రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్‌ నెలలో విపరీతమైన ఎండలు, వడగాడ్పులు, అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు. మే నెలలో కూడా అధిక ఎండలు, అకాల వర్షాలు, వడగండ్ల వానలు కొనసాగే అవకాశం. మార్కెట్లలో, కళ్లాలలో కొన్ని చోట్ల తడిచి ముద్దవుతున్న ధాన్యం. మామిడి మొదలయిన పండ్ల తోటలు, కూరగాయల పంటలకు అక్కడక్కడ గాలులతో కూడిన వర్షాలతో నస్టాలు. దీనికి తోడు మే 13న జరిగే ఎన్నికల కొరకు అభ్యర్థుల ప్రచార హోరు. ఈ నేపథ్యంలో మే (భరణి, కృత్తిక, రోహిణి మొదటి భాగం)లో వివిధ పంటలలో చేయవలసిన కార్యక్రమాలు, చేతికొచ్చిన పంటలను అమ్ముకునేటప్పుడు మెళకువలు, ఇందులో రైతు ప్రజా సంఘాల పాత్ర మొదలయిన విషయాల గురించి…

వరి: యాసంగి/రబీ పంట మే మాసంలో మార్కెట్‌కు ఎక్కువగా వస్తుంది. వెంటవెంటనే మార్కెట్లలో కళ్ళాల్లో ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా అకాల వర్షాలకు తడిసి ముద్దవకుండా అమ్ముడుబోయే ఏర్పాట్లు జరగాలి. ప్రకటించిన ధరల డబ్బులు రైతులకు వెంటవెంటనే అందేటట్లు ఏర్పాట్లు జరగాలి. రైతు ప్రజా సంఘాలు ఈ విషయంలో రైతులకు బాగా సహాయపడే అవకాశముంది. ఎలక్షన్‌ జరుగుతున్న నెల కాబట్టి, రైతుల అభివృద్ధికి ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తులకు, పార్టీలకు ఓటు వేయండి. నిజంగా మేలు చేసేదెవరు, ఒట్టి మాటలతో కాలం వెల్లదీసే వారెవరనే విషయాలను రైతు ప్రజా సంఘాల నెలవారీ సమావేశంలో విశదంగా చర్చించండి. నిర్ణయాత్మక తీర్మానాలను ఆచరణలో ఓటు ద్వారా చేసి చూపించండి. వడ్లుగా కాకుండా బియ్యం చేసి అమ్మడం లాభదాయకం. రాబోయే ఖరీఫ్‌ పంటకు నార్లు పోయడం ఈ నెల కడవారంలో రోహిణి కార్తె (25.5.24 నుండి 7.6.24 వరకు)లో మొదలవుతుంది. ఈ సమయంలో నీరున్న వాళ్ళు నార్లు పోసుకుని, లేత నారు నాటితే చీడపీడలు తక్కువగా ఆశించి, దిగుబడి బాగా ఎక్కువగా వస్తుంది. వీలయినంత త్వరగా మంచి ధరవచ్చే నాణ్యమైన విత్తనాలను ముందే సేకరించి పెట్టుకోండి. నాటే సమయంలో కూడా నీరు పుష్కలంగా ఉండాలి. నీటిలభ్యత నమ్మకం లేనిచోట, నారుపోయడం నిదానించి, తర్వాత నీటి లభ్యత మెరుగైనాక నారుపోసి, నాటుకోవడం మేలు. ముదురునారు నాటితే దిగుబడి తగ్గుతుంది. రకాల ఎంపికలో, బాగా పండి, మంచి ధర పలికే తెలిసిన రకాలను ఎంపిక చేసుకోండి. కొత్త రకాలను, కొద్దిపాటి భూమిలో పరీక్షించి, అవి బాగా పండి, మంచి ధరవ స్తే తర్వాతి పంటలలో, వీటి విస్తీర్ణాన్ని పెంచవచ్చు. ఈ సంవత్సరం వరికి బోనస్‌ లేనట్లే. వచ్చే ఖరీఫ్‌ పంటకిస్తామని తెలంగాణలో ప్రకటించినారు. మిగతా రాష్ట్రాల్లో కూడా అలా ప్రకటిస్తే రైతుకు లాభం.

ప్రత్తి: ప్రత్తి ధరలు రూ. 7000-రూ. 7500 మధ్య నడుస్తున్నాయి, రూ. 8000 వరకు రావచ్చు. ముంగారి పత్తిని రోహిణి కార్తెలో మే కడవారంలో, మంచి వర్షం వచ్చినాక లేక నీటితడులిచ్చి విత్తుతారు. రోహిణిలో విత్తిన పత్తిలో చీడపీడల బెడద ముఖ్యంగా గులాబిరంగు పురుగు ఉధృతి తక్కువ. ప్రత్తిని అధిక సాంద్రత విధానంలో 80þ20 సెం.మీ. (ఎకరాకు 25,000 మొక్కలుండేటట్లు) విత్తుకోవచ్చు. వర్షాధారంలోనూ, నీటి తడులిచ్చి కూడా అధిక సాంద్రతలో పండించవచ్చు. ఈ విధానంలో పంట త్వరగా పూర్తవుతుంది. తర్వాత పంటగా నువ్వులు, శనగ, వేరశనగ, పెసర, మినుము సాగు చేయవచ్చు. నీటి ఆధారమున్నచోట దిగుబడి బాగా ఎక్కువ ఉంటుంది. అధిక సాంద్రతలో విత్తనానికి అనువైనరకం: ఎల్‌.హెచ్‌.డి.పి.ప్రత్తి-5: ఇది సూటి రకం. శాఖీయ కొమ్మలు లేకుండా ఉంటుంది. జిన్నింగ్‌ శాతం 37.6. పింజ పొడవు 27.5 మి.మీ. పంటకాలం 140-150 రోజులు. దిగుబడి: 10-11 క్వి/ఎ. పచ్చదోమ, బాక్టీరియా ఆకుమచ్చ తెగులును తట్టుకుంటుంది. ప్రత్తి కొత్త రకాలు: ఎన్‌.డి.ఎల్‌.హెచ్‌.2056-4, ఎన్‌డి.ఎల్‌.హెచ్‌.3104-4 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక మరియు తమిళనాడులో సాగుకు అనుకూలమైనవి. అధిక దిగుబడి, పురుగులు, రోగాలను తట్టుకుంటాయి. 160 రోజుల పంట. 

మొక్కజొన్న: పురుగులు రోగాలు తక్కువగా ఉండి అత్యధిక దిగుబడులు సాధించడానికి మే చివరి వారం నుండి జూన్‌ మొదటి వారం వరకు విత్తాలి. భూమిలో సరిపడినంత తేమ లేకపోతే, తడి ఇచ్చి విత్తాల్సుంటుంది. తేమ తక్కువ కాకుండా నీటి తడులను ఇవ్వగలిగితే అత్యధిక దిగుబడులు సాధ్యమవుతాయి. పలు ప్రైవేట్‌ హైబ్రిడ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటికి 40-50 క్వి/ఎ. గింజ దిగుబడినివ్వగల సామర్థ్యముంది.

అల్లం: మే నెలలోపల విత్తడం పూర్తి చేయవలసిన పంట. తెలంగాణకు అనుకూలమైన రకాలు. మారన్‌, రియోడిజెనెరో, హిమాచల్‌ మొ||. ఆంధ్రప్రదేశ్‌కు అనువైన రకాలు: రియెడిజెనెరో, మారన్‌, నడియా మొ|| నిదానంగా విత్తితే దుంపకుళ్ళు ఎక్కువ. దిగుబడి తక్కువ.

పసుపు: స్వల్పకాలిక రకాలు (6-7 నెలల్లో త్రవ్వకానికి వచ్చే రకాలు) ఆంధ్రప్రదేశ్‌లో మే రెండవ పక్షంలో నాటడానికి అనుకూలం. తెలంగాణాలో జూన్‌ మొదటి పక్షంలో నాటడానికి కనుకూలం. మంచి రకాలు: సృజన్‌, సుదర్శన్‌, ప్రగతి, ప్రతిభ మొ||.

నువ్వులు: అధిక దిగుబడులకొరకు నువ్వు పంటను కోస్థా ఆంధ్రలో మే 15 నుండి 31 వరకు, రాయలసీమలో మే-జూన్‌ నెలల్లో, తెలంగాణాలో మే మొదటి పక్షంలో విత్తుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత అధిక దిగుబడినిస్తున్న రకం: జగిత్యాలతిల్‌-1 (జె.సి.ఎస్‌-1020): 90-125 రోజుల పంట. దిగుబడి: 5-8 క్వి/ఎ. ఖరీఫ్‌, రబీ, వేసవి కాలాల్లో సాగుకు అనుకూలం. విత్తనోత్పత్తి చేపట్టి మంచి ధరలకు అమ్ముకోవచ్చు.

కొత్తిమీర: ఎండాకాలంలో పాక్షిక నీడలో కొద్ది నీళ్లతో, అత్యధిక ఆదాయాన్నివ్వగల్గిన పంట. ఎకరాకు లక్షకుపై మాటే. పంట జాగ్రత్తగా పెట్టాలి. కొత్తిమీరకనుకవైన రకాలు: సురుచి: తొలికోత విత్తిన 35-55 రోజులకు. హరితగృహాలలో బాగా ఎదుగుతుంది. దిగుబడి 1.0-1.8 ట/ఎ. యాసంగి/రబీ దిగుబడి 6.0-7.2 ట/ఎ. ఎ.జి.సి.ఆర్‌-1: వేసవిలో 50% నీడనిచ్చే షేడ్‌నెట్‌ క్రింద దిగుబడి బయట పొలం కంటే  3 నుండి 4 రెట్లు అధికం. అర్కఇషా: ఎక్కువ సార్లు కోతకొస్తుంది (మల్టీకట్‌). విశాలమైన ఆకులు, గుబురు మొక్కలు,  మంచి వాసన, ఎక్కువ రోజుల వరకు తాజాగా ఉంటుంది. చల్లగా ఉంచితే 21 రోజులు నిల్వ చేయవచ్చు. ఆకు దిగుబడి 4.0-4.8 ట/ఎ. (3 కోతల్లో, 70 రోజుల్లో) ఆకులో విటమిన్‌ సి: 167 మి.గ్రా./100 గ్రా. ఆకుకు. పెరటితోటల్లో కూడా కొత్తిమీరను ఆరోగ్యం కొరకు పండించవచ్చు.

పొదీనా: ఎండాకాలంలో ఇంకొక మంచి ఆదాయ పంట పొదీనా. దీనిని వేర్ల ద్వారా, కాండపు ముక్కల ద్వారా ప్రవర్థనం చేయవచ్చు. ఎకరాకు 3-4 క్వింటాళ్ళ తీగ ముక్కలు కావాలి. మన దేశంలో జపాన్‌ పొదీనాకు ఎక్కువ ప్రాచుర్యం ఉది. మంచి రకాలు: కోసి, సక్షమ్‌, హిమాలయ, శిలిక్‌. ఆకుకూరగాను, తైలం ఉత్పత్తికి ఉపయోగం. నాటిన 120 రోజుల నుండి కోత ప్రారంభవుతుంది. దిగుబడి: 15-20 ట/ఎ. పెరటి తోటల్లో కూడా పండించవచ్చు. ఆరోగ్యదాయకం.

ఆకుకూరలు: పెరటితోటల్లోనూ, మిద్దెతోటల్లోనూ, కొద్దిగా నీళ్ళు, కొద్దిగా భూమి ఉన్న సాధారణ పొలాల్లోనూ ఆకుకూరలను, ఉత్పత్తి చేయవచ్చు. పాలకూర, తోటకూర, ఎర్రతోటకూర, చుక్కకూర, మెంతికూర, గోంగూర, పొన్నగంటి కూర, సొయకూర, కొయ్యగూర మొదలయినవి. మునగాకు కూడా ఆకుకూరగా ప్రాచుర్యంలో కొస్తున్నది. ఆరోగ్యంతో పాటు అగ్గువకే ఆకుకూరలు ఎండాకాలంలో దొరుకుతున్నందున కొనడం ఎక్కువయింది. 

పూలు: ఈ నెలలో నారుపోయదగిన పూలు – కనకాంబరం. మే-జూన్‌ నెలల్లో నారుపోసుకుని, ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో నాటుకోవాలి. నాటిన తర్వాత 2 సం|| వరకు లాభదాయకంగా పూత తీసుకోవచ్చు. 2 సంవత్సరాలలో పూత దిగుబడి 1500-2000 కిలోలు. పూలకాడల్లో పూలు తెంపడం అయిపోయాక, పూల గుత్తులను, ఎండిన కొమ్మలను తీసి వేస్తూ ఉంటే సంవత్సరం పొడవునా పూలను పొందవచ్చు. వర్షాకాలంలో దిగుబడి తక్కువగా ఉంటుంది.

టమాట: ఎండలు, వడగాల్పులు మే మొదటి వారం వరకు విపరీతంగా ఉన్నాయి. అక్కడక్కడ వడగండ్ల వానలు, అకాల వర్షాలు పడి, పంట దెబ్బతిన్నది. భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. దిగుబడి తగ్గితే ధరలు పెరగవచ్చు. జూన్‌-జూలైలో ఎక్కువ ధరలుండే సూచనలు కనబడుతున్నాయి. తర్వాతి ధరలు జూన్‌-జూలైల్లో కురిసే వర్షాల మీద ఆధారపడతాయి.

కీరదోస, బెంగుళూరు మిర్చి: సాలాడ్‌గా ఉపయోగం, చైనీస్‌ ఫుడ్‌లలో బాగా వాడటం వలన వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. పాలీహౌస్‌లలో, నెట్‌హౌస్‌లలో, షేడ్‌నెట్‌లలో వీటిని పెంచడం బాగా పెరుగుతున్నది.

కందగడ్డ: ఖరీఫ్‌ పంటను ఏప్రిల్‌ నుండి జూన్‌ వరకు, మేలో కూడా నాటితే నవంబరు నుండి జనవరి వరకు త్రవ్వకానికి తయారవుతుంది. మంచిరకాలు: గజేంద్ర: 6-8 నెలల పంట. దిగుబడి 26-28 ట/ఎ. శ్రీత్రిపుర: 9-10 నెలల పంట. దిగుబడి: 14 ట/ఎ.

మామిడి: తయారైన కాయలను మందులు వేయకుండా చెట్ల క్రింద వరి లేక బోద గడ్డిలో మాగబెట్టితే ఎక్కువ రేటుకు అమ్ముకోవచ్చు. ఆ విధంగా బోర్డు పెట్టుకోవాల్సుటుంది. ఈ పండ్లు పుల్లగా ఉండకుండా, తియ్యగా, కమ్మగా ఉంటాయి.

ఫ్రెంచ్‌బీన్స్‌: ఎండాకాలంలో పంట సరిగా ఎదగదు. పాక్షిక నీడ ఉండాలి. కొండ ప్రాంతాల్లో చల్లగా ఉన్న ప్రాంతాల్లో ఎదుగుతుంది. వెజ్‌బిరియానీలో వాడకం ఎక్కువ. మంచిరేటొస్తుంది. పాక్షిక నీడ ఉన్న తోట పంటలలో, సాగుచేసి మంచి ఆదాయం పొందే వీలుంది. అనుకూలమైన రకాలు: అర్కకోమల్‌: 70 రోజులకు కాయకోత కొస్తుంది. కాయ దిగుబడి 4.0-4.8 ట/ఎ. కాయనాణ్యత చాలా బాగుంటుంది. రవాణాను తట్టుకుంటుంది. పంత్‌ అనుపమ: 55-65 రోజుల్లో మొదటికోత. గింజ త్వరగా పట్టదు. కాయలు ఆకుపచ్చగా ఉంటాయి. ఆకుమచ్చ తెగులును కొద్దిగా తట్టుకుంటుంది. వెర్రి తెగులును కూడా తట్టుకుంటుంది. కాయదిగుబడి 3-6 ట/ఎ.

జొన్న: జొన్న పంటను ఇదివరకు తెలంగాణ ప్రభుత్వము ఎకరాకు 8-8.5 క్వింటాళ్లు మాత్రం మద్దతు ధరకు (రూ.3180/క్వి) కొంటామనేవారు. ఇప్పుడు ఎకరాకు 12 క్వింటాళ్ళ దాకా కొంటామంటున్నారు. 

చింతచిగురు: చింతచిగురు చిల్లరగా హైదరాబాదులో 100 గ్రా. రూ. 80 నుండి 100 దాకా అమ్ముతున్నారు. 

అకాల వర్షాల్లో నష్టపోయిన పంటలు: వరి, మొక్కజొన్న, జొన్న, నువ్వులు, మామిడి, బొప్పాయి.

ఉల్లి ఎగుమతులపై ఆంక్షల తొలగింపు: టన్ను ధర కనీసం 550 డాలర్లు (సుమారు రూ. 46000) గా ఉంటే ఎగుమతులకు అంగీకరిస్తారు. ఎగుమతి సుంకం 40% ఉంటుంది. మొత్తం 770 డాలర్లు (సుమారు రూ. 64000) రైతులకు ఎంతవరకు ఉపయోగమో గమనించాలి.

9 లోగా సంపూర్ణంగా రైతు భరోసా: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు అందరి ఖాతాల్లోకి మే 9వ తేదీలోగా జమచేస్తామంటున్నారు. మంచి పని.

మనసుండాలి-ధైర్యముండాలి-మార్గమదే సాధ్యం: ప్రతి సంవత్సరం ఎండలు, వానలు, గాలులు, వడగండ్లు, కడగండ్లు, రైతుల మొరల ఆలకింపే లేదు. 75 ఏండ్లయింది స్వతంత్రమొచ్చి. మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం మొలకలు వస్తూనే ఉన్నాయి. టెక్నాలజీలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆ ఊర్లో పంటలు నా ఊర్లోనే, ఏ రైతు పంటలనారైతు పొలం దగ్గరే కొంటే అతనికెన్ని బాధలు తప్పుతాయి. ప్రభుత్వాల విధానాలలో మార్పులు తేవాల్సిన అవసరముంది. రైతులను వ్యాపారులు మోసగించకుండా కాపాడడానికి ప్రతి జనావాసం/కుగ్రామం/గ్రామం/పెద్ద ఊర్లలో రైతు ప్రజాసంఘాలను సులభంగా ప్రోత్సహించవచ్చు. అవి రైతులకు అన్ని విధాలా అండగా ఉండేటట్లు తీర్చిదిద్దవచ్చు. ఇప్పటికే ఉన్న వ్యవసాయ, తదనుబంధ శాఖల అధికారులను ఉపయోగించి వీటిని ఏర్పాటు చేయవచ్చు. పండిన సరుకును వీడియోకాన్ఫరెన్స్‌ల ద్వారా అమ్మే విధానం సులభతరం చేయవచ్చు. మార్కెట్లకే వెళ్లాలి. అక్కడ దళారీలకు కొంత మేపాలనేది మార్చాలి. ఇండ్ల దగ్గరే మంచి రేటుకు బాధలు లేకుండా అమ్ముకునేందుకు యంత్రాంగం సహకరించే విధంగా మార్పులు జరగాలి. బాధలు తగ్గాలి. పనితనం పెరగాలి. రైతుల జీవితాలు గాలిలో పెట్టిన దీపాలు గాకుండా కాపాడాలి. అందుకు గొప్ప మనసుతో, పట్టుదలతో ప్రభుత్వాలు సహకారమందించాలి. మార్పుతప్పకుండా వస్తుంది.