భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వరద నీటిని రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో నిల్వ చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎత్తి, నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఆ నీటిని వీలైనంత వరకు ఎత్తిపోయాలని, రోజుకు ఒక టి.ఎం.సి తగ్గకుండా నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపాలని మంత్రి సూచించారు. మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి కూడా నీటిని ఎత్తిపోయాలని మంత్రి ఆదేశించారు.

3 Sep, 2024
