రసాయనిక వ్యవసాయం వలన జరిగిన, జరుగుతున్న అనర్థాల నుండి బయటపడటానికి అనేకమంది రైతులు సేంద్రియ బాట పట్టారు. ఇంకా పడుతూనే ఉన్నారు. సేంద్రియ సాగు బాగా వెలుగులోకి వచ్చిన తరువాత అప్పటికే పంటలు సాగు చేస్తూ రసాయనిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తున్న రైతులు సేంద్రియం వైపు అడుగులు వేయడంతో పాటు, కొంతమంది ఉద్యోగ, వ్యాపార రంగాల నుండి కొత్తగా వ్యవసాయంలోకి అడుగుపెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. వ్యవసాయ అనుభవం ఉండి సాగు పద్ధతులు మార్చుకున్న వారి విషయంలో పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇలాంటి వారు కేవలం వారి సాగు పద్ధతులను మాత్రం మార్చుకున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటే కొత్త విధానాలను కొనసాగిస్తారు. అనుకూలంగా లేకుంటే మరలా పాత విధానాలవైపు అడుగులు వేయగలరు. కాని ఉద్యోగ వ్యాపార రంగాల నుంచి వ్యవసాయంలో కొత్తగా అడుగు పెట్టిన వారి విషయంలో అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ రెండు వర్గాలలో ఉద్యోగ రంగం నుంచి చేస్తున్న ఉద్యోగాన్ని వదలి వచ్చిన వారి విషయంలో ప్రత్యేకత అవసరం. తాము చేస్తున్న ఉద్యోగాన్ని వదలి, వచ్చే ఆదాయాన్ని వదలి శారీరక శ్రమ పెద్దగా అవసరం లేకుండా కేవలం ఎ.సి. (సాఫ్ట్‌వేర్‌ రంగం) గదులకు, కుర్చీలకే పరిమితమయిన జీవనశైలి నుంచి పూర్తిగా శారీరక శ్రమ ఉండి, చెమటలు కక్కే నిండు వేసవిలో పనిచేయవలసిన జీవన శైలికి మారవలసి వస్తుంది కాబట్టి ఇలాంటి వారి విషయంలో తప్పనిసరిగా ప్రత్యేకత ఉంటుంది. ఇవన్నీ అధిగమించగలిగితే వాటన్నికంటే అతి పెద్ద సమస్య ఇంట్లోని పెద్దలు, మహిళలు. ప్రస్తుత సమాజాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో స్థిరపడ్డ మహిళలలో 99 శాతం పైగా మహిళలు వ్యవసాయం అంటే విముఖత చూపుతున్నారు. అతి తక్కువ మంది మహిళలు మాత్రమే వ్యవసాయ రంగం అంటే వ్యతిరేకత లేకుండా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిగత సమస్యలను ఎదుర్కోగలమనే నమ్మకంతో ఇటీవలకాలంలో అనేకమంది ఉద్యోగ రంగం నుండి ప్రత్యేకంగా సాప్ట్‌వేర్‌ ఉద్యోగ రంగం నుండి సేంద్రియ సాగువైపు అడుగులు వేశారు. ఇంకా వేస్తూనే ఉన్నారు. సేంద్రియ సాగువైపు అడుగులు వేసిన వారు వివిధ రకాల కారణాల వలన తమ సాగుని లాభల బాటలో నడిపించుకోలేక వెనుతిరిగి పోతున్నారు. అతితక్కువ మంది మాత్రమే వివిధ రకాల ఒడిదుడుకులను తట్టుకుని, సమయానుకూలంగా తమ సాగు పద్ధతులను మార్చుకుంటూ, పంటల సాగుని లాభాల బాట పట్టించడానికి అవసరమయిన అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకుంటూ మనసు ఉంటే మార్గాలు అనేకం ఉంటాయనే సూక్తిని నమ్ముతూ ముందుకు సాగుతున్నారు. ఇదే కోవకు చెందుతాడు సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన చండ్ర వెంకటేశ్వరరావు.

వెంకటేశ్వరరావుది వ్యవసాయ నేపథ్యం. అయినాకాని అందరిలాగానే వీరు కూడా ఉన్నత చదువులు చదివి వ్యవసాయ రంగానికి దూరం జరిగి ఉద్యోగరంగంలో ప్రవేశించి మంచి ఉద్యోగం, మంచి జీతంతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. చదువుకు తగిన ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఉద్యోగంలో కొనసాగుతున్నా కూడా ఆరోగ్యసమస్యలు ఎదురవ్వడంతో తమ ప్రస్తుత జీవన శైలి గురించి పరిశీలించుకొని అనారోగ్య సమస్యల నుండి బయట పడాలంటే జీవనశైలిని మార్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని గ్రహించి ఆరోగ్యకరమైన జీవనశైలికి సేంద్రియ సాగే సరైన దారి అని నమ్మి కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా కూడా వారి సలహాలను ప్రక్కకు నెట్టి మంచి జీతం అందిస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులోకి అడుగు పెట్టడం జరిగింది.

వెంకటేశ్వరరావు వ్యవసాయ నేపథ్యంకి చెందినప్పటికి వ్యవసాయంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సందర్భాలు లేవు కాబట్టి చేస్తున్న ఉద్యోగాన్ని, ఏసి గదులను వదలి ఎండలో, మట్టితో పనిచేయడానికి సిద్దం అయ్యాడు కాబట్టి పట్టుదలతో ముందుకు వెళ్ళాలి అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. కాబట్టే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కాని ఎదుర్కొని మెల్లమెల్లగానే ఎదుగుతూ ముందుకు సాగుతున్నాడు. వ్యవసాయంలో శారరీక శ్రమ ఎక్కువ అనే విషయం తెలిసిందే. సేంద్రియ సాగులో శారీరక శ్రమ ఇంకా ఎక్కువగా ఉంటుంది. వెంకటేశ్వరరావు సేంద్రియ సాగులో అడుగు పెట్టినప్పుడు సుభాష్‌ పాలేకర్‌ గారి ప్రకృతి వ్యవసాయ పద్ధతులు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. కాబట్టి అవే పద్ధతులతో సేంద్రియ సాగులో అడుగుపెట్టి వరి మరియు వివిధ రకాల కూరగాయలు సాగు చేసుకుంటూ ముందుకు సాగుతున్న క్రమంలో కేవలం సుభాస్‌ పాలేకర్‌ గారి పద్ధతులు మాత్రమే పాటించినట్లయితే తగిన ఫలితాలు రావడం లేదని తన అనుభవంతో తెలుసుకున్న వెంకటేశ్వరరావు సుభాష్‌ పాలేకర్‌ గారి పద్ధతులకు తోడు వేరే సేంద్రియ పద్ధతలను కూడా తన సాగులో అమలు చేయడం మొదలు పెట్టి సమయానుకూలంగా కొత్త కొత్త సేంద్రియ పద్ధతులను కూడా తెలుసుకుంటూ, తన సాగులో అమలుపరుస్తూ, ఏ ఒక్క సేంద్రియ పద్ధతిని గుడ్డిగా నమ్మకుండా అవకాశం ఉన్న వివిధ రకాల సేంద్రియ పద్ధతులను పాటిస్తూ వరి, కూరగాయలు, చెరకు లాంటి పంటలు పండిస్తున్నాడు.

వివిధ రకాల కారణాల వలన సేంద్రియ సాగులో అడుగుపెట్టిన మొదటలో తన సాగులో ఆశించిన లాభాలు రాకపోవడముతో, సాగుని లాభాల బాట పట్టించడానికి అవసరమైన మార్గాలను అన్వేషిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు మరియు సొంత మార్కెటింగ్‌ వ్యవస్థలతోనే సేంద్రియ సాగును లాభాల బాట పట్టించగలను అని నమ్మి కోదాడలో సేంద్రియ ఉత్పత్తుల అమ్మకం దుకాణం ఏర్పాటు చేసి తాను పండించిన ఉత్పత్తులతో పాటు తోటి సేంద్రియ రైతులు పండించిన ఉత్పత్తులను కూడా అమ్మకం చేయడం మొదలు పెట్టాడు. అయినా కాని ఆశించిన మొత్తంలో ఫలితాలు రాకపోవడముతో నూనె గానుగను ఏర్పాటు చేసి గానుగ నూనెను తీసి నేరుగా వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నాడు. కోదాడ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో అనేకమంది యువతకు గానుగ నూనె తీసే పద్ధతిపై శిక్షణ అందించి యువతకు స్వయం ఉపాధి మార్గం చూపించడంలో వెంకటేశ్వరరావు తనవంతు పాత్రను పోషించాడు. వీటన్నింటికి తోడు చెరకు రసం గురించి సర్వే చేసి చెరకు పండించి, చెరకు నుండి రసం తీసి అమ్మగలిగితే మంచి లాభం ఉంటుందని తెలుసుకుని సేంద్రియ పద్ధతిలో చెరకు పండిస్తూ ఆ చెరకును తానే సొంతంగా చెరకు రసం తీసి అమ్మకం చేస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నాడు.

చేస్తున్న ఉద్యోగాన్ని వదలి సేంద్రియ సాగులో అడుగు పెట్టి విష రసాయన రహిత వ్యవసాయాన్ని విజయవంతం చేస్తున్నాడు. ప్రస్తుతం వరి, చెరకు, వివిధ రకాల కూరగాయల సాగులో ఉన్నాయి. ఈ రోజు ఈ స్థాయికి రావడానికి వెంకటేశ్వరరావు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. పంటలను చీడపీడల నుంచి కాపాడుకుంటూ మంచి దిగుబడులు సాధించడానికి మార్గాలు అన్వేషిస్తూ, అమలుపరుస్తూ, పంట దిగుబడులను అదేవిధంగా అమ్మకుండా విలువ జోడింపుకు సంబంధించిన మార్గాలను అన్వేషిస్తూ, అమలు పరుస్తూ ముందుకు సాగుతూ మనసు ఉంటే మార్గాలు తప్పనిసరిగా ఉంటాయని వెంకటేశ్వరరావు నిరూపిస్తున్నాడు. మరిన్ని వివరాలు 9652111343కి ఫోను చేసి తెలుసుకోగలరు.  

వై. శ్రవణ్‌ కుమార్‌, స్పెషల్‌ కరస్పాండెంట్‌