సాధారణంగా పశువులలో వచ్చు కామెర్లనే ఇక్టిరస్ లేదా జాండీన్ అని కూడా అందురు. ఇది సాధారణంగా కాలేయవ్యాధులలో అతిప్రధానమైన లక్షణం. ఇది సాధారణంగా బైలిరుబిన్ అనునది రక్తంలో >2.0 mg/d గ్రా. ఉన్నపుడు కనిపించును. దీనివలన శ్లేష్మపొరలు, అన్నిరకాల కణజాలాలు మరియు కణజాల ద్రవాలు పసుపురంగులోనికి మారి కంటిలోని స్ల్కీరా యందు పసుపురంగు స్పష్టంగా కనిపించును. ఇది కాలేయ వ్యాధులు, రక్తంలోని ఎర్రరక్తకణాలు అధికంగా విచ్ఛిన్నమయినపుడు లేదా పైత్యరసము ప్రేగులోనికి చేర్చు నాళము మూతపడినపుడు లక్షణంగా కనిపించును.

సాధారణంగా జాండీస్‌ను మూడు రకాలుగా విభజించవచ్చును. ఇవి హీమోలైటిక్, టాక్సిక్ మరియు అబ్‌స్ట్రక్టీవ్ జాండీస్ రకాలు. హీమోలైటిక్ జాండీస్‌కు గల ముఖ్యమైన కారణాలు ఎర్రమూత్రవ్యాధి, ఎనాప్లాస్మోసిస్, ట్రిపనోసోమియాసిస్, ఈక్వైన్ వైరల్ ఎనీమియా, క్లాస్ట్రీడియల్ వ్యాధులు మొదలగునవి. ఈ వ్యాధుల కారణంగా అనేకమైన ఎర్రరక్తకణాలు ఒకేసారి విచ్ఛిన్నమై కామెర్లను కలుగజేయును. సాల్మొనెల్లా, లెప్టోస్పైరా, ఇన్ఫెక్షియస్ కెనైన్ హెపటైటిస్, పాష్పరస్ వంటి విషపదార్థాలు, క్రొటలేరియా వంటి విషపు మొక్కల కారణంగా కాలేయ కణాలు దెబ్బతిని నాశనము అగును. అందువలన వచ్చే కామెర్లను టాక్సిక్ జాండీస్ అందురు. పరాన్నజీవులు అగు ఫేషియోలా హెపాటికా, ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్; గొర్రెలలో బద్దెపురుగులు; కొలాంజైటిస్, కోలిసిస్టైటిస్, ప్యాంక్రియాటైటిస్, పైత్యరస నాళికలోనికి చిన్నచిన్న రాళ్ళు చేరటం, కణితులు వంటి కారణాల వలన కలుగు కామెర్లను అబ్‌స్ట్రక్టీవ్ జాండీస్ అందురు. ఇది ముఖ్యంగా పై కారణాల వలన పైత్యరస నాళిక మూతపడుట వలనవచ్చును. కామెర్ల సమయంలో శ్లేష్మపొర కొన్నిసార్లు చర్మం పచ్చగా కనిపించును. మూత్రము చిక్కటి, పచ్చటి ద్రవములాగ రావటము; పాలు పసుపు రంగులోనికి మారటం పైన తెలిపిన విధంగా బైలిరూబిన్ మోతాదు పెరుగుట, క్రొవ్వు కలిగిన మలవిసర్జన చేయటం, ఆకలి మందగించుట లేదా అసలే లేకపోవటం, శరీర బరువు తగ్గటం, కుక్కలలో వాంతులు కలుగుట జరుగును. దీని నిర్ధారణ మూత్ర పరీక్ష (హే పరీక్ష), సీరం పరీక్ష (వాండెన్ బర్గ్ పరీక్ష) మరియు ఇక్టిరస్ ఇండెక్స్ (రోగి యొక్క ప్లాస్మా రంగును స్టాండర్డ్ పొటాషియం డైక్రోమేట్ ద్రవాలతో పోల్చి కనుగొనవచ్చును. చివరగా జాండీస్ యొక్క కారణాన్ని గుర్తించి, చికిత్స మరియు నివారణ చర్యలు చేపట్టి, విశ్రాంతి ఇచ్చి, క్రొవ్వు లేని, ఉప్పు లేని ఆహారం ఇచ్చినచో పశువులలో కామెర్లను నియంత్రించవచ్చు.
డా. ఎం. జీవనలత (9490292468), అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ హెడ్,
డా. ఎం. కె. శ్రీకాంత్ (9652655255), పశువైద్యాధికారి, రాజేంద్రనగర్

