మన దేశ వ్యవసాయ పరిశ్రమల్లో కోళ్ళ పెంపకం ఒక ముఖ్యమైన భాగము. కోళ్ళ పరిశ్రమ పెరుగుతున్న జనాభా యొక్క పోషణ మరియు మాంసకృతుల అవసరాలను అందించడానికి కీలక పాత్ర వహిస్తున్నది. అయితే, ఇతర వ్యవసాయ రంగాల మాదిరిగానే, కోళ్ళ పెంపకం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. కోళ్ళ రైతులు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లలో, కోళ్ళ మందలలో దుర్గుణాల ఉనికి సూక్ష్మమైన మరియు సంక్లిష్టమైన ఆందోళనగా నిలుస్తూ వాటి నిర్మూలన రైతులకు ఒక ప్రధాన నిర్వహణ సమస్యగా మారింది. దుర్గుణాలు కోళ్ళు ప్రదర్శించే అవాంఛనీయ ప్రవర్తనలు అవి కోళ్ళ ఆరోగ్యం, ఉత్పాదకత మరియు సంక్షేమాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. దుర్గుణాలు ఒక్క సారి మందలో అభివృద్ధి చెందిన తర్వాత అవి వేగంగా మంద అంతటా వ్యాపించి వాటి నియంత్రణ మరియు నిర్మూలన చాలా కష్ట సాద్యంగా మారుతుంది. ఫలితంగా, ఈ దుర్గుణాలు (చెడు అలవాట్లు) పౌల్ట్రీ రైతులకు భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి.
కోళ్లలో తరచుగా కనిపించు దుర్గుణాలు
ఈకలు మరియు చర్మాన్ని పొడవడం, పీకడం: ఇది కోళ్లలో ఒక తీవ్రమైన చెడు అలవాటు, కోళ్ళు ఒకదానికొకటి ఈకలు, చర్మం మరియు మలద్వారం ప్రాంతాన్ని పొడుచుకుని పీకుతుంటాయి. పొడుచుకోవడం వల్ల ఏర్పడిన గాయాల ద్వారా వివిధ రకాల రోగాలు మరియు అంటువ్యాధులు సోకే ప్రమాదం ఉంది అంతేకాకుండా ఈ గాయాలు ఇతర కోళ్లను తిరిగి పొడవడానికి ప్రేరేపిస్తాయి. ఇలా ఆ గాయాలను తిరిగి మందలోని ఇతర కోళ్ళు పొడవడం ద్వారా అవి తీవ్రతరమయ్యి చివరికి కోళ్ళ మరణానికి దారితీస్తాయి. ఈ సమస్యలు ప్రదానంగా కోళ్ళ గృహ వ్యవస్థ లో కావాల్సిన స్థలం లేక రద్దీ పెరగడం వలన, పేలవమైన యాజమాన్య పద్ధతుల కారణంగా మరియు ముఖ్యంగా పోషకాహార లోపాలు (మాంసకృత్తుల లోపాలు, భాస్వరం లోపం మరియు అధిక శక్తి తక్కువ పీచు పదార్థము ఉన్న దాణా) వలన తలెత్తుతాయి.

గుడ్లను కుక్కడం మరియు తినడం: కోళ్ళు తమ స్వంత లేదా ఇతర కోళ్ళ గుడ్లను తినే ప్రవర్తనను అలవర్చుకుని మంద అంతటా వ్యాపింపజేస్తాయి. ఈ ప్రవర్తన, ఒకసారి మందలో కనిపించిన తర్వాత, త్వరగా వ్యాపించి ఒక నిరంతర సమస్యగా మారుతుంది, దీని నిర్వహణ మరియు నివారణ కోళ్ళ పెంపకంలో ప్రధాన అంశంగా మారుతుంది. ఈ దురలవాటు కోళ్ళ ఉత్పాదకత మరియు ఆర్థిక సాధ్యతను ప్రభావితం చేసి రైతుకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది.
కోళ్లలో గుడ్లను తినే అలవాటు అవి గుడ్లు పెట్టడానికి ఏర్పరిచిన గూళ్ళ యొక్క పేలవమైన నిర్వహణ వలన కలగవచ్చును, పోషకాహార లోపాల వలన కోళ్ళు పెట్టే గుడ్లలో పగుళ్లు మరియు చీలికలు ఉన్నపుడు కోళ్ళు ఆ గుడ్లను పొడిచే అవకాశం ఎక్కువ అలాగే కోళ్ళు నిత్యం గురయ్యే ఒత్తిడికి ప్రతిస్పందనగా కూడా ఈ దుర్గుణము ఉద్భవించవచ్చు.
గుడ్లను దాచిపెట్టుట: గుడ్డు దాచడం అనేది పెరటి కోళ్లలో అప్పుడప్పుడు గమనించే ప్రవర్తన, ఇక్కడ కోళ్లు తమ గుడ్లను నియమించబడిన గూళ్ళు, గూడు పెట్టెల్లో కాకుండా ఇతర ప్రదేశాలలో పెట్టడానికి ఎంచుకుంటాయి. గుడ్డు దాచడం అనేది అడవి కోడి యొక్క సహజ ప్రవృత్తి, కొన్ని పెరటి కోళ్లలో కూడా ఈ ప్రవృత్తి జన్యుపరంగా సంక్రమించడం వల్ల అవి గుడ్లను దాచి పెట్టవచ్చును. గుడ్లు పెట్టడానికి సరైన గూళ్ళు మరియు గూడు పెట్టెల్లో లేకపోవుట, అధిక రద్దీ వలన కూడా కోళ్లలో ఈ ప్రవర్తన గమనించవచ్చును. దీనివలన రైతులకు కోళ్ళు పెట్టిన గుడ్లను గుర్తించడం మరియు సేకరించడం సవాలుగా మారుతుంది, ఫలితంగా సేకరించిన గుడ్ల సంఖ్య తగ్గి దిగుబడి పడిపోతుంది.
నివారణ మరియు నిర్వహణ
- మెరుగైన గృహవ్యవస్థ మరియు సరిపడా నేల స్థలం కేటాయించడం: కోళ్ళలో దుర్గుణాలకు దోహదపడే ప్రదాన కారకం అధిక రద్దీ. తగినంత స్థలం, తగినన్ని దాణా మరియు నీటి తొట్టెలు కల్పించడం ద్వారా పొడుచుకునే సమస్యను నివారించవచ్చును. సరైన గాలి ప్రసరణ మరియు మెరుగైన జీవన పరిస్థితులను కలిగిన గృహవ్యవస్థను అందించడం ద్వారా కోళ్ళలో ఒత్తిడిని తగ్గించి అవాంఛనీయ ప్రవర్తనలను అరికట్టవచ్చును.

- సమతుల్య పోషణను అందించడం: దుర్గుణాలను నివారించడంలో కోళ్లకు సమతుల్య దాణా అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మాంసకృత్తుల లోపాలు, భాస్వరం లోపము మరియు దాణాలో శక్తినిచ్చు పదార్థాలు మరియు పీచు పదార్థాల హెచ్చుతగ్గులు లేకుండా పశువైద్యుల సలహా మేరకు నిర్దిష్ట పోషణ సమతుల్యత కలిగిన దాణాను కోళ్లకు అందించాలి.
- కోళ్ళ ముక్కులు కత్తరించడం ద్వారా పొడుచుకునే సమస్యను నివారించవచ్చు: నాలుకను జాగ్రత్తగా వెనక్కి నెట్టి పై ముక్కు 2/3వ వంతు మరియు దిగువ ముక్కును 1/3వ వంతు ముక్కులు కత్తిరించు యంత్రం సహాయంతో కత్తిరించాలి.
- దుర్గుణాలు కలిగిన కోళ్లను, గాయపడిన కోళ్లను గమనించి వెంటనే మంద నుండి వేరు చేయాలి.
- కోళ్ళు గుడ్లు పెట్టుటకు అనువైన గూడు పెట్టలను నిర్మించాలి.
డా|| ఎన్. దీపక్, సహాయ ఆచార్యులు, కోళ్ళ శాస్త్ర విభాగము, శ్రీ వేంకటేశ్వర పశు వైద్యవిశ్వ విద్యాలయము – తిరుపతి.
డా|| టి. సాయి ఊర్మిళ, సహాయ ఆచార్యులు, పశు శరీర నిర్మాణ శాస్త్ర విభాగము, శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయము-తిరుపతి

