ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరకోస్తా జిల్లాలైనటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చెరకు ఒక ప్రధాన వాణిజ్యపంట. ఈ జిల్లాల్లో వరి పంట తరువాత చెరకు పంటకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనికి తోడు ఉత్తరకోస్తా జిల్లాల్లో బెల్లం తయారీ ఒక కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెంది ఉంది. ముఖ్యంగా అనకాపల్లి బెల్లం మార్కెట్ నందు జరుగు వాణిజ్య లావాదేవీలు దేశంలోని బెల్లం వాణిజ్య లావాదేవీలకు ఒక గుర్తింపుగా నిలుచుచుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రాంతాలలో సుమారు 1.0 లక్షల హెక్టార్లలో చెరకు సాగు చేస్తుండగా దీనిలో సుమారుగా 40,000 హెక్టార్లకు పైగా ఒక్క శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాలో సాగు చేస్తున్నారు. దీనిని బట్టి ఈ మూడు జిల్లాలలో చెరకు పంట ప్రాధాన్యత తెలుస్తుంది. దీనికి తోడు ఈ మూడు జిల్లాల్లో 4 సహకార చక్కెర కర్మాగారాలు, 1 ప్రైవేటు చక్కెర కర్మాగారం స్థాపించబడి మొత్తంగా 5 చక్కెర పరిశ్రమలు ప్రస్తుతంఈ మూడు జిల్లాల్లో స్థాపించబడి మనుగడలో ఒక్క చోడవరం చక్కెర ఫ్యాక్టరీ ఆడుతుంది. రాష్ట్ర సరాసరి చెరకు దిగుబడి 76 నుండి 78 ట/హె.తో పొరుగు రాష్ట్రంతో 10వ స్థానంలో నిలిచింది.

సాధారణంగా ఉత్తర కోస్తా జిల్లాలయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో సాధారణ వర్షపాతం 1000 మి.లీ. నుండి 1100 మి.లీ. వరకు ఉంటుంది. కాని, అసమాన వర్షపాత విస్తరణ కారణంగా ఈ మూడు జిల్లాల్లో అతివృష్టి, అనావృష్టి సాధారణంగా ప్రతీ సంవత్సరం నమోదు కాబడుతుంది. దీనికి తోడు అక్టోబరు, నవంబరు నెలల్లో రబీ పంట కాలంలో సంభవించే తుఫాన్లు, అల్పపీడన ద్రోణుల కారణంగా రెండు నెలల కొకసారైన సాధారణ వర్షపాతం ఒక సారిగా ఒకటి రెండు రోజులలో నమోదు కాబడుతుంది. ఉదాహరణకు రాష్ట్రంలో గత 2010 సంవత్సరం నుండి అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఏర్పడిన లైలా, జల్, నేలం, ఫైలీన్, హెలెన్, లెహర్, హుద్‌హుద్, ఫోని, తితిలి, యాంఫన్ గులాబ్ తుఫాన్ల కారణంగా ఒకటి రెండు రోజులలోనే సుమారు 200 మి.మీ.కు మించి వర్షపాతం నమోదైంది. దీని కారణంగా పలు పంటలు నీటిముంపుకు గురవుతాయి. ముఖ్యంగా చెరకు ప్రధానమైనది.
ఉదాహరణకు తేది 12-10-2014 నాడు హుద్‌హుద్ తుఫాన్ కారణంగా అనకాపల్లిలో ఒక్కరోజులో 231.7 మి.మీ.

వర్షపాతం నమోదవగా, ఒక్క అచ్యుతాపురం గ్రామంలోనే సుమారు 500 మి.మీ. వర్షపాతం నమోదు కాబడినదంటే, తుఫాన్ల కారణంగా వర్షపాత తీవ్రత తేటతెల్లమవుతుంది. ఈ అధిక వర్షపాతం కారణంగా ప్రథమంగా పంట నష్టం తీవ్రత అధింకగా ఉంటూ వస్తుంది. ఈ హుద్‌హుద్ తుఫాన్ కారణంగా అధిక వర్షపాతానికి తోడు ఈదురు గాలులు సుమారు గంటకు 250 కి.మీ.కు పైబడి వీచడం వలన పంటలకు తోటలకు అధిక నష్టం వాటిల్లడం జరిగింది. ప్రధానంగా మామిడి, జీడిమామిడి, అరటి, ఆయిల్‌పామ్, కొబ్బరి తోటలతో పాటుగా వివిధ థలలో ఉన్న చెరకు తోటలకు నష్టం వాటిల్లుతుంది. ఈ నష్ట తీవ్రత వివిధ రూపాల్లో అనగా చెరకు తోటలు విరిగి పడిపోవడం, ఆకులు చీలిపోవడం, చెరకు తోటలు మొదళ్ళు వేళ్ళతో పెకిలించబడడం, వంగి పోవడం వంటివి జరుగుతుంటాయి. దీనికి తోడు చెరకు తోటల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలబడటం, ముంపుకు గురవడం సంభవిస్తుంది. దీనికితోడు చుట్టూ వరిమాగాణి పొలాలు, మధ్య చెరకు సాగు కారణంగా, చెరకు పంట నీటి ముంపుకు గురవుతుంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణంగా అక్టోబరు/నవంబరు నెలల్లో రబీ పంట కాలంలో తుఫాన్లు మరియు నీటిముంపు కారణంగా చెరకు పంట వివిధ థలలో నష్టానికి గురవుతుంది.
- జనవరి/ఫిబ్రవరి నెలల్లో నాటిన చెరకు తోటలు పక్వథకు దగ్గరగా, (270-360 రోజులు)
- మార్చి/ఏప్రిల్ నెలల తోటలు – చెరకు ఏపుగా పెరుగు థలోను (120-270 రోజులు)
- జూన్/జులై నెలల్లో వర్షాధారంగా నాటిన చెరకు తోటలు – పిలక థలోను (45-120 రోజులు) ఉంటాయి.
- నీటి ముంపు కారణంగా చెరకు తోటలకు కలిగే నష్టం
- చెరకు తోటలు విరిగిపోవడం వలన చచ్చు కర్రలు ఎక్కువగా వచ్చి దిగుబడి తగ్గుతుంది. చచ్చు కర్రలు ఎక్కువ దిగుబడి నష్టం చేస్తాయి. దీనికి తోడు కణుపులపై వేర్లు పుట్టి దిగుబడిని నిరోధిస్తాయి.
- చెరకు తోటలు పడిపోవడం వలన చక్కెర శాతం తద్వారా రికవరీలో తరుగుదల ఉంటుంది. నిలబడిన తోటలకన్నా పడిపోయిన తోటలలో 0.4 శాతం రికవరీ క్షీణత ఉన్నట్లుగా పరిశోధనా ఫలితాలు చెబుతున్నాయి.
- మురుగు నీరు/నీరు నిలబడిన చెరకు తోటల్లో పూతకు వచ్చిన లేదా కణుపుల వద్ద వేర్లు పుట్టినచో గడబరువు, రసక్షీణత ఎక్కువగా ఉంటుంది. పూత వచ్చిన తోటల్లో ఊల ఏర్పడి గడ బరువు గణనీయంగా పడిపోతుంది.
- ముంపు, నీరు నిలబడిన చెరకు తోటల్లో చీడపీడలు ముఖ్యంగా ఎర్రకుళ్ళు, వడలు తెగులు, దూదేకుల పురుగు, పిండినల్లి తాకిడి ఎక్కువ.
- పడిపోయిన తోటల్లో ఎలుకలు, ఉడుతల కారణంగా నష్టం ఎక్కువ.

- వివిధ థలలో ఉన్న చెరకు తోటలు తుఫాను కారణంగా అధిక వర్షపాతం, నీటిముంపు మరియు ఈదురు గాలులకు గురయినపుడు తీసుకోవలసిన యాజమాన్య చర్యలు
- ముందుగా చెరకు పంట పొలంలో / లోతట్టు ప్రాంతంలో నిలచియున్న మురుగు నీటిని యాంత్రిక కప్పీలు/మోటారు పంపులు, ఏతాలు లేదా గూడలు ద్వారా మురుగు నీటిని పంట పొలం నుండి తీసివేసి, పంట పొలంలో నీరు నిలువకుండా జాగ్రత్తపడాలి.
- పడిపోయిన చెరకు తోటలను కర్రపచ్చిపై అవకాశాన్ని బట్టి నిలగట్టాలి. అవసరమైతే వెదురు బొంగులు, సర్వీబాదు కర్రల సహాయంతో చెరకు దుబ్బులు/తోటలను నిలగట్టాలి.
- నేలను ఆరగట్టి వెంట్రుకవాసి పగుళ్ళు వచ్చిన తర్వాత ఒకటి రెండు తడులు మంచి నీటితో ఇచ్చినట్లయితే సరికొత్త వేరు వ్యవస్థ పుట్టి చెరకు తోటలు మెరుగుపడతాయి.
- చక్కెర కర్మాగారాలు నవంబరు, డిసెంబర్ నెలల్లో తెరచిన వెంటనే చెరకు కాల పరిమితి, పక్వతను బట్టి చెరకు కార్మాగారాలలో ముంపు తోటలను ముందుగా గానుగాడుకోవాలి.
- ముంపుకు గురైన తోటలలో చచ్చుకర్రలు ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది. కావున ఇటువంటి తోటల నుండి విత్తన ఎంపిక అంత శ్రేయస్కరం కాదు.
- జూన్/జులై నెలల వర్షాధార చెరకు తోటలు, విత్తనపు దవ్వ తోటల యాజమాన్యంలో అదనపు మోతాదు పోషకాలను అందిస్తూ, నిఘా ఉంచి సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
- చక్కెర కర్మాగారాల పరిధిలోని చెరకు తోటలకు నిఘా ఉంచి పక్వత నిర్ధారణ చేయించుకోవాలి.
- బెల్లం తయారీ చేయు రైతాంగం పక్వతను బట్టి అనివార్య కారణాల వలన ముందుగా బెల్లం తయారు చేయవలసి వస్తే బెల్లం పొడి లేదా పంచదారను వినియోగించి పాకం వచ్చేటట్లు చేసుకోవాలి. (తప్పని పరిస్థితుల్లో మాత్రమే)
నీటి ముంపు ప్రాంతం మరియు లోతట్టు ప్రాంతాలలో చెరకు సాగు చేయు రైతాంగం తీసుకోవలసిన చర్యలు
- చెరకు తోటలు నాటేముందు ప్రతీ 15 మీటర్లకు ఇవకతీత కాలువలు చెరకు సాగు చేయు రైతాంగం సామూహికంగా ఏర్పాటు చేసుకొని మురుగు నీటిని పంట పొలం నుండి తొలగించాలి.
- ఎర్రకుళ్ళు తెగులును తట్టుకునే కో6907, 85ఎ261, కోటి8201, 86ఎ46, కో7219, కోఎ7602, కో7602, 87ఎ298, 2003వి26, 93ఎ145, 2001ఎ63, 97ఎ85, 2000ఎ225, 2005ఎ128, 2009ఎ107, 2009ఎ2, 98ఎ163 వంటి చెరకు రకాలను సాగు చేసుకోవాలి.
- పూతకు రాని లేదా పూత తక్కువగా పూచే రకాలు నాటుకోవాలి. ఉదాహరణకు కో6907, 84ఎ 125, 85ఎ261, 86వి96, 88ఎ189, కో7706, 87ఎ397, కో7219, 86ఎ146, 87ఎ298, 2001ఎ63, 98ఎ163
- నీటి ముంపుకు గురయ్యే ప్రాంతంలో చెరకు తోటల నాట్లు జనవరి ఆఖరి లోగా నాటుకోవాలి. దీని కారణంగా ఎదిగిన తోటలు నీటి ముంపును కొంత వరకు తట్టుకుంటాయి.
- నీటి ముంపుకు గురయిన తోటలకు, మురుగు నీటిని తీసి, పొలాన్ని ఆరగట్టి పంట థను బట్టి అదనంగా ఎకరానికి 50 కిలోల యూరియాతోపాటు 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను వాడుకోవాలి.

- తోటల నుండి నీటిని తీయడానికి వీలుకాని పరిస్థితులలో పంటపై పంటథను బట్టి లీటరు నీటికి 25 గ్రాముల యూరియా, 25 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.
- వర్షాకాలానికి ముందుగా ఎదిగిన తోటలకు జడచుట్లు వేసి మట్టిని ఎగద్రోసి చెరకు తోటలను నిలగట్టాలి.
- చెరకు పొలం చుట్టూ ఉన్న గట్లకు వర్షాకాలానికి ముందుగా గట్టిగా వేసుకోవడం వలన ముంపు నీరు లేదా వరి పంట ప్రక్క పొలంలోని ఊట నీరు చెరకు తోటలోకి రాకుండా జాగ్రత్తపడాలి.
- మురుగు నీరు తీసిన తరువాత పంట పొలాన్ని ఆరగట్టి, వెంట్రుకవాసి నెర్రెలు, పగుళ్ళు వచ్చిన వెంటనే పంట థనుబట్టి మంచినీటితో ఒకటి రెండు దగ్గరదగ్గర తడులు ఇచ్చుకోవాలి. దీని కారణంగా క్రొత్త వేరు వ్యవస్థ వృద్ధి చెంది చెరకు తోటలు వేగంగా నిలదొక్కుకుంటాయి.
- చక్కెర కర్మాగారాలు తెరచిన వెంటనే ముంపుకు గురైన తోటలను ముందు కర్మాగారాలకు పక్వతను బట్టి గానుగాడుకోవాలి.
- వర్షాకాలం నీటి ముంపుకు గురైన తోటలను మొక్క తోట తరువాత కార్శి లేదా మోడెం చేయడం ఎంత ముందుగా వీలయితే అంతముందుగా (ఫిబ్రవరి 15 లోపుగా) చేసుకోవాలి.
ముంపుకు గురైన చెరకు తోటల్లో సకాలంలో చెరకు పంట యాజమాన్య చర్యలు చేపట్టి కొంతమేరకు ముంపు వలన చెరకు పంటకు వాటిల్లే నష్టాన్ని పూరించుకోవచ్చు.
డా|| సిహెచ్. ముకుందరావు (9908150600), డా|| పి. సాంబశివరావు, డా|| యం. చారుమతి, డా|| బి. చిత్కళాదేవి, డా|| యం. భరతలక్ష్మి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, అనకాపల్లి – 531 001, ఆం.ప్ర.
