ఆహార ధాన్యాలన్నింటిలోనూ ప్రపంచంలో అత్యధికంగా ఉత్పత్తవుతున్న పంట మొక్కజొన్న. మధ్య అమెరికా, మెక్సికో ప్రాంతాల్లో మొక్కజొన్నను తొలిగా పండించినట్లు చారిత్రక ఆధారాలు దొరికాయి. మొట్టమొదట్లో ఈ పంటను రైతులు సాగు చేసినప్పుడు ఒక మొక్కజొన్న కండెకు ఎనిమిది గింజలే ఉన్నట్లు నమోదైంది. ఇప్పుడు కొన్ని సంకర రకాల్లో కండెకు 800కి పైగా గింజలుంటున్నాయి. అంతేకాక మొక్కల సాంద్రత పెరగటం వల్ల దిగుబడులు వంద రెట్లకు పైగా పెరిగాయి. పంటలన్నింటిలోనూ సంకర రకాలు తొలిగా అభివృద్ధి చేసింది మొక్కజొన్నలోనే. 2021 -22లో ప్రపంచంలో 1216.87 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తయినట్లు అమెరికా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 2022-23లో మొక్కజొన్న ఉత్పత్తి 4.52 శాతం తగ్గి, 1161.86 మిలియన్ టన్నులుగా ఉండవచ్చని అభిప్రాయపడ్డది. మొక్కజొన్న ఉత్పత్తిలో అమెరికాదే అగ్రస్థానం. చైనా, బ్రెజిల్, ఆర్జెంటీనా, యూరోపియన్ యూనియన్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాటి తర్వాత భారతదేశం ఆరవ స్థానంలో ఉన్నది. గత సంవత్సరం (2021-22)లో భారతదేశంలో 33.73 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తయినట్లు అంచనాలున్నాయి. గత సంవత్సరం రబీలో దేశంలో 20.22 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగవ్వగా 2022-23లో 22.98 లక్షల హెక్టార్లలో ఈ పంట సాగవుతున్నట్లు ప్రాధమిక అంచనాలు తెలుపుతున్నాయి. భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం దేశంలో 34.61 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి కావచ్చు. గత సంవత్సరం కన్నా 0.88 మిలియన్ టన్నుల మొక్కజొన్న అదనంగా పండవచ్చని భావిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం గోధుమ ఉత్పత్తి 4.4 మిలియన్ టన్నులు పెరగ వచ్చని ప్రభుత్వం అంచనాలు తెలుపుతున్నాయి. చలికాలంలో ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా ఉండటం వల్ల ఆలస్యంగా పక్వానికి వచ్చి, దిగుబడులు పెరుగుతాయని భావిస్తున్నారు. వరి ఉత్పత్తిలో 0.3 మిలియన్ టన్నులు, మొక్కజొన్నలో 0.9 మిలియన్ టన్నులు, ఇతర ముతక ధాన్యాల్లో 0.7 మిలియన్ టన్నులు, అపరాల్లో 0.5 మిలియన్ టన్నులు అదనంగా ఉత్పత్తవుతాయని ప్రభుత్వం అంచనాలు తేటతెల్లం చేస్తున్నాయి. మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 323.55 మిలియన్ టన్నులుండవచ్చనే ఆశాభావంతో ప్రభుత్వం ఉన్నది. గత సంవత్సరం కన్నా 7.94 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు అధికంగా ఉత్పత్తవవచ్చనే అంచనా ఆశాజనకంగా ఉంది. ప్రపంచ జనాభాలో ప్రథమ స్థానం సంపాదించిన భారత్‌లో ఆహార కొరత ఉండకపోవచ్చని భావించవచ్చు. కానీ ఇప్పటికీ తలసరి ధాన్య లభ్యత భారత్‌లో తక్కువగానే ఉంది. ఆహార భద్రత విషయంలో దేశం ఇప్పటికీ కడగొట్టు దేశాల జాబితాలోనే ఉన్నది.

బహుళ వినియోగాలు
గత 60 సంవత్సరాల్లో ప్రపంచంలో మొక్కజొన్న సాగు రెట్టింపయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా మొక్కజొన్న సాగు 105 మిలియన్ హెక్టార్ల నుండి 198 మిలియన్ హెక్టార్లకు పెరిగింది. ఇదే కాలంలో ఉత్పత్తి సుమారు ఆరు రెట్లు పెరిగింది. 1960లో 200 మిలియన్ టన్నులుగా ఉన్న ఉత్పత్తి ఇప్పుడు 1200 మిలియన్ టన్నులకు చేరింది. ఉత్పాదకత 1960లో హెక్టారుకు 2 టన్నుల దిగుబడి ఉండగా 2020 నాటికి దాదాపు 6 టన్నులకు పెరిగింది. విస్తీర్ణం రెట్టింపవ్వగా, దిగుబడి మూడు రెట్లు పెరగటం వల్ల, ఉత్పత్తి ఆరు రెట్లు పెరగటం సాధ్యపడింది. భారత దేశంలో 1950-51 సంవత్సరంలో 1.73 మిలియన్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తయింది. అప్పుడు మొక్కజొన్న సాగు కింద 3.16 మిలియన్ హెక్టార్లు మాత్రమే. 2020-21లో మొక్కజొన్న సాగు 9.9 మిలియన్ హెక్టార్లుగా నమోదైంది. ఖరీఫ్‌లో 7.7 మిలియన్ల హెక్టార్లలోనూ, రబీలో 2.2 మిలియన్ హెక్టార్లలోనూ ఈ పంట సాగవుతున్నది. గత 70 సంవత్సరాల్లో మొక్కజొన్న ఉత్పత్తి దేశంలో 20 రెట్లు పెరిగింది. విస్తీర్ణం 3.13 రెట్లు పెరగ్గా, దిగుబడి 6.4 రెట్లు పెరగటం వల్ల మొక్కజొన్న ఉత్పత్తిలో విప్లవాత్మక పెరుగుదల సాధ్యమైంది. సగటు దిగుబడి హెక్టారుకి 3.5 టన్నులకు చేరింది. ఖరీఫ్‌లో 22 మిలియన్ టన్నులు, రబీలో 12.6 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతున్నది. సగటు దిగుబడి ఖరీఫ్‌లో 2.87 టన్నులు మాత్రమే ఉండగా, రబీలో రెట్టింపు దిగుబడి (5.7 టన్నులు) లభిస్తున్నది. దేశంలో రబీ దిగుబడి ప్రపంచ సగటు దిగుబడికి సమీపంగా ఉన్నది. ఖరీఫ్ పంటలో దాదాపు 15 శాతానికి మాత్రమే సాగు నీటి వసతి ఉంది. రబీలో దాదాపు మొత్తం విస్తీర్ణానికి నీటి సదుపాయం లభిస్తున్నది. దిగుబడిలో తేడాకి ఇదే ముఖ్య కారణం కావచ్చు. మొక్కజొన్న నుండి 200కి పైగా ఉప ఉత్పత్తులు తయారు చేయవచ్చు. 40 ఉత్పత్తులైతే బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. అమెరికాలో ఉత్పత్తవుతున్న మొక్కజొన్నలో 45 శాతం ఇథనాల్ తయారీకి వాడుతున్నారు. యూరోప్‌లో పారిశ్రామిక వినియోగం ఎక్కువ. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో ఎక్కువగా ఆహారానికే దీనిని వినియోగిస్తున్నారు. చైనాలో మొక్కజొన్న ఉత్పత్తిలో 60 శాతం పశువుల దాణాకు వాడుతుండగా, భారత్‌లో ఉత్పత్తవుతున్న మొక్కజొన్నల్లో సగభాగం కోళ్ళమేతకు వాడుతున్నారు. మొక్కజొన్నను ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా, యుక్రెయిన్, ఆర్జెంటీనా, బ్రెజిల్, రష్యాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. యుక్రెయిన్, రష్యాలు ఒక సంవత్సరానికి పైగా యుద్ధంలో నిమగ్నమై ఉండటంతో, వాటి ఎగుమతులు దెబ్బతిన్నాయి. ప్రపచ మార్కెట్లో సరఫరా తగ్గటంతో ధరలు పెరిగాయి. ఈ సంవత్సరం ప్రపంచ మొక్కజొన్న ఉత్పత్తి కొంత తగ్గవచ్చనే అనుమానంతో ధరలు ఎక్కువగానే ఉంటున్నాయి. గత సంవత్సరం భారతదేశం కూడా 1.7 మిలియన్ టన్నుల మొక్కజొన్నను ఎగుమతి చేసింది. అది ఈ సంవత్సరం మరికొంత పెరిగే అవకాశం కనిపిస్తున్నది.
తెలుగు రాష్ట్రాల్లో సాగు, దిగుబడులు:
దేశంలో అత్యధికంగా మొక్కజొన్న సాగు అయ్యే రాష్ట్రాలు మధ్యప్రదేశ్, కర్నాటకలు. ఈ రెండు రాష్ట్రాలు దేశంలో మొక్కజొన్న సాగయ్యే విస్తీర్ణంలో చెరి 15 శాతం వాటా కలిగి ఉన్నాయి. మహారాష్ట్రకు 10 శాతం, రాజస్థాన్‌కు 9 శాతం, ఉత్తరప్రదేశ్‌కు 8 శాతం వాటాలతో ముఖ్య రాష్ట్రాలుగా ఉన్నాయి. అయితే ఉత్పత్తిలో కర్నాటక, మధ్యప్రదేశ్‌ల తర్వాత బీహార్ మూడవ స్థానంలో ఉన్నది. ఉత్పాదకతలో మాత్రం ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. బీహార్‌లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ రబీ మొక్కజొన్న వాటా ఎక్కువగా ఉంది. తెలంగాణాలో మొక్కజొన్న సాగు 6.63 లక్షల హెక్టార్లలో జరుగుతున్నది. 2540 కిలోల హెక్టారు సగటు దిగుబడితో 16 లక్షల టన్నుల మొక్కజొన్న ఉత్పత్తవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న సాగు 3.01 లక్షల హెక్టార్లకే పరిమితం. తెలంగాణాలో సాగవుతున్న మొక్కజొన్న విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌లో సాగు విస్తీర్ణం సగం కన్నా తక్కువగా ఉంది. అయితే సగటు దిగుబడి 7055 కిలోలుగా ఉండటంతో దిగుబడి 21.21 లక్షల టన్నులుగా ఉంది. రబీలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న గుంటూరు జిల్లాలో హెక్టారుకి 10,455 కిలోలు, పశ్చిమ గోదావరిలో హెక్టారుకి 9,108 కిలోల దిగుబడి నమోదవుతున్నది. కర్నూలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఖరీఫ్ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల సగటు దిగుబడులు తక్కువగా ఉన్నాయి. తెలంగాణాలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సాంప్రదాయకంగా మొక్కజొన్నని పండిస్తారు. దక్షిణ తెలంగాణా జిల్లాలైన అవిభక్త రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో గతంలో జొన్న, సజ్జ, రాగి వంటి పంటలు సాగయ్యేవి. కానీ క్రమేపీ మొక్కజొన్న వాటి స్థానంలో ఈ జిల్లాలకు కూడా పాకింది. ఇక రబీలో అయితే నీటి వసతి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం, మహబూబాబాద్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో రబీ మొక్కజొన్న సాగువుతున్నది. ఈ జిల్లాల్లో ఎక్కువగా సాగయినా, దాదాపు అన్ని జిల్లాల్లోనూ రబీ మొక్కజొన్న వ్యాపించింది.
ఉత్పత్తి వ్యయం – ఆదాయం:
ఖరీఫ్ మొక్కజొన్న సాగుకి హెక్టారుకి రూ. 40 నుండి 50 వేల వరకు ఖర్చవుతున్నది. రబీ మొక్కజొన్న సాగుకి రూ. 60 నుండి 80 వేల వరకు ఖర్చవుతున్నది. ఖరీఫ్‌లో సగటున 25 క్వింటాళ్ళు, రబీలో సగటున 35 నుండి 50 క్వింటాళ్ళ వరకు దిగుబడులు లభిస్తున్నాయి. ఒక క్వింటాలు ఉత్పత్తి వ్యయం ఖరీఫ్‌లో రూ. 1500 నుండి 1800, రబీలో రూ. 1600 నుండి 2000 వరకు వస్తున్నది. ఈ సంవత్సరం మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాలుకి రూ. 1962గా ప్రకటించారు. మార్కెట్ ధరలు కనిష్టంగా రూ. 1500, గరిష్టంగా రూ. 2700 నాణ్యతను బట్టి లభిస్తున్నాయి. సగటు ధర రూ. 2000గా చాలా మార్కెట్లలో నమోదవుతున్నది. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్‌లో వాతావరణ ప్రతికూలతలనెదుర్కొంటున్న రైతులు 20 శాతం వరకు నష్టపోతున్నారు. రబీలో దిగుబడి నిలకడగా ఉంటున్నది కాబట్టి 90 శాతం రైతులు లాభిస్తున్నారు. అయితే లాభశాతం మాత్రం 10 నుండి 20 శాతం కన్నా మించటం లేదు. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామ వంటి చిరుధాన్యాలకు సాపేక్షికంగా ఎక్కువ ధర లభిస్తున్నది. వాటికి ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా మొక్కజొన్నతో పోలిస్తే ఎక్కువే. అయినా రైతులు వాటి సాగువైపు మళ్ళకపోవటానికి కారణం మార్కెటింగ్‌లో ఎదుర్కుంటున్న సమస్యలే. వాటికి కనీస మద్దతు ధర ఎక్కువగా ఉన్నా ప్రభుత్వాలు సేకరణ మద్దతు నందిస్తాయనే నమ్మకం రైతుల్లో లేదు. ప్రపంచ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా బడ్జెట్‌లో ‘సిరిధాన్యాల’కు ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రకటించారు. మార్కెట్ ధరలు కూడా ఆకర్షణీయంగానే ఉన్నా వాటిని పెద్ద ఎత్తున సాగు చేయటానికి రైతులు ధైర్యం చేయటం లేదు. జొన్న, సజ్జ, రాగి పంటలకు కనీస మద్దతు ధరలు మొక్కజొన్న కన్నా ఎక్కువగానే ఉన్నాయి. వాటితో పాటు కొర్ర, సామ, ఊద, అండుకొర్ర, వరిగ, ఆరిక వంటి సిరిధాన్యాలకు కూడా కనీస మద్దతు ధరల్ని ప్రకటించి, అవసరమైతే వాటిని కొనుగోలు చేస్తామనే హామీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వాటి ఉత్పత్తి పెరిగితే ధరలు నిలుస్తాయనే నమ్మకం లేక రైతులు వాటి సాగుని చేపట్టటం లేదు. ఎందుకంటే మద్దత ధర ప్రకటించిన పంటల విషయంలో కూడా ధరలు తగ్గినప్పుడు కేంద్రం సేకరణ మద్దతు నందించటం లేదు. అలాంటప్పుడు కొత్త పంటలకు, జొన్న, సజ్జ, రాగి వంటి పంటలకు సేకరణ మద్దతు నందిస్తారనే నమ్మకం లేదు. అందుకే వర్షపాతం తగ్గినప్పుడు మొక్కజొన్న కన్నా వర్షాభావాన్ని తట్టుకోగలిగిన జొన్న, సజ్జ, రాగి, వరిగ, కొర్ర, అండుకొర్ర, సామ, ఊద, అరిక వంటి పంటలు రైతుల అభిమానానికి నోచుకోవటం లేదు. మార్కెట్‌లో గిరాకీ ఉన్న మొక్కజొన్న సాగునే ఇష్టపడుతున్నారు.
కోళ్ళ పరిశ్రమతో లింకు:
మొక్కజొన్నలను ఎక్కువగా కోళ్ళ పరిశ్రమలో దాణాగా వాడుతున్నారు. కోళ్ళ దాణాకు మొక్కజొన్నలు, సోయా చెక్క ముఖ్యమైన ముడి పదార్థాలు. మొక్కజొన్న ధరలు కనీస మద్ధతు ధర కన్నా తక్కువకు పడిపోయినప్పుడు కోళ్ళ పరిశ్రమ రైతులు లాభిస్తారు. కాని సోయాచెక్క ధరలు పెరిగినప్పుడు వారు దాణాకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకనుగుణంగా గ్రుడ్లు, మాంసం ధరలు పెరగకుంటే వారు నష్టాల పాలవుతారు. ప్రస్తుతం వేసవి ప్రభావం వల్ల గ్రుడ్లకు గిరాకీ తగ్గి ధరలు తగ్గాయి. ఒక్కో కోడి గ్రుడ్డు ఉత్పత్తిలో ఒక రూపాయి నష్టపోతున్నామని కోళ్ళ రైతులు వాపోతున్నారు. ఇలా మొక్కజొన్న ధర-కోడిగ్రుడ్ల ధర మధ్య వైరుధ్యం నెలకొని ఉన్నది. కోళ్ళ మేతతో పాటు మొక్కజొన్నను పశువుల దాణాకు కూడా వాడుతున్నారు. అంతేకాక ‘స్టార్చ్’ తయారీకి కూడా మొక్కజొన్నను వాడుతున్నారు. స్టార్చ్‌ని మందుల పరిశ్రమలోనూ, కాగితం తయారీలోనూ, జౌళి పరిశ్రమలోనూ విరివిగా వాడతారు. ప్రపంచంలో తలసరి స్టార్చ్ వినియోగం 6 కిలోలుంటే భారత్‌లో అది 1.5 కిలోలు మాత్రంగా ఉంది. అయితే మొక్కజొన్న ఆధారిత స్టార్చ్ యూనిట్లు కూడా బియ్యం నూకలు, దారి మళ్ళుతున్న రేషన్ బియ్యం చౌకగా దొరుకుతుండటంతో వాటిని వాడుతున్నారు. ఇవికాక మొక్కజొన్న పిండిని అనేక వంటకాల్లో, స్నాక్స్ తయారీకి కూడా వాడుతున్నారు. కార్న్‌ఫ్లేక్స్‌ను పాలతో కలిపి ఫలహారంగా వాడుతున్నారు. ఇంకా ఎన్నో ఉపఉత్పాదనలను తయారు చేసే అవకాశాలను ఆహార శుద్ధి పరిశ్రమ పరిశీలిస్తున్నది. సాపేక్షికంగా తక్కువ చీడపీడలతో, అధిక దిగగుబడినిచ్చే సత్తా కలిగిన మొక్కజొన్న సాగుపై రైతుల ఆసక్తి పెరుగుతూనే ఉంది. వివిధ అవసరాలకు 40 మిలియన్ టన్నుల మొక్కజొన్న అవసరమని, పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 36 మిలియన్ టన్నులుగా ఉన్న ప్రస్తుత ఉత్పత్తి మరింత పెరిగి రైతులకు, దేశానికి మేలు కలిగే అవకాశం ఉంది.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త,
(రిటైర్డ్ & కన్సల్టెంట్ ఇక్రిసాట్), ఫోన్: 83098 59517, 70328 11608

