మన సంప్రదాయ వ్యవసాయ విధానమైన సమగ్ర వ్యవసాయ విధానంతో రైతులు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని ‘నాబార్డు’ చైర్మన్ చింతల గోవిందరాజులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతునేస్తం ఫౌండేషన్ సంయుక్తంగా తిరుపతిలో ఏప్రిల్ 8,9,10 తేదీల్లో ఇస్కాన్ మైదానంలో ఏర్పాటు చేసిన మూడు రోజుల ‘రాయలసీమ ఆర్గానిక్ మేళా’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
మార్కెటింగ్ సమస్య లేని తిరుపతి లాంటి కేంద్రాల్లో ఆర్గానిక్ విక్రయాలకు అవకాశం ఉందని ఆయన విక్రయదారులకు సూచించారు. సేంద్రియ వ్యవసాయానికి సహాయ సహకారాలు అందిస్తామని నాబార్డు చైర్మన్ డాక్టర్ చింతల గోవిందరాజులు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేసేందుకు టిటిడి గానీ, ప్రకృతి వ్యవసాయదారులు గానీ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పురాతన కాలంలో ప్రజలు ఆరోగ్యంగా, బలిష్టంగా ఉండడానికి ప్రధాన కారణం ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంటలను తినడమేనని వివరించారు. నేడు రసాయన ఎరువుల వాడకం రోజురోజుకూ పెరగడం వల్ల విషపూరిత ఆహార పదార్థాలు ఎక్కువగా లభిస్తున్నాయని, ఈ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందన్నారు. కల్తీ లేని ఆహార ఉత్పత్తులను అందించడం ద్వారానే ఆరోగ్య భారత్‌ను చూడగలమని పేర్కొన్నారు. నాబార్డు ద్వారా ప్రకృతి వ్యవసాయం చేసే వ్యవసాయదారులను తాము ప్రోత్సహిస్తామని తెలిపారు. 1982లో 4 వేల కోట్లతో ప్రారంభమైన నాబార్డ్ నేడు 7 లక్షల 50 వేల కోట్ల రూపాయలకు చేరుకుందని తెలిపారు.

రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ వై. వేంకటేశ్వరరావు మాట్లాడుతూ 2012 నుంచి సేంద్రియ వ్యవసాయ విధానాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రైతులు వినియోగదారుల్లో మార్పు కనిపిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం వ్యస్థాపకులు కుమారస్వామి మాట్లాడుతూ రసాయన వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు సేంద్రియ వ్యవసాయానికి వర్తింపజేస్తే ప్రకృతి వ్యవసాయం ఊపందుకుంటుందన్నారు.
ప్రధాని నుంచి సామాన్యుడి వరకు...
భారతీయ కిసాన్‌సంఘ్ జాతీయ సంఘటన కార్యదర్శి దినేష్ కులకర్ణి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ప్రధాని నుంచి సామాన్యుడి వరకు ఆరోగ్యం కోసం ప్రకృతి, గోఆధారి వ్యస్తాయంపై ఆధారపడడం మంచి పరిమాణం అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త నిర్వహణ కార్యదర్శి విజయ్ ఆదిత్య మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయ విధానాలను పాఠ్యాంశాలుగా చేర్చితే దేశ వ్యవసాయ విధానంలో మార్పు తేవచ్చని వివరించారు. ఆప్కాబ్ ఎండీ శ్రీనాథరెడ్డి ప్రసంగిస్తూ సేంద్రియ రైతులు రైతు ఉత్పత్తిదరాఉలు సంఘంగా ఏర్పడితే అనేక సౌకర్యాలు, అవసరమైన శిక్షణ కార్యక్రమాలకు సహకరిస్తామని ప్రకటించారు. నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మార్కెటింగ్ పెంపొందించేందుకు రూరల్ మార్టులను రాయితీలతో ప్రోత్సహిస్తామని తెలిపారు. గో-ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఉపాధ్యకక్షుడు గంగాధరమ్, ప్రధాన కార్యదర్శి భరత్‌వర్మ, 300 మందికి పైగా ప్రకృతి వ్యవసాయదారులు పాల్గొన్నారు.
