ఆయిల్‌పామ్‌ గెలల ధర టన్నుకు గరిష్టంగా రూ. 20 వేలు కల్పించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో కలిసి కేంద్ర వ్యవసాయ మంత్రిని త్వరలో కలవనున్నట్లు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తన మూడు రోజుల మలేసియా పర్యటనలో అక్కడి ఆయిల్‌పాం సాగు విధానాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. పొట్టిరకం, అధిక దిగుబడిని అందించే ఆయిల్‌పాం మొక్కలను తెలంగాణకు ఇవ్వాల్సిందిగా అక్కడి ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. అక్కడ నర్సరీల్లోనే నిర్దేశిత రకానికి చెందని (ఆఫ్‌ టైప్‌) మొక్కల గుర్తింపు, గ్యానోడెర్మా వ్యాధి నివారణ చర్యలు తీసుకుంటున్నారని, ఈ విధానాలను మన రాష్ట్రంలోనూ అమలు చేస్తామన్నారు.