మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచ ఆహార సంస్థ నిర్ధేశించిన విధంగా ప్రతి మనిషికి సగటున రోజుకు 300 గ్రా. కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మనదేశంలో కేవలం 230 గ్రా. మాత్రమే లభ్యమవుతున్నాయి. కావున కూరగాయల ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఉంది. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం కూరగాయల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో సంవత్సరం పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా కూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలంలో సాగు చేస్తారు. రబీ మరియు వేసవితో పోలిస్తే ఖరీఫ్‌లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జూలై నెలలో ప్రారంభమయ్యే తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. కావున ఖరీఫ్ కూరగాయల సాగులో రైతు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పంట నష్టం నుంచి బయటపడటంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరకు కూరగాయలను అందించే అవకాశం ఉంది.
నేల: సారవంతమైన తేలికపాటి నేలలు లేదా బాగా నీరు ఇంకే బరువైన గరప నేలలు కూరగాయల సాగు చేపట్టడానికి అనుకూలంగా ఉంటాయి. బీడు భూములు, మురుగు నీరు పోయే సదుపాయం లేని భూములు కూరగాయల సాగుకు అనుకూలం కాదు.
పొలం తయారీ: పొలాన్ని మూడు, నాలుగు సార్లు బాగా దున్ని దుక్కిలో ఒక హెక్టారుకు 15-20 టన్నుల మాగిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. పొలంలో వరుసగా ఒకే పంట వేయకుండా పంట మార్పిడి చేయాలి.
నారుమళ్ళ తయారీ: కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి. టమాట, వంగ, పచ్చిమిర్చి పంటలకు నారు పోసేటప్పుడు ఎత్తు నారుమడులు తయారు చేసుకోవాలి.
నారుమళ్ళలో వచ్చే నారుకుళ్ళు తెగులు నివారణకు విత్తనశుద్ధి చేసుకుని విత్తనాలను పది సెం.మీ. ఎడంలో వరుసల్లో రెండు సెం.మీ. లోతులో విత్తిన తరువాత పశువుల ఎరువుగానీ, మట్టి లేదా ఇసుకతో గానీ కప్పాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసేయాలి. 4-6 వారాల వయస్సు కలిగిన, 8-10 సెం.మీ. ఎత్తు పెరిగిన మొక్కలను నాటాలి.
నారు నాటే విధానం: నారును సాయంత్రం సమయాల్లో నిర్ణీత దూరాల్లో నాటాలి. విత్తనాలైతే నిర్ణీత దూరంలో ఎకరానికి నిర్ణీత పరిమాణంలో నాటాలి. చిక్కుడు, బెండ, సొరకాయ వంటి పెద్దగింజలను కొంచెం లోతుగాను, ముల్లంగి వంటి చిన్న గింజలను కొంచెం పైపైన నాటాలి.
అధిక దిగుబడికి సూచనలు:
- నేలలో గల పోషక పదార్థాలను భూసార పరీక్ష ద్వారా నిర్ధారించుకొని పంటలకు కావాల్సిన పోషకాలను నిర్ణీత మోతాదులో అందించాలి.
- చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
- పంట కాలంలో నేలలో తగినంత తేమ లేని పక్షంలో దిగుబడి తగ్గుతుంది.
- బిందు, తుంపర్ల సేద్యంలో నీరు పెడితే తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు.
- సరైన పక్వథలో కాయలు కోయాలి.
- ఆకారం, పరిమాణం, రంగును అనుసరించి గ్రేడింగ్ చేయాలి. రవాణా చేసేటప్పుడు దెబ్బతినకుండా ప్లాస్టిక్ బుట్టలను వాడాలి.
విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు:
- వాతావరణ పరిస్థితులకు అనువుగా ఉండే రకాలను మాత్రమే ఎన్నుకోవాలి.
- విత్తనాల్లో ఆమోదిత సంస్థల నుంచి పూర్తి వివరాలతో కూడిన బిల్లులను తీసుకొని మాత్రమే కొనాలి.
- విత్తనాల్లో మొలక శాతం 70 శాతం కంటే ఎక్కువగా ఉండాలి.
- విత్తనశుద్ధి చేసిన విత్తనాలను మాత్రమే కొనాలి. లేదంటే రైతులే సొంతంగా ఇంటి దగ్గర విత్తనశుద్ధి చేసుకోవాలి.
- రోగనిరోధక శక్తి కలిగి, అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ విత్తనాలను వాడాలి.
- ఒక కిలో విత్తనానికి ట్రైకోడెర్మావిరిడి 4 గ్రా. చొప్పున విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి.
టి. తేజస్విని (పిహెచ్.డి), 7032883207, డా. టి. థాంసన్ (శాస్త్రవేత్త), 9494963291, డా. ఎమ్. రవీంద్రబాబు (సీనియర్ శాస్త్రవేత్త), 9849733741, డా. వైఎస్‌ఆర్ హార్టీకల్చరల్ యూనివర్సిటీ.
