పాడి పశువులలో పామాయిల్‌ మడ్డి వినియోగం – దుష్ప్రభావాలు

భారతదేశం దిగుమతి చేసుకునే వివిధ రకాల నూనెలలో 80% భాగాన్ని పామ్‌ఆయిల్‌ ఆక్రమించింది. థాయ్‌లాండ్‌, ఇండోనేసియా, మలేషియా, కొలంబియా, నైజీరియా దేశాలలో పామాయిల్‌ విరివిగా సాగు చేసి మన దేశంతో సహా ఇతర దేశాలకు పామాయిల్‌ను ఎగుమతి చేస్తున్నాయి. ఈ పరిస్థితిని నిలువరించడానికి జాతీయ ఆహార భద్రతా మిషన్‌ క్రింద పామాయిల్‌ సాగు ప్రోత్సహిస్తుంది. దేశంలో 3.7 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు చేస్తే ఆంధ్రప్రదేశ్‌లో 1.85 లక్షల ఎకరాలకు ఈ పంట విస్తరించి పామాయిల్‌ సాగులో మొదటి స్థానంలో ఉంది. విస్తరిస్తున్న సాగుతో పాటు పామాయిల్‌ ఉత్పత్తి సైతం పెరుగుతూ వివిధ రకాల ఉపఉత్పత్తులు వ్యర్థాలు పామాయిల్‌ పరిశ్రమల నుండి లభ్యమవుతున్నాయి.

పామ్‌ గెలల నుండి ఆయిల్‌ను వేరు చేసే ప్రక్రియలో 10-12% నూనె ఉత్పత్తి కాగా మిగిలిన 80-90% ఉపఉత్పత్తులుగా మరియు వ్యర్థాలుగా లభిస్తున్నాయి. ఖాళీ గెలలు 20-25%, పామ్‌ గుజ్జు పీచు 12-15%, విత్తనం – 25-30%, విత్తనంపై పెంకు – 5% గా ఉండి మిగిలిన భాగం నీటిలో కరిగే వ్యర్థాల రూపంలో బయటకు విడుదల అవుతుంది. పామ్‌ గింజల నుండి వచ్చే నూనెను పామ్‌ కెర్నల్‌ నూనెగా మరియు నూనె తీయగా మిగిలిన చెక్కను పామ్‌ కెర్నల్‌ కేకుగా పిలుస్తారు. ఈ పామ్‌ కెర్నల్‌ కేకులో ఎక్కువ ప్రొటీను శాతం (30-35% సిపి) ఉండి పశువులకు మేపడానికి అనుకూలంగా ఉంటుంది. పామాయిల్‌ మడ్డి అనేది పామ్‌ ఆయిల్‌ మిల్లు నుండి వచ్చే వ్యర్థం (Palm Oil Mill Effluent-POEM)లోని నీటిని వేరు చేయగా మిగగిలిన ఘనపదార్థం. ఈ POEMలో పామ్‌ గెలల పీచు, గుజ్జు పీచు, పెంకులు, ఇతర పదార్థాలు, నీరు, నీటిలో కరిగే పదార్థాలు ఉంటాయి. నేరుగా బయటకు వదిలినట్లయితే ఈ ఆంజూఖ నేల పైన పొరలను ఏర్పరిచి భూమి యొక్క సారాన్ని హరిస్తుంది. ప్రాసెస్‌ చేసి నీటిని వేరు చేసి మిగిలిన వ్యర్థాన్ని వివధ రకాలుగా వినియోగిస్తూ ఉంటాయి. ఈ ఆంజూఖ మరియు పామాయిల్‌ మడ్డిని బయోఫర్టిలైజర్‌ (జీవ ఎరువు)గా, వానపాముల ఎరువు తయారీకి, సూక్ష్మశైవలాల ఉత్పత్తికి, బయోడీజిల్‌, బయోగ్యాస్‌ ఉత్పత్తికి అనుకూలం. కానీ కొన్ని ప్రాంతాలలో ఈ మడ్డినే అవగాహన లేని రైతులకు పామ్‌ కెర్నల్‌ కేకుగా విక్రయిస్తూ ఉంటారు.

అనేక రకాల వ్యర్థాలు, ఉపఉత్పత్తులు, రసాయనాలు ఉండటం చేత ఈ మడ్డిని ప్రాసెస్‌ చేసిన తరువాత మాత్రమే పశువులకు ముఖ్యంగా పందులకు, కోళ్ళకు మేపుకోవడానికి అనుకూలం. ఇటీవలి కాలంలో కొందరు పాడి రైతులు అతి తక్కువ రేటుకు ఎక్కువ మొత్తంలో లభ్యం అయ్యే ఈ మడ్డి పదార్థాన్ని పశువుల మేతగా వాడుతూ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. విడుదల అయ్యే పదార్థాలను బట్టి ఈ మడ్డిలోని పోషక విలువలు మారుతూ ఉంటాయి. 

థాయ్‌లాండ్‌ మలేషియా దేశాలలో జరిగిన పరిశోధనల ప్రకారం ఈ మడ్డిలోని పోషక విలువలు – ఘన పదార్థాం – 90-92%,  బూడిద – 10-12%, ప్రోటీను – 8-10%, క్రొవ్వులు – 18-20%, పీచు పదార్థం – 17-19%.

ఈ క్రూడ్‌ మడ్డిని వివిధ రకాల బాక్టీరియా, ఫంగస్‌లతో పెర్మెంట్‌ చేయడం వలన దీనిలోని పోషక విలువలు (ప్రోటీను పెరగడం, పీచు పదార్థం తగ్గడం) పెరిగి పందులకు, కోళ్ళకు మేతగా వినియోగించవచ్చు.

ఇప్పటి వరకు జరిగిన పరిశోధనల ప్రకారం పాడి పశువులకు ఇచ్చే దాణాలో గరిష్టంగా 10% క్రూడ్‌ మడ్డి 20% వరకు ప్రాసెస్‌ (ఫెర్మెంటెడ్‌) మడ్డి వాడటం శ్రేయస్కరం 5 కిలోల దాణా అందించే పశువులకు గరిష్టంగా 1 కిలో మడ్డి వరకు మేపవచ్చు. కానీ కొందరు అతి తక్కువ రేటుకు ఎక్కువ మొత్తంలో లభ్యం అవుతుండటం వలన రోజుకు 5-6 కిలోలు ఒక పశువుకు మేపుతున్నారు. ఈ విధంగా మేపడం వలన ఈ మడ్డిలో ఉండే క్రొవ్వులు పశువు తినే గడ్డిపై పేరుకు పోయి సూక్ష్మజీవుల ద్వారా జరిగే అరుగుదలను ప్రభావితం చేస్తాయి. అంతేకాక ఈ మడ్డిని మేపినపుడు పాలలో వెన్నశాతం తాత్కాలికంగా పెరిగినప్పటికీ పాలనాణ్యత తగ్గుతుంది. మరియు పశువులు తిరగ కట్టడం, ఈసుకు పోవడం, అజీర్తి చేయడం వంటి అనారోగ్య లక్షణాలు గమనించవచ్చు.

  •  పామాయిల్‌ మడ్డిని ప్లాస్టిక్‌ డ్రమ్ములలో గరిష్టంగా 7 రోజులు నిలువ చేసుకొని మేపుకోవచ్చు. దీని నిలువ కాలం మడ్డిలో ఉండే తేమ శాతంపై ఆధారపడి ఉంటుంది.
  •  చెడిపోయిన, బూజు పట్టిన, దుర్వాసన వెదజల్లే మడ్డిని పశువుకు మేపడం ద్వారా వివిధ రకాల విషాలు పశువు కాలేయం పనితీరును దెబ్బతీయడంతో పాటు పాలలో సైతం దుర్వాసన మరియు టాక్సిన్‌ అవశేషాలుగా విడుదల అవుతుంటాయి.
  •  మోతాదుకు మించి మేపడం వలన పశువు గడ్డి, దాణా తగినంతగా తీసుకోలేకపోతుంది. 
  •  పామాయిల్‌ మడ్డి ఎక్కువగా మేపిన గేదెల నుండి వచ్చే పాలను తీసుకున్న వారు కూడా అనేక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి.

కావున రైతులు ఈ సమస్యలను పరిగణలోకి తీసుకొని నిపుణుల సలహా మేరకు మాత్రమే ఈ పామాయిల్‌ మడ్డిని పశువులకు మేపుకోవాలి.

ఆర్‌.కె. సౌజన్య లక్ష్మి, (ఫోన్‌: 90306 65100), సైంటిస్ట్‌ కృషి విజ్ఞాన కేంద్రం, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, లాం, గుంటూరు – 522034. డా. యం. యుగంధర్‌ కుమార్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ ఞ హెడ్‌, కె.వి.కె. గుంటూరు. 

Read More

తేనెటీగల భవిష్యత్‌ యువతతో ముడిపడి ఉంది.

తేనెటీగలు శ్రమ జీవులు. ఇవి జీవవైవిధ్యంలో ప్రముఖ పాత్ర వహించి మానవాళి మనుగడకు చాలా అవసరమైన జీవులు. వీటి నుండి తేనె మరియు ఇతర ఉపఉత్పత్తులు అయినటువంటి మైనము, పుప్పొడి, రాజాహారం, తేనెటీగల విషం మరియు ప్రొపోలిస్‌ లభ్యమవుతాయి. అంతేకాకుండా పంట దిగుబడులు పెంచడంలో తేనెటీగలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. తేనెటీగల పెంపకం వల్ల ఆదాయంతో పాటు నాణ్యమైన పంట దిగుబడులు పొందవచ్చు. ముఖ్యంగా ఉద్యాన పంటలు గల రైతులకు అదనపు ఆదాయ వనరులుగా కూడా ఉపయోగపడుతుంది.

తేనెటీగలు-పెంపకం-ప్రాముఖ్యత

1. తేనెటీగల పెంపకానికి ఎలాంటి సొంతభూమి అవసరం లేదు.

2. ఏ విధమైన వ్యవసాయ పనులకు ఇది అడ్డురాదు.

3. తేనె ఉత్పత్తి ద్వారా రైతులకు ఆర్థిక వెసులుబాటు

4. తేనెను ఉపయోగించుట వలన ఆహార సమతుల్యత పెరుగుతుంది.

5. గృహవైద్య ప్రక్రియలకు ఉపయోగపడుతుంది.

6. తేనె నిల్వ మరియు విక్రయం సులభం

7. తేనెటీగల పెంపకానికి శారీరక శ్రమ అవసరం లేదు. కనుక స్త్రీలు, పిల్లలు కూడా చేయవచ్చు.

8. తేనెటీగలకు నిత్యం చేయవలసిన పని ఉండదు. కావున కూలీలు ఎక్కువగా అవసరం ఉండదు.

9. పెంపకానికి భారీ పెట్టుబడితో పనిలేదు.

10. తేనెటీగల పెంపకానికి పెట్టె, ఫ్రేములు తదితర పరికరాల అవసరం ఉంటుంది. తద్వారా వడ్రంగికి భృతి చేకూరుస్తుంది. 

11. తేనెటీగల పెంపకం వలన పరపరాగ సంపర్కం అధికమై, పంటలలో ఫలదీకరణ జరిగి అధిక దిగుబడులు పొందవచ్చు.

12. ఇది అన్ని విధాల అందరూ చేపట్టదగిన పరిశ్రమ.

ఇన్ని విధాలుగా లాభదాయకంగా ఉన్న తేనె పరిశ్రమ ఈ మధ్యకాలంలో తేనెటీగల సంఖ్య తగ్గిపోతుంది. కావున వీటి సంఖ్య పెంపొందించడం, పరిరక్షించడం వాటి ఆవాసాలు మరియు వైవిధ్యంను కాపాడుట ద్వారా సుస్థిరతను సాధించవచ్చు. కావున ప్రతీ సంవత్సరం మే 20వ తేదీని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా గుర్తించడం జరిగింది. మొదటిసారిగా 2018వ సంవత్సరంలో సాల్వేనియా ప్రభుత్వం మరియు యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ సంయుక్తంగా మే 20 వ తేదీని ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా పరిగణించడం జరిగింది.

ప్రపచ వ్యాప్తంగా 20,000 రకాల తేనెటీగలు మరియు పరపరాగ సంపర్కంలో పాల్గొనే ఇతర కీటకాలు మానవుల చర్యల వలన ఆవాసాలు కోల్పోవడం, పురుగుమందుల ప్రభావం, వాతావరణ మార్పుల వలన వీటి సంఖ్య తగ్గుతుంది. కాబట్టి వీటి సంఖ్య పెంచవలసిన అవసరం యువతపై ఆధారపడి ఉంది. కావున 2024 ప్రపంచ తేనెటీగల దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం తేనెటీగల మనుగడ యువతతో ముడిపడి ఉంది. దీని ముఖ్యాంశాలు యువతను తేనెటీగల పెంపకంలో పాల్గొనేలా ప్రోత్సహించడం మరియు పర్యావరణ పరిరక్షణ చేయడం వల్ల యువత భవిష్యత్‌ తరాల రథసారధులుగా ఉంటారు.

ఈ సంవత్సరం ముఖ్యంగా యువతను తేనెటీగల ప్రాముఖ్యత గూర్చి, పర్యావరణ సమతుల్యత మరియు జీవవైవిధ్య పరిరక్షణ గూర్చి అవగాహన కల్పించడం. యువతను తేనెటీగల పెంపకంలో పాల్గొనే విధంగా చేసి వారిని ఉత్సాహపరిచి భవిష్యత్‌తరాలకు పర్యావరణ నాయకులుగా మరియు ప్రపంచ వ్యాప్తంగా సానుకూల ప్రభావంతో సాధికారత సాధించేవిధంగా ప్రోత్సహించాలి.

వైవిధ్యమైన వ్యవసాయంను చేయుట ద్వారా, పురుగుమందులు వాడకం తగ్గించుట ద్వారా, పరాగ సంపర్కంలో పాల్గొనే కీటకాల సంఖ్యను పెంపొందించి ఆహార నాణ్యత, దిగుబడి తద్వారా మానవాళికి మరియు పర్యావరణానికి ప్రయోజనం చేకూరుతుంది.

ఈ విధంగా తేనెటీగలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా మద్దతు వలన సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఆకలి బాధ నుండి భూమిపై జీవించడానికి తోడ్పడతాయి.     

డా. వి. సునీత డా. ఐ. అరుణశ్రీ (9701051104) డా. ఎమ్‌. అనురాధ, డా. వి. రవీందర్‌ రెడ్డి, అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌-500 030

Read More

ఏమైనా ఆగవచ్చు  కానీ…  వ్యవసాయం ఆగకూడదు

అనంతజీవకోటితో పాటు మనిషి కూడా జీవనం కొనసాగించాలంటే గాలి, నీరు, ఆహారం తప్పనిసరి. గాలి, నీరు ప్రకృతి నుంచి ఉచితంగా లభిస్తున్నాయి. కాబట్టి వాటిని ప్రక్కన పెట్టి ఆహారం విషయం గురించి మాట్లాడుకుంటే.. మనం తినే ఆహారాన్ని స్వేదం చిందించి, సేద్యం చేసి అష్టకష్టాలు పడుతూ, నష్టాలను భరిస్తూ రైతు పండిస్తున్నాడు. మన దేశ జనాభా ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. అయినా కాని పెరుగుతున్న జనాభాకు అవసరమయిన ఆహారాన్ని మన రైతులు పండించగలుగుతున్నారు. మన ఆహార అవసరాలను తీర్చడంతో పాటు వేరే దేశాలకు కూడా మన రైతులు పండించిన ఆహారాలను ఎగుమతి చేయగలుగుతున్నాము. మన దేశంలో చాలామంది రైతులు తాము నష్టాల ఊబిలో కూరుకు పోతూ కూడా తమ కాడిని ఆపకుండా కొనసాగిస్తున్నారు. కాబట్టే మనకు కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. రైతు కాడి ఆపితే మనం అకలితో అలమటించవలసిందే. కాబట్టి రైతు కాడి ఆపకూడదు. మనిషి ఉన్నంత కాలం రైతు వ్యవసాయం చేయవలసిందే. ఏమయినా ఆగవచ్చు కాని వ్యవసాయం ఆగకూడదు అనే విషయం అక్షర సత్యం. కాని ఆ వ్యవసాయం చేసే రైతు ఆర్థికంగా బలపడుతున్నాడా? లేదా? అంటే చాలామంది రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ రైతు పంటల సాగుని కొనసాగించలేడు కాబట్టి రైతులను లాభాల బాట పట్టించడానికి అవసరమయిన చర్యల గురించి ఎవరి పరిధిలో వారు ప్రయత్నిస్తున్నారు. బాపట్ల జిల్లా, మార్టూరు మండలం, బొబ్బేపల్లికి చెందిన శరత్‌ కూడా రైతును లాభాల బాట పట్టించడానికి తనవంతు పాత్రను పోషిస్తున్నాడు.

శరత్‌ది వ్యవసాయ నేపథ్యం. అయినాకాని అందరిలాగే ఉన్నత చదువులు చదివిన తరువాత వ్యవసాయ రంగానికి దూరంగా ఉద్యోగ రంగంలో స్థిరపడాలని ఎంబిఏ వరకు చదువుకుని తన అభీష్టం మేరకు ఉద్యోగ (సాఫ్ట్‌వేర్‌) రంగంలో ప్రవేశించాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంలో సమాజం గురించి, ప్రజల గురించి ఆలోచించడం మొదలయ్యింది. ప్రజలందరికి గాలి, నీరు తరువాత ఆహారం తప్పనిసరి. కాని ఆ ఆహారం పండించే రైతుకు సమాజంలో సరైన గౌరవం దక్కడం లేదు అని గ్రహించాడు. దానికి తోడు రసాయనాలతో పంటల సాగు కొనసాగిస్తుండడం వలన రసాయనిక అవశేషాలు ఉన్న ఆహారాలు తిన్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ రెండింటికి సరైన పరిష్కారం తాను నేరుగా వ్యవసాయరంగంలో అడుగుపెట్టడమే అని తెలుసుకుని, చేస్తున్న ఉద్యోగాన్ని వదలి 2016వ సంవత్సరంలో పంటల సాగులో అడుగు పెట్టాడు.

తన ప్రధాన లక్ష్యం విష రసాయనాలు లేని ఆహారాన్ని ప్రజలకు అందించాలి కాబట్టి అందుకు అనుగుణంగా సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించాలని గట్టిగా నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించిన సమాచారాన్ని వివిధ మార్గాల ద్వారా తెలుసుకుని మొదటగా బొప్పాయి సాగును సేంద్రియ పద్ధతులతో సాగు చేయడం మొదలు పెట్టాడు. 2016 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం బొప్పాయి సాగును కొనసాగిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సుమారు రెండు ఎకరాలలో బొప్పాయి సాగులో ఉంది. ఇందుకు గాను దుక్కిలో పచ్చిరొట్టపైర్లు వేసి పచ్చిరొట్ట పైర్లు పూత థలో భూమిలో కలియదున్ని అనంతపురం నుంచి కొనుగోలు చేసిన బొప్పాయి మొక్కలను 2023 వ సంవత్సరం ఆగస్టు మాసంలో నాటించాడు. భూమిలో సేంద్రియ పదార్థం పెరగడానికి అవసరమయిన చర్యలు తీసుకున్నాడు కాబట్టి బొప్పాయి ఆరోగ్యంగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా జీవామృతాన్ని మరియు వివిధ రకాల జీవన ఎరువులను భూమికి అందించటంతో పాటు చీడపీడల నివారణకుగాను వేపనూనె, వేప కషాయం, జీవసంబంధిత కీటకనాశనులు, థపర్ణి కషాయం, అగ్నాస్త్రం లాంటి వాటిని అవసరాన్ని బట్టి పిచికారి చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం పంట ఆరోగ్యంగా ఉంది. పంటను గమనించినట్లయితే ఎకరానికి 25 టన్నుల వరకు దిగుబడి వచ్చేలా ఉంది.

2016వ సంవత్సరంలో శరత్‌ మొట్టమొదట సేంద్రియ పద్ధతులతో బొప్పాయి పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించాడు. కాని మార్కెటింగ్‌ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తాను పండించిన బొప్పాయి పండ్లను వ్యాపారస్తులకు అమ్మడానికి ప్రయత్నించగా అప్పుడు ఉన్న రేటు ఆశాజనకంగా లేకపోవడం వలన కొంత బొప్పాయి దిగుబడిని వ్యాపారస్తులకు అమ్మి కొంత బొప్పాయిని ఒంగోలు, చిలకలూరిపేట, గుంటూరు లాంటి పట్టణాలలో నేరుగా వినియోగదారులకు అమ్మడం మొదలు పెట్టాడు. సేంద్రియ పద్ధతులతో పండించడం వలన బొప్పాయి రుచి బాగా ఉండి వినియోగదారులు మరలా మరలా కొనడం మొదలు పెట్టారు. ఆశాజనకమయిన ధరలకు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడం తెలుసుకొన్న శరత్‌ బొప్పాయితో పాటు ఇతర సేంద్రియ రైతుల దగ్గర నుంచి కూరగాయలు మరియు ఇతర ఆహారాలను సేకరించి నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడం మొదలు పెట్టాడు. ఎలాంటి రసాయనాలు అందించకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పండించిన ఆహారాలను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడమే సరైన దారి అని తెలుసుకుని మార్టూరులో సేంద్రియ ఉత్పత్తుల అమ్మకాల దుకాణాన్ని ఏర్పాటు చేసి ఆ దుకాణం ద్వారా తాను పండించిన సేంద్రియ ఉత్పత్తులతో పాటు ఇతర రైతులు పండించిన సేంద్రియ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అమ్మకం చేస్తూ వస్తున్నాడు.

శరత్‌ లక్ష్యం తాను ప్రత్యక్షంగా వ్యవసాయం చేసి ఎలాంటి విష రసాయనాలు ఉపయోగించకుండా పంటలు పండించి తన పంటల సాగుని లాభాల బాట పట్టించడంతో పాటు తోటి రైతులను కూడా లాభాల బాట పట్టించడం కాబట్టి సేంద్రియ సాగులో తాను తెలుసుకున్న మెళకువలను తోటి రైతులకు కూడా తెలియ చేస్తూ తోటి రైతులను కూడా సేంద్రియం వైపు మల్లించడానికి తన వంతు కృషి నిరంతరం చేస్తూ ఉన్నాడు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల గురించి శరత్‌ దగ్గర సలహాలు తీసుకుంటున్న రైతులు చాలా వరకు తమ పద్ధతులు మార్చుకుంటూ తమ రసాయనిక సేద్యాన్ని సేంద్రియంలోకి మార్చుకుంటూ వస్తున్నారు.

గతాన్ని ఒక్కసారి గమనించినట్లయితే చాలామంది రైతులు పంటల సాగుతో పాటు పాడి పశువులు, ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు లాంటి వాటిని పోషిస్తూ వారికి తెలియకుండానే సమీకృత వ్యవసాయ విధానాన్ని అనుసరించారు. కాని రాను రాను వివిధ రకాల కారణాల వలన రైతులు ఏక పంట విధానానికి అలవాటు పడ్డారు. ఏక పంట విధానం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఏక పంట విధానం వలన చీడపీడల ప్రభావం పంటలపై పెరగడంతో పాటు ప్రతికూల పరిస్థితులలో ఆ ఏక పంటలో నష్టం వచ్చినట్లయితే రైతులు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. కాబట్టి రైతులు తిరిగి సమీకృత వ్యవసాయ బాట పట్టవలసిందే అని గ్రహించిన శరత్‌ సమీకృత వ్యవసాయంలో భాగంగా నాటు కోళ్ళను పెంచుతూ, ఆవులను పోసిస్తున్నాడు. భవిష్యత్తులో చేపలను కూడా పెంచాలనే యోచనలో ఉన్నాడు. 

తన సేంద్రియ పంటల సాగుని లాభాల బాట పట్టించడంతో పాటు తోటి రైతులు కూడా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే లక్ష్యం శరత్‌ నిర్దేశించుకున్నాడు కాబట్టి అందులో భాగంగా ఇటీవల గాంఢీవ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ను ప్రారంభించాడు. ఇందులో రైతులను సభ్యులుగా చేర్చుకున్నాడు. ప్రస్తుతానికి 300 మందికి పైగా రైతులు గాంఢీవ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీలో సభ్యులుగా ఉన్నారు. ముందు ముందు ఇంకా సభ్యుల సంఖ్య పెరుగుతుందని వివరించాడు. రైతులకు అవసరమయిన శిక్షణా తరగతులు నిర్వహించటము, పంటల సాగుకు అవసరమయిన వ్యవసాయ ఉత్పాదనలను తక్కువ ధరలో రైతుకు అందుబాటులో ఉంచటం, రైతులు పండించిన ఉత్పత్తులను ఆశాజనకమయిన ధరలకు ఎక్కడ వీలుంటే అక్కడ అమ్మకం చేయడం లాంటివి ఈ కంపెనీ ద్వారా చేస్తాము అని శరత్‌ వివరించాడు.

సేంద్రియ సాగుపై అవగాహన పెరిగిన తరువాత అనేకమంది ఉద్యోగ రంగం నుంచి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టారు కాని అతికొద్దిమంది మాత్రమే వ్యవసాయరంగంలో కొనసాగుతున్నారు. ఎక్కువ మంది వ్యవసాయ రంగాన్ని వదలి తిరిగి వేరే రంగాలకు వెళ్ళారు. కాని శరత్‌ పట్టువదలని విక్రమార్కుడిలా పట్టుబట్టి సేంద్రియ సాగులో కొనసాగుతూ సాగుని లాభాల బాట పట్టించడానికి తన వంతు కృషిని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నాడు. మరిన్ని వివరాలు 95533 01949 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

Read More

అల్లం సాగులో మెలకువలు

అల్లం ఒక ముఖ్య వాణిజ్య పరంగా సాగు చేయు దుపం జాతికి చెందిన సుగంధ ద్రవ్యపు పంట. ఈ పంట సుగంధ ద్రవ్యంగానే కాకుండా ఔషధముగా ప్రసిద్ది చెందినది. తాజా అల్లాన్ని వంటకాల్లో విరివిగా వాడతారు. వ్యాపారంగా పచ్చి అల్లంగా, ఎండు అల్లంగా, శొంఠి అల్లంగా, అల్లం పొడిగా, అల్లం నూనెగా, అల్లం కలకండగా, అల్లం బీరుగా, అల్లం వైన్‌గా, అల్లం పానీయంగా, అల్లం పొరలు/బెరడుగా మొ|| రూపాలలో విక్రయించబడుతుంది.

అల్లం జింజర్‌ అపిసినేల్‌ అను శాస్త్రీయ నామము కల్గి జింజిబరెసి అను కుటుంబ జాతికి చెందిన పంట. దక్షిణ ఈశాన్య ఆసియాలో ఉనికి ఆనవాలు గుర్తించడమైనది.

తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1771 హెక్టార్లలో సాగవుతూ 12729 టన్నుల దిగుబడి సాధిస్తున్నది. ఇక జిల్లాల పరంగా చూస్తే మెదక్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో విస్తారంగా సాగవుతుంది.

వాతావరణం : తేమతో కూడిన వేడి వాతావరణం అల్లం సాగుకు అనుకూలం. సముద్ర మట్టానికి 1500 మీ. ఎత్తు వరకు గల ప్రదేశాలలో అల్లం పంటను సాగు చేయవచ్చును. దుంపలు మొలకెత్తుటకు దుంపలు నాటిన తర్వాత ఒక మాదిరి వర్షపాతం అవసరము. మొక్క పెరుగుదల థలో మంచి వర్షాలు చాలా అవసరము. దుంపలు త్రవ్వడానికి 28 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత అనుకూలం. ఉష్ణోగ్రతలు తగ్గించుటకు అల్లం పంటను తోటలలో (మామిడి, కొబ్బరి, జామ, మొ||) పాక్షిక నీడ ఉన్న ప్రాంతాల్లో పండించవచ్చును. నీటి వసతి ఉండి 1000-1500 మి.మీ. వర్షపాతం ఉన్న ప్రదేశాలు అల్లం సాగుకు అనుకూలం.

నేలలు : అల్లం పంట అభివృద్ధికి నీరు నిలువని, ఇసుకతో కూడిన బంక నేలలు, ఎర్రనేలలు, నల్ల మట్టి నేలలు, లేటరైట్‌ నేలలు అనుకూలం. అల్లం వేర్లు మరియు దుంపలు 25 సెం.మీ లోతు వరకు విస్తరించి ఉంటారు. కావున 30 సెం.మీ లోతుగల సారవంతమైన నేలలు అనుకూలం. 

ఉదజని సూచిక 6.0 నుండి 7.0 వరకు ఉన్న నేలలు అల్లం అధిక దిగుబడికి అనుకూలం.

తెలంగాణాకు అనువైన రకాలు:

మారన్‌, రియోడి జెనెరో, హిమాచల్‌, రజిత, జహిరాబాద్‌, పూణ, నర్సీపట్నం మొదలగునవి.

నేల తయారి: భూమిని రెండు సార్లు వేసవిలో దున్నుకోవాలి. పెద్ద మట్టి గడ్డలు రోటోవెటర్‌తో కరిగించాలి. విత్తుటకు ముందు 3 నుండి 4 సార్లు భూమి గుల్లగా అయ్యే వరకు దున్నుకొని సిద్ధం చేసుకోవాలి.

విత్తే కాలం : రాష్ట్రంలో ఏప్రిల్‌ మొదటి వారం నుండి మే నెలాఖరు వరకు విత్తుకోవాలి. మే నెలలో విత్తుకోవాలంటే నీటి వసతి ఉండాలి. ప్రాంతాల వారిగా విత్తే సమయంలో పెద్దగా మార్పులు ఉండవు, దుంపలు విత్తేందుకు వర్షపాతం లేదా నీటి వసతి కావాలి. దుంపలను మే నెలలో అనగా నైఋతి ఋతు పవనాలకు ముందుగానే విత్తుకోవడం చాలా మంచిది. దీని వలన వర్షాలు పడే లోపల మొక్కలు బాగా నిలదొక్కుకొని పెరిగి వుంటారు. తర్వాత అధిక వర్షాలు పడినా మొక్కలు నిలదొక్కుకుంటారు. విత్తడం ఆలస్యం అరుతే దుంప కుళ్ళు ఎక్కువగా రావడమే కాకుండా దిగుబడులు తగ్గుతాయి.

విత్తన పరిమాణం మరియు మోతాదు: ఆరోగ్యకరమైన చీడపీడలు ఆశించని దుంపలను విత్తనానికి ఎంపిక చేసుకోవాలి. మొలకొచ్చిన దుంపలను 20-25 గ్రా|| బరువు ఉండేవిధంగా 2.5 నుండి 5 సెంమీ పొడవు ఉండే విధంగా ముక్కలు చేయాలి, ప్రతి ముక్కకు 2 నుండి 3 మొలకెత్తు కణుపులు కల్గియుండాలి. విత్తన మోతాదు ఒక్కో ప్రాంతానికి మారుతూ ఉంటుంది. తెలంగాణలో అరుతే రకాన్ని బట్టి ఎకరాకు 600 నుండి 800 కిలోల విత్తనపు దుంపలు అవసరము ఉంటుంది. మెట్ట ప్రాంతాలలో ఎకరాకు 600 నుండి 700 కిలోల విత్తనం నాటుకోవచ్చును. ఎత్తైన గిరిజన ప్రాంతాలలో 900-1000 కిలోల విత్తనం ఎకరాకు అవసరము ఉంటుంది.

విత్తన శుద్ది: అల్లం విత్తన దుంపలకు ఖచ్చితంగా విత్తన శుద్ది చేసుకోవాలి. లీటరు నీటికి 10 గ్రా|| ట్రెకోడెర్మా విరిడి అను ఫార్ములేషన్‌ను కలిపిన ద్రావణంలో 30-40 ని||లు నాన బెట్టాలి. తద్వారా దుంపలకు విత్తన శుద్ధి అవుతుంది.

మళ్ళ తయారీ మరియు నాటడం : అల్లంను ఈ విధములుగా నాటుకోవచ్చు. 1) సమతల బెడ్‌ విధానము  2) బ్రాడ్‌ రిడ్జ్‌ విధానము.

సమతల బెడ్‌ విధానము : ఈ పద్ధతిలో 4þ4 మీటర్ల వైశాల్యం గల సమతల మడులు తయారు చేస్తారు. ఈ మడులలో 30 సె.మీ. దూరంతో వరసలు ఏర్పాటు చేసుకోవాలి. దుంపలను 10-15 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. నాటిన వెంటనే తేలికపాటి నీరివ్వాలి. ఈ విధానము తేలికపాటి నేలలకు అనుకూలం.

వెడల్పు గట్టు పద్దతి (బ్రాడ్‌ రిడ్జ్‌ విధానము): ఈ పద్ధతి మధ్యస్తం నుండి బరువైన నల్లరేగడి నేలలకు అనుకూలం. ఈ పద్దతిలో 20-30 సెం.మీ.ల ఎత్తైన 75 నుండి 100 సెం.మీ. వెడల్పైన బోదెలు/గట్లు ఏర్పాటు చేసుకోవచ్చు. దుంపలను 30 సెం.మీ. వరుసలలో, మొక్క మొక్కకు మధ్య 10-15 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. విత్తిన వెంటనే తేలికపాటి నీరివ్వాలి. ఈ పద్దతి ద్వారా 20-30% వరకు అధిక దిగుబడి వస్తుందని నిరూపితమైనది. విత్తన దుంపలను నాటేటప్పుడు మొలకెత్తిన బుడిపెలు పైకి ఉండు విధంగా నాటుకోవాలి. అల్లం విత్తన దుంపను నాటటానికి 10 రోజుల ముందు (విత్తన శుద్ది చేయుటకు ముందు) మంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వలన మంచి మొలక శాతం పెరుగుతుంది. ఇలాంటి మొక్కలు నాటిన 2-3 వారాలలో మొలకెత్తుతారు.

ఎరువులు: అల్లం దుంప జాతికి చెందినది కావున భూమి నుండి ఎక్కువ పోషకాలను గ్రహిస్తుంది కావున సరైన ఎరువుల మోతాదును అందించవలసి ఉంటుంది.

అంతర పంటలు : అల్లం నీడను ఇష్టపడే మొక్క కావున 50% నీడ నిచ్చే తోటల పంటలలో (మామిడి, కొబ్బరి, బొప్పారు, నిమ్మ, ద్రాక్ష, ఆరటి, కంది, ఆముదం) మొక్కల మధ్య పెంచవచ్చును. వరుసల మధ్య మొక్కజొన్న, అలసంద మరియు ఆముదం లాంటి మొక్కలు పెంచి పంటకు కావలసిన నీడను కల్పించాలి. నీడనిచ్చే నెట్స్‌ క్రింద కూడా అల్లం సాగు చేయవచ్చు. అల్లంలో టమాట లేక మిరప పంటను కూడా పండించవచ్చు.

అంతర కృషి: అల్లం పంటలో అంతరకృషిలో భాగంగా మల్చింగ్‌, నీడనివ్వడం, కలుపు నివారణ మరియు మట్టిని ఎగదోయుట మొదలగునవి.

అ) మల్చింగ్‌: అల్లంలో మల్చింగ్‌ చాలా ముఖ్యమైనది దీనివల్ల తేమను నిల్వ చేయడాన్ని, చినుకులు పడినప్పుడు మట్టి చెదిరిపోకుండా కాపాడుతూ, కలుపు పెరుగుదల నియత్రించుతూ మొలక శాతం వృద్ది చెందేవిధంగా దోహదపడుతుంది. మల్చింగ్‌ కోసం ఎవైనా ఎండు ఆకులు లేక గడ్డిని ఉపయోగించవచ్చును.

ఆ) నీడనివ్వడం: అల్లం పంట నీడలో చక్కగా మొలకెత్తుతారు. నీడ కొరకు కంది లేక మొక్కజొన్న లేక ఆలసంద లేక ఆముదం పంటలను సాళ్ళలో లేక నీటి కాలువలలో విత్తుకోవాలి.

ఇ) కలుపు నివారణ : తోటలలో కలుపు లేకుండా చూసుకోవాలి. 

ఈ) మట్టి ఎగదోయుట: సెప్టెంబర్‌ మాసంలో కొక్కిలతో మొక్క కాండం వద్ద కలుపు తీయాలి. దీని ద్వారా పీచు వేర్లు తెగి కొత్త వేర్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. దీని ద్వారా దుంపలు మంచిగా ఊరుతూ అధిక దిగుబడి వస్తుంది.

నీటి యాజమాన్యం: వేసవిలో నాటిన తొలి రోజుల్లో 4 రోజులకు ఒకసారి, వర్షాకాలం చివరిలో 7 రోజులకు ఒకసారి, అక్టోబర్‌ మాసం నుండి వారానికొకసారి నీరు పెట్టాలి. అల్లం పంటకు నీటి తడులు మరియు తేమ ఉండే విధంగా చూసుకోవాలి. నీరు నిలువకుండా మురుగు నీటి కాలువల ద్వారా నీరు తీసివేయాలి. లేనిచో దుంప కుళ్ళు సమస్య తీవ్రమవుతుంది. డ్రిప్‌లో మైక్రోజెట్స్‌ ద్వారా కావలసిన నీటిని అందిస్తూ అధిక దిగుబడులు సాదించవచ్చని పరిశోధనలలో తేలినది.

పంటకోత: సాధారణంగా అల్లం పంట కాలపరిమితి 9-10 నెలలు. సాధారణంగా అల్లం దుంపలు ఏప్రిల్‌-మే నెలల్లో నాటుకొంటే నవంబర్‌, డిసెంబరు, జనవరి మాసాలలో త్రవ్వకానికి వస్తారు. ఆకులు పసుపుపచ్చగా మారి ఎండిపోవడం, ఆకులు మొక్కల మధ్య కాండం ఎండిపోవడాన్ని బట్టి దుంపలు పక్వానికి వచ్చినట్లుగా గుర్తించవచ్చు. కాలపరిమితి పూర్తరునా సరే ఊరకున్నా లేక మార్కెట్‌లో రేటు లేకున్నా అల్లాన్ని త్రవ్వకుండా నేలలోనే ఉంచి నీరు కట్టాలి. తరువాత సంవత్సరం త్రవ్వి తగిన దిగుబడులను పొందవచ్చు. ఫిబ్రవరి – మార్చిలో నీడ ఏర్పాటు చేసి ఒకటి రెండు తడులు ఇస్తే ఆదనంగా 20 క్వి. దిగుబడి వస్తుంది ఏప్రిల్‌-మే మాసాలలో తవ్వి మార్కెట్‌ చేస్తే విత్తనంగా మంచి ధర పొందవచ్చు. త్రవ్విన తరువాత దుంపల మీద గల వేర్లు, పొలుసులు, మట్టిని తీసివేసి శుభ్రపరచి మార్కెట్‌ చేయాలి. అల్లాన్ని ఉపయోగించే విధానాన్ని బట్టి పంటకోత యొక్క సమయాన్ని నిర్ణరుంచాలి.  ప్రధానంగా అల్లాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. పచ్చి అల్లం కొరకు దుంపలు విత్తిన 6 మాసాల తరువాత త్రవ్వడం ప్రారంభించాలి. ఎండు అల్లం కొరకు ఆకులు పసుపు రంగుకు మారి ఎండిపోవడం ప్రారంభించినపుడు అంటే నాటిన 8 నెలల తరువాత కోత ప్రారంభించాలి. నిల్వ వుండే అల్లం కొరకు (దుంపలు నిల్వ వుండే) నాటిన 7 నెలల తర్వాత కోత ప్రారంభించాలి, అలస్యమరుతే దుంపలో పీచు ఎక్కువ అవుతుంది.

విత్తన దుంపల ఎన్నిక మరియు నిలువ: త్రవ్విన తరువాత, తదుపరి పంట కొరకు కొంత అల్లాన్ని విత్తన దుంపలుగా ఎంపిక చేసుకొని నిలువ చేయాలి. నిలువలో పురుగులు, తెగుళ్ళ వలన దుంపకు నష్టం జరుగుతుంది. సాధారణంగా పొలుసు పురుగులు మొలకెత్తుతున్న మొగ్గ భాగాలను ఆశించి నష్టపరుస్తారు. అల్లం త్రవ్వకం తరువాత కొన్ని పద్దతులను పాటించడం వలన విత్తన దుంపలను తాజాగా నష్టపోకుండా నిలువ చేయవచ్చు. 

కె. సాధన, సెల్‌: 9940236076; డా. ఎం.ఆర్‌. భానుశ్రీ, డా. బి. పుష్పావతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం

Read More

A గ్రేడ్‌ మోడల్‌గా మిశ్రమ పంటలు

ప్రకృతి వ్యవసాయంలో వీరనారి  ఝాన్సీ

మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే ప్రకృతి వ్యవసాయం ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా రైతు లోగిళ్ళకు చేరుతుంది. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖలో ప్రకృతి వ్యవసాయ విభాగాన్ని ప్రారంభించి అందులో క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించుకొని వారి ద్వారా వివిధ రకాల పద్ధతులలో వివిధ రకాల పంటలు సాగు చేయిస్తూ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వచ్చిన క్షేత్రస్థాయి ఫలితాలను తోటి రైతులకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఎక్కువ మంది రైతులను ప్రకృతి వ్యవసాయ బాట పట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రకృతి వ్యవసాయ విభాగం వారు కొత్తగా A గ్రేడ్‌ మోడల్‌ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్‌లో ఒక ఎకరంలో 5 ఎకరాలకు అవసరమయిన విత్తనాన్ని ఉపయోగించి 5 ఎకరాలలో వచ్చే దిగుబడిని ఒక ఎకరంలో పొందడం ఈ మోడల్‌ యొక్క విశిష్టత. ప్రకృతి వ్యవసాయ విభాగం మెంటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఝాన్సీలక్ష్మి ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, గాదెపాలెం గ్రామంలో ఒక ఎకరం పొలంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రకృతి వ్యవసాయ విభాగం రూపొందించిన A గ్రేడ్‌ మోడల్‌ విధానంలో పలు పంటల సాగు చేస్తున్నారు.

ఝాన్సీ లక్ష్మిది వ్యవసాయ నేపథ్యం. వివిధ పంటల సాగులో వారికి అనుభవం ఉంది. రసాయనిక వ్యవసాయం చేస్తున్న వీరు ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని తమ రసాయనిక వ్యవసాయాన్ని ఏడు సంవత్సరాల క్రితం ప్రకృతి వ్యవసాయంలోకి మార్చారు. రసాయనిక వ్యవసాయం చేస్తున్న సమయంలో పెట్టుబడులు పెరగడముతో పాటు తమ ఆరోగ్యాలు దెబ్బతినడము గమనించిన వీరు ఈ సమస్యల పరిష్కారానికి గాను తమ రసాయనిక సాగుని ప్రకృతి వ్యవసాయంలోకి మార్చారు. ప్రస్తుతం వీరు ప్రకృతి వ్యవసాయ విభాగంలో మెంటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారి ఉద్యోగ బాధ్యతలలో భాగంగా ఒక ఎకరం పొలంలో A గ్రేడ్‌ మోడల్‌ పంటల సాగు మొదలు పెట్టారు.

దుక్కిలో ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం అందించి 30 రకాల విత్తనాలను PMDSపద్ధతిలో చల్లుకోవడం జరిగింది. 45 రోజులు పెరిగిన పంటను పశువులకు మేతగా అందించి పొలాన్ని దున్నకుండానే 5 రకాలు ప్రధాన పంటలుగా, 20 రకాలు బయోడైవర్సిటి పంటలుగా ట్రాక్టరు గొర్రుతో పొలంలో ఎద బెట్టడం జరిగింది. మామూలుగా అయితే PMDS పంటలను పచ్చిరొట్టగా భూమిలో కలియదున్నుతారు. కాని తాను పశువులకు మేతగా అందించారు. పోషకాలు గల పచ్చిమేతను పశువులకు మేతగా అందించడం వలన దిగుబడి పెరగడముతో పాటు పాలలో వెన్న శాతం పెరగడము వీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. జు గ్రేడ్‌ మోడల్‌లో వేసే ఐదు ప్రధాన పంటలకుగాను శనగ 30 కిలోలు, ధనియాలు 2 కిలోలు, వరిగలు ఒక కిలో, గోరు చిక్కుడు కొంచెం, పొద్దు తిరుగుడు కిలోన్నర విత్తనాలు అవసరంపడింది. ఈ పంటలన్నీ కూడా సుమారు 90 రోజులలో దిగుబడి అందించేవి కాబట్టి అన్ని పంటలు ఒకేసారి దిగుబడి పొందవచ్చు అనే ఉద్దేశ్యంతో ఈ పంటలను ఎంపిక చేసుకున్నారు. వీటితో పాటు బయోడైవర్సిటి పంటలుగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పెసర, అలసంద, పిల్లిపెసర మొదలగు 20 రకాల విత్తనాలను కూడా మిశ్రమ పంటలుగా వేయడం జరిగింది. అన్ని పంటలకు కలిపి క్రమం తప్పకుండా 15 రోజులకు ఒకసారి ద్రవ జీవామృతాన్ని పంటలపై పిచికారి చేస్తుంటారు. చీడపీడల నివారణకు గాను పక్షిస్థావరాలు, పసుపు రంగు జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకున్నారు. అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, థపర్ణి కషాయాలను పంటపై చీడపీడల నివారణకు పిచికారి చేస్తున్నారు. పూత నిలవటానికి మరియు దిగుబడి పెరగటానికి గాను అవసరాన్ని బట్టి పుల్లటి మజ్జిగను పిచికారి చేస్తున్నారు. రక్షక పంటలుగా సరిహద్దులో జొన్న మరియు సజ్జ పంటలను వేసుకున్నారు. 

A గ్రేడ్‌ మోడల్‌లో వేసిన అన్ని పంటలు ప్రస్తుతం పూత, పిందె థలో ఉన్నాయి. దిగుబడి రావడానికి కొంత సమయం పడుతుంది. పంటలను గమనించినట్లయితే దిగుబడులు ఆశాజనకంగా రావచ్చు. ఎలాంటి రసాయనాలు అందించకుండా పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యకరమయిన పంటలు పండిస్తున్నారు.

     – వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

వేసవి  దుక్కులతో రైతుకు  లాభాలు ఎన్నో…

సాధారణంగా వేసవి నెలల్లో అడపాదడపా కురిసే వానలను సద్వినియోగం చేసుకొని మాగాణి, మెట్ట, బీడు భూములను దున్నుకోవాలి. వీటినే వేసవి దుక్కులు అంటారు. ప్రస్తుతం యాసంగి దాదాపు ముగియటంతో రైతులకు పంటలన్నీ చేతికంది వేసవి వచ్చేసింది. ఇలాంటి తరుణంలో చాలా ప్రాంతాల్లో రైతు సోదరులు వానాకాలం లేదా యాసంగి పంట తీసుకున్న తర్వాత మళ్ళీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలివేయటం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, పోషక పదార్థాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేస్తున్నాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవటమే కాకుండా నీరు భూమిలోని లోపల పొరల నుంచి గ్రహించబడి ఆవిరైపోతుంది.

ప్రయోజనాలు

పంటకోత అనంతరం పొలాన్ని అలా వదిలివేయకుండా వర్షాలకు ముందే భూమిని దున్నటం వల్ల తొలకరి వర్షాలు పడగానే నీరు భూమిలోకి ఇంకి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కుల వల్ల భూమి పైపొరలు కిందికి, కింది పొరలు పైకి తిరగబడి నేల సారవంతంగా మారుతుంది. ఇలా చేయడం వల్ల భూమిలో తేమశాతం పెరిగి, భూసారాభివృద్ధి, పురుగులు, తెగుళ్ళ యాజమాన్యం, కలుపు మొక్కల నివారణ వంటి ప్రయోజనాలు సమకూరుతాయి.

భూసారాభివృద్ధి, తేమశాతం పెరుగుదలలో కీలకపాత్ర

వేసవి దుక్కులు లోతుగా వాలుకు అడ్డంగా దున్నుకోవాలి. వాలుకు అడ్డంగా దున్నుకోవటం వల్ల వాన నీరు భూమిలోకి ఇంకేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో పాటు భూమి ఎక్కువ తేమను గ్రహించి నిల్వ చేసుకొనే సామర్థ్యం పెరుగుతుంది. దీని ప్రభావం పంట దిగుబడి మీద కేంద్రీకృతమవుతుంది. వేసవి దుక్కులు దున్నే ముందు పొలంలో గొర్రెలను, పశువుల మందలను తోలటం వల్ల అవి విసర్జించే వ్యర్థాలు భూమిలోకి చేరి సేంద్రియ పదార్థాలుగా తయారై అవి భూసారాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయి.

వేసవి దుక్కులు దున్నే ముందు పశువుల పెంటపోగు, కంపోస్టు ఎరువు, చెరువు మట్టిని వెదజల్లటం వల్ల నేల సారవంతమై పంట దిగుబడి పెరగటంతో పాటు తేమశాతం పెరుగుతుంది. సాధారణంగా రైతులు పంట చేతికందగానే పంటల నుండి వచ్చే ఎండు ఆకులు, చెత్త, చెదారం కాల్చి వేయకుండా అవకాశమున్నవారు లోతు దుక్కులు చేయటం వల్ల పంట చెత్త, చెదారం, ఎండు ఆకులు నేల పొరల్లో కలిసిపోయి కుళ్లిపోయి ఎరువుగా మారి భూసారం పెరిగి పంటలకు కావలసిన పోషక పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.

వేసవి దుక్కులతో పురుగులు, తెగుళ్ళ నివారణ

వేసవి కాలంలో చాలా వరకు భూమి ఖాళీగా ఉంటుంది. అలాంటి సమయంలో పంటలను ఆశించే అనేక రకాల పురుగులు పంటకోత థల్లో వాటి నిద్రావస్థ థలను నేలలో, చెత్తా చెదారంలో, కొయ్యకాడల్లో గడుపుతాయి. తెగుళ్ళను కలుగజేసే శిలీంద్రాలు మొదలైనవి భూమి లోపల ఆశ్రయం పొందుతాయి. వీటి శిలీంద్ర బీజాలు భూమిలో నిల్వ ఉంటాయి. వేసవి లోతు దుక్కుల వల్ల నిద్రావస్థ థలో భూమిలో ఉన్న చీడ పురుగుల గ్రుడ్లు, లార్వాలు, ప్యూపాలను పకక్షులు, కొంగలు తిని నాశనం చేస్తాయి. అదే విధంగా వేసవి దుక్కుల వల్ల భూమి లోపల పొరల్లో ఉన్న శిలీంద్ర బీజాలు మట్టితో పాటు నేలపైకి వస్తాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతకు గురై వ్యాధి కలుగజేసే శక్తిని కోల్పోతాయి.

వేసవి దుక్కులతో కలుపు నిర్మూలన

సాధారణంగా పంటలేని సమయంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు నేలలోని నీరు, పోషకాలను ప్రత్యక్షంగా గ్రహించి పంట దిగుబడిని తగ్గిస్తాయి. అదేవిధంగా అనేక రకాల పురుగులకు, శిలీంధ్రాలకు ఆశ్రయాన్ని కల్పించటం ద్వారా పరోక్షంగా పంట నష్టానికి కారణమవుతాయి. కాబట్టి వేసవి లోతు దుక్కుల వల్ల లోతుకు పాతుకుపోయిన కలుపు మొక్కలు, వాటి విత్తనాలు నేలపై పొరల్లోకి చేరటం వల్ల ఉష్ణోగ్రతకు గురై నశిస్తాయి. దీనివల్ల తదుపరి పంటలో కలుపు తాకిడి తక్కువగా ఉంటుంది. అందువల్ల అప్రమత్తంగా ఉండి వేసవి జల్లులను ఆసరా చేసుకొని వేసవి దుక్కులు చేపడదాం!  

ఇతర వివరములకు సంప్రదించవలసిన ఫోన్‌ నెం. 8978672595

డా|| ఎం. సురేష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డా|| శ్రీధర్‌ చౌహాన్‌, డా|| కె. భానురేఖ, డా|| బి. రాజేశ్వరి, డా|| జి. అనిత, వ్యవసాయ కళాశాల, ఆదిలాబాద్‌.

Read More

చౌడును, బెట్టను తట్టుకునే ధనియాలు

పంటల సాగు లాభదాయకంగా ఉండాలంటే సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు మంచి దిగుబడులు పొంది వచ్చిన దిగుబడులను ఆశాజనకమయిన ధరలకు అమ్ముకోగలగాలి. ఈ మూడింటిలో మార్కెట్‌ ధర అనేది రైతు చేతుల్లో ఉండదు అనే విషయం అందరికి తెలిసిందే. ఇంక మిగిలిన రెండు అంశాలు మాత్రమే రైతు చేతులలో ఉంటాయి. సాగు ఖర్చులు తగ్గించుకోవాలంటే సొంతంగా శ్రమించడముతో పాటు రసాయనిక వ్యవసాయం బదులుగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంభించినట్లయితే సాగు ఖర్చులు తగ్గుతున్నాయని అనేకమంది సేంద్రియ రైతుల అనుభవాలు చెబుతున్నాయి. పంట దిగుబడులు పెరగడము అనేది విత్తన నాణ్యత మరియు నేల సారం మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. నాణ్యమయిన విత్తనాలు వేసుకోవడం అనేది రైతు చేతులలో ఉంటుంది కాని నేల సారం మరియు నేల రకం రైతు చేతులలో ఉండదు. అందుబాటులో ఉన్న నేలలోనే పంటల సాగు చేపట్టవలసి ఉంటుంది. కాబట్టి మనం సాగు చేసే నేలను బట్టి సాగు చేసే పంటలను ఎంపిక చేసుకున్నట్లయితే కొంతలో కొంత ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన రైతు సురేష్‌ తన భూమిలో ధనియాల పంటను సాగు చేశారు.

సురేష్‌ది వ్యవసాయ నేపథ్యం. వారి ప్రాంతంలో శనగ పంటను ఎక్కువగా వేస్తుంటారు. అందరి రైతుల మాదిరిగానే చాలా సంవత్సరాలు పంట మార్పిడి చేయకుండా శనగ పంటను సాగు చేస్తూ రసాయన పద్ధతులు పాటిస్తూ వస్తున్నాడు. కాబట్టి తన పొలం చౌడు బారిపోయింది. దానికితోడు ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉంటాయని నిపుణులు తెలియచేయడంతో ఇలాంటి పరిస్థితులలో తన పొలంలో ధనియాల పంటను సాగు చేయడానికి సిద్ధం అయ్యాడు. అంతకుముందు రసాయనిక వ్యవసాయం చేసిన సురేష్‌ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల యొక్క ఉపయోగాలను ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా తెలుసుకుని 4 సంవత్సరాల క్రితం తన రసాయనిక వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయానికి మార్చాడు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయ విభాగంలో ICRPగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 

దుక్కిలో PMDS పద్ధతి ప్రకారం 35 రకాల విత్తనాలను చల్లుకోవడం జరిగింది. వివిధ రకాల కారణాల వలన మొక్కలు సరిగ్గా పెరగకపోవడంతో పంట మొత్తాన్ని దున్ని మరలా 12 రకాల విత్తనాలను పచ్చిరొట్టగా వేసి పచ్చిరొట్ట పైరు రెండున్నర నుంచి మూడు అడుగులు పెరిగిన తరువాత ట్రాక్టరు సహాయంతో పచ్చిరొట్టను భూమిలో కలియదున్నాడు. పశువుల ఎరువుకు ట్రైకోడెర్మావిరిడే, సూడోమోనాస్‌, VAMలు కలిపి దుక్కిలో అందించడం జరిగింది. నేల చౌడుబారి పోవడం మరియు ఈ సంవత్సరం వర్షాలు సక్రమంగా ఉండకపోవచ్చని తెలుసుకుని ఈ పరిస్థితులలో తమ నేలకు ధనియాలు సరైన పంట అని తెలసుకుని 82 సెంట్ల భూమిలో 8 కిలోల ధనియాలు, 100 గ్రాముల పొద్దుతిరుగుడు, కిలోన్నర జొన్న, 50 ఆముదం విత్తనాలు, కొంచెం దోస, కొంచెం ఆవాలు విత్తనాలను బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవడం జరిగింది. ధనియాలు విత్తనాలు విత్తిన 9 నుండి 11 రోజుల మధ్యలోనే మొలకలు వచ్చాయి. మొలక వచ్చిన 15 రోజులలో నీమాస్త్రం, మరలా తరువాత 10 రోజులకు జీవామృతం, తరువాత 10 రోజులకు థపర్ణి కషాయం, తరువాత బూడిద తెగులు నివారణకు ఆవుపేడ+మూత్రం+ఇంగువ ద్రావణంతో పాటు అవసరాన్ని బట్టి అగ్నాస్త్రం, థపర్ణి కషాయాలు పిచికారి చేసుకున్నాడు. వీటితో పాటు చీడపీడల ఉధృతి తగ్గటానికి గాను లింగాకర్షక బుట్టలు, పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేయడంతో పాటు ఆకర్షిక పంటలుగా ఆముదం లాంటివి, సరిహద్దు పంటలుగా జొన్న పంట వేయడం జరిగింది.

చౌడుబారిపోతున్న తన భూమిని కాపాడుకుంటూ, అవశేషాలు లేని పంట దిగుబడుల కోసం సేంద్రియ వ్యవసాయం చేస్తూ నలుగురికి స్ఫూర్తినిస్తూ సాగుతున్నారు. మరిన్ని వివరాలు 9989481681కి ఫోను చేసి తెలుసుకోగలరు.

– వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌

Read More

మెదడుకు పనిపెడితేనే వ్యవసాయం లాభసాటి

మన ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒకప్పుడు 90 శాతానికి పైగా, ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇంత ఎక్కువమంది ఆధారపడుతున్న వ్యవసాయరంగం పరిస్థితి బాగానే ఉంది. కాని ఆ వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి బాగా లేదు అని చెప్పవచ్చు. స్వేదం చిందించి సేద్యం చేసి పంటలు పండించి మన ఆకలి తీర్చే రైతులలో 90 శాతానికి పైగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టే మనం ప్రతినిత్యం అన్నదాతల ఆత్మహత్యల గురించి వింటున్నాము. ఈ పరిస్థితులు మారవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో రైతు వర్గం చాలా పెద్ద వర్గం కాబట్టి అంత పెద్ద వర్గాన్ని ఆదుకునే సత్తా ప్రభుత్వానికి కాని వేరే సంస్థలకు కాని లేదు అనే విషయం అక్షర సత్యం. కాబట్టి రైతులే ఎవరికి వారు తమ పంటల సాగును లాభాల బాట పట్టించటానికి అవసరమైన చర్యలు చేపట్టాలి. లాభసాటి పంటల సాగుకు సంబంధించిన ఆలోచనలు రైతులందరూ చేయలేకపోయినా కాని కొంతమంది అభ్యుదయ రైతులు తమ మెదడుకు పదను పెడతూ అనునిత్యం లాభసాటి వ్యవసాయం గురించి ఆలోచిస్తూ తమకు వచ్చిన ఆలోచనలను అమలు పరుస్తూ ముందుకు నడుస్తూ వచ్చిన ఫలితాలను తోటి రైతులకు తెలియ చేస్తుంటారు. ఈ కోవకే చెందుతాడు యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం వంచెగూడెం గ్రామంలో సమీకృత వ్యవసాయం చేస్తున్న ఫణికుమార్‌.

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, మాచర్ల ప్రాంతానికి చెందిన ఫణికుమార్‌ది వ్యవసాయ నేపథ్యం. చిన్నతనం నుండి పంటల సాగులో తన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటాడు. వ్యవసాయంలో తన వంతు పాత్రను పోషించేవాడు. ఉన్నత చదువులు చదివిన ఫణికుమార్‌ తన చదువు పూర్తి కాగానే హైదరాబాదు నగరం రావడం, వివిధ కార్యక్రమాలు చేపట్టడం లాంటివి చేసి తన లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు మండలం, వంచెగూడెం గ్రామంలో వంద ఎకరాలకు పైగా భూమిని కౌలుకు తీసుకొని సమీకృత వ్యవసాయం చేస్తున్నాడు. 125 ఎకరాలకు పైగా భూమిలో సూపర్‌ నేపియర్‌ పశుగ్రాసాన్ని సాగు చేస్తూ నాణ్యమయిన పశుగ్రాసాన్ని గోశాలలకు అమ్మకం చేస్తున్నాడు. సూపర్‌ నేపియర్‌ సాగుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని గత సంచిక (రైతునేస్తం మార్చి నెల సంచిక)లో విపులంగా వివరించడం జరిగింది. ఫణికుమార్‌ సాగు చేస్తున్న సమీకృత వ్యవసాయంలో భాగంగా నారిసువర్ణ జాతి గొర్రెల పెంపకం, సోనాలి రకం కోళ్ళ పెంపకం మరియు బయోటాయిలెట్‌లలో ఉపయోగించే బాక్టీరియాల గురించిన సమాచారాన్ని ఈ సంచికలో వివరిస్తున్నాము.

నారి సువర్ణ జాతి గొర్రెల పెంపకం

అనునిత్యం అన్ని రంగాలలో మార్పులు జరుగుతూనే ఉంటాయి. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో జరిగే మార్పులు కొద్దిగా నిదానంగా జరుగుతాయి అనే విషయం అందరికి తెలిసిందే. గతంతో పోల్చుకుంటే ఇటీవల కాలంలో వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలలో కూడా మార్పులు రావడములో కొంచెం వేగం పెరిగిందని చెప్పవచ్చు. రైతులకు లాభాలు ఆర్జించి పెట్టే వ్యవసాయ అనుబంధరంగాలలో గొర్రెల పెంపకం మొదటి వరుసలో ఉంటుందని చెప్పవచ్చు. గొర్రెల పెంపకం అనేది చాలా వరకు కులవృత్తిగా కొనసాగుతూ వస్తుంది. ఇటీవలకాలంలో మిగతా వర్గాల వారు కూడా గొర్రెల పెంపకంలో అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు.

ప్రభుత్వం కూడా గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. కాని గొర్రెలలో వచ్చే వివిధ రకాల ఆనారోగ్య సమస్యలు మరియు ఇతర సమస్యల వలన గొర్రెలు పెంపకం చేసే రైతులందరూ లాభాలను ఆర్జించలేక పోతున్నారు. ఈ సమస్యలకు సరైన పరిష్కారం కొరకు అందుకు సంబంధించిన ప్రభుత్వ సంస్థలు పరిశోధనలు చేశాయి. ఇంకా చేస్తూనే ఉన్నాయి. ఆ బాటలో నడిచిన మహారాష్ట్రకు చెందిన నింబాకర్‌ యూనివర్సిటీ వారు 30 సంవత్సరాల నుంచి పరిశోధనలు చేసి నారి సువర్ణ రకం గొర్రె జాతిని అభివృద్ధి చేశారు. నారి సువర్ణ జాతి గొర్రెలు అన్ని రకాల వాతావరణాలకు మరియు కరువును తట్టుకోగలవు అని శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకున్న ఫణికుమార్‌ 8 ఆడగొర్రెలను, 4 మగ గొర్రెలను కొనుగోలు చేసుకుని పోషిస్తున్నాడు. వీటికి సంబంధించిన లాభనష్టాలు తెలుసుకోవాలంటే 2024 డిసెంబర్‌ వరకు వేచి ఉండవలసిందే అని ఫణికుమార్‌ అంటున్నాడు. వీటికి పశుగ్రాసంగా సూపర్‌ నేపియర్‌, థరథగడ్డి, జనుము, మొక్కజొన్న, జొన్న లాంటి మేతలను అందిస్తూ దాణాను కూడా అందిస్తున్నాడు. తమ పొలంలో పగలు మొత్తం తిరుగుతూ అందుబాటులో ఉన్న పచ్చిగడ్డిని తింటూ తిరుగుతుంటాయి కాబట్టి శారీరకంగా దృఢంగా ఉంటున్నాయి. ఈ జాతిని అభివృద్ధి పరచి మన స్థానిక జాతులతో సంపర్కం చేసి అన్ని విధాలుగా లాభదాయకంగా ఉండే జాతి గొర్రెలను భారీ మొత్తంలో పెంపకం చేయాలనే లక్ష్యంతో ఫణికుమార్‌ ముందుకు సాగుతున్నాడు.

సొనాలి జాతి నాటు కోళ్ళ పెంపకం

కొంచెం అటూఇటుగా వ్యవసాయ అనుబంధరంగం అయిన కోళ్ళ రంగంలో కూడా అనేక మార్పులు సంభవించాయి. ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. మనం పూర్వం నుంచి పెంపకం చేస్తూ వస్తున్న నాటు కోళ్ళను వివిధ రకాలుగా అభివృద్ధి చేసి ఎక్కువ గ్రుడ్లను అందివ్వడంతో పాటు త్వరగా బరువు పెరిగే జాతులను అభివృద్ధి చేశారు. అభివృద్ధి పరచిన వివిధ రకాల నాటుకోళ్ళ జాతులలో సోనాలి రకంకు ఉన్న విశిష్టత వలన ఫణికుమార్‌ గారు సొనాలి రకం నాటుకోళ్ళను కూడా పెంపకం చేస్తున్నాడు.

ఇందుకు గాను ఒకరోజు వయస్సు ఉన్న పిల్లలను కొనుగోలు చేసుకుని పోషిస్తూ వస్తున్నాడు. మొదట బ్యాచ్‌లో 3000 పిల్లలను కొనుగోలు చేసుకొని 2023 నవంబరు నుంచి బహిరంగంగా తిరుగుతూ పెరుగుతున్నాయి. పొలంలో అందుబాటులో ఉండే చీడపీడలను, పురుగులను, గడ్డిని తినడముతో పాటు అన్ని రకాల గడ్డి మొక్కలను, గడ్డి ముక్కలతో పాటు దాణాను అందిస్తూన్నారు. జనవరి నుండి అమ్మకం మొదలు పెట్టాడు. బరువుతో సంబంధం లేకుండా కోడి 350/-ల చొప్పున ఇప్పటి వరకు 2500 కోళ్లను అమ్మకం చేశారు. వారు కొనుగోలు చేసేటప్పుడు పుంజులు, పెట్టలు రెండు కలిపి కొనుగోలు చేశారు. జాతిని అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ విధంగా మగవి, ఆడవి కలిపి కొనుగోలు చేయడం జరిగింది. సొనాలి జాతి కోడి పెట్టలు సంవత్సరానికి 200 వరకు గ్రుడ్లను పెడతాయి. మొదటగా పెట్టిన గ్రుడ్లు చిన్నవిగా ఉంటాయి. కాబట్టి వాటిని అమ్మకం చేస్తూ వస్తున్నాడు. పెద్ద సైజు గ్రుడ్లు పెట్టిన తరువాత వాటిని సహజ సిద్ధంగా పొదిగించటానికి సిద్ధం అవుతున్నాడు. వీరికున్న నాలుగు నెలల సొనాలి జాతి కోళ్ళ పెంపకం అనుభవంలో రోగాల వలన ఒక్క కోడి కూడా మరణించలేదు. కోళ్లకు అవసరమైన టీకాలను సమయానుకూలంగా అందిస్తూ వచ్చారు. వీటిని పొలంలో సహజసిద్ధంగా పెంపకం చేస్తున్నారు కాబట్టి రోగాలు ఆశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఫణికుమార్‌ వివరిస్తున్నాడు.

బయోటాయిలెట్స్‌లో ఉపయోగించే బాక్టీరియా తయారీ

గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకున్నట్లయితే గ్రామాలలో చాలావరకు ఇళ్ళలో టాయిలెట్స్‌ ఉండేవి కావు. కాబట్టి బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన జరిగేది. ఆ సమయం పందులు స్వచ్ఛభారత్‌ కార్యకర్తల పాత్రను పోషించేవి. ఆ తరువాత ఇళ్ళలో టాయిలెట్స్‌ ఏర్పాటు చేసుకున్నారు. టాంక్‌ నిండగానే ఖాళీ చేయవలసి వస్తుంది. అదేవిధంగా రైళ్ళలో కూడా మలవిసర్జన చేసినపుడు అన్ని ప్రాంతాలు అశుద్ధంగా ఉండేవి.

ఈ సమస్యల పరిష్కారానికి మలమునే ఆహారంగా తినగలిగే బాక్టీరియాను డిఆర్‌డిఓ వాళ్లు అభివృద్ధి పరచి మదర్‌ కల్చర్‌ను లైసెన్స్‌ ఉన్న సంస్థలకు సరఫరా చేస్తుండడము తెలుసుకున్న ఫణికుమార్‌ ఇందుకు సంబంధించిన లైసెన్స్‌ను పొంది బ్యాక్టీరియాను అభివృద్ధి పరచే యూనిట్‌ను ఆలేరు సమీపంలో ప్రారంభించారు. డిఆర్‌డిఓ వారు అందించు మదర్‌ కల్చర్‌కు ఆవుపేడను ఆహారంగా అందిస్తూ బయోటాయలెట్స్‌లో ఉపయోగించే బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం రైల్వేలకు మరియు కొంతమందికి సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో అందరూ బయో టాయలెట్స్‌ను నిర్మించుకోవలసిన అవసరం పడుతుంది కాబట్టి ఇలాంటి యూనిట్లు అనేకం ప్రారంభించవలసిన అవసరం ఉందని ఫణికుమార్‌ అంటున్నాడు.

వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలను ఆదరించడముతో పాటు సాగులో పెట్టుబడులు తగ్గించుకుంటూ, కొత్త పంటల సాగువైపు అడుగులు వేస్తూ, సొంత మార్కెటింగ్‌ చేసుకొంటే పంటల సాగు లాభసాటి కాగలదని ఫణికుమార్‌ ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9866469096 కి ఫోను చేసి తెలుసుకోగలరు.    

గొర్రెలలో మగవాటిని, ఆడవాటిని విడివిడిగా ఉంచాలి

గొర్రెల పెంపకంలో రైతులు ఎదుర్కొనే సమస్యలలో రోగాల వలన గొర్రెలు చనిపోవడం అనేది అతిపెద్ద సమస్య. గొర్రెల పెంపకందారులందరూ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. మనుషులతో సహా ఏ జీవి అయినా ఆరోగ్యంగా ఎదగాలంటే రోగనిరోధక శక్తి అతిముఖ్యం. ఈ విషయం కరోనా తరువాత అందరికీ తెలిసి వచ్చింది. రోగనిరోధక శక్తి బాగా ఉన్న వారిని కరోనా ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. రోగనిరోధక శక్తి సక్రమంగా లేని వారిని మాత్రం కరోనా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందనే విషయం అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని కక్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగితే రోగనిరోధక శక్తి యొక్క ప్రాముఖ్యత అర్థం అవుతుంది. గొర్రెల విషయానికొస్తే రోగాల వలన గొర్రెలు చనిపోవడము అనేది మనం ప్రతినిత్యం వింటున్న సమస్య. రోగనిరోధక శక్తి సక్రమంగా లేకపోవటము వలన చిన్న చిన్న రోగాలను తట్టుకోలేని గొర్రెలు మృత్యువాత పడుతున్నాయి. రోగనిరోధక శక్తి పెరగాలంటే డెలివరి అయిన తరువాత ఆడ గొర్రెలకు కొన్ని నెలలు విశ్రాంతిని ఇవ్వాలి. ఆ విశ్రాంతి సమయంలో ఆడగొర్రెలలోని అన్ని అవయవాలు తిరిగి శక్తిని పుంజుకుంటాయి. కాని ప్రస్తుతం గొర్రెల మందలు పరిశీలించినట్లయితే డెలివరి అయిన వెంటనే గొర్రెలను మందలలో తోలుతుంటారు. ఆ మందలో మగ గొర్రెలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి ఉన్న పశుప్రవృత్తి వలన మగ, ఆడ గొర్రెల మధ్య సంపర్కం జరిగి ఆడ గొర్రెలకు అవసరమయిన విశ్రాంతి లేకుండానే మరలా గర్భం దాల్చుతుంటాయి. ఆవిధంగా గర్భం దాల్చడం వలన జన్మించిన గొర్రె పిల్లలలో రోగనిరోధక శక్తి సక్రమంగా ఉండదు కాబట్టి అలాంటి గొర్రెపిల్లలు త్వరగా రోగాల బారిన పడటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆడ గొర్రెలను, మగగొర్రెలను విడివిడిగా పోషించడమే ఈ సమస్యకు సరైన పరిష్కారం అంటున్నాడు ఫణికుమార్‌. అందుకనే వీరు మగ గొర్రెలను, ఆడ గొర్రెలను విడివిడిగా పెంచుతున్నారు.

Read More

పసుపు ధరలు పైకి… మిర్చి ధరలు కిందకు….

2010 తర్వాత మళ్ళీ 2023 నుండి పసుపు ధరలు పెరగటంతో పసుపుని పండించే రైతులు సంతోషిస్తున్నారు. 2010లో అంతర్జాతీయ మార్కెట్‌లో పసుపు ధరలు కిలోకు 2.07 డాలర్లుగా గరిష్ట స్థాయిని నమోదు చేసాయి. అప్పటి నుండి మళ్ళీ ఆ స్థాయి ధరలు లభిస్తాయనే ఆశతో రైతులు పసుపుని సాగు చేస్తున్నారు. క్వింటాలుకి 15 వేల రూపాయల ధర 2010లో దేశంలోని పసుపు రైతులకు లభించింది. ఆ తర్వాత క్వింటాలు ధర 6 వేల రూపాయలకు మించలేదు. కొందరు రైతులు, వ్యాపారులు పసుపు పంటను నిల్వ చేసి, నష్టపోయారు. 2022-23 నుండి పసుపు ధరలో కొంత కదలిక వచ్చింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే పసుపు ఎగుమతులు 11 శాతం వృద్ధి చెందాయి. అనేక సంవత్సరాల పాటు పసుపు ధరలు నిరాశాజనకంగా ఉండటం వల్ల రైతులు పసుపు సాగుని తగ్గించారు. 2021-22లో 3.49 లక్షల హెక్టార్లలో పసుపు పంట సాగయింది. 13.34 లక్షల టన్నుల పసుపు ఆ సంవత్సరం ఉత్పత్తయినట్లు అంచనా. ఆ సంవత్సరం 1.53 లక్షల టన్నుల ఎగుమతి ద్వారా దేశం 1784 కోట్ల రూపాయలు ఆర్జించింది. అదే సంవత్సరం 0.24 లక్షల టన్నుల కొన్ని రకాల పసుపు దిగుమతయింది. అందుకు 246 కోట్ల రూపాయలు ఖర్చవగా, నికరంగా రూ. 1538 కోట్ల విదేశీ మారకద్రవ్యం దేశానికి లభించింది. యునైటెడ్‌ ఆరబ్‌ రిపబ్లిక్‌, నేపాల్‌, ఒమన్‌, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, మలేసియాలు ముఖ్యంగా భారత్‌ నుండి పసుపుని దిగుమతి చేసుకున్నాయి. గత రెండు థాబ్దాలుగా పసుపు విస్తీర్ణం పెరుగుతుండగా దిగుబడుల్లో తగ్గుదల కనిపిస్తున్నది. 2015-16లో దేశపు సగటు ఉత్పత్తి హెక్టారుకి 5100 కిలోలుండగా 2021-22లో అది 3818 కిలోలకు తగ్గింది. 2021-22లో క్వింటాలు సగటు ఉత్పత్తి వ్యయం రూ. 8373 కాగా ధర మాత్రం రూ. 6100 గానే ఉంది. నష్టాలను భరించలేక గత రెండేళ్ళలో రైతులు వేరే పంటలకు మళ్ళారు. 2022-23లో పంట విస్తీర్ణం 12 శాతం తగ్గినట్లు అంచనా వేశారు. విస్తీర్ణం తగ్గటం, ఎగుమతి గిరాకీ పెరగటం వల్ల 2023లో పసుపు ధరలు 70 శాతం పెరిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు 1.58 డాలర్లు పలుకుతున్నది. దేశీయ మార్కెట్‌లో క్వింటాలు ధర 15 వేల రూపాయలు దాటింది. ఇంకా పెరగవచ్చనే ఆశాభావంతో ఫ్యూచర్స్‌ మార్కెట్‌లో క్వింటాలు ధర 16 వేల రూపాయల్ని దాటింది. నాణ్యతను బట్టి రైతులకు క్వింటాలు ధర 16 వేల రూపాయల్ని దాటింది. నాణ్యతను బట్టి రైతులకు క్వింటాలుకి 12 వేల నుండి 16 వేల రూపాయలు లభిస్తున్నాయి. అనేక సంవత్సరాల చేదు అనుభవం తర్వాత ఈ సంవత్సరం పసుపు రైతులు ఎంతో కొంత లాభాలను పొందుతున్నారు. గత రెండేళ్ళుగా నిల్వ పెట్టిన రైతులు, వ్యాపారులు లాభానికి అమ్ముకోగలుగుతున్నారు. రాబోయే సంవత్సరంలో పసుపు సాగు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

నిరాశలో మిర్చి రైతులు

2022-23లో మిర్చి పంటకు గరిష్ట స్థాయిలో ధరలు పలికాయి. ఒక రైతుకి క్వింటాలుకి 81 వేల రూపాయల ధర లభించినట్లు వార్తలొచ్చాయి. బ్యాడిగి రకానికి క్వింటాలుకి 50 వేల రూపాయలు, తేజ రకానికి 35 వేల రూపాయలు, ఇతర రకాలకు 25 వేల రూపాయలకు పైగా ధరలు లభించాయి. 2023-24 సీజనులో రైతులు మిర్చి పంట విస్తీర్ణాన్ని పెంచారు. ఉత్పత్తి పెరుగుతుందనే అంచనాలతో ధరలు సగానికి సగం తగ్గాయి. క్వింటాలుకి రూ. 10 వేల నుండి రూ. 15 వేల మధ్య ధరలు లభిస్తుండటంతో రైతులు నష్టపోతున్నామని వాపోతున్నారు. వాణిజ్య పంటల్లో ధరలు ఆటుపోట్లకు గురికావటం, సర్వసాధారణమై పోయింది. గత సంవత్సరం పత్తి, మిర్చి ధరలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రెండింటి ధరలు తగ్గాయి.

ప్రపంచ మిర్చి ఉత్పత్తిలో భారత దేశానికి 40 నుండి 45 శాతం వాటా ఉంటున్నది. దేశంలో తెలుగు రాష్ట్రాలు ముఖ్య ఉత్పత్తిదారులుగా ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో ఉత్పత్తి ఎక్కువవుతుందనే అంచనాలు రావడం వల్ల దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ ధరలు పతనమయ్యాయి. 2023 డిసెంబరులో క్వింటాలు మిర్చి ధర 315 డాలర్లుండగా 2024 మార్చికి 230 డాలర్లకు తగ్గింది. భారత దేశం నుండి ఎండుమిర్చిని దిగుమతి చేసుకునే దేశాల్లో థాయ్‌లాండ్‌, మలేసియా, శ్రీలంకలు ముఖ్యమైనవి. పచ్చిమిర్చి ఎక్కువగా యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లకు ఎగుమతి అవుతున్నాయి. థాయ్‌లాండ్‌లో కూడా ఎండుమిర్చిని బాగానే పండిస్తున్నారు. ప్రపంచ ఎండుమిర్చి ఉత్పత్తిలో ఆదేశానికి ఏడుశాతం వాటా ఉన్నది. ఈ సంవత్సరం ఆదేశంలో ఎండుమిర్చి ఉత్పత్తి ఆశాజనకంగా ఉండటం వల్ల అక్కడకు జరిగే ఎగుమతులు తగ్గవచ్చనే అనుమానంతో ఎగుమతిదార్లు కొనుగోళ్ళు తగ్గించారు. బంగ్లాదేశ్‌, చైనా, ఇథియోపియా, బెనిన్‌, ఐవరేకోస్ట్‌, మయన్మార్‌ వంటి దేశాల్లో ఎండుమిర్చి ఉత్పత్తి పెరిగే అంచనాలుండటం వల్ల ఆదేశాలు కూడా ఎగుమతి మార్కెట్‌లో భారత ఎండుమిర్చితో పోటీపడే అవకాశం ఉంది. గుంటూరు మార్కెట్‌కు రోజుకి లక్ష టిక్కీలు (35 కిలోలవి) రావటం వల్ల మార్కెట్‌ ధరలు తగ్గుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. చాలామంది రైతులు పంట కల్లాల నుండి మార్కెట్‌కు తరలించడం వల్ల సరఫరాపై నియంత్రణ ఉండటం లేదు. రైతులకు కొద్ది నెలల పాటు తాత్కాలికంగా నిల్వ చేసే సదుపాయాలు కూడా లేకపోవటం వల్ల ఇలా జరుగుతున్నది. వ్యాపారుల మధ్య ఐక్యత వల్ల రైతులకు ధరల్ని తగ్గిస్తున్నారని మిర్చి రైతులు ఆందోళన చేస్తున్నారు. మొదటి రకం మిర్చికే ధరలు సరిగా రాక పోవటం వల్ల, నాశిరకం మిర్చి ధరలు పదివేల రూపాయలకన్నా తక్కువ పలుకుతున్నాయి. 

వాణిజ్య పంటల ధరల్లో సాలెగూడు సామ్యం

మార్కెట్‌ వ్యవస్థలో ఏ వస్తువు, ఏ సేవలకైనా చెల్లించాల్సిన ధరలు సాలెగూడులా కనిపిస్తాయి. గిరాకీని మించిన సరఫరా ఉన్నప్పుడు మార్కెట్‌ ధరలు తగ్గటం, కొరత ఏర్పడటం వల్ల మరుసటి సంవత్సరం ధరలు పెరగటం, మళ్ళీ సరఫరా పెరగటంతో ఆ తర్వాతి సంవత్సరం ధరలు తగ్గటం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల ధరల్ని, సరఫరా, గిరాకీలను పరిశీలిస్తే అవి ఒక సాలె గూడులా కనిపిస్తాయి. ఫ్యాక్టరీల్లో తయారయ్యే వస్తువుల విషయంలో సరఫరా, గిరాకీల మధ్య ఉన్న వ్యత్యాసాలను తక్కువ సమయంలో సరిచేయవచ్చు. కాని వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో సరఫరాను పెంచాలంటే కొన్ని ఉత్పత్తుల విషయంలో నాలుగైదు నెలలు, మరికొన్ని ఉత్పత్తుల విషయంలో పది, పన్నెండు నెలల సమయం అవసరమౌతుంది. అందువల్లనే వ్యవసాయ ఉత్పత్తుల ధరల సరళి సాలెగూడుల్ని తలపిస్తాయి. ఒక వ్యవసాయ ఉత్పత్తిని పూర్తిగా దేశీయంగా వినియోగిస్తే సాలెగూడులు చిన్నవిగా కనిపిస్తాయి. గింజధాన్యాలు, పప్పుధాన్యాల విషయంలో ఈ సరళి కనిపిస్తుంది. కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో ఎగుమతులు, దిగుమతుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు దేశీయ మార్కెట్‌ ధరలపై అంతర్జాతీయ మార్కెట్‌ ధరల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాటి ధరల సరళిని గమనిస్తే పెద్ద సాలెగూడులా కనిపిస్తాయి. పత్తి, మిర్చి, పసుపు, వంటనూనెలు, సుగంధద్రవ్యాల విషయంలో ఎగుమతి, దిగుమతులు ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి కాబట్టి, వాటి ధరల సరళిలో సాలెగూడు ఆకారం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులు, అందులో ఎగుమతి, దిగుమతి ప్రభావం ఎక్కువ వున్న ఉత్పత్తుల విషయంలో ధరల్లో ఆటుపోట్లు ఎక్కువగా ఉండటం వల్ల వాటి ధరల సరళిలో సాలెగూడు ఆకారాన్ని స్పష్టంగా గమనించవచ్చు

వాణిజ్య పంటలపై రైతులకు మోజు ఉండటానికి కారణం లాభాపేక్షయే. ఒక పది శాతం రైతులకు మంచి దిగుబడులు వచ్చిన సీజనులో ధరలు అధికంగా లభిస్తాయి. ఒక నలభై శాతం రైతులకు అధిక దిగుబడులు వచ్చిన సీజనులో తక్కువ ధరలు లభిస్తాయి. మరో నలభై శాతం రైతులకు తక్కువ దిగుబడులు లభించిన సమయంలో ఎక్కువ ధరలు లభిస్తాయి. మిగిలిన 10 శాతం రైతులకు తక్కువ దిగుబడులు వచ్చిన సంవత్సరాల్లో తక్కువ ధరలు లభిస్తాయి. మొదటి పదిశాతం మంది లాభాలార్జిస్తే చివరి పది శాతం రైతులు నష్టాలపాలై, అప్పుల్లో కూరుకుపోతారు. 80 శాతం మంది రైతులు రెండు, మూడు రకాల్లో ఉండి, మధ్యస్తంగా ఉండి, కొద్ది లాభాల్లో గానీ, కొద్ది నష్టాల్లో గానీ ఉండిపోతారు. ఐదేళ్ళ పాటు ఒకే పంటను సాగు చేసిన రైతులు ఒక సంవత్సరంలో మంచి లాభాలు, ఒక సంవత్సరంలో భారీ నష్టాలు, మూడు సంవత్సరాల్లో ఖర్చులు మాత్రమే రాబట్టుకునే పరిస్థితి ఉంటుంది. రెండు మూడు వాణిజ్య పంటలను మార్చి మార్చి సాగు చేసే రైతులు రాబోయే సీజన్‌లో మార్కెట్‌ను అంచనా వేయగల శక్తిని బట్టి లాభనష్టాలు ఉంటాయి. 

గొర్రెదాటు వైఖరి

ఒక సంవత్సరం ఏయే వాణిజ్య పంటలకు మంచి ధరలు లభిస్తాయో తర్వాత సంవత్సరం చాలామంది రైతులు ఆ పంట సాగుని చేపట్టటం జరుగుతున్నది. విస్తీర్ణం పెరుగుతున్నట్లు అంచనా రాగానే మార్కెట్‌ ధరలను వ్యాపారులు తగ్గించేస్తారు. వాతావరణ పరిస్థితులు ఉత్పాదకతను ప్రభావితం చేస్తాయి. ధరల్ని ఉత్పత్తి అంచనాలు, ఎగుమతి దిగుమతి అవకాశాలు నిర్దేశిస్తాయి. వాతావరణాన్ని, ధరల్ని సరిగా అంచనా వేయలేని రైతులు ప్రస్తుత ధరలను బట్టి రాబోయే పంట కాలంలో వేయాల్సిన పంటలను ఎంచుకుంటారు. ఎక్కువమంది రైతులు ప్రస్తుతం ధరలు బాగున్న పంటలను సాగు చేయటానికి ఇష్టపడుతున్నారు. దానితో ఉత్పత్తి పెరగటం వల్ల తర్వాతి పంట కాలంలో ధరలు తగ్గటం సాధారణంగా జరుగుతుంది. తరచుగా వాణిజ్య పంటల రైతులు నష్టపోతున్నందువల్ల వాటికి కూడా కనీస మద్దతు ధరల్ని ప్రకటించాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఇటీవలి కాలంలో ఢిల్లీలో మహాపంచాయత్‌ నిర్వహించిన రైతు సంఘాలు అన్ని పంటలకు కనీస మద్దతు ధరల్ని నిర్ణయించాలని కోరారు. ప్రస్తుతం కనీస మద్దతు ధరల్ని ప్రకటిస్తున్న 21 పంటలకు చట్టబద్ధ గారెంటీలను కోరారు. రైతు సంఘాల కోర్కెలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించటం లేదు. రైతు ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేయటానికి ప్రయత్నించింది. రైతులు పంటలను మార్కెట్‌కు తెచ్చే సమయంలో వ్యాపారులు కుమ్మక్కై ధరల్ని తగ్గిస్తున్నందుకు కొంతమేరకు మార్కెట్‌లో ప్రభుత్వ సంస్థలు కొనుగోళ్ళు చేయటానికి నిధులు కేటాయించాల్సిన అవసరాన్ని రైతు నాయకులు నొక్కి చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై కూడా క్రియాశీలకంగా వ్యవహరించటం లేదు.

భవిష్యత్‌లో ధరలు

ప్రస్తుతం పసుపు ధరలు పదమూడేళ్ళ తర్వాత గరిష్ట స్థాయికి చేరితే, మిర్చి ధరలు గత సంవత్సరపు ధరలతో పోలిస్తే సగానికి పడిపోయాయి. పత్తి ధరలు కూడా గత సంవత్సరంతో పోలిస్తే తగ్గాయి. పత్తి, వరి, మొక్కజొన్నల ధరలు కనీస మద్దతు ధరల స్థాయికి ఇంచుమించుగా ఉన్నాయి. బియ్యం ఎగుమతులపై విధించిన ఆంక్షల వల్ల వరి ధాన్యం ధరలకు కళ్ళెం పడింది. కాని సన్నరకం వడ్ల ధరలు కొంత ఆకర్షణీయంగా ఉన్నాయి. మొక్కజొన్న ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉండటం వల్ల ధరలు కనీస మద్దతు ధరకు పైనే కదలాడుతున్నాయి. సరఫరా కన్నా గిరాకీ ఎక్కువగా ఉండటం వల్ల పసుపు ధరలు మరికొంత పెరగవచ్చనే అంచనాలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి. మిర్చి ధరల పతనం కూడా తాత్కాలికమే అని విశ్లేషకులు అంటున్నారు.2021-22లో భారతదేశంలో మిర్చిని 6.94 లక్షల హెక్టార్లలో సాగు చేసారని గణాంకాలు తెలుపుతున్నాయి. ఆ సంవత్సరం ఉత్పత్తిని 15.78 లక్షల టన్నులుగా అంచనా వేశారు. సగటు దిగుబడి హెక్టారుకి 2689 కిలోలుగా లెక్క కట్టారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏడు లక్షల టన్నులు, తెలంగాణలో 4.33 లక్షల టన్నులు, మధ్యప్రదేశ్‌లో 3.03 లక్షల టన్నులు, కర్నాటకలో 1.85 లక్షల టన్నులు, ఒడిస్సాలో 0.69 లక్షల టన్నుల మిర్చి ఉత్పత్తయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ఆ సంవత్సరం 5.57 లక్షల టన్నుల మిర్చి ఎగుమతుల ద్వారా రూ. 8581 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని దేశం ఆర్జించింది. 2022-23లో మిర్చి ఎగుమతులు 5.8 లక్షల టన్నులకు పెరిగాయి. 2023-24లో కూడా ఎగుమతి ఐదు లక్షల టన్నుల స్థాయి కన్నా తగ్గకపోవచ్చు. 2023 నవంబరులో కురిసిన అధిక వర్షాల వల్ల మధ్యప్రదేశ్‌లో మిర్చి పంట బాగా దెబ్బతిన్నట్లు వార్తలొచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో కూడా వర్షాల వల్ల కొన్ని ప్రాంతాల్లో మిర్చి పంట నష్టపోయింది. ఐనా కొన్ని ప్రాంతాల్లో దిగుబడులు బాగా ఉన్నందువల్ల, సరకు మార్కెట్లకు చేరటం వల్ల వ్యాపారులు ధరల్ని తగ్గించారు. రైతుల్ని కొన్నాళ్ళు సరుకుని నిలవపెట్టి, ఆలస్యంగా మార్కెట్‌కు తీసుకురమ్మని అధికారులు సలహా ఇస్తున్నారు. కాని అప్పుల్ని తీర్చాల్సిన అవసరం, నిలవపెట్టే సౌకర్యాలు, సామర్థ్యం లేకపోవటంతో రైతులు సరుకుని మార్కెట్‌కు తెస్తున్నారు. ఎగుమతి ఆర్డర్లు ఎక్కువగా లేకపోవటంతో వ్యాపారులు ఉత్సాహంగా కొనుగోళ్ళు చేయటం లేదు.

వాస్తవంగా మిర్చి, పత్తి పంటల విషయంలో సరఫరా పెరగలేదు. ఐతే వివిధ దేశాల్లో నెలకొని ఉన్న ఆర్థిక సమస్యల కారణంగా కొనుగోళ్ళు, దిగుమతి ఆర్డర్లు మందగించాయి. బట్టలకు, నూలుకి ఆర్డర్లు తగ్గినందువల్ల స్పిన్నింగ్‌ మిల్లులు పత్తి కొనుగోళ్లను నిలిపివేశాయి. నిల్వలను వాడుతూ తాజా కొనుగోళ్ళను తగ్గించటం వల్ల మార్కెట్‌ నిస్తేజంగా ఉంది. మిర్చి విషయంలోనూ కొనుగోళ్ళు మందగించడం వల్ల ధరలు తగ్గుతున్నాయి. ఎగుమతుల మార్కెట్‌లో ఉన్న అనిశ్చితి వల్ల వ్యాపారులు కొని, నిలవ పెట్టటానికి కూడా జంకుతున్నారు. కొద్దిమంది రైతులు ధైర్యం చేసి, శీతల గిడ్డంగులలో నిల్వ చేయటానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తం ఉత్పత్తిలో దాదాపు 30 శాతం ఎగుమతి జరిగే మిర్చి పంట విషయంలో ఎగుమతులు మందగించటం వల్ల నైరాశ్యం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తమ సంస్థల ద్వారా కొనుగోళ్ళు జరిపి, మార్కెట్‌ను నిలబెట్టే ప్రయత్నం చేయాలి. రైతులు, కౌలుదార్లు తక్కువ ధరలకు అమ్మి నష్టపోవలసి వస్తున్నది. పత్తి, మిర్చి వంటి పంటల్లో కూలీల వినియోగం ఎక్కువ. కూలి రేట్లు ఏటేటా పెరగటం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమౌతున్నది. ఒక క్వింటాలు మిర్చి ఉత్పత్తి వ్యయం పదివేల రూపాయలు దాటుతున్నది. ప్రస్తుతం లభిస్తున్న ధరల వల్ల సగంమంది రైతులు నష్టాల పాలవుతున్నారు. పసుపు ధరలు పెరుగుతున్నందువల్ల రాబోయే సంవత్సరం (2024-25)లో ఆ పంట విస్తీర్ణం బాగా పెరిగే అవకాశం ఉంది. కాని పత్తి, మిర్చిని పండించే రైతులు ఆ రెండు పంటలను మార్చి, మార్చి వేస్తుంటారు. ఈ రెండు పంటలకు ధరలు తగ్గటం వల్ల వాటి బదులు ఏ పంటలు వేయాలో తెలియని స్థితిలో మెట్ట ప్రాంత రైతులుంటారు. గత పదేళ్ళుగా పసుపు రైతులెదుర్కున్న పరిస్థితుల్ని ఈ సంవత్సరం మిర్చి, పత్తిని సాగు చేసే రైతులు, కౌలుదార్లు ఎదుర్కొంటున్నారు. వాతావరణ అనిశ్చితికి తోడు మార్కెట్‌ మాంద్యం కూడా ఎదురైతే రైతులు గట్టెక్కడం కష్టమే. 

డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్‌ కన్సల్టెంట్‌ ఇక్రిసాట్‌), ఫోన్‌: 83098 59517, 70328 11608

Read More

వ్యవసాయంలోనే తృప్తి

మనది వ్యవసాయక దేశం. ఒకప్పుడు 90 శాతానికి పైగా ప్రస్తుతం 60 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారు. గతంలో వ్యవసాయం చేయడము చాలా కష్టంగా ఉండడముతో పాటు వ్యవసాయంలో ఆర్థికంగా ఫలితాలు సక్రమంగా లేకపోవడము, ఉద్యోగ, వ్యాపార రంగాలలో ఉన్నవారు శారీరక శ్రమ తక్కువ చేస్తూ ఆర్థికంగా ఎదగడం లాంటి పరిణామాలు ప్రత్యక్షంగా చూసిన చాలామంది వ్యవసాయరంగాన్ని వదలి ఉద్యోగ, వ్యాపార రంగాలకి వలసలు పోవడం జరిగింది. కానీ కాలం గడిచేకొలది, ఆరోగ్యంపై అవగాహన పెరిగే కొలది ఆరోగ్యంగా ఉండాలంటే ఉద్యోగ, వ్యాపార రంగాల కంటే వ్యవసాయ రంగమే సరైనదారి అని నమ్మి ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇచ్చే కొంతమంది ఉద్యోగ, వ్యాపార రంగాల నుంచి వ్యవసాయ రంగంవైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా సేంద్రియ సాగు గురించి అవగాహన పెరిగిన తరువాత మనం ఆరోగ్యంగా ఉండాలంటే సేంద్రియ ఉత్పత్తులు తప్పనిసరిగా తినాలనే అవగాహన ప్రజలలో పెరగడము మొదలైన దగ్గరి నుంచి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టేవారి సంఖ్య ఏఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఒక రంగం అనేకాకుండ ఉద్యోగ రంగం, వ్యాపార రంగం, సేవా రంగం ఇలాంటి రంగాల నుంచే కాకుండా ఉన్నత చదువులు చదివే విద్యార్థుల కూడా తమ విద్య పూర్తి అయిన తరువాత వ్యవసాయ రంగంలో అడుగు బెడుతున్నారు. ఇలాంటి వారితో పాటు ఆర్థిక అవసరాల నిమిత్తం సొంత పొలం ఉన్నా కాని వ్యవసాయ రంగాన్ని వదలి వేరే రంగాలకు వెళ్ళిన వారు ఆర్థికంగా ఇబ్బందులు లేని స్థాయికి ఎదిగిన తరువాత తమ మూలాలను వెతుక్కుంటూ తిరిగి వ్యవసాయ రంగంలో ప్రవేశించారు. ఇంకా ప్రవేశిస్తూనే ఉంటారు. ఈ కోవకు చెందుతాడు బాపట్ల జిల్లా వేమూరు మండలం, జంపని గ్రామానికి చెందిన శ్రీనివాసరావు.

శ్రీనివాసరావుది వ్యవసాయ నేపథ్యం. అయినా కాని చదువు పూర్తి కాగానే అందరిలాగానే వ్యవసాయాన్ని వదిలి వేరే రంగాలకు వెళ్లడం జరిగింది. అందులో భాగంగా కొన్ని సంవత్సరాలు మలేషియాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం, కొంతకాలం బంధువులకు సంబంధించిన రైల్వే కాంట్రాక్టు పనులు చూసుకోవడం జరిగింది. ఎన్ని చేసినా కాని తృప్తి లేకుండాపోయింది. తాను ఏదో కోల్పోయిన భావం కలుగుతుంది. తనకు తృప్తి కావాలంటే తిరిగి వ్యవసాయ రంగంలో అడుగు పెట్టాల్సిందేనని గ్రహించి వ్యవసాయరంగంలో అడుగు పెట్టడం జరిగింది. తరువాత కుటుంబంలో జరిగిన కొన్ని పరిణామాల వలన తన సమయాన్ని మొత్తం పూర్తిగా వ్యవసాయంలో కేటాయించవలసి వచ్చి, సేంద్రియ పద్ధతులు పాటించాలని భావించి గత 6 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం 9 ఎకరాలలో వరితో పాటు ఒక ఎకరంలో నిమ్మ, ఒక ఎకరంలో ఐదు అంచెల విధానంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ సమీకృత వ్యవసాయంలో భాగంగా నాటుకోళ్ళను కూడా పెంచుతూ, నీటికుంటలో వర్షాకాలంలో చేపలు కూడా పెంపకం చేస్తున్నాడు.

నిమ్మ: ఒక ఎకరంలో నిమ్మతోట సాగులో ఉంది. దాని వయస్సు 15 సంవత్సరాలు. కాని గత 6 సంవత్సరాల నుంచి పూర్తి సేంద్రియ పద్ధతులు పాటిస్తూ నిమ్మ మొక్కలను సాగు చేస్తున్నాడు. నిమ్మ తోట సాగు అనుభవంలో కొత్తగా నిమ్మ తోట పెట్టేవారు 18þ18 లేదా 18þ15 అడుగుల దూరం పాటించి నిమ్మ మొక్కలు నాటుకుంటే అనుకూలంగా ఉంటుందని అంటున్నాడు. గుంతలలో బాగా మాగిన పశువుల ఎరువు, వేపపిండి, ఆముదం పిండి, జీవామృతం కలిపిన మిశ్రమాన్ని వేసి మొక్కలు నాటుకోవాలి. తమ పొలంలో నాటు నిమ్మ మరియు బాలాజి రకం నిమ్మ రెండు రకాలు ఉన్నాయి కాని ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు నాటు నిమ్మ రకం అనకూలంగా ఉంటుందని అంటున్నాడు. అవసరాన్నిబట్టి పైపాటుగా అప్పుడప్పుడు మాగిన పశువుల ఎరువు, వేపపిండి, ఆముదపు పిండి, వేరుశనగ పిండిల మిశ్రమాన్ని మరియు ద్రవజీవామృతాన్ని భూమికి అందిస్తుంటాడు. చీడపీడల నివారణకు మరియు మంచి దిగుబడికి గాను వేపనూనె, పుల్లటి మజ్జిగ, నీమాస్త్రం, పంచగవ్య, సప్తధాన్యాంకుర కషాయం, చౌహాన్‌ క్యూ పద్ధతిలో ఉన్న ం.క. ద్రావణం లాంటి వాటిని అవసరాన్ని బట్టి పిచికారి చేస్తుంటాడు. అన్ని అనుకూలంగా ఉంటే నిమ్మ మొక్కలు నాటిన తరువాత 3వ సంవత్సరం దిగుబడి మొదలయ్యి క్రమంగా దిగుబడి పెరుగుతూ చెట్టు బాగా ఎదిగిన తరువాత ఎకరం నుంచి 100 నుంచి 150 బస్తాల నిమ్మకాయల దిగుబడి పొందవచ్చు. మార్కెట్‌లో ఉన్న ధరలను బట్టి ఆదాయం వస్తుందని వివరించాడు. 

ఐదు అంచెల పద్ధతి: ఒక ఎకరం పొలాన్ని ఐదు అంచెల పద్ధతికి కేటాయించి 50 అడుగుల పొడవు మరియు వెడల్పును ఎంపిక చేసుకున్నాడు. ప్రస్తుతం మామిడి, కొబ్బరి, అరటి, మునగ, జామ లాంటి మొక్కలు నాటించాడు. మిగతా మొక్కలు మరియు వివిధ రకాల కూరగాయలు త్వరలో మొదలు పెట్టబోతున్నాడు. ఐదు అంచెల పద్ధతికి గాను అడుగు ఎత్తులో బెడ్‌లు చేసుకొని బెడ్‌లపై మొక్కలు నాటించాడు. నీటి వసతి కొరకు కాలువలు ఉన్నా కాని వివిధ రకాల మొక్కలకు నీటి అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయి కాబట్టి నీటిని కాలువ ద్వారా కాకుండా డ్రిప్పుద్వారా అందిస్తే అనుకూలంగా ఉంటుందని శ్రీనివాసరావు అంటున్నాడు.

నాటుకోళ్ళు: సేంద్రియ సాగులో ఆర్థికంగా ఫలితాలు రావాలంటే సమీకృత వ్యవసాయం సరైన దారి అని తెలుసుకున్న శ్రీనివాసరావు నాటుకోళ్ళ పెంపాకన్ని కూడా చేపట్టాడు. మొదట 50 కోళ్ళతో మొదలయితే సంవత్సరంలో 500 కోళ్ళు అయినాయి.  అందులో 100 కోళ్ళు అమ్మగా ప్రస్తుతం 400 కోళ్ళు ఉన్నాయి. ఈ కోళ్ళన్నీ కూడా ఐదు అంచెల పద్ధతి వేసిన పొలంలో తిరుగుతూ ఉంటాయి. అదనంగా ఆవుల పేడ మరియు కొంత దాణాని కూడా అందిస్తున్నాడు. సక్రమంగా చేసుకుంటే నాటుకోళ్ళు మంచి ఆదాయ వనరే… కానీ కోళ్ళకు వచ్చే వ్యాధులపై సరిగ్గా అవగాహన లేకపోవడం, పొలం మొత్తాన్ని ఒంటరిగా చూసుకోవలసి రావడము, బయట నుంచి వచ్చే వారి వలన కోళ్ళకు జబ్బులు వచ్చే అవకాశాలు ఉండడము లాంటి కారణాల వలన తాను సక్రమంగా కోళ్ళ పెంపకాన్ని చేయలేకపోతున్నానని అంటూ, ఒక వ్యక్తిని కోళ్ళ పెంపకానికి కేటాయించగలిగితే స్వయం ఉపాధిగా కోళ్ళ పెంపకం మంచి అవకాశం అని శ్రీనివాసరావు అంటున్నాడు.

వీటన్నింటితోపాటు ఎకరం పొలం అంటే 200 అడుగుల పొడవు మరియు వెడల్పుతో చెరువు తవ్వించాడు. ఆ చెరువు తవ్విన మట్టిన ఐదు అంచెల విధానంలో బెడ్‌లకు ఉపయోగించాడు. చెరువు కట్ట మీద కొబ్బరి మొక్కలు మధ్యలో ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలతో పాటు పైనాపిల్‌ మొక్కలు, వివిధ రకాల కూరగాయ మొక్కలు సాగు చేస్తున్నాడు.  వేసవి కాలంలో చెరువులో నీటిని పంటల సాగుకు వినియోగిస్తూ వర్షాకాలంలో చెరువులో బాగా నీరు ఉన్నప్పుడు కొన్ని చేపలను కూడా పెంపకం చేస్తుంటాడు. వీటన్నింటితో పాటు గట్ల మీద అవకాశం ఉన్న చోట కంది మొక్కలు నాటి వచ్చిన దిగుబడిని సొంతంగా ఉపయోగించుకోవడముతో పాటు మిగిలిన వాటిని బంధువులకు, తెలిసిన వారికి అమ్మి అదనపు ఆదాయం గడిస్తున్నాడు.

సేంద్రియ సాగుకు ముఖ్య వనరు అయినటువంటి దేశీయ జాతి ఆవులను నాలుగింటిని పోషిస్తూ వాటి వ్యర్థాలను పంటల సాగులో వినియోగిస్తున్నాడు. పాలను అమ్మకం చేయకుండా సొంతానికి ఉపయోగించుకోగా మిగిలిన పాలను పుల్లటి మజ్జిగ తయారు చేపించి పంటలకు పిచికారి చేస్తుంటాడు. మరిన్ని వివరాలు 73374 53266 కి ఫోను చేసి తెలుసుకోగలరు.

Read More