పశుగణన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 21వ అఖిల భారత పశుగణనలో భాగంగా అక్టోబరు 25 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రంలోని 1.50 కోట్ల కుటుంబాలకు చెందిన పశువుల వివరాలను ఇందులో నమోదు చేయనున్నారు. వ్యవసాయ పరికరాల వివరాలనూ సేకరిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, భూమిలేని కుటుంబాలకు ప్రధాన ఆదాయవనరుగా ఉన్న పశుసంవర్ధక రంగాన్ని మెరుగుపరచడానికి అవసరమయ్యే నిధులు, పథకాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణకు ఇది ఉపయోగపడుతుందని పశుసంవర్ధకశాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, డైరెక్టర్ దామోదరనాయుడు పేర్కొన్నారు. జిల్లాల పశుసంవర్థక అధికారులతో గురువారం వారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు భాగస్వామ్యంతో కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగా పశుగణన నిర్వహిస్తారని వివరించారు.
ప్రధానంగా గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, కోళ్లు, పకక్షులతో సహా 16 రకాల పెంపుడు జంతువుల సమాచారం సేకరిస్తారు. 17,244 గ్రామాలు, పట్టణాల్లోని 3,929 వార్డుల్లో గృహ, గృహేతర వ్యక్తుల నుంచి వివరాలు తీసుకుంటారు. 5,390 మంది సిబ్బంది, 1,237 మంది పర్యవేక్షకులు, 45 మంది స్క్రూటినీ అధికారులు, ఇతర సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు. వీరికి ట్రావెలింగ్ కిట్లు, 60 వేల వాల్‌పోస్టర్లు, 1.50 కోట్ల గృహస్టిక్కర్లు, 8 వేల ఐడీ కార్డులు అందించారు. పశుగణన పూర్తి అయిన ఇంటి తలుపుపై స్టిక్కర్ వేస్తారు.

25 Oct, 2024
