ఈ రోజు జలసౌధలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వచ్చే 6 నెలలు చాలా క్రియాశీలమని, సత్తుపల్లి ట్రంకు, ట్రంక్ కెనాల్, యాతలకుంట వరకు పనులు పూర్తి చేసుకొంటే, వచ్చే పంటకాలానికి సాగునీరందించే అవకాశమున్నదని, దానికి సంబంధించి డిజైన్లు, టెండర్ల ప్రక్రియ వెంటనే చేపట్టాల్సిందిగా నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగారి చేతుల మీదుగా ఆగస్టు 15న ప్రారంభోత్సవం చేసుకున్న ఈ పథకం, మన శాఖకు అత్యంత ప్రాధాన్యత అని, ఈ ప్రాజెక్ట్‌కు అవసరమైన నిధులు కానీ, పరిపాలన అనుమతులు ఇచ్చే బాధ్యత తాను తీసుకొంటానని, అధికారులు త్వరితగతిన పనులు ఆరంభించాలని ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిని ప్రతీ 15 రోజులకు సమీక్షించి, తనకు ఎప్పటికప్పుడు వివరాలు అందచేయాల్సిందిగా సెక్రటరీ ప్రశాంత్ పాటిల్‌ని ఆదేశించారు.

2 Nov, 2024
