రామచంద్రయ్య హర్యానా నుండి లారీలలో దిగుమతి చేసుకున్న ఎనిమిది గేదెలలో రెండు మార్గమధ్యంలోనే గర్భస్రావాలకు గురికాగా, మిగిలిన వాటి నుంచి క్షీణించిన పాల ఉత్పత్తి పునరుద్ధరించడానికి ఎంతో సమయం, శ్రమ, ఖర్చు చేయవలసి వచ్చింది. వెంకట్రామయ్య పాడి గేదె దూడ చనిపోయిందనే దిగులుతో పాలివ్వడం మాని వేసింది. యజమాని చనిపోయిన వారం రోజులకే దిగులుతో సుబ్బారావుగారి పెంపుడు కుక్క కూడా చనిపోయింది. అదేవిధంగా మావటి చనిపోయినందున ఒక దేవాలయ ఏనుగు కూడా మరణించింది. మరోచోట మావటి యొక్క క్రూరత్వాన్ని, నిర్దయ, నిర్లక్ష్యాలను భరించలేక ఒక ఏనుగు నగరమంతా బీభత్సం సృష్టించింది. ఇటువంటి ఎన్నో దురదృష్టకర సంఘటనలకు మూగజీవాలు భరించలేని మానసిక, శారీరక వత్తిళ్లే కారణమని మనమంతా తెలుసుకోవాలి. ఈ వత్తిళ్లకు కారణాలను సకాలంలో గుర్తించి వాటిని తొలగించటం లేదా ప్రత్యామ్నాయ ఉపశమన మార్గాలను పాటించకపోతే తీవ్రమైన కష్టనష్టాలను యజమానులు ఎదుర్కోవలసి ఉంటుంది.

శరీరం తాను సహజంగా భరించగలిగిన అసౌకర్యానికి, ఇబ్బందులకు, ఆకలి, దాహాలకు ప్రయాణాలకు, నడక, వాతావరణ – యాజమాన్య – వసతి నిర్వహణాలోపాల బాధలకు గురైనప్పుడు అవి మానసికంగా, భౌతికంగా, హార్మోన్ల పరంగా ఎదుర్కొనే మార్పుల వల్ల కలిగే ఎదురయ్యే సమస్యల సముదాయమే వత్తిడి! లైంగిక సుఖానికి దూరమైన జంతువులలో కూడా వత్తిడి లక్షణాలను ప్రదర్శించడం ఏనుగులు, ఆంబోతులలో ఎక్కువగా గమనించవచ్చు. సహజ లేదా కృత్రిమ సంపర్కాలకు ముందు ఆ తర్వాత ఎక్కువ నడక వల్ల జరిగే వత్తిడి వల్ల కూడా గర్భాలు నిలిచే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. దాదాపు అన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా జంతువులపై వత్తిడి పెరుగుతుంది.
వత్తిడి లక్షణాలు: 

ఉత్పత్తి క్షీణించడం, ఆయాసం, వగర్పు, మూలుగుట, గురక, భయం, వణుకుట, ఇతర పశువులు – మనుషుల నుండి దూరంగా వెళ్ళిపోవుట, సహజమైన విధేయత అణకువలు క్షీణించటం, దాడి చేయటం వంటి అనేక లక్షణాలను వత్తిళ్ళకు గురైన జంతువులు ప్రదర్శిస్తాయి. ప్రతికూలతలను తట్టుకోలేని పరిస్థితులలో మెదడులోని హైపోథలామస్‌, మరియు పిట్యుటరీ గ్రంథుల వల్ల ప్రేరణ పొందిన థైరాయిడ్‌ మరియు అడ్రినల్‌ గ్రంథులు విడుదల చేసే థైరాక్సిన్‌ మరియూ కార్టికోస్టెరాయిడ్స్‌ ప్రభావంతోనే వివిధ వత్తిడి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో పాలు కుడవటం మానని దూడల వల్ల కలిగే మాతృత్వ స్పందనలకు కారణమయ్యే ప్రొలాక్టిన్‌ అనే హార్మోనువల్ల కూడా ఎదకు రావటం ఆలస్యం కావచ్చు. గేదెలలో చెమట గ్రంథులు చాలా తక్కువగా ఉండటం, వాటి నల్లని చర్మం వాతావరణ వేడిని ఎక్కువగా గ్రహించటం వల్ల అవి త్వరగా వడగాడ్పులకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వాతావరణ తాపం పెరిగినప్పుడు శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచే హైపోథలామస్‌ గ్రంథి కూడా తన నియంత్రణ శక్తిని కోల్పోవుట వల్ల పశువు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉండవచ్చు. వత్తిడి సమయంలో శరీరంలో విడుదలయ్యే కొన్ని స్రావాలను గుర్తించుట ద్వారా వత్తిడి స్థాయిల్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం కూడా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది.
జంతువులలో వత్తిడిని తగ్గించే మార్గాలు

*    జంతువుల పట్ల ప్రేమ ఆదర-అభిమానాలను పెంచుకుని వాటి మానసిక, శారీరక ఆహార, లైంగిక అవసరాలను సకాలంలో తీర్చే ఏర్పాట్లు చేయాలి.

*    పోషకాహార అవసరాలను తీర్చే విధంగా నాణ్యమైన పుష్టివంతమైన శాస్త్రీయ మేతల్ని అందించాలి. ఎల్లప్పుడూ చల్లని త్రాగునీటిని సమృద్ధిగా అందుబాటులో ఉంచాలి.

*    సంతతి నుండి సహ జంతువుల నుండి లభించవలసిన సామాజిక జీవనానికి అంతరాయాలు కలిగించరాదు.

*    చల్లని, సుఖవంతమైన, శుభ్రమైన వసతిని వీలైతే చెట్ల నీడన, పచ్చని వాతావరణంలో ఏర్పాటు చేయాలి.

*    శబ్దాలు, రణగొణ ధ్వనుల చికాకుకు వీలైనంత మేరకు నివారించాలి.*    పొగలు, దుమ్ము, ధూళీలు, రసాయన కాలుష్యాలకు పశువుల్ని దూరంగా ఉంచాలి.

*    విశ్రాంతికి, నిద్రకు రోజుకు కనీసం 5-6 గంటల విరామంతోపాటు, అవసరమైన నడక ఈత వంటి వ్యాయామ సదుపాయం కూడా ఉండాలి. సహజ సంపర్కం లేదా కృత్రిమ గర్భధారణలకు ముందు – ఆ తర్వాత పశువును ప్రశాంతంగా ఉంచి, కనీసం 15-20 నిముషాలు విశ్రాంతినివ్వాలి.

 *    పశువుల ప్రవర్తనను, ఉత్పత్తి స్థాయిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, వత్తిడి లక్షణాలను, వ్యాధుల్ని గుర్తించి సకాలంలో చికిత్సను అందించాలి. ఇందుకు వీలైతే నిరంతర పరిశీలన-పర్యవేక్షణలకు సి.సి. కెమేరాల వంటి సాంకేతిక ఏర్పాట్లు చేసుకోగల్గితే మంచిది.

*    నిర్వాహకులను పదేపదే మార్చరాదు. వీలైతే ప్రత్యామ్నాయ నిర్వాహకుల్ని ముందు నుంచీ పశువులకు అలవాటు చేయగల్గితే మంచిది.

*    విభిన్న వాతావరణ పరిస్థితులు కలిగిన ప్రాంతాల మధ్య పశువుల్ని రవాణా చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆకస్మిక తీవ్ర వాతావరణ వత్తిళ్లకు పశువులు గురికాకుండా జాగ్రత్తవహించాలి. ఉదాహరణకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఉత్తరాది ప్రాంతాల నుండి పశువుల్ని వేసవి రోజులలో కంటే చలికాలంలో మన తెలుగు రాష్ట్రాలలోకి దిగుమతి చేసుకుంటే మంచిది. 

*    ప్రకృతిసిద్ధమైన లైంగిక అవసరాలను గుర్తించి, సకాలంలో లైంగిక సంపర్క అవసరాలను తీర్చే ఏర్పాట్లు చేయాలి.

*    తీవ్రమైన ఎండలు, గాడ్పులు, చలులు, ముసురు రోజులలో ఎంతో అవసరమైతే తప్ప టీకాలు వేయించటం, డివర్మింగ్‌ చేయించటం వంటి అదనపు వత్తిళ్ళు కలిగించే చర్యలు చేపట్టుట మంచిది కాదు.

*    వైద్య అవసరాలకు వాడే మందుల వినియోగం విషయంలో కూడా శాస్త్రీయతను తప్పక పాటించాలి. అవసరానికి మించి వినియోగించే మందులు కూడా రోగుల మీద వత్తిడిని పెంచుతాయని తెలుసుకోవాలి. ప్రతి వ్యాధి చికిత్సలో విశ్రాంతి కూడా ఒక కీలక అంశమేఅని కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా పశువుల పట్ల ప్రేమ, ఆదరణ, కరుణతో వ్యవహరించటం ద్వారా వాటిలో వత్తిళ్ల ప్రభావాన్ని చాలా వరకు నివారించవచ్చు.    
డా. ఎం.వి.జి. అహోబలరావు, 9393055611