పుదీనాలో జపనీస్ పుదీనా, స్పియర్ పుదీనా, పిప్పర్మెంట్ పుదీనా, బర్గామెట్ అనే వాటిలో భారతదేశంలో జపనీస్ పుదీనాకు గిరాకీ ఉంది. దీని తైలాన్ని సుగంధ పరిమళాలు, పాన్మసాలాల్లో, దగ్గు, జలుబు, నొప్పులను తగ్గించే ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. అంతేగాక టూత్‌పేస్టులు, మౌత్‌వాష్‌లు, చూయింగ్‌గమ్ మొదలగు వాటిలో పుదీనాను వాడుతున్నారు.
రకాలు: శివాలిక్, కోసి, హిమాలయ, సక్షమ్, కుషాల్ అను రకాలు జపాన్ పుదీనాలో ముఖ్యమైనవి. శివాలిక్, కోసి, హిమాలయ రకాలు ఆకుపచ్చ, తుప్పు, తెగుళ్ళను తట్టుకోలేవు. అందువల్ల ఇప్పుడు అవి ఎక్కువగా సాగు చేయడం లేదు.
సక్షమ్: పిలకలు నాటడం ద్వారా ఈ రకం నుంచి హెక్టారుకు 80 శాతానికి పైగా మెంథాల్ కలిగిన 225-250 కిలోల తైలాన్ని పొందవచ్చు.
కుషాల్: ఈ రకం రబీ చివరలో కూడా నాటడానికి అనుకూలం. అంటే వరికోత ఆలస్యమైనప్పుడు కూడా వరి తర్వాత ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు.
నేలలు: అధిక సేంద్రియ పదార్థం కలిగిన ఎర్రనేలలు, నీరు నిల్వని, నల్లనేలలు, ఉదజని సూచిక 6.5-8.5 ఉన్న నేలలు అనుకూలం. ఆమ్ల, క్షార భూములు సాగుకు అనుకూలం కాదు.
వాతావరణం: సమశీతోష్ణస్థితి నుంచి ఉష్ణ వాతావరణ పరిస్థితులు పుదీనా పెరుగుదలకు అనుకూలం. 100-110 సెం.మీ. వర్షపాతం, 20-40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలు సాగుకు అత్యంత అనుకూలం.
ప్రవర్ధనం: దీనిని వేర్లు, కాండపు ముక్కలు, పిలకల ద్వారా వ్యాప్తి చేస్తారు.
నాటే పద్ధతులు: పుదీనాను రెండు రకాలుగా నాటుకోవచ్చు.
1) జనవరి నుంచి ఫిబ్రవరి 15 వరకు నాటుకోవాలంటే పిలకలను పొలంలో నాటుకోవచ్చు. వరుసకు మధ్య 60 సెం.మీ. మొక్కల మధ్య 10 సెం.మీ. ఉండేలా నాటుకోవాలి. పిలకలను 5-6 సెం.మీ. లోతులో నాటుకోవాలి. తర్వాత వాటిని పూడ్చాలి. వెంటనే తడి ఇవ్వాలి. జనవరిలో నాటుకొంటే 3-4 వారాల్లో, ఫిబ్రవరిలో అయితే 2-3 వారాల్లో మొలకలు వస్తాయి.
2) ఫిబ్రవరి 15 తర్వాత నాటుకోవాలంటే పిలకలను ముందుగా 100 చ.మీ. నారుమడిలో పెంచుకొని ఆరు ఆకులు వచ్చిన తర్వాత 30þ10 సెం.మీ. దూరంతో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు.
ఎరువులు: సమగ్ర పోషక యాజమాన్యం అనగా ఎరువులను సమ్మిళతంగా ఉపయోగించడం వల్ల ఆకులు, మెంథాల్ పదార్థాల దిగుబడి ఎక్కువ వస్తుంది. ఆఖరి దుక్కిలో 20-30 టన్నుల పశువుల ఎరువు వేసుకొని కలియదున్నాలి.
నీటి యాజమాన్యం: జనవరి, మార్చి నెలల మధ్య రెండు వారాలకోసారి తడి ఇవ్వాలి. ఏప్రిల్, జూన్ మాసాల్లో అయితే ప్రతి 7-10 రోజుల వ్యవధిలో 8-10 నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. సాళ్ళలో 5 టన్నుల పచ్చి, ఎండు ఆకులతో కప్పి ఉంచడం ద్వారా 25 శాతం నీటిని ఆదా చేయడమే గాక కలుపు పెరగకుండా చేసి వేసవిలో నేల ఉష్ణోగ్రతను తగ్గించడంతో పాటు ఆకుల సత్తువ, సేంద్రియ పదార్థం నేలకు అందుతుంది.
కలుపు తీయడం: సరైన సమయంలో కలుపు నివారణ చేపట్టకపోతే 70-75 శాతం దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి పిలకలు నాటే పద్ధతిలో అయితే నాటిన 45, 65, 80 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి. మళ్ళీ పంట మొదటి కోత తర్వాత 30-45 రోజులకు రెండోసారి కలుపు తీయాలి.
అంతర పంటలు: ప్రతి రెండు వరుసల పుదీనాకు ఒక వరుస మినుము, కంది లేదా అలసందలు వేసుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందడమేగాక ఈ పంటల వేర్లు నేలకు నత్రజనిని అందిస్తాయి. అదేవిధంగా మలబారు వేప, శ్రీగంధం వంటి తోటల్లో పుదీనాను అంతరపంటగా సాగు చేయటం ద్వారా రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకు అదనపు ఆదాయం పొందవచ్చు.
కోత: పిలకలను నాటుకుంటే (జనవరి-ఫిబ్రవరి 15 వరకు) 100 రోజుల్లో (మేలో) పంట మొదటి కోతకు సిద్ధంగా ఉంటుంది. తదుపరి ప్రతి 60-70 రోజులకు కోతలు కోసుకోవచ్చు. రెండు లేదా మూడు కోతల తర్వాత తీసివేసి మళ్ళీ నాటుకోవాలి. అదే నారు ద్వారా నాటుకునే పంట మార్చి-ఏప్రిల్‌లో నాటుకుంటే జూన్-జూలైలో ఒకే ఒక కోత కోసుకోవచ్చు. అడుగున ఉన్న ఆకుల రంగును బట్టి కోత మొదలు పెట్టవచ్చు. అడుగు ఆకులు పసుపురంగుకు మారుతుంటే వెంటనే కోయాలి.

దిగుబడి: హెక్టారుకు 20-40 టన్నుల ఆకుల దిగుబడి, వాటి నుంచి 125-200 కిలోల తైలం దిగుబడి వస్తుంది.
సస్యరక్షణ – పురుగులు: ఆకుచుట్టు పురుగులు, పెంకు పురుగులు, బొంత పురుగులు ఆశించి ఆకులను నాశనం చేస్తాయి. వీటి నివారణకు తగిన చర్యలు చేపట్టాలి.
తెగుళ్ళు: పిలక, వేరుకుళ్ళు, ఆకుమచ్చ, వడలు తెగులు కనిపిస్తే తగిన చర్యలు చేపట్టాలి.
తైలం తీసే పద్ధతి: పంటకోసిన తర్వాత 4-5 గంటలు నీడలో ఆరబెట్టి నూనె బట్టీలో వేసి స్వేదన ప్రక్రియ ద్వారా నూనె తీయాలి. దీనికోసం బట్టీ తొట్టి (బాయిలర్), ద్రవీకారి (కండెన్సర్) సంగ్రహపాత్ర (సెపరేటర్) కలిగిన యంత్రం అవసరం. కోసిన ఆకులను బట్టీ తొట్టిలో నిండా నింపి, మూత మూసి నీటి ఆవిరి పంపాలి. ఇలా చేయడం వల్ల ఆకుల్లోని నూనెగ్రంధులు పగిలి నూనె ఆవిరి, నీటి ఆవిరి కలిసి ద్రవీకారిలోకి ప్రవేశించి చుట్టూ ఉన్న నీటివల్ల ద్రవీభవించి చుక్కల రూపంలో సంగ్రహ పాత్రలోకి ప్రవేశించింది. తైలాన్ని వేరుచేసి, శుభ్రపరిచి అల్యూమినియం లేదా గాజు పాత్రలో భద్రపరుచుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తవడానికి 4 గంటల వ్యవధి పడుతుంది.
ఆర్. అర్చన, (7075394529), కె. అనూష, కె. సాధన, డా. ఆర్. సుశీల, డా. బి. పుష్పవతి, వ్యవసాయ కళాశాల, పాలెం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం.

