”రోహిణి కార్తెతో మొదలు మన రైతన్నల వ్యవసాయ పనులు.”

తొలకరి వర్షాలతోనే రైతులు ఖరీఫ్‌ (వానాకాలం) సీజన్‌ పనులకు సన్నాహాలు జరుగుతువుంటాయి. ఈ సంవత్సరంకు గాను మనకు నైరుతి రుతుపవనాలు చాలా తొందరగా (ముందస్తుగా) వచ్చేస్తున్నాయని మన వాతావరణ విభాగం వారు తెలియజేస్తున్నారు.

ఖరీఫ్‌ 2022-2023 త్వరలో మొదలవుతుంది. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని గతంలో వ్యవసాయ పనులలో, వ్యయంలో (ఆర్థికంగా) గాని మరియు వనరులను ఉపయోగించడంలో గతంలో చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా ఈ తొలకరిలో సరైన సన్నాహాలను చేసుకొన్నట్లయితే రైతన్నకు లాభసాటి వ్యవసాయం సాధ్యమే. అలా కాని పక్షంలో రైతు వ్యవసాయంలో భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.

మనకున్న (రైతు) నేల రకం, నీటి వసతి, పెట్టుబడి లభ్యత, కుటుంబ పరిస్థితి మరియు ఆర్థిక స్థితిగతులు వంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని పంటలను మరియు విత్తన రకాలను ఎన్నుకోవాలి. మన పరిస్థితులకు అనుగుణంగా మన వ్యవసాయ ప్రణాళిక ఉండాలి. నీటి వసతి, మరియు వర్షాధారిత నేలలో కొన్ని దీర్ఘకాలిక, మరికొన్ని స్వల్పకాలిక ఆదాయ వనరులను ఇచ్చేవిధంగా ఉండాలి. ఎప్పటికి వేరే వాళ్ళను అనుకరించే విధంగా ఉండకూడదు.

సాధ్యమైన వరకు నేల సారవంతతను పెరిగే విధంగా…

  • చెరువు మట్టిని పంటపొలాలకు వేసవిలో తోలుకోవాలి.
  • పొలంలో గొర్రెల మందలకు తోలాలి (పెట్టాలి)
  • పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు మరియు గొర్రెల ఎరువులను పంట పొలాల భూములలో తప్పకుండా వాడాలి.
  • నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్న చోట వేసవిలో పచ్చిరొట్ట ఎరువులను (జీలుగ/పెసర/జనుము) వేసి అవి పూత థకు చేరుకొనే సమయంలో రోటావేటర్‌ సహాయంతో నేలలో కలియదున్నాలి. 

పంటల ఎన్నిక / పంటల ప్రణాళిక

  • ఎండాకాలంలో మట్టి నమూనా పరీక్షలు తప్పని సరిగా చేయించాలి. మట్టి నమూనాలలో వచ్చిన ఫలితాలకు సమతుల్యమైన ఎరువులను సమయానుసారంగా శాస్త్రీయ పద్ధతిలో వాడాలి.
  • వాతావరణం సూచనలు, భూగర్భ జలాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ వాటికి అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలి.
  • పంటలలో మన వాతావరణ పరిస్థితులకు మరియు మన పరిస్థితులకు అనువైన రకాలను అలాగే మన ప్రాంతంలో చీడపీడలను తట్టుకొనే రకాలను ఎన్నిక చేసుకోవాలి.
  • ఏక పంటకు బదులు బహుళ పంటల సాగు పద్దతిని ఎన్నుకోవాలి. దీర్ఘకాలిక పంటలకు బదులుగా 2-3 స్వల్పకాలిక పంటలు, తక్కువ పెట్టుబడి అవసరమున్న పంటలను ఎన్నుకోవాలి. మరీ ముఖ్యంగా అంతరపంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పంటల మార్పిడి లేక రకాల మార్పిడి తప్పకుండా పాటించాలి.
  • అవసరానుసారంగా మండల వ్యవసాయ అధికారులకు, ఏరువాక కేంద్రాలను, శాస్త్రవేత్తలను మరియు కిసాన్‌ కాల్‌ సెంటర్లను సంప్రదించి సందేహాలను (వ్యవసాయ పనులలో) నివృత్తి చేసుకోవాలి.
  • ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమన్వయ సమతుల సహాయాన్ని, మార్కెటింగ్‌, గిడ్డంగులు మరియు తక్కువ వడ్డీతో పంట రుణాలను వాటి మాఫీ సదుపాయాలను రైతులు వినియోగించుకోవాలి.
  • విత్తనాలను సర్టిఫైడ్‌ డీలర్ల వద్ద మాత్రమే కొనాలి. అలాగే రశీదు తప్పక తీసుకొని భద్రపరచుకోవాలి.
  • సమగ్ర సుస్థిర వ్యవసాయం చేపట్టాలి. అనగా వ్యవసాయంతో పాటు పెరటి కోళ్ళ పెంపకం, పాడి గేదెల పెంపకం మరియు పందిరి కూరగాయలు మొదలైనవి చేపట్టాలి. 

ఈ విధంగా రైతులు సరైన ప్రణాళికలను ఖరీఫ్‌కు ముందుగా రూపొందించుకొని, పంటలపై పెట్టుబడిని తగ్గుంచుకుని, పంట ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచుకొని, వ్యవసాయంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించి వ్యవసాయాన్ని ఈ ఖరీఫ్‌ సీజన్‌లో పండగ లాగా చేసుకోవాలి.        జి

ఎల్‌. శకుంతల, ఎం.ఎస్సీ., అగ్రానమి, ఈ. అజయ్‌ కుమార్‌, పి.హెచ్‌డి. స్కాలర్‌, సాయిల్‌ సైన్స్‌, జె. కరుణాకర్‌, ఎం.ఎస్సీ., వెజిటబుల్‌ సైన్స్‌, కె. నవ్య, ఎం.ఎస్సీ, సాయిల్‌ సైన్స్‌, వి. శాలిని, పి.హెచ్‌డి స్కాలర్‌, సాయిల్‌ సైన్స్‌, జె. కమలాకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సాయిల్‌ సైన్స్‌, పి. సౌమ్య, పి.హెచ్‌డి. స్కాలర్‌, సాయిల్‌ సైన్స్‌, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫోన్‌ : 9490998056