తెలంగాణలో పెసలును మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు శుక్రవారం నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏడు జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సంగారెడ్డి, వికారాబాద్‌, సూర్యాపేట, నారాయణపేట, మహబూబాబాద్‌, కామారెడ్డి జిల్లాలలో వీటిని ప్రారంభిస్తామన్నారు. గురువారం సచివాలయంలో ఆయన పెసర సాగుపై సమీక్ష నిర్వహించారు. మార్క్‌ఫెడ్‌ ఎండీ వి. శ్రీనివాస్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ”రాష్ట్రంలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 64,175 ఎకరాలలో ఈ పంట సాగయింది. మొత్తం 17,841 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా. పెసర సాగు అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో తొలివిడతగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. కేంద్రం నిర్దేశించిన విధంగా క్వింటాలుకు రూ. 8,682 మద్ధతు ధరతో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తుంది. రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించి పంటకు మద్దతు ధర పొందాలి” అని మంత్రి కోరారు.