కల్పవృక్షంగా అభివర్ణించే కొబ్బరి సాగు ప్రపంచవ్యాప్తంగా 93 దేశాలలో జరుగుచున్నది. దేశ వ్యాప్తంగా కేరళ, తమిళనాడు, కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్‌ కొబ్బరిని పండించే ముఖ్యమైన రాష్ట్రాలు. కొబ్బరిని ఎక్కువగా పండించే రాష్ట్రాలలో మన ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. మన రాష్ట్రంలో దీనిని సుమారు లక్ష హెక్టార్లలో సాగు చేస్తున్నారు. కొబ్బరి సాగుకు సంబంధించి మన రాష్ట్రం విస్తీర్ణంలో నాల్గవ స్థానంలో ఉంది. విస్తీర్ణంలో సగానికి పైగా ఉభయ గోదావరి జిల్లాలలో ఉండి, మిగతా విస్తీర్ణం, ఉత్తరకోస్తా, కృష్ణా, గుంటూరు మరియు చిత్తూరు జిల్లాలలో ఉన్నది. కొబ్బరిలో దిగుబడి గణనీయంగా తగ్గిపోవడానికి ప్రధానమైన కారణం శిలీంధ్రాలు కలుగజేసే తెగుళ్ళు. ఈ తెగుళ్ళలో ఎర్రలక్క తెగులు (గానోడెర్మా తెగులు), నల్లమచ్చ తెగులు మరియు మొవ్వుకుళ్ళు లేదా కాయకుళ్ళు తెగుళ్ళు ముఖ్యమైనవి.

కొబ్బరి పంట దిగుబడిని గణనీయంగా తగ్గించే వివిధ కారణాలలో తెగుళ్ళు ముఖ్యమైనవి. గానోడెర్మా శిలీంధ్రము వలన కలిగే ఎర్రలక్క తెగులు అతి ముఖ్యమైనది మరియు ప్రమాదకరమైనది. ఈ తెగులు ఎక్కువగా తేలిక పాటి నేలలైన ఇసుక నేలలు, ఎర్ర నేలలు, లంక భూములలో ఉన్న కొబ్బరిని ఆశిస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలోని సఖినేటిపల్లి, మల్కిపురం, ఆత్రేయపురం, రాజమండ్రిలోని లంక భూముల్లో, అప్పనపల్లి, ఉప్పలగుప్తం, అల్లవరం, కలవచర్ల మండలాలలో ఈ తెగులు ఉధృతి గమనించడమైనది. అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం, శ్రీకాకుళంలోని కవిటి మండలం, విజయనగరం జిల్లాలోని పూసపాటి రేగ మండలాలలో కూడా గమనించడమైనది.

గానోడెర్మా తెగులు

కొబ్బరి తోటలను ఆశించు తెగుళ్ళలో గానోడెర్మా తెగులు ముఖ్యమైనది మరియు చాలా ప్రమాదకరమైనది. దీనిని సిగ తెగులు, ఎర్రలక్క తెగులు, బంకకారు తెగులు, పొట్టులక్క తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు నల్ల నేలలలో కంటే తేలిక నేలల్లోని కొబ్బరి తోటలలో ఎక్కువగా కనబడుతుంది. వ్యాప్తి కూడా తేలిక నేలల్లో విస్తారంగా ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా ఉన్న సంవత్సరాలలో వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉండటం గమనించవచ్చు. సాధారణంగా నవంబరు నుండి జూన్‌ వరకు ఉండే వాతావరణ పరిస్థితులు ఈ తెగులు వ్యాప్తికి దోహదపడుతుంటాయి. ఈ తెగులు తీవ్రత మరియు తెగులు వ్యాప్తి నీటి ఎద్దడి అధికముగా ఉండు తోటలలో ఎక్కువగా ఉంటుంది. సాధారణముగా రైతులు, కొబ్బరి చెట్ల వేర్లను నరికివేయడం చేస్తూ ఉంటారు. అలా చేయరాదు. కొబ్బరి వేర్లు నరికివేయడం వలన వేర్లు గాయము ఏర్పడి నేలలో ఉండే గానోడెర్మా తెగులు కలుగచేయు శిలీంధ్రబీజాలు గాయమైన వేర్ల ద్వారా చెట్లను ఆశించడం జరుగుతుంది. 

గానోడెర్మా తెగులు లక్షణాలు

గానోడెర్మా తెగులు నేలలో ఉండే బూజు జాతి శిలీంద్ర బీజముల వలన కొబ్బరికి సోకుతుంది. గానోడెర్మా తెగులు తొలుత భూమిలో నుండు వేర్లను ఆశించును. ఈ థలో మనము తెగులును గమనించలేము. అధిక శాతం వేర్లుకుళ్ళిన తరువాత కాండములోకి వ్యాపించి కణాలు పూర్తిగా కుళ్ళేలా చేస్తుంది. అయితే ఈ కుళ్ళు భూమిలోను, కాండములోను అంతర్గతమవడం వలన బయటకు కనిపించదు. క్రమక్రమముగా ఈ తెగులు వేర్ల నుండి కాండములోనికి ప్రవేశించును. ఈ థలో కాండము మొదలు చుట్టూ ఉన్న చిన్న చిన్న పగుళ్ళ నుండి ముదురు గోధుమ రంగు నుండి తెలుపు వర్ణం కలిగిన చిక్కటి జిగురు వంటి ద్రవం కారడం గమనించవచ్చు. కాండములోని కణ సముదాయం పూర్తిగా కుళ్ళిపోవడం వలన చెట్టు అవసరమైన నీరు, పోషక లవణాలను భూమి నుండి తీసుకోలేకపోతుంది. ఈ థలో కాండము మొదలు చుట్టూ ముందు చిన్న చిన్న పగుళ్ళ ద్వారా జిగురు కారును. ఈ బంక కారుట క్రమేణా పైకి వ్యాపించును. తెగులు సోకిన చెట్టు ఆకులు పసుపు వర్ణమునకు మారి వడలిపోయి గోధుమ వర్ణానికి మారుతాయి. కొత్త ఆకులు ఆలస్యముగా రావడము వలన తెగులు సోకిన చెట్టుపై ఆకుల సంఖ్య తక్కువగా ఉండటం గమనించవచ్చు. అదే విధముగా ఆకు పరిమాణము కూడా తగ్గిపోతుంది.

తెగులు సోకిన కొబ్బరి మొక్కలలో పుష్పాల సంఖ్య బాగా తగ్గిపోవడమే కాకుండా మగ పుష్పాల సంఖ్య పెరిగి ఆడ పుష్పాల సంఖ్య బాగా తగ్గి పోతుంది. పిందెలు, కాయలు రాలడము కూడా ఈ తెగులు యొక్క లక్షణము. ఈ తెగులు ఆశించిన కొబ్బరి చెట్టు వేర్లను గమనించినట్లయితే పూర్తిగా కుళ్ళిపోయి నలుపు రంగులో మారడం చూడవచ్చు. తెగులు తీవ్రంగా ఉన్న చెట్లలో సుమారు 70 శాతం వేర్లు కుళ్ళిపోయి ఉంటాయి. కొత్త వేర్లు పుట్టవు. ఏ మాత్రము అశ్రద్ధ చేసినను తెగులు తీవ్రమయి చెట్టు ఆకులు పసుపు వర్ణంలోకి మారి వడలి వ్రేలాడిపోవు థకు చేరును.తరువాత మొవ్వు భాగం మొత్తం వడలి చెట్టు ఎండిపోతుంది. ఈ లక్షణము గానోడెర్మా తెగులుగా గుర్తించాలి. పిమ్మట ఈ ఎండిపోయిన కొబ్బరి ఆకులు రాలిపోవడం జరుగుతుంది. కొబ్బరి ఆకులు పూర్తిగా రాలిపోవడం వలన కాండము మొండిగా తయారై చెక్కిన పెన్సిల్‌ మొన మాదిరిగా అగుపిస్తుంది. తదుపరి 5, 6 మాసములలో చెట్టు చనిపోవును. కొన్ని సమయాలలో తెగులు సోకి చివరి థలో ఉన్న చెట్ల మొదళ్ళపై పుట్టగొడుగులు మొలుచును. ఈ పుట్టగొడుగుల పై భాగము లక్క రంగులో ఉండును. క్రింది భాగము తెలుపు లేక బూడిద రంగులో ఉండును. ఈ భాగమును శ్రద్ధగా చూసినచో లక్షలాది సూక్ష్మరంధ్రములు కనిపించును. వీటి నుండి కోట్ల కొలది తెగులు కలిగించు శిలీంద్రము యొక్క బీజములు బయల్పడి గాలి ద్వారా వ్యాప్తి చెందును. తడికి ఇవి మొలకెత్తి శిలీంద్రమును పెంచిదగ్గరలో ఉన్న కొబ్బరి వేర్లను తెగులుకు గురిచేయును. అదుచేతనే ఈ గానోడెర్మా తెగులును పుట్టగొడుగులు ఏర్పడువరకు రానిచ్చుట అత్యంత ప్రమాదకరము. బలమైన గాలులు వీచినపుడు ఈ గానోడెర్మా తెగులు సోకి చనిపోయిన చెట్లు, అడుగు భాగములో విరిగి పడిపోవడం కొబ్బరి తోటలలో గమనిస్తూ ఉంటాము. ఈ పడిపోయిన కొబ్బరి దుంగలను గమనించినపుడు దుంగల లోపలి భాగము కుళ్ళిపోయి గుల్లమాదిరి ఉండుటం కూడా గమనించవచ్చు. 

గానోడెర్మా తెగులు నివారణకు జీవనియంత్రణ పద్ధతులతో కూడిన సమగ్ర యాజమాన్య పద్ధతులు

1. తోటలో గానోడెర్మా తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు ఉన్న ప్రాంతమును ఒక మీటరు లోతు, 50 సెం.మీ. వెడల్పు గల గోతిని త్రవ్వి తెగులు సోకిన చెట్ల నుండి వేరు చేయాలి. ఈ విధముగా చేయడం వలన తెగులు సోకిన చెట్టు వేర్లు వద్ద ఉన్న తెగులు కలుగచేయు శిలీంద్ర బీజాలు ఆరోగ్యవంతమైన చెట్టు వద్దకు చేరజాలవు.

2. తోటలోని చనిపోయిన మరియు తెగులు ఎక్కువగా సోకిన చెట్లను వేర్లతో సహా పెకలించి తగుల బెట్టవలయును. లేనిచో చనిపోయిన చెట్ల కాండముపై పుట్టగొడుగులు మొలచి తెగులు వ్యాప్తిని నిరోధించుట కష్టసాధ్యమగును. ఆ గోతులలో చెత్త, గడ్డి వేసి తగులబెట్ట వలయును. ఏ పరిస్థితులలోను చనిపోయిన చెట్ల మొదళ్ళను తోటలో నిలువ ఉచంరాదు. లేనిచో కొత్తగా నాటిన మొక్కలు చనిపోవును.

3. చనిపోయిన చెట్ల స్థానంలో తిరిగి మొక్కలను నాటేముందు, గుంతలను వారం, పదిరోజులు సూర్యరశ్మికి బాగా ఎండేలా చేయాలి. తరువాత చెత్త, చెదారం వేసి కాల్చడం ద్వారా వేరు కుళ్ళు శిలీంద్రాలను నియంత్రించవచ్చు. కొత్త మొక్కలను తిరిగి నాటునపుడు చెత్త వేసి కాల్చిన గోతులలో బాగా చివికిన పశువుల ఎరువు, కంపోస్ట్‌ ఎరువులతో పాటు 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రపు పొడిని 1 కిలో వేపపిండి మిశ్రమముతో నింపి మొక్కను నాటవలయును.

4. కొత్తగా తోటలు పెంచడానికి తెగులు ఉనికి లేని ప్రాంతాలలో పెంచిన మొక్కలు ఎన్నుకోవాలి.

5. గానోడెర్మా తెగులు కలిగించే శిలీంద్రబీజాలు నేలలో ఉండి తెగిన లేక దెబ్బ తిన్న వేర్ల ద్వారా చెట్లకు వ్యాపిస్తుంది. కనుక కొబ్బరి చెట్ల వేరు నరుకుట, వేర్లు తెగునంతవరకు లోతుగా దుక్కి చేయుట పనికిరాదు. ఎట్టి పరిస్థితులలోను చెట్ల వేర్లు నరకరాదు.

6. ఈ తెగులు ఎక్కువగా తేలిక నేలల్లో వస్తుంది. అందువల్ల ఈ తేలిక నేలల్లో జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పంటలు చిక్కగా పెంచి పూతకు వచ్చే థలో భూమిలో కలియదున్నాలి. ఇందువల్ల భూమిలో సేంద్రియ పదార్థములు పెరిగి నీటిని నిలువ ఉంచు శక్తి అధికమవుతుంది. దీనితో పాటుగా గానోడెర్మా శిలీంద్రాన్ని అదుపులో ఉంచే శిలీంద్రాలు కూడా అభివృద్ధి అవుతాయి.

7. చెట్ల మొదలు చుట్టూ రెండు మీటర్ల వ్యాసార్థం గల పళ్ళాలు చేసి, బోదెల ద్వారా ప్రతి చెట్టుకు విడివిడిగా నీరు పెట్టాలి. అలా కాకుండా తోటలకు మడులుగా చేసి నీరు పెడితే గానోడెర్మా శిలీంద్రము నీటి ద్వారా అన్ని చెట్లకు వ్యాప్తిస్తుంది.

8. గానోడెర్మా తెగులు ఉన్న నేలల్లో కొబ్బరి చెట్టుకు ప్రతి సంవత్సరం 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రపు పొడిని 5 కిలోల వేపపిండిలో కలిపి వేయాలి. ఈ ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రపు పొడిని ఖచ్చితముగా వేపపిండితో కలిపి వేయవలెను. ఎందువలన అనగా ఈ ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రము వేపపిండిలో బాగా వృద్ధి చెంది గానోడెర్మా తెలుగు కలుగచేయు శిలీంద్రబీజాలు అభివృద్ధి చెందకుండా అరికట్టగలుగుతుంది.

9. గానోడెర్మా తెగులు అధికంగా ఉన్న నేలల్లో కొబ్బరి చెట్టుకు ప్రతి సంవత్సరం 125 గ్రా. ట్రైకోడెర్మా విరిడి + 125 గ్రా. సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ శిలీంద్రపు పొడిని 5 కిలోల వేపపిండిలో కలిపి సంవత్సరమునకు ఒకసారి వేయాలి.

10. కొబ్బరి తోటలో ఏ ఒక్క చెట్టుపై గానోడెర్మా తెగులు లక్షణాలు కనిపించినా, ఆ తోటలోని అన్ని చెట్లకు పైన వివరించిన విధముగా చర్యలు చేపట్టవలయును.

11. ట్రైకోడెర్మా శిలీంద్రపు పొడిని బోర్డో మిశ్రమముతో కాని లేక ఇతర తెగులు మందులతో కలిపి వాడరాదు. 

నల్లమచ్చ తెగులు

నల్లమచ్చ తెగులును నల్లలక్క తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ధీలావియాప్సస్‌ పేరడాక్సా అనే బూజు జాతి శిలీంద్రము వలన కలుగుతుంది. ఈ తెగులు అన్ని వయస్సుల కొబ్బరి చెట్లను ఆశిస్తుంది. కాని తక్కువ వయస్సుగల చెట్లపై తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది. భూమిలో ఎత్తయిన నీటిమట్టం మరియు నేల యొక్క అధిక ఆమ్ల్ల లేదా క్షార లక్షణములు ఈ తెగులు కలగడానికి దోహదం చేస్తాయి. 

నల్లమచ్చ తెగులు లక్షణాలు

కాండము పై పగుళ్ళ నుండి ముదురు రంగు ద్రవం కారుట ప్రధాన లక్షణము, అలా కారిన ద్రవం నలుపురంగులోకి మారి నల్లమచ్చగా ఆమరుతుంది. ఈ నల్లమచ్చ క్రిందనున్న భాగమంతా కుళ్ళిపోతుంది.  ఈ నల్లమచ్చ ప్రాంతములో చెక్కినట్లయితే పసుపునుండి గోధుమ వర్ణం కలిగిన ద్రవం బయటకి వస్తుంది. తెగులు బాగా అభివృద్ధి చెందితే కాండముపైన బెరడు ఊడిపోతుంది. ఈ తెగులుకు అనుకూల పరిస్థితులు తోడు అయినపుడు, కాండము అంతయూ నల్లని చారలుగా అగుపించును. ఈ తెగులు ఆశించిన చెట్లలో కొబ్బరికాయల దిగుబడి తగ్గిపోతుంది. ఈ తెగులు లేత వయసు మొక్కలను ఆశించినపుడు, ఆ మొక్కలు చనిపోయే ప్రమాదము ఉన్నది. ఈ తెగులు కలుగచేయు బూజు శిలీంధ్రము కాండము పై ఏర్పడిన గాయముల ద్వారా, పగుళ్ళ ద్వారా చెట్టులోనికి ప్రవేశించి తెగులును కలుగచేయును.

యాజమాన్య పద్ధతులు

1. కొబ్బరి చెట్టు కాండముపై ఎటువంటి గాయము కలిగించరాదు.

2. ఈ తెగులు లక్షణాలు కాండముపై కనిపించిన వెంటనే, ఆభాగము పై ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని పేస్ట్‌గా తయారుచేసి పూయవలెను (50 గ్రాముల పొడికి 25 మి.లీ. నీటిని కలిపిన పేస్ట్‌ తయారగును). 

3. ఈ తెగులును కలిగించే శిలీంధ్రబీజాలు కూడా గానోడెర్మా తెగులు కలిగించే శిలీంధ్ర బీజాలవలనే నేలలో ఉండి, తగిన వాతావరణ పరిస్థితులలో కాండముపై ఉన్నటువంటి సహజమైన పగుళ్ళద్వారా కొబ్బరిని ఆశించి తెగులును కలిగిస్తాయి. కావున నేలలో ఉన్నటువంటి శిలీంధ్రబీజములను అరికట్టుటకు ప్రతి సంవత్సరము చెట్టుకు 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి శిలీంధ్రపు పొడిని 5 కిలోల వేపపిండితో కలిపి పాదులలో వేయడం వలన లాభదాయకంగా ఉంటుంది.

నల్లమచ్చ తెగులు లక్షణాలు కాండముపై కనిపించిన వెంటనే, ఆ భాగమును చెక్కి, అక్కడ ట్రైకోడెర్మా విరిడి కేకును పెట్టి కట్టవలయును. ఈ విధముగా చేయడం ద్వారా ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రబీజములు అభివృద్ధి చెంది, తద్వారా నల్లమచ్చ తెగులును నివారించవచ్చును.

మొవ్వుకుళ్ళు తెగులు

మొవ్వుకుళ్ళు, కాయకుళ్ళు తెగులు వర్షాకాలంలో కొబ్బరిని ఆశించి నష్టపరుస్తాయి. వర్షాల ఆరంభముతోనే ఈ తెగులు లక్షణాలు కనిపించడానికి అవకాశము కలదు. మొవ్వుకుళ్ళు, కాయకుళ్ళు తెగులు సోకిన చెట్లు, నివారణ చర్యలు తీసికొననిచో చనిపోతాయి. ఈ తెగులును ఫైటోఫ్తోరా పామివోరా అనే బూజుజాతి శిలీంద్రము కలుగుచేస్తుంది. కొబ్బరిలో మొవ్వు, కాయకుళ్ళు తెగులు నారుమడిలోని చిన్న మొక్కల నుంచి 25 ఏళ్ళలోపు చెట్లకు ఆశించి నష్టపరుస్తుంది. నీటి ముంపునకు గురైన తోటల్లో ఇది ఎక్కువగా ఆశిస్తుంది. లంక భూముల్లోని తోటల్లో వరద ముంపునకు గురయిన సంవత్సరాలలో ఎక్కువ నష్టం కలిగిస్తుంది.

లక్షణాలు

ఓ తెగులు సోకిన మొక్కల్లో మొదట మొవ్వు ఆకు, దాని పక్కనున్న రెండు లేదా మూడు ఆకులు వడలిపోతాయి.

ఓ తర్వాత ఇతర పరాన్నజీవులు చేరి మొవ్వు పూర్తిగా కూల్చి, చెడు వాసన వస్తుంది.

ఓ ఈ కుళ్ళు మొవ్వు ఆకు క్రిందకు వ్యాపించి కొబ్బరి చెట్టులోని ఏకైక అంకురాన్ని ఆశించి, తద్వారా అంకురం చనిపోయి చెట్టు చనిపోతుంది. 

ఓ కొన్నిసార్లు మొవ్వు కుళ్ళినప్పటికీ అంకురం బ్రతికి ఉండుటచేత కొన్ని మాసాల తరువాత కొత్త ఆకులు జనిస్తాయి.

ఓ కాని అవి అంచులు మాడి కురచగా గిడసబారినట్లుగా ఉంటాయి. ఇటువంటి ఆకులు మొవ్వులోని పీచుతో నొక్కివేయబడి గుబురుగా ఉంటాయి.

ఓ తగిన సమయంలో నివారణ చర్యలు తీసుకొననిచో ఈ తెగులు కొబ్బరి తోటలకు విపరీతంగా నష్టాన్ని కల్గించును.

మొవ్వుకుళ్ళు తెగులు నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు

తెగులు సోకిన తర్వాత నివారణ చర్యలు తీసుకునేకంటే రాకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. 

1. సిఫారసు చేసిన విధంగా 8 మీటర్ల ఎడంతో కొబ్బరి మొక్కలు నాటాలి. దగ్గర దగ్గరగా నాటితే గాలిలో తేమ పెరిగి త్వరగా, సులభంగా తెగులు వ్యాప్తి చెందుతుంది. 

2. తెగులు సోకి చనిపోయిన చెట్లను తీసి కాల్చివేయాలి. మొవ్వుకుళ్ళు సోకిన చెట్టు మొవ్వు, దాని ప్రక్కన కుళ్ళిన భాగము తీసివేసి తగులబెట్టాలి. గిడసబారి కురచ ఆకులున్న చెట్ల మొవ్వులోని పీచు కోసివేసి ఆకులు సులభంగా బయటకొచ్చేలా వదులుచేయాలి. 

3. సిఫారసు చేసిన మోతాదులో పొటాష్‌ ఎరువులు క్రమం తప్పకుండా వేస్తే మొక్కలలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

4. కొబ్బరి మొక్క మొవ్వు భాగంలో సుడోమోనాస్‌ ప్లోరిసెన్స్‌ టాల్క్‌ పొడిని వేయాలి. మొక్క వయసును బట్టి సంవత్సరం లోపు మొక్కకు 5 గ్రాములు, ఒక సంవత్సరం మొక్కకు 10 గ్రాములు ఇదే విధముగా 2, 3, 4, 5 మరియు 5 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు గల మొక్కలకు 75, 100, 150, 200 గ్రాముల టాల్క్‌ పొడిని వేయాలి.

5. కాయకుళ్ళు సోకిన గెలను తొలగించి, ఇతర గెలలు, మొవ్వు భాగం తడిచేలా సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ కల్చర్‌ ద్రావణాన్ని పిచికారి చేయాలి.

6. వరద ముంపుకు గురయిన తోటలలో వరద నీరు తగ్గగానే మొవ్వులలో చేరిన ఒండ్రుమట్టి పోయేలా శుభ్రంగా కడిగివేయాలి. తదుపరి మొక్క వయసును బట్టి పై విధముగా సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ టాల్క్‌ పొడిని వేయాలి లేక సూడోమోనాస్‌ ఫ్లోరిసెన్స్‌ కల్చర్‌ ద్రావణాన్ని మొవ్వు ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి.

7. ఈ తెగులును కలిగించే శిలీంద్రబీజాలు కూడా నేలలో ఉండి, వాతావరణ పరిస్థితులు అనుకూలించినపుడు కొబ్బరి మొక్కను ఆశించి తెగులును కలిగిస్తాయి. అందువల్ల నేలలో ఉన్నటువంటి శిలీంద్ర బీజాల ఉత్పత్తిని అరికట్టేందుకు ప్రతి యేటా చెట్టుకు 50 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి శిలీంద్రపు పొడిని 5 కిలోల వేపపిండితో కలిపి పాదులలో వేయాలి. దీని వల్ల నేలలో ఉండే శిలీంద్రబీజాల ఉత్పత్తి తగ్గిపోవడమే కాక తెగుళ్ళను తట్టుకునే శక్తి కూడా పెంపొందుతుంది. 

ఆకు ఎండు తెగులు లక్షణాలు

1. ఈ తెగులు పాత ఆకులపై మచ్చలుగా ఏర్పడి క్రమేపి ఆకు మొత్తము విస్తరిస్తుంది. బాహ్యవలయంలో ఉన్న ఆకులను ఎక్కువగా ఆశిస్తుంది.

2. తెగులు సోకిన ఆకుల చివరి నుండి ఎండిపోవడం ప్రారంభమై, క్రమేపి ఆకు మొత్తం ఎండిపోయినట్లు ఉంటుంది.

3. ఈ తెగులు సోకిన కాయలపై అలల మాదిరిగా మచ్చలు ఏర్పడి ముచ్చిక చివరి భాగంలో వ్యాప్తి ప్రారంభమవుతుంది.

4. తరువాత కాయ లోపల కొబ్బరి మొత్తం కుళ్ళిపోతుంది. దీనివలన కాయలు ఎదుగుదల లేక, చిన్నవిగా ఉండి, ఊడిపోతాయి. దిగుబడి 10 నుండి 25 శాతం వరకు తగ్గుతుంది.

5. ఈ తెగులు సంవత్సరం మొత్తం వ్యాపిస్తుంది. ఎక్కువగా వేసవి కాలము తెగులుకి అనుకూల వాతావరణము.

6. వాతావరణ పరిస్థితులు అనుకూలించినప్పుడు శిలీంద్ర బీజాలు గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి.

యాజమాన్య పద్ధతులు

1. తెగులు సోకిన ఆకులను తోట నుండి వేరు చేసి కాల్చివేయాలి.

2. ఈ తెగులు ఉన్న కొబ్బరి చెట్టుకు ప్రతి సంవత్సరం 200 గ్రా. సూడోమోనాస్‌ ఫ్లోరిసన్స్‌ టాల్క్‌ పొడిని, 50 కిలోల పశువుల ఎరువు మరియు 5 కిలోల వేపపిండిలో కలిపి వేయాలి.

డా|| వి.గోవర్ధన్‌ రావు, సైంటిస్ట్‌ (ప్లాంట్‌ పేథాలజీ), శ్రీమతి బి. నీరజ, సైంటిస్ట్‌ (ప్లాంట్‌ పేథాలజీ), డా||ఎన్‌.బి.వి.చలపతిరావు, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ (కీటక విభాగం), డా|| వి. అనూష, సైంటిస్ట్‌ (ఎంటమాలజీ), శ్రీ ఎ. కిరీటి, సైంటిస్ట్‌ (హార్టీకల్చర్‌), డా|| జి.కోటేశ్వరరావు, రీసెర్చ్‌ అసోసియేట్‌ (హార్టీ), డా|| బి. శ్రీనివాసులు, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ & హెడ్‌, డా|| వై.యస్‌.ఆర్‌.హెచ్‌.యు. – ఉద్యాన పరిశోధనా స్థానం, డా|| వై.యస్‌.ఆర్‌.ఉద్యాన విశ్వవిద్యాలయము, అంబాజీపేట – 533214, డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌.