ప్రతి ఒక్కరి జీవిత లక్ష్యం ఆనందంగా జీవితాన్ని గడపడమే. ఆరోగ్యం సక్రమంగా లేకుంటే ఆనందంగా జీవితాలను గడపలేము అనే విషయం అందరికి తెలిసిందే. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉన్నపుడే ఎలాంటి ఆనందమయినా పొందగలం. మన ఆరోగ్యం మనం తినే ఆహారం, పీల్చే గాలి, త్రాగే నీటిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఈ మూడింటిలో మనం తినే ఆహారం విషయం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మనం తినే ఆహారం చాలా వరకు రైతులు రసాయన వ్యవసాయం చేసి పండిస్తున్నదే కాబట్టి విష రసాయన అవశేషాలు ఉన్న ఆహారాలు తినడము వలన మన ఆరోగ్యాన్ని పాడు చేయడములో రసాయన అవశేషాలు ఉన్న ఆహారాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా చాలామంది రైతులు సేంద్రియ బాటపట్టి విష రసాయనాలు లేకుండా సేంద్రియ ఆహారాలను పండిస్తున్నారు. వినియోగదారులు కూడా వారికున్న అవకాశాలను బట్టి సేంద్రియ ఆహారాలను తినడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సేంద్రియ ఆహారానికి ఉన్న ప్రాముఖ్యత గమనించి తాము సేంద్రియ ఉత్పత్తులను తినడంతో పాటు సమాజానికి కూడా నాణ్యమయిన సేంద్రియ ఉత్పత్తులు అందించడంలో తన వంతు పాత్రను పోషిద్దాము అనే లక్ష్యంతో సేంద్రియ సాగులో అడుగు పెట్టారు సునంద.

సునందది వ్యవసాయ నేపథ్యం. అయినా కాని ఉన్నత చదువులు చదివి అధ్యాపక వృత్తిలో ప్రవేశించి కొనసాగుతున్న క్రమంలో ఆసీఫాబాదు జిల్లాకు చెందిన రవికుమార్‌తో వివాహం జరిగింది. రవికుమార్‌ సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అప్పట్లో వీరి కుటుంబం హైదరాబాదు నగరం ఆల్వాలు ప్రాంతంలో నివాసం ఉండేది. ఎం.ఎస్సీ. కెమిస్ట్రీ పూర్తి చేసిన సునంద పీహెచ్‌.డి. పూర్తి చేసి ఏదైనా కాలేజీలో లెక్చరర్‌గా మరలా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుండగా భర్త రవికుమార్‌ వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడటము జరిగింది. అంతేకాకుండా వీరిపిల్లలు కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో అనునిత్యం సతమతమవడం ప్రత్యక్షంగా అనుభవించారు. అదే సమయంలో రవికుమార్‌ ప్రాణ స్నేహితుడు క్యాన్సర్‌తో మరణించడం జరిగి భార్యా, పిల్లలను అనాథలను చేయడము సునంద మనసుని కలచి వేసింది. ఎంత డబ్బున్నా కాని ఆరోగ్యం సక్రమంగా లేకుంటే అంతా వృథా అని ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. ఈ పరిణామాలన్నీ అనారోగ్య సమస్యలకు కారణాలు వెతకడానికి ప్రేరేపించి కారణాలు తెలుసుకోగా, ప్రధానంగా ప్రస్తుతం తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలకు కారణాలు చాలావరకు తాము తినే ఆహారంలో ఉండే విషరసాయన అవశేషాలు అని గ్రహించి తాము విష రసాయన అవశేషాలు లేని ఆహారాన్ని తినాలని నిశ్చయించుకుని అటువైపు అడుగులు వేయడం జరిగి, మొదటగా తాము ఉపయోగించే నూనెను మార్పు చేసి మార్కెట్‌లో దొరికే రిఫైండ్‌ నూనెకు బదులుగా కోల్డ్‌ ప్రెస్డ్‌ నూనెను ఉపయోగించడం మొదలు పెట్టారు. చాలా వరకు అనారోగ్య సమస్యలు దూరం అవటం గమనించిన తరువాత తాము తినే ఆహారాలను చాలా వరకు సేంద్రియ పద్ధతులతో పండించినవే తినడం మొదలుపెట్టారు. ఈ మార్పుల వలన తమ కుటుంబసభ్యులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం ప్రత్యక్షంగా తెలుసుకోగలిగారు. అదే సమయంలో కరోనా మహమ్మారి వలన లాక్‌డౌన్‌ ప్రకటించడం జరిగి హైదరాబాదు నుంచి తమ కుటుంబాన్ని రవికుమార్‌ సొంత ఊరు అసీఫాబాదు జిల్లా విజయనగరంకి మార్చడం జరిగింది. 

వీరి కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలు మరియు కరోనా సమయంలో ప్రపంచం మొత్తం ఎదుర్కొన్న ఇబ్బందులు కక్షుణ్ణంగా అధ్యయనం చేసిన సునంద ఆదాయం కంటే ఆరోగ్యం చాలా చాలా ముఖ్యం అని తెలుసుకుని తాను వ్యవసాయ రంగంలో దిగి పూర్తి సేంద్రియ పద్ధతులలో వివిధ రకాల పంటలు పండించాలనుకుంటున్నానని భర్త రవికుమార్‌కు తెలియచేయగా రవికుమార్‌ ఆనందంగా సునంద నిర్ణయాన్ని స్వాగతించి తను మాత్రం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగ రంగంలో కొనసాగుతూ, తన ఖాళీ సమయాన్ని వ్యవసాయంలో సునందకు సహకారం అందిస్తూ సునందని పూర్తిగా వ్యవసాయరంగంలో దించడం జరిగింది.

తమ సొంత పొలం 8 ఎకరాలలో సేంద్రియ పద్ధతులతో వివిధ రకాల పంటల సాగు మొదలు పెట్టారు. సేంద్రియ పద్ధతులకు సంబంధించిన సమాచారం కొరకు వివిధ రకాల పుస్తకాలు చదవడం, సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన రైతులను కలవడం, రైతుల యొక్క వీడియోలను యూట్యూబ్‌లో చూడడము, సేంద్రియ పద్ధతులను ప్రచారం చేస్తున్న నిపుణులను కలసి వివరాలు తెలుసుకోవడం లాంటివి చేస్తూ సేంద్రియ సాగు మొదలు పెట్టి అనుభవం గడించే కొలది తాము పాటించే పద్ధతులలో మార్పులు చేసుకుంటూ వస్తూ సుమారు 30 రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తూ ఆరోగ్యకరమయిన దిగుబడులు సాధిస్తూ వస్తున్నారు. వచ్చిన దిగుబడిని హోల్‌సేల్‌గా అమ్మినట్లయితే సరైన ధర రావడం లేదు కనుక సేంద్రియ సాగులో లాభాలు ఆర్జించాలంటే పంట ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు నేరుగా వినియోగదారులకు అమ్మకం చేయడమే సరైన దారి అని నమ్మి తమ పంట ఉత్పత్తులకు విలువ జోడించి అనగా వడ్లను బియ్యం చేసి, కందులు, పెసలు, మినుములు లాంటివి పప్పులు చేసి… ఈ విధంగా తాము పండించే పంటలను సాధ్యమైనంతవరకు విలువ జోడించి నేరుగా వినియోగదారులకు అమ్మడం మొదలు పెట్టారు. తాము పాటించే సాగు పద్ధతులు మరియు తాము పండించే పంటల వివరాలు ఎక్కువమంది ప్రజలకు తెలియ చేయడానికి సామాజిక మాధ్యమాలను సరైన పద్ధతిలో వినియోగించుకుంటూ రోజురోజుకు వినియోగదారుల సంఖ్య పెంచుకుంటూ వస్తున్నారు.

తమ ఈ ప్రయాణంలో అనేకమంది వినియోగదారులు సమకూరడంతో పాటు అనేక మంది సేంద్రియ రైతులు కూడా తమ ఉత్పత్తులకు ఆశాజనకమయిన ధర లభించడానికి గాను సునందను కలవగా తాము పండించే ఉత్పత్తులతో పాటు తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా కలిపి వినియోగదారులకు అందించగలిగితే అటు వినియోగదారులకు ఇటు రైతులకు ఇద్దరికీ ఉపయోగకరంగా ఉంటుందని గ్రహించి తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా వినియోగదారులకు అమ్మకం చేయడం మొదలు పెట్టారు. 

వివిధ రకాల పంటల సాగులో వివిధ రకాల సేంద్రియ పద్ధతులను పాటిస్తూ ఆరోగ్యకరమయిన దిగుబడి సాధిస్తున్న క్రమంలో తోటి రైతులు కూడా సేంద్రియ పద్ధతుల గురించి సునందను సంప్రదించటము మొదలయ్యింది. తన సేంద్రియ సాగు అనుభవాలు ఎక్కువమందికి చేరాలంటే హైదరాబాదు సమీపంలో పంటల సాగు మొదలు పెడితే ఫలితాలు బాగా ఉంటాయని, దానికి తోడు హైదరాబాదు మార్కెట్‌ చాలా పెద్ద మార్కెట్‌ కాబట్టి తాము ఆర్థికంగా కూడా ఉద్యోగం చేస్తే వచ్చే ఆదాయాన్ని వ్యవసాయం చేస్తూ కూడా పొందవచ్చు అని తోటి యువతకు ప్రత్యేకించి మహిళలకు చూపించాలనే లక్ష్యంతో ఉన్న సునంద హైదరాబాదు శివారు ప్రాంతాలు తిరిగి శంషాబాదు సమీపంలోని పెదవేడు గ్రామంలో 25 ఎకరాలు వివిధ రకాల పండ్ల తోటను 2023 ఆగస్టు నెలలో కౌలుకు తీసుకుని తమ కుటుంబాన్ని ఆ పొలంలోకి మార్చారు. రవికుమార్‌ ఉద్యోగ బాధ్యతలు కూడా హైదరాబాదులోనే కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటాయని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం సునందగారు కౌలుకి తీసుకుని సాగు చేస్తున్న 25 ఎకరాల తోటలో మామిడి, సపోట, బత్తాయి మొదలగు వివిధ రకాల పండ్ల మొక్కలు దిగుబడిని ఇస్తున్నాయి. వచ్చిన దిగుబడిని నేరుగా వినియోగదారులకు, కొంత భాగం దిగుబడిని సేంద్రియ ఉత్పత్తులు అమ్మకం చేసే దుకాణాలకు అమ్మకం చేస్తూ వస్తున్నారు. తాము పండించే పంట దిగుబడులతో పాటు తోటి రైతులు పండించే నాణ్యమయిన సేంద్రియ ఉత్పత్తులను కూడా మార్కెటింగ్‌ చేస్తూ తోటి రైతులకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మరిన్ని వివరాలు 7799544705కు ఫోను చేసి తెలుసుకోగలరు. 

కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి

ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరి అనే విషయం అందరికి తెలిసిందే. మిగతా రంగాలతో పోల్చుకుంటే వ్యవసాయ రంగం, అదీను సేంద్రియ వ్యవసాయ రంగంలో కుంటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా ఉండాలి. సేంద్రియ సాగులో ఉపయోగించే వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు లాంటి వాటిని సొంతంగా తయారు చేసుకోవడంతో పాటు పంట ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు మార్కెటింగ్‌ లాంటి విషయాలలో కూడా కుటుంబ సభ్యుల సహకారం తప్పని సరి అవుతుంది. కాని ప్రస్తుత పరిస్థితులను పరిశీలించినట్లయితే చాలామంది మహిళలకు వ్యవసాయరంగం అంటే పెద్దగా ఇష్టం ఉండడం లేదు. కాబట్టే మగవారు వ్యవసాయం అంటే మక్కువ ఉన్నా కూడా తమ ఇంటి మహిళలకు వ్యవసాయరంగం అంటే ఇష్టం లేకపోవడం వలన వ్యవసాయరంగంలో అడుగు పెట్టలేక పోతున్నారు. కొంతమంది మగవారు అయితే తమ ఇంట్లోని మహిళల ఇష్టాలను పట్టించుకోకుండా వ్యవసాయరంగంలోకి అడుగు పెట్టి తమ మక్కువను తీర్చుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చాలావరకు ఇలా ఉంటే సునంద గారి మనస్తత్వం ఇందుకు భిన్నంగా తోటి మహిళలకు స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. ఉన్నత చదువులు చదివి కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి కుటుంబ బాధ్యతల నిమిత్తం ఉద్యోగం మానివేసి కుటుంబ బాధ్యతల నుంచి కొంచెం బయట పడ్డ తరువాత మరలా ఉద్యోగంలో చేరదామనే లక్ష్యంతో ముందుకు నడుస్తున్న సమయంలో ఆదాయం కంటే ఆరోగ్యం ముఖ్యం అని తెలుసుకుని తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కాపాడడం ఒక ఇల్లాలిగా తన బాధ్యత అని గుర్తించి ఉద్యోగ ప్రయత్నాలు మానివేసి, తమ కుటుంబాన్ని నగరాన్నుంచి గ్రామానికి మార్చి వ్యవసాయరంగం అదీను శారీరక శ్రమ ఎక్కువగా ఉండే సేంద్రియ వ్యవసాయ రంగంలోకి అడుగు పెట్టవలసి వచ్చింది. పరిస్థితులకు అనుకూలంగా తన లక్ష్యాన్ని మార్చుకుని ప్రత్యక్ష వ్యవసాయరంగంలోకి దిగిన సునందకు భర్త రవికుమార్‌ కృతజ్ఞతలు తెలియచేశారు. అదేవిధంగా తాను ఉద్యోగం చేస్తూ, అవసరమయితే పంటల సాగు కొరకు తన డబ్బును ఇవ్వడముతో పాటు పంటల సాగు, విలువ జోడింపు మరియు మార్కెటింగ్‌ లాంటి విషయాలలో తన వంతు పాత్ర పోషిస్తున్న భర్త రవికుమార్‌కు సునంద కృతజ్ఞతలు తెలియచేశారు. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ముందుకు సాగుతుంటే ఆరోగ్యకరమయిన, ఆనందకర జీవితం పెద్ద కష్టం కాదు అని సునంద, రవికుమార్‌లు నిరూపిస్తున్నారు.

(గమనిక: సునంద గారు సాగు చేసే పంటలు, పాటించే పద్ధతుల గురించి ‘రైతునేస్తం’ యూట్యూబ్‌ ఛానల్‌లో ఆవిడ మాటల్లోనే వినగలరు.)