు పడిన తర్వాత నేలను 2 సార్లు దున్నుకొని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవాలి. జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద, నవధాన్యాలు వంటి పంటలను తోటల్లో చల్లుకొంటే వర్షాలకు అవి పెరిగి కలుపు మొక్కలు రాకుండా చేస్తాయి. ఈ పచ్చి రొట్ట పైర్లు పూత థకు రాగానే వాటిని మళ్ళీ నేలలో కలియ దున్నాలి. ఈ విధంగా చేయటం వలన మల్చింగ్‌గా పనిచేసి కలుపు రాకుండా చేయటమే కాకుండా అవి కుళ్ల్లి సేంద్రియ ఎరువుగా మారి నేల సారవంతం పెరుగుతుంది. అంతే కాకుండా కలుపు నివారణకు చేసే ఖర్చు తగ్గుతుంది. ఈ విధంగా తక్కువ ఖర్చుతో కలుపు నివారించుకోవాలి.
4. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం
కాయ కోత అనతరం లోతు దుక్కులు దున్నుకొంటే నేలలో ఉండే పురుగుల గుడ్లు మరియు నిద్రావస్థ థలు బయటపడి నాశనమౌతాయి.
తేనెమంచు పురుగు ఉదృతి కొత్త చిగుర్లు వచ్చే సమయం నుండి ప్రారంభమవుతుంది. వీటి ఉధృతిని అరికట్టాలంటే చెట్ల కొమ్మలను పలచన చేయాలి. అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కత్తిరించి చెట్టుకు గాలి, వెలుతురు బాగా సోకేలా చేయాలి. ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించాలి. తోటలో కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
అక్టోబర్‌లో వర్షాలు లేనట్లైతే ఒకసారి చెట్ల పాదుల్లో నీటితడులు ఇవ్వటం వలన కూడా భూమిలో ఉండే గుడ్లు బయట పడతాయి.
తోటలో రాలిన కాయలను ఏరి నాశనం చేయాలి.
ప్రతి 2 నెలలకు ఒకసారి వేప నూనె 3000 పిపియం 3 మిల్లీ లీ. ఒక లీటరు నీటికి చొప్పున కలిపిన ద్రావణాన్ని చెట్ల కొమ్మలు, మొదలు బాగా తడిచేలా పిచికారి చేయాలి. దీనివలన కొమ్మల పగుళ్ళలో దాక్కొని ఉన్న పురుగు కోశస్థ థలు నాశనమై వాటి ఉధృతి తగ్గుతుంది.
పిండి పురుగులు నివారణకు చెట్ల మొదలు నుండి 1 అడుగు ఎత్తులో 25 సెం.మీ. వెడల్పు ఉన్న 400 గేజు మందం ఉన్న పాలీథీన్ షీటుతో చుట్టాలి. ఇలా చేయటం వలన నేలలో ఉండే పిల్ల పురుగుల థలు చెట్టుపైకి పాకకుండా ఉంటాయి. చెట్ల పాదుల్లో వేపపిండి వేయటం వలన కూడా వీటిని నివారించుకోవచ్చు.
పండు ఈగ ఆశించిన కాయలు రాలి ఉంటే వాటిని వెంటనే ఎరివేసి నేలలో లోతుగా కప్పటమో లేదా కాల్చివేయటం చేయాలి.
ఆకు ముడత పురుగులు అల్లిన గూళ్ళను తొలగించి వాటిని కాల్చేస్తే ఆ గూడులో ఉండే గుడ్లు, పిల్ల పురుగు థలు నాశనం అయ్యి తోటలో వాటి ఉధృతి తగ్గుతుంది.
తోటలో మిత్ర పురుగులను రక్షించటం వలన హానికర పురుగుల ఉధృతి అదుపులో ఉండి పంట నష్టం తగ్గుతుంది.
సాధ్యమైనంత వరకు రసాయన మందుల పిచికారీ తగ్గించుకోవాలి. వీటికి బదులు పురుగులు, తెగుళ్ళు ఆశించకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని జీవ సంబంధిత మందులు అయినటువంటి వేపనూనె, కానుగ నూనె, బవేరియా బాసియానా, మెటారైజియం వంటి సురక్షితమైనవి వాడుకొని నివారించుకోవాలి.
డా. కె. రాధారాణి, ప్రధాన శాస్త్రవేత్త (హార్టీకల్చర్), డా. బి. కనక మహాలక్ష్మి, ప్రధాన శాస్త్రవేత్త (ప్లాంట్ పాథాలజీ) జి. శాలిరాజు, శాస్త్రవేత్త, (ఎంటమాలజీ), మామిడి పరిశోధనా స్థానం, నూజివీడు. ఫోన్: 9948977535