• తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ దండ రాజిరెడ్డి

విద్యార్థులకు, నిపుణులకు ఉద్యాన రంగంలో అవకాశాలు ఉన్నాయని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ దండ రాజిరెడ్డి అన్నారు. భవిష్యత్తులో ఉద్యానరంగంపై ఆయన మాట్లాడుతూ… కోవిడ్‌ అనంతరం మానవ శరీర ఇమ్యూనిటీని పెంచేందుకు ఉద్యాన ఉత్పత్తులే కీలకమని, ఇటీవల వివిధ అధ్యయన సంస్థలు …. సైతం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే సరాసరిన రోజుకు 400 గ్రాములు పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఖనిజలవణాలు, విటమిన్‌లకు కూరగాయలు, పండ్లు పుష్కల వనరులని, రోజురోజుకూ పెరుగుతున్న ఉద్యాన పంటల విస్తీర్ణం నేపథ్యంలో ఉద్యాన విద్యార్థులకు పుష్కలమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఉద్యాన విద్య పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే టీజీపీఎస్సీ ద్వారా ఉద్యాన అధికారులుగా నియమితులవుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లఓ్యం ప్రకారం పామ్‌ ఆయిల్‌ తోటల విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో నర్సరీలు, పామాయిల్‌ తోటల నిర్వహణ, అలాగే పామాయిల్‌ పరిశ్రమలు వందలాది ఉద్యాన విద్యార్థులను నియమించుకోనున్నట్లు తెలిపారు.
అలాగే ఉద్యాన పంటల ఆధారిత అంకుర సంస్థలు, స్టార్ట్‌ అప్స్‌ భారీగా మార్కెట్లో ఉన్నాయని స్వయం ఉపాధికి సైతం ఈ స్టార్ట్‌ అప్‌లు దోహదం చేస్తున్నాయని అన్నారు. ”వీటి స్థాపనకు సైతం ఉద్యాన విద్యల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన విద్యార్థులు విజయవంతంగా ముందుకు వెళ్తున్నారు. విజయవంతమైన ఎంటర్‌ప్రైన్యూర్‌ కెరీర్‌ ప్రారంభించారని” వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రాజిరెడ్డి తెలిపారు.
సేంద్రీయ ఉద్యాన పంటల క్షేత్రాలకు కన్సల్టెన్సుగా, హోటల్స్‌, రిసార్ట్స్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగం, ఎయిర్‌పోర్ట్‌ సంస్థల్లో ల్యాండ్‌ స్కేప్‌ నిపుణులుగా, కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైనింగ్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌లలో ఉద్యాన విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రాజిరెడ్డి పేర్కొన్నారు.
అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యాన విశ్వవిద్యాలయం, కళాశాలలు, డిప్లమా కాలేజీలు, ఇతర కళాశాలలో శాస్త్రవేత్తలుగా, ప్రొఫెసర్లుగా అవకాశం సైతం ఉన్నాయి. విత్తన పరిశ్రమ, పురుగుమందుల, తెగుళ్ల మందుల పరిశ్రమలలో సైతం వీరికి అవకాశాలు మెరుగేనని డాక్టర్‌ రాజిరెడ్డి తెలిపారు.