మన తాతముత్తాతలు వ్యవసాయంలో పెద్దగా ఏమీ చేసేవారు కాదు. విత్తనాలు వేసేవారు. దిగుబడి తీసుకునేవారు. కాని రాను రాను పంటల సాగుకి పశువుల ఎరువు అందించటం మొదలయ్యింది. అప్పటి వరకు పరవాలేదు. పశువుల ఎరువు అందించి ఆరోగ్యకరమైన దిగుబడులు సాధించారు. విత్తనాలను కూడా బయట కొనుగోలు చేయకుండా తమ సొంత విత్తనాలను లేదా తమ ప్రాంతాలలో అందుబాటులో ఉండే విత్తనాలను ఉపయోగిస్తూ పంటల సాగు కొనసాగిస్తూ దిగుబడి గురించి ఆలోచించకుండా ఎంత దిగుబడి వస్తే అంత దిగుబడి తీసుకుంటూ జీవితాలను గడుపుతూ వచ్చారు. కానీ రాను, రాను వ్యవసాయంలో సాంకేతికత పెరగడం, జనాభా పెరిగి వారి ఆహార అవసరాలను తీర్చటానికి వ్యవసాయంలో రసాయనాలు, అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టటం జరిగింది. ఈ పరిణామాల వలన అనుకున్న లక్ష్యం నెరవేరింది కాని అనేక ఇబ్బందులు ఎదురవుతున్నవి. ఆ ఇబ్బందుల నుండి బయటకు రావడానికి రైతులు మరలా తిరిగి మన తాత ముత్తాతలు చేసిన పంటల సాగు విధానాలవైపు అడుగులు వేయాలని ప్రభుత్వాలు, అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు చెబుతున్నారు. వీరి మాటలు విని వాస్తవం తెలుసుకున్న కొంతమంది రైతులు తమ సాగు పద్ధతులను మార్చుకుని ప్రకృతి సాగు విధానాలవైపు అడుగులు వేశారు. వేస్తున్నారు. ఇదేకోవకు చెందుతారు కోనసీమ జిల్లా గంగవరం గ్రామానికి చెందిన అల్లూరి సూర్యనారాయణమూర్తి.
సూర్యనారాయణమూర్తిది వ్యవసాయ నేపధ్యం. మొదటి నుంచి అంటే గత 40 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తూ వస్తున్నారు. వారి ప్రాంతం పల్లపు ప్రాంతం కాబట్టి వరి ప్రధాన పంటగా సాగు చేస్తూ వస్తుంటారు. అందరి రైతుల మాదిరిగానే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తన వరి సాగులో కూడా రసాయనాలు అందిస్తూ సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. ఎక్కువగా అధికంగా 50 బస్తాలకు పైగా దిగుబడి వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. దిగుబడి బాగానే వస్తుంది కాని వివిధ రకాల కారణాల వలన ఆదాయం రాకపోగా రసాయన పద్ధతులతో పండించిన బియ్యాన్ని తినడం వలన ఆరోగ్యాలు కూడా సక్రమంగా ఉండటం లేదు. దానికి పరిష్కారం ప్రకృతి వ్యవసాయం అని తెలుసుకొని తన సాగుని సేంద్రియ పద్ధతులలోకి మార్చాలనే లక్ష్యంతో రసాయనాలను తగ్గిస్తూ సేంద్రియ పదార్థాలను పెంచుతూ కొన్ని సంవత్సరాలు చేసిన తరువాత అంటే 2014 వ సంవత్సరం నుంచి పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వరి పంట సాగును కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రకృతి వ్యవసాయానికి మారిన మొదటలో దిగుబడులు తగ్గినవి కాబట్టి పశువుల ఎరువు, జీవామృతం లాంటివి భూమికి అందిస్తూ వస్తూ గత రెండు సంవత్సరాల నుంచి భూమికి ఏమీ అందివ్వడం లేదు. నారు నాటుకోవటం, కలుపు నివారించటం, దిగుబడి తీయటం అంతే అంతకు మించి ఏమీ చేయకుండా అసలయిన ప్రకృతి వ్యవసాయానికి చిరునామాగా సూర్యనారాయణమూర్తి నిలుస్తున్నారు.
5 ఎకరాలలో వరిని సాగు చేస్తున్నారు. 2021వ సంవత్సరం ఖరీఫ్‌లో బి.పి.టి. రకం పండించి 75 కిలోల బస్తాలు ఎకరానికి 28 చొప్పున దిగుబడి సాధించారు. రబీలో ఆర్‌ఎన్‌ఆర్ 15048 రకం వరిని సాగు చేసి ఎకరానికి 25 బస్తాల దిగుబడిని సాధించారు. సొంత విత్తనాలను లేదా బయట కొనుగోలు చేసుకున్న విత్తనాలను నారు పోసుకుని ఖరీఫ్‌లో అయితే 35 రోజుల పెరిగిన నారు, రబీలో అయితే 25 రోజులు పెరిగిన నారుని నాటిస్తుంటారు. కలుపు సమస్య నుండి పంటను రక్షించుకోవడానికి నారు నాటే పద్ధతినే అవలంభిస్తున్నారు. ప్రస్తుతం తాను సాగు చేస్తున్న వరి పంటకు ఎలాంటి పదార్థాలు అందించడం లేదు. రబీలో మాత్రం వేడి తగ్గడానికి ఎండుద్రాక్ష, బార్లీగింజలు, మజ్జిగల మిశ్రమాన్ని పిచికారి చేస్తుంటారు. అంతకుమించి ఏమీ చేయవలసిన అవసరం పడటం లేదు. వడ్లను బియ్యం ఆడించి నేరుగా వినియోగదారులకి బియ్యం అమ్మకం చేస్తున్నారు.
సుమారు ఒక ఎకరం తొంభై సెంట్ల భూమిలో చుట్టూ 10 అడుగుల వెడల్పు 4 అడగుల లోతులో కందకం తవ్వి ఆ కందకంలో వచ్చిన మట్టిని మధ్యలో వేసి చదును చేయించారు. కందకంలో చేపలు పెంచుతూ మధ్యలో ఉన్న మట్టిలో వివిధ రకాల పంటలు అంటే తన కుటుంబానికి అవసరమైన అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు పండిస్తూ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వస్తుంటారు. ఈ ప్రాంతంలో సాగు చేసే పంటలలో సొర, బీర, కాకర, బెండ, వంగ, టమాట, సీతాఫలం, జామ, సపోట, వాటర్ యాపిల్ లాంటి తమ కుటుంబ ఆహారానికి అవసరమైన పంటలు ఉంటాయి. కందకంలో ప్రతి సంవత్సరం చేపలు పెంచి అవి పెరిగిన తరువాత వాటిని అమ్మి అదనపు ఆదాయాన్ని పొందుతుంటారు. 2021వ సంవత్సరం 200 చేప పిల్లలను పెంచారు. ఇందులో గడ్డి చేప, బొచ్చ, బంగారు తీగ, గచ్చ మొదలగు నాలుగు రకాలు ఒక్కొక్కటి 50 పిల్లల చొప్పున వేశారు. చేప పిల్లలకు ప్రతి రోజు 2 కిలోల చొప్పున తమ వడ్లను మర పట్టించినపుడు మిగిలే వృథాగా పోయే రద్దు నూకను అందిస్తుంటారు. రోజుకు 2 కిలోల చొప్పున నెలకు 60 కిలోల రద్దు నూకలను మాత్రమే అందిస్తుంటారు. తన వరి పంటలో వచ్చిన నూకలు చేపలకు ఆహారంగా సరిపోతుంటవి. బయట నుంచి ఏమీ కొనుగోలు చేయకుండా చేపలను పెంచుతుంటారు. నూకలను మరియు మట్టిని తింటూ చేపలు పెరుగుతుంటాయి. సంవత్సరంలో 1 కిలో వరకు తూగేలా బరువు పెరుగుతాయి. కిలో 250/-ల చొప్పున నేరుగా పొలం దగ్గర అమ్ముతుంటారు. వినియోగదారులు నేరుగా పొలం వద్దకు వచ్చి తమకు నచ్చిన రకాన్ని కొనుగోలు చేస్తుంటారు. వరి మరియు వివిధ రకాల కూరగాయలు, పండ్లు పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తూ చేపలకు కూడా బయట నుంచి కొనుగోలు చేసిన పదార్థాలను అందించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో పండించిన సొంత నూకలను అందిస్తూ నాణ్యమైన చేపలను పెంచి మంచి ధరకు అమ్ముతున్నారు. ఒక ఆవు మరియు రెండు గేదెలను పోషిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తూ తోటి సమాజానికి రసాయనాలు లేని ఆహారాన్ని అందిస్తూ సంవత్సరానికి ఎకరానికి లక్ష రూపాయలు పైగానే ఆదాయం గడిస్తూ నిజమైన ప్రకృతి వ్యవసాయానికి సూర్యనారాయణమూర్తి దారి చూపిస్తున్నారు.
