అముల్‌ డెయిరీ గురించి గానీ అముల్‌ బటర్‌కు అంతర్జాతీయంగా ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి గానీ తెలియని వారు ఉండరు. అముల్‌ ఉత్పత్తులకు ముఖ్యంగా అముల్‌ బటర్‌కు అంతటి కీర్తి రావడానికి దివంగత శ్వేత విప్లవ నేత డాక్టర్‌ వర్గీస్‌ కురియన్‌ యొక్క శక్తి సామర్థ్యాలు, అముల్‌ డెయిరీ సాంకేతిక సిబ్బంది యొక్క వృత్తి నైపుణ్యాలతో పాటు అముల్‌ డెయిరీకి పాలను అందించిన సుర్తీ జాతి గేదెల పాలలోని విశిష్టతకు ఒక ముఖ్య కారణమేనని చెప్పక తప్పదు. గుజరాత్‌ రాష్ట్రంలోని కైరా జిల్లా (ఆనంద్‌ డెయిరీ పాల సేకరణకు ప్రధాన సరఫరా జిల్లా) సూరత్‌, వడోదరా, భరూచీ, నడియాద్‌, తలాఖా ప్రాంతాలలో అభివృద్ధి చెందిన సుర్తీ జాతి గేదెలు సాధారణ చిన్న-మధ్యస్థాయి రైతుల నిర్వహణకు, అక్కడి మేత, వాతావరణ యాజమాన్య పరిస్థితులకు అనుకూలంగా ఉండుటయే కాక, ఎక్కువ పరిమాణంలో అంటే సగటున 7.5 గట్టి వెన్నతో భారతీయ సగటు కంటే చాలా ఎక్కువగానే పాలను అందించగలవు. ఇందుకు ఈ జాతికి వున్న సహజమైన జన్యు శక్తితో పాటు స్థానికంగా సులువుగా, చౌకగా లభ్యమయ్యే ఎక్కువ క్రొవ్వు కలిగిన ప్రత్తి చెక్క నుండి, వేరుశనగ పిండి, ఇతర వ్యవసాయ వ్యర్థాలు కూడా దోహదపడుతున్నాయి. గోధుమ వర్ణ చర్మం కలిగిన సుర్తీ గేదెలు, ముర్రాజాతి పశువులకంటే ఎక్కువగా ఎండ ధాటిని తట్టుకోగలవు. వీటి మధ్యస్థ శరీర తూకం ముర్రా జాతి సగటు పశువు కంటే 75-80 శాతం తక్కువగా ఉండుట వల్ల వీటి నిర్వహణ ముఖ్యంగా తినే మేత పరిమాణం తక్కువగా ఉండి ఆ మేరకు పోషించే ఖర్చులు తగ్గుతాయి. మరోవిధంగా చెప్పాలంటే ఒక్క కొమ్ముల ఆకృతి, కొన్ని శరీర కణాల విషయంలో తప్ప, నాలుగైదు థాబ్దాల క్రితం మన తెలుగు రాష్ట్రాలలో విరివిగా కనిపించే గేదెల మందలలో ఉన్నతమైన నాటు జాతి గేదెలతో వీటిని పోల్చవచ్చును.

అముల్‌ డెయిరీ వారు గత ఆరుథాబ్దాలుగా అమలు చేస్తున్న పాల పరిమానాన్ని కాక అందులోని వెన్న పరిమాణం (కిలో వెన్న ఆధారిత పాల ధర నిర్ణయ విధానం) ఆధారంగా పాల సేకరణ ధరలు నిర్ణయించుట వల్ల ఎక్కువ వెన్న శాతం కలిగిన సుర్తీ గేదెపాలకు ఎక్కువ ధర రైతులకు గిట్టుబాటు కావటం వల్ల, మధ్య-చిన్న స్థాయి పాల ఉత్పత్తిదారులు సుర్తీ జాతి పాడి గేదెల పట్ల తమ ఆసక్తిని కొనసాగిస్తూ ఉండటం, ఈ జాతిని మరింత లాభదాయకం చేయడానికి, అముల్‌ డెయిరీ, జాతీయ పాడి అభివృద్ధి సంస్థ మరియు డెయిరీ పరిశోధనా సంస్థలు విశేషమైన కృషిని కొనసాగిస్తున్నాయి.

గోధుమ వర్ణం కలిగిన చర్మం, కొడవలి ఆకృతిలో బల్లపరుపుగా ఉండి ప్రక్కకు క్రిందకు ఆ తర్వాత పైకి వంగి, కొన వద్ద కొక్కెం మాదిరి వంపు తిరిగిన కొమ్ములు, పొడవు-వెడల్పు కలిగిన నుదురు, మెడ క్రింద తెల్లని ఆకర్షణీయమైన రెండు చారలు, ఎగుడుదిగుడు లేకుండా సమాంతరంగా ఉండే వెన్ను సుర్తీ జాతి ముఖ్య లక్షణాలు. 

సాధు స్వభావంతో పాటు, మధ్యస్థ శరీర పరిమాణం (400-450 కిలోల శరీర తూకం) ఈ జాతి గేదె పడ్డలు 40-45 నెలల వయసుసలో తొలిసారి ఈని, ఆ తర్వాత యాజమాన్య పరిస్థితులను బట్టి ప్రతి 400-450 రోజులకొకసారి ఈనగలవు. వేసవిలో సైతం ఎదలోకి వచ్చి చూడి కట్టే అవకాశాలు ముర్రా జాతిలో కంటే ఈ సుర్తీ జాతిలోనే ఎక్కువ అని నా వ్యక్తిగత అభిప్రాయం.

ఈ జాతి గేదెలు తొలిఈతలో సగటున 1500 నుండి 1600 లీటర్లు. రెండవ ఈతలో 1900 నుండి 2000 లీటర్లు, మూడవ ఈత నుండి 5-6 ఈతల వరకు 2200 నుండి 2500 లీటర్ల వరకు పాలను ఎక్కువ వెన్న శాతంతో అందించగలవు. పది లీటర్ల ముర్రా గేదె పాలలో ఉండే వెన్న ఎనిమిది-తొమ్మిది లీటర్ల సుర్తీ గేదెల పాలలో ఉంటుందని అముల్‌ పాల ఉత్పత్తిదారులు చెబుతారు. గరిష్టంగా రోజులో 19 లీటర్లు ఈతలో 3300 లీటర్ల పాలను ఇవ్వగల సత్తా సుర్తీ గేదెలలో ఉంది. ముర్రా గేదెలలో కంటే సుర్తీ జాతిలో పాల ఉత్పత్తి ఎక్కువ స్థిరంగా, నిలకడగా తక్కువ ఒడిదుడుకులతో ఎక్కువ రోజులు ఉండే అవకాశాలు ఎక్కువ. సుర్తీ జాతి గేదెలలో పొదుగువాపు సమస్య కూడా ముర్రా, గ్రేడెడ్‌ ముర్రా జాతులలో కంటే తక్కువ.

వివిధ సంక్షేమ పథకాల క్రింద మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న ముర్రా గేదెలు చాలామంది లబ్దిదారులకు ఆశించిన ఫలితాలను అందించని విషయం తెలిసిందే! పేద మధ్య తరగతి లబ్దిదారులకు అందుబాటులో ఉన్న పరిమిత వనరులతో సులువుగా పోషించగలిగే సుర్తీగేదెలను మన తెలుగు రాష్ట్రాలలో ప్రోత్సహించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే సుర్తీ జాతి గేదెల గర్భాశయం పొడవు ఎక్కువగా ఉండి, ఈ సమయంలో గర్భసంచి మెలికపడి (టార్షన్‌) గర్భద్వారం మూసుకు పోయి దూడ బైటకు రావడం జటిలం కావచ్చు. ఈ మెలికను నిపుణుడైన, అనుభవజ్ఞుడైన పశువైద్యుడు మాత్రమే సులువుగా సరిదిద్ది ప్రసవాన్ని సులభతరం చేయగలడు. అనుభవం లేని వారు మొరటుగా బలప్రయోగంతో దూడకు బైటకు లాగాలనే ప్రయత్నం వల్ల దూడతో పాటు తల్లి ప్రాణాలకు ముప్పు వాటిల్లవచ్చును. అయినా అలవాటుగా క్రమంగా పశువుగా పశువుల ప్రాణాలకు బీమా చేయిస్తే దీనివల్ల ఆర్థిక నష్టాలను నివారించుకోవచ్చు. 

– డా.యం.వి.జి. అహోబలరావు, 9393055611