ఆయిల్‌ పామ్‌ విస్తరణావకాశాలు మరియు ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఆయిల్‌ పామ్‌ ఉత్పాదకాలు మున్నగువాటి గురించి శాస్త్రీయ అధ్యయనానికి తెలంగాణా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌ రావు గారు, డైరెక్టర్‌, ఉద్యానశాఖ మరియు ఎండీ ఆయిల్‌ ఫెడ్‌ శ్రీమతి యాస్మిన్‌ బాషా గారు మరియు వారి బృందం మలేషియా పర్యటనలో భాగంగా ఈ రోజు మలేషియా ప్లాంటేషన్‌ మరియు కమోడిటీస్‌ మంత్రి వర్యులు శ్రీ జోహరి అబ్దుల్‌ ఘని గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా మన మంత్రివర్యులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వము ఆయిల్‌ పామ్‌ సాగుకోసం అందిస్తున్న ప్రోత్సహకాలు, ప్రస్తుత పరిస్థితి మరియు రానున్న రోజుల్లో ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ అభివృద్దికి గల అవకాశాలు వివరించి, ఆయిల్‌ పామ్‌ సాగులో అగ్రగామి దేశాలలో ఒకటిగా ఉన్న మలేషియా నుంచి సహకారం అందించగలరని కోరారు. మలేషియా మంత్రి వర్యులు మాట్లాడుతూ, 143 కోట్ల జనాభా గల దేశానికి ఆహారం అందించడం చాలా గొప్ప విషయమని, ప్రపంచ దేశాలు అన్నీ భారతదేశం ఆ దిశలో అవలంబిస్తున్న విధివిధానాలను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పామ్‌ఆయిల్‌ వృద్దికి తాము అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నామని, ఆ దిశలో త్వరలోనే వారి బృందం తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారని తెలియజేసారు. పర్యటనలో భాగంగా మంత్రివర్యులు MATRAOE చైర్మన్‌ డాటో సెరి రీజల్‌ మెరికన్‌ గారిని కలిసి మలేషియాతో వ్యవసాయపరంగా గల వ్యాపార అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ గారు ఇండియాతో వ్యాపారాభివృద్ధికి తమదేశం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది, వ్యాపార పరంగానే కాక ఇండియాతో తమకు సామాజికంగా, చారిత్రకంగా కూడా బంధము ఉన్నదని తెలియజేస్తూ, Broken Riceకు తమ దేశంలో అత్యంత డిమాండ్‌ ఉందని తెలియజేయగా, మన రాష్ట్రం నుండి Broken Rice సరఫరాకు గల అవకాశాలను పరిశీలించి త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. వెంటనే మంత్రివర్యులు HACA MD శ్రీ చంథ్రేఖర్‌ రెడ్డి గారిని టెలిఫోన్‌లో సంప్రదించి మన రాష్ట్రంలో Broken Rice ఎగుమతి చేయడానికి, దానికి సంబంధించిన Economicsను పరిశీలించి, మన వరి రైతులకు అదనపు ప్రయోజనం కలిగితే, వచ్చే యాసంగి కల్లా ఎగుమతి చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సాయంత్రం పర్యటనలో భాగంగా మలేషియా పామ్‌ ఆయిల్‌ బోర్డును సందర్శించి, పామ్‌ ఆయిల్‌ రంగంలో వాళ్ళ అనుభవాలను MPOB చైర్మన్‌ డా. అహ్మద్‌ పర్వేజ్‌ గులామ్‌ ఖాదీర్‌ గారు పర్యటన బృందంతో పంచుకున్నారు. MPOB ఆయిల్‌ పామ్‌ సాగులో ఒక నూతన ఒరవడిని సృష్టించిందని, అంతేగాక ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందుకు వచ్చే ప్రాంతాలలో పంట విస్తరణకు కావాల్సిన సాంకేతిక సహాయం అందిస్తుందని మంత్రివర్యులకు తెలియజేశారు.