మనది వ్యవసాయక దేశం. ఆది నుంచి మన ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఒకప్పుడు 90 శాతానికి పైగా ప్రస్తుతం 70 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. వ్యవసాయాన్ని మన ప్రజలు మన సంస్కృతి, సంప్రదాయాలలో భాగంగానే చూస్తారు. అందుకనే చాలామంది పొలాన్ని అమ్మటానికి ఇష్టపడరు. కొంతమంది పొలం ఉండికూడా వ్యవసాయ రంగానికి దూరంగా జరిగిన వారు కూడా తమ పొలాన్ని అమ్మకుండా కొనసాగిస్తుండటము మన దేశంలో సహజం. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడం మరియు వివిధ రకాల కారణాల వలన చాలామంది వ్యవసాయ రంగం నుండి వేరే రంగాలవైపు వెళ్ళినా కాని తమ మూలాలను మరవకుండా తమ ఆలోచనలను వ్యవసాయరంగం చుట్టూ తిప్పుతూనే ఉంటారు. ఒకప్పుడు వ్యవసాయంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడము కుదరదు కాబట్టి వ్యవసాయరంగాన్ని వదలి వేరే ఉద్యోగ, వ్యాపార రంగాలలో అడుగు పెట్టి ఆర్థికంగా ఒకస్థాయికి చేరుకున్న తరువాత తిరిగి వ్యవసాయం గురించి ఆలోచించే వారి సంఖ్య ప్రస్తుత తరుణంలో రోజు రోజుకి పెరుగుతూ ఉంది.
గతంతో పోల్చుకుంటే సేంద్రియ సాగు గురించి అవగాహన పెరిగిన తరువాత, ప్రధానంగా కరోనా తరువాత వ్యవసాయ రంగం గురించి ఆలోచించడంలో వేగం పెరిగిందని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందులో భాగంగానే గతంలో వ్యవసాయ రంగం నుంచి వేరే రంగంవైపు వెళ్ళిన వారు తిరిగి వ్యవసాయరంగం వైపు ఆలోచిస్తూ తమ మూలాలను మరవకూడదు అనే తపనతోపాటు ఆరోగ్యం కాపాడుకోవాలంటే వ్యవసాయ రంగమే సరైన రంగం అని తలచి వ్యవసాయ రంగం వైపు వేగంగా అడుగులు వేసే వారి సంఖ్య క్రమేపి పెరుగుతూ ఉంది. ఇదే విధంగా ఆలోచించి తమ మూలాలను మరవకూడదనే తలంపుతో పారిశ్రామిక రంగంలో రాణిస్తూ కూడా తమ వ్యవసాయ నేపధ్యాన్ని మరవకుండా తిరిగి వ్యవసాయ రంగంలో అడుగుపెట్టి వినూత్న ఆలోచనలలో వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులలో పండిస్తూ మన దేశీయ గోజాతులతో గో-శాలను నిర్వహిస్తున్నారు కృష్ణా జిల్లా, గన్నవరం మండలం, చిక్కవరం గ్రామానికి చెందిన సురేంద్రబాబు.
సురేంద్రబాబు గారిది వ్యవసాయ నేపథ్యం. వీరి పూర్వీకుల నుంచి వ్యవసాయం చేస్తున్న చరిత్ర వీరిది. అయినా కాని అందరిలాగానే వ్యవసాయరంగాన్ని వీడి పారిశ్రామిక రంగంలో అడుగుపెట్టడం జరిగింది. పారిశ్రామిక రంగంలో అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటు రాణించగలిగి ఒక గుర్తింపు సంపాయించారు. గుర్తింపుతో పాటు ఆర్థికంగా ఎదిగిన తరువాత తమ మూలాలను మరవకూడదు అని గ్రహించి 2020వ సంవత్సరంలో తిరిగి వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టారు. వీరికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు కాబట్టి తాము చేసే వ్యవసాయం నలుగురికి ఉపయోగపడేదిగా, మన సంస్కృతి, సాంప్రదాయ, సనాతన ధర్మాలను కొనసాగించేదిగా, తమ ఆరోగ్యాలను కాపాడేదిగా ఉండాలనే తలంపుతో అడుగులు వేయడం జరిగింది. సురేంద్రబాబు తన ఆలోచనలతో పాటు తన అర్థాంగి విశాలాక్షి అభీష్టం మేరకు అందరికి ఉపయోగపడేలా ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకోగా అందుకు రంగారావు మరియు ఇతరుల సలహాలు, సంప్రదింపులతో తన వ్యవసాయ క్షేత్రాన్ని ఒక నందనవనంగా తీర్చిదిద్ది వివిధ రకాల పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు.

సురేంద్ర బాబు గారికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి తన వ్యవసాయంలో వ్యాపార ధోరణిని ప్రక్కనబెట్టి ఆరోగ్యానికి, ఆధ్యాత్మకతకు ప్రాధాన్యాన్ని ఇచ్చారు. అందులో భాగంగానే నక్షత్రవనాన్ని నిర్మించి ఆ నక్షత్రవనంలో వివిధ రకాల ఔషధ గుణాలున్న ఆయుర్వేద మొక్కలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. ఈ నక్షత్ర వనంలో మల్టి విటమిన్, కొవెల్ బంక, కుందేటి చెవులు, రుద్రాక్ష, మిరియాలు, తిప్పతీగ, రణపాల, లక్ష్మితరు, ఇన్సులిన్, బిర్యాని ఆకు, యాలకులు మొదలగు ఔషధ మొక్కలను నక్షత్రపు ఆకారపు తోటలో పెంచుతూ మధ్యలో వన దుర్గ మరియు ధన్వంతరి స్వామి విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రతి పౌర్ణమి రోజున వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నారు. పౌర్ణమి రోజున అనేకమంది హోమంతో పాటు ఇక్కడ జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొని ఒక వేడుకలాగా జరుపుతుంటారు. ఈ హోమం ద్వారా వచ్చిన బూడిదను పంటల సాగులో వినియోగిస్తూన్నారు. ఈ నక్షత్ర వనంలో వివిధ రకాల ఔషధ గుణాలున్న మొక్కల మధ్య ధ్యానం చేయడం వలన ఆరోగ్యం బాగుంటుందనే తలంపుతో ఈ నక్షత్రవనాన్ని ఏర్పాటు చేశారు.
నక్షత్రవనంలో వివిధ రకాల ఔషధ గుణాలున్న మొక్కల పెంపకంతో పాటు అవకాశం ఉన్న చోట వివిధ రకాల ఆకుకూరలు మరియు కూరగాయలను సాగు చేస్తున్నారు. సుమారు 15 కుటుంబాల అవసరాలను తీర్చటానికి అవసరమయిన అన్ని రకాల ఆకుకూరలు, టమాట, వంగ, మిరప, సొర, బీర, కాకర వంటి కూరగాయలను సాగు చేస్తూ తమ సొంత వినియోగానికి ఉపయోగిస్తున్నారు. వీటి సాగుకు ఎలాంటి రసాయనాలు ఉపయోగించకుండా కేవలం పంచగవ్య, హోమంలో లభించే బూడిద, గోవ్యర్థాలను మాత్రమే ఉపయోగిస్తున్నారు.

సేంద్రియ సాగులో మన దేశీయ జాతి గోవు ప్రధాన పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిన వీరు వివిధ రకాల దేశీ గోజాతుల గోశాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి వీరి గోశాలలో 80 దూడలు 100 పెద్ద పశువులు ఉన్నాయి. ప్రధానంగా గిర్, పుంగనూరు, తార్పార్కర్, రాఠి, సాహివాల్ జాతికి చెందిన గోవులను పోషిస్తున్నారు. రోజుకి 80 లీటర్ల చొప్పున పాల దిగుబడి పొందుతున్నారు. గోవులను ఒకే ప్రాంతంలో కట్టివేయకుండా ఫ్రీగ్రేజింగ్ పద్ధతిలో పెంచుతున్నారు. ఈవిధంగా ఫ్రిగ్రేజింగ్ పద్ధతిలో పెంచటం వలన ఆవులకు నడవటానికి అవకాశం ఉండటంతో పాటు తమకు ఇష్టం వచ్చినగ్రాసాలను తినటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఆవుల ద్వారా వచ్చిన పాలు, పేడ, మూత్రం లాంటివి నాణ్యంగా ఉంటాయనే లక్ష్యంతో ఈ పెంపక విధానాన్ని ఎన్నుకున్నారు. గోవులకు మేతగా సూపర్ నేపియర్, పిల్లిపెసర, అలసంద మొదలగు పంటలను పూర్తి సేంద్రియ పద్ధతులతో సాగు చేస్తున్నారు. దాణాగా ఎండుగడ్డి, పెసరపొట్టు, మినుపపొట్టు, వేరుశనగ పొట్టు లాంటివి వినియోగిస్తున్నారు.

వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలతో పాటు వరి, మామిడి పంటలను కూడా పూర్తి సేంద్రియ పద్ధతులతో పండిస్తున్నారు. 1262 రకం వరిలో కేవలం ఎకరానికి 20,000/-ల ఖర్చుతో ఎకరం నుంచి సుమారు 39 బస్తాల వడ్లను దిగుబడి పొందడము జరిగింది. సుమారు 25 సంవత్సరాల వయస్సు గల మామిడి తోటను గత మూడు సంవత్సరాల నుంచి సేంద్రియ సాగు పద్ధతులు పాటిస్తూ ఆరోగ్యకరమైన దిగుబడి పొందుతున్నారు. ముందు ముందు మామిడి కాయలను వేరే దేశాలకు ఎగుమతి చేయాలనే ధ్యేయంతో ఉన్నారు. వీరు సాగు చేసే పంటలకు పశువుల ఎరువు, పంచగవ్య, థపర్ణి కషాయం, జీవామృతాలను ఉపయో గిస్తుంటారు. పశువుల పాక శుభ్రం చేసే సమయంలో వచ్చే వ్యర్థాలను నేరుగా పొలానికి పంపించే ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ క్షేత్రంలో ఆరోగ్యకర వాతావరణం ఏర్పడి ఉదయం, సాయంకాలం సమయంలో వివిధ రకాల పకక్షులు దర్శనమిస్తుంటాయి. మరిన్ని వివరాలు 99856 92555కి ఫోను చేసి తెలుసుకోగలరు.
– వై. శ్రవణ్ కుమార్, స్పెషల్ కరస్పాండెంట్

