ప్లాస్టిక్ వల్ల అరిష్టాలు అన్నీ ఇన్నీ కావు
ఆధునిక సంస్కృతిలో ప్లాస్టిక్ వినియోగం అత్యంత వేగంగా విస్తరిస్తూవుంది. భూమి, జలవనరులు, వృక్షజాలం, జంతుజాలాలతో పాటు మనుషుల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారిన ఈ విశృంఖల ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేయకపోతే రాబోయే కాలంలో మానవుని మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ సంచులు, ఒకసారి వాడి పారవేసే సీసాలు, గ్లాసులు మరియు ప్లాస్టిక్ షీట్స్, భోజనాల అనంతరం వాడి, భోజన వ్యర్థాలతో పాటు వదలివేసే ప్లాస్టిక్ పన్ను పుల్లలు, కప్పులు, ప్లాస్టిక్ చెంచాల వల్ల మూగజీవాలు పడే బాధను వర్ణించలేము. భోజనశాల, వంటశాలల వ్యర్థాలను ప్లాస్టిక్ సంచులలో నింపి వదిలి వేసినప్పుడు ఆ వ్యర్థాలతో పాటు తిన్న కుక్కలు, పిల్లులు, పశువుల పొట్ట, ప్రేగులలో ఉండలుగా చుట్టుకొని జీర్ణవ్యవస్థకు అడ్డంగా మారి అజీర్తిని, కడుపు ఉబ్బరాన్ని కలిగించి వాటికి తీవ్రమైన బాధను కలిగించి ప్రాణాలను హరిస్తున్నాయి. ఇటీవల ఒక పశువు శవ పరీక్ష జరిపినప్పుడు వాటి పొట్టలో 120 కిలోల ప్లాస్టిక్ ఉండలు చుట్టుకొని కనిపించింది.
ఇటీవల మన జాతీయ పోషకాహార సంస్థ వారు జరిపిన కొన్ని అధ్యయనాలలో ప్లాస్టిక్‌లో ఉండే బిస్పెనాల్-ఎ (బి.పి.ఏ) అనే రసాయనం మనుషులతో పాటు అన్ని జంతువులలో హార్మోన్ వ్యవస్థలపై తీవ్ర దుష్ప్రభావం చూపి, మగజాతిలో వీర్యకణాల ఉత్పత్తిని ఆడజాతిలో గర్భధారణ అవకాశాలను తీవ్రంగా కృంగదీస్తాయని ఎలుకలపై జరిపిన పరిశోధనలద్వారా నిరూపించుట జరిగింది. బి.పి.ఎ. వల్ల సంతతి యొక్క ఎదుగుదల, పాల ఉత్పత్తి మరియు ప్రత్యుత్పత్తి సామర్థ్యాలు కూడా క్షీణించగలవు.
డాల్ఫిన్స్, తిమింగలాలు, చేపలు, రొయ్యలు, తదితర జలచరాలు ఈ ప్లాస్టిక్ వల్ల అంతరిస్తున్నాయి. భూమి యొక్క పటిష్ఠత, తేమను పీల్చే శక్తి కూడా వందల సంవత్సరాల పాటు నేలలో నశించని ప్లాస్టిక్ వల్ల క్షీణిస్తూవుంది. కొండలవిూద విచక్షణా రహితంగా వదలివేస్తున్న ప్లాస్టిక్ సంచులు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లేట్స్ వల్ల నేల పటిష్ఠత తగ్గి కొండ చరియలు విరిగి పడటానికి కూడా కారణం అవుతున్నాయి. అనేక ప్రాంతాలలో ముఖ్యంగా పర్యాటకుల సందర్శనలు ఎక్కువగా ఉండే పర్వతాల నుండి భారీ వర్షాల కారణంగా విరిగి పడుతున్న కొండచరియల వల్ల జరుగుచున్న ప్రాణ నష్టాలకు, ఆస్థినష్టాలకు కూడా ప్లాస్టిక్ వల్ల పటుత్వం కోల్పోతున్న పర్వత నేలలే కారణంగా అనుమానించవచ్చు.
ఆహార, తదితర వ్యర్థాలను ప్లాస్టిక్ సంచులలో నింపి, మురుగు కాల్వలలో పారవేయుట వల్ల అవి కాల్వలలో మురుగు నీరు, వర్షపు నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారి చిన్న పాటి వర్షాలకే మన జనావాసాలు, రహదారులు జలమయమై తీవ్ర నష్టాలను కలిగిస్తున్నాయి.
ప్లాస్టిక్స్ తగలబడినప్పుడు విడుదలయ్యే అనేక విష వాయువులు, మనుషులు, జంతువులలో క్యాన్సర్స్‌ను కూడా కలిగించి ప్రాణాలను హరిస్తున్నాయి.

విందులలో భోజనాల బల్లల మీద పరచే ప్లాస్టిక్ షీట్లు, వడ్డనప్లేట్లు, గ్లాసులు, మొనదేలిన ప్లాస్టిక్ పుల్లలు, విరిగిన స్పూన్స్, ఫోర్కులను ఆహార వ్యర్థాలతో కలిపి విచక్షణారహితంగా బయట పారవేసిన్పుపడు వీటిని తిన్న పెంపుడు జంతువులతో పాటు వన్యప్రాణుల నోరు, జీర్ణాశయం, గుండె, ఊపిరితిత్తులు తదితర అవయవాలు తీవ్రంగా గాయాలపాలై సుదీర్ఘకాలం అవి బాధపడి మరణిస్తున్నాయనే వాస్తవాన్ని మనం గుర్తించాలి.
ఇప్పటికైనా మన ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో పాటు ప్రజలందరూ ప్లాస్టిక్స్ వల్ల జరిగే అనర్థాలను గుర్తించటమే కాక సమాజంలోని అన్ని వర్గాలలో అవగాహన పెంచే కృషి చేయాలి. దీనికి సంబంధించిన పోస్టర్లు, ప్రకటనలను ఫంక్షన్ హాల్స్, దేవాలయాలు, హోటల్సు, పార్కులు, పర్యాటక ప్రదేశాలలో ప్రస్ఫుటంగా ఏర్పాటు చేయాలి. ప్లాస్టిక్ సంచులు, షీట్సు, కప్పులు, ప్లేట్లు, గ్లాసులు తదితర సామాగ్రుల తయారీని నిషేధించి కట్టుదిట్టంగా అమలు చేయాలి.
డా. యం.వి.జి. అహోబలరావు, 93930 55611

