ఆంధ్రప్రదేశ్‌లో 26 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో తక్కువ వర్షపాతం. అన్నమయ్య, అనంతపురం జిల్లాలలో చాలా ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు విత్తనేలేదు. బెట్ట పరిస్థితుల వలన విత్తిన పంటలు చాలా జిల్లాల్లో దెబ్బతిన్నాయి. తెలంగాణలో కూడా నిండిన జలాశయాలు, చెరువులు, భూగర్భజలాలు బాగున్న చోట తప్ప వర్షాధార పంటలకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో చాలా వరకు బెట్ట దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ (హస్త, చిత్త, స్వాతి తొలి రోజులు)లో వ్యవసాయ పంటల్లో చేయవలసిన పనులను గురించి…
టమాట: పొడి వాతావరణం, ఎండలు బాగా కాయడం, టమాట దిగుబడికి మంచి అనుకూలం. జులై, ఆగస్టు మొదట్లో విపరీతంగా పెరిగిన టమాట ధరలు ఈ పంట విస్తీర్ణాన్ని పెంచేవిధంగా ఆశ జూపాయి. ఫలితంగా రైతుకు దక్కే ధర పత్తి కొండ మార్కెట్లో కిలో 40 పైసలకు పడిపోయింది. విస్తీర్ణాన్ని నియంత్రించి దిగుబడిని తగ్గించాల్సిన అవసరముంది. ఎగుమతులను, ప్రాసెసింగును బాగా పెంచాల్సిన అవసరముంది. జులై నుండి మార్చి వరకు టమాట విస్తీర్ణాన్ని తగ్గించాల్సిన అవసరమేర్పడింది.

వరి: సన్నబియ్యానికి ప్రపంచమంతా మంచి గిరాకీ ఉంది. ఎంత పండించినా ఎగుమతి చేసుకొని మంచి ధరలు పొందే అవకాశం ఉంది. ఎగుమతులను ప్రోత్సహించాల్సిన అత్యవసరమేర్పడింది. పండించే సత్తా కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో సహా భారతదేశానికుంది. రాష్ట్రాలు, కేంద్రం ఈ అవకాశాలను సద్వినియోగ పరచుకొని రైతులను ప్రోత్సహించి సన్నబియ్యాన్ని ఎక్కువగా పండించడానికి తగిన ప్రోత్సాహకాలిచ్చి, రైతులకు మేలు చేయవచ్చు. ఫారిన్ ఎక్స్చేంజ్‌ని అధికంగా సంపాదించవచ్చు. ప్రభుత్వాల ఆలోచనా విధానంలో మార్పులు అత్యవసరం. వర్షాకాలం మొదట్లో విత్తిన స్వల్పకాల వరి రకాలు అక్టోబర్‌లో కోతకొస్తాయి. తయారైన పంటను వెంటనే కోసి, తుపాన్లబారి నుండి రక్షించాలి. వరి మద్దతు ధర సాధారణ రకాలకు రూ. 2185/క్వి. ఏ గ్రేడ్ రకాలకు రూ. 2203/క్వి. నిదానంగా జూన్, జులై, ఆగస్టులలో నారుపోసి నాటిన వరి, వివిధ థల్లో (గింజ గట్టిపడు, పాలుపోసుకొను, కంకి, చిరుపొట్ట, పిలకలు వేయు థల్లో) ఉంది. వివిధ రకాల పురుగులు, రోగాల బారి నుండి పంటను కాపాడడానికి అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కొన్ని ప్రాంతాల్లో అక్టోబర్‌లో కూడా ఎక్కువ వర్షాలు పడతాయి. తుపాన్లు రావచ్చు. పడిన ఎక్కువ నీరు త్వరగా వెళ్ళిపోయేటట్లు గట్లను తెగ్గొట్టాలి. నష్టాన్ని తగ్గించాలి. రబీ పంటకు అక్టోబరులో నార్లు పోయడం అనుకూలం కాదు. చలికి పంటకాలం ఎక్కువవుతంది. పంట దిగుబడి తగ్గుతుంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేరుశనగ, పొద్దుతిరుగుడు పండించి మంచి ఆదాయం పొందవచ్చు. పెసర, మినుము, శనగ విత్తడానికి అక్టోబర్ నెల అనుకూలం.

మొక్కజొన్న: అక్టోబర్ రెండో పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు విత్తితే ఈ పంటనుండి అత్యధిక దిగుబడులు పొందే అవకాశముంది. సిఫారస్ చేయబడిన అత్యధిక గింజ దిగుబడి నిచ్చే ప్రైవేట్ హైబ్రిడ్‌లు: 100-120 రోజులవి: బయో-9681, పయనీర్-3580 మొ||. 90-100 రోజులవి: ఎన్.ఎస్.సి.హెచ్-12, కె.ఎం.హెచ్ 25కె-60 మొ||. 90 రోజులలోపువి: డి.కె.సి-7074, జె.కె.ఎం.హెచ్-1701 మొ||. మొక్కజొన్న మద్ధతు ధర: రూ. 2090/క్వి. మొక్కజొన్న పంటలో ప్రాచుర్యాన్ని పొందుతున్న రకాలు: తీపిరకాలు: హైబ్రిడ్లు: బ్రైట్‌జీన్, షుగర్-75, కాంపోజిట్‌లు: అల్మోరా, విన్‌ఆరంజ్, ప్రియ, మాధురి. పేలాల రకాలు: కాంపోజిట్‌లు: పెర్ల్‌పాప్‌కార్న్, అల్మోరాపాప్ కార్న్, అంబర్‌పాప్ కార్న్. బేబికార్న్ రకాలు: కాంపోజిట్‌లు: మాధురి, హిమ్-123 మొ||, హైబ్రిడ్లు: హిమ్-128, హెచ్.ఎం-4, పూసాఎర్లీ హైబ్రిడ్ మొక్కజొన్న-2, క్వాలిటీ ప్రోటీన్ రకాలు: అంబర్ శక్తి-1, శక్తి-1, హెచ్.క్యు.పి.ఎం-7, వివేక్.క్యు.పి.ఎం-9, పశుగ్రాస రకాలు: ఎ.పి.ఎఫ్.ఎం.-8, గంగ-5, విజయ్ కాంపోజిట్, వరుణ్ కాంపోజిట్.

జొన్న: వానాకాలం జొన్న కోతలు అక్టోబర్‌లో ఉంటాయి. క్వాలిటీ జొన్న రకాల పిండి ధరలు విపరీతంగా పెరిగాయి. జొన్నలు పండించడం తక్కువ, వినియోగం ఎక్కువగా ఉంది. జొన్నలో అత్యంత పోషక విలువలు కలిగి, దిగుబడులు బాగా ఎక్కువగా ఇచ్చేరకాలు: పర్భనిశక్తి (ఐ.సి.ఎస్.ఆర్-14001): దిగుబడి నీటి ఆధారంగా 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి./ఎ. ఇతర రకాల కంటే 50% ఐరన్, జింక్ ఎక్కువ. ఐరన్ 45, జింకు 32 పి.పి.ఎమ్. ప్రోటీన్లు 11.9% రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, మహారాష్ట్రలో కూడా విత్తవచ్చు. తెల్లటిగింజ గలిగి ఉంటుంది. ఐ.సి.ఎస్.హెచ్-14002: హైబ్రిడ్. తెల్లటిగింజ. వరి మాగాణులలో కూడా పండించవచ్చు. చలికాలం/యాసంగికి అనుకూలం. గింజ లావుగా ఉంటుంది. నీటి ఆధారంగా 28-32 క్వి/ఎ. వర్షాధారంగా 16-20 క్వి/ఎ. దిగుబడినిస్తుంది. నీటిఆధారంగా ఈనెలలో విత్తవచ్చు. ఇతర రకాల కంటే 40% అధిక ఐరన్, జింక్ కలిగి ఉంటుంది. చొప్ప అధికంగా ఇస్తుంది. మొక్క 1.9 నుండి 2.0 మీ. ఎత్తు వరకు పెరుగుతుంది. ఐ.సి.ఎస్.వి-15013: ఎర్రగింజ. ఎగుమతికి అనుకూలం. గింజ దిగుబడి 30 క్వి/ఎ. చొప్ప 2.0-2.5 ట/ఎ. అక్టోబరులో రెండు తెలుగు రాష్ట్రాల్లో విత్తడానికి అనుకూలం. ఐరన్ 50 పిపిఎం, జింక్ 45-50 పిపిఎం. 2-3 తడుల నీరు ఇవ్వాల్సుంటుంది. చీడపీడల బెడద తక్కువ. పెట్టుబడి తక్కువ. మార్కెట్ సదుపాయం కొరకు ముందుగా మాట్లాడుకొని విత్తేందుకు ప్రయత్నించవచ్చు. ఇక్రిశాట్ వారిని సంప్రదించవచ్చు. ఎన్.టి.జె-5: నల్లనేలల్లో 20-25 తేలిక నేలల్లో 14-16 క్వి/ఎ. గింజ దిగుబడి. ఎం. 35-1 (మల్దండి): గింజ దిగుబడి 10-12 క్వి/ఎ. గింజ, చొప్ప అత్యంత నాణ్యంగా ఉంటాయి. మార్కెట్‌లో అత్యధిక ధర పలుకుతాయి. దిగుబడి తక్కువ. జొన్న మద్దతు ధర మల్దండి : రూ. 3225/క్వి. హైబ్రిడ్: రూ. 3180/క్వి.

శనగ: అత్యధిక దిగుబడులు సాధించాలంటే ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 15 నుండి నవంబరు 15 లోగా విత్తాలి. తెలంగాణలో అక్టోబర్ మొదటి నుండి నవంబరు 15 వరకు విత్తాలి. అత్యధిక దిగుబడులనిచ్చే రకాలు: నంద్యాల గ్రామ్-857 (ఎన్.బిఇ.జి-857): దేశవాళీ రకం. 90-105 రోజులు. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. దిగుబడి. 1-2 నీటి తడులతో 12-14 క్వి/ఎ. ఎండుతెగులును తట్టుకుంటుంది. కర్ణాటక, తమిళనాడుల్లో కూడా సాగుకు అనుకూలం. నంద్యాల గ్రామ్-452 (ఎన్.బిఇ.జి-452): దేశవాళి రకం. 90-105 రోజలు. వర్షాధారంగా 7-9 క్వి/ఎ. 1-2 తడులతో 10-12 క్వి/ఎ. దీర (ఎన్.బిఇ.జి-47): దేశవాళి రకం. 90-105 రోజులు. వర్షాధారంగా 7-9 క్వి/ఎ, 1-2 నీటి తడులతో 10-12 క్వి/ఎ. నంద్యాలగ్రామ్-119 (ఎన్.బిఇ.జి-119): కాబూలీరకం. లావుగింజ. 90-100 రోజులు. వర్షాధారంగా 6-8 క్వి/ఎ. 1-2 నీటితడులతో 10 క్వి/ఎ. శనగ మద్దతు ధరలకంటే మార్కెట్ ధరలు అధికంగా ఉన్నాయి.

పెసర: వర్షాధార పెసర అక్టోబరులో కోతకు వస్తుంది. మద్దతు ధర రూ. 8558/క్వి. తెలంగాణాలో యాసంగి పెసర పంటను సెప్టెంబరు 15 నుండి అక్టోబరు కడవరకు, ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరులోను విత్తి అత్యధిక దిగుబడులు పొందవచ్చు. చలికాలం/రబీ/యాసంగికి అనువైన రకాలు: పల్లాకు తెగులును తట్టుకునే పెసర మెరుపు గింజ రకాలు: డబ్ల్యు.జి.జి-42 (యాదాద్రి) 4-6 క్వి/ఎ, డబ్ల్యు.జి.జి-37 (ఏకశిల) 5-6 క్వి/ఎ. టి.ఎం-96-2: 4-6 క్వి/ఎ.

మినుము: పల్లాకు తెగులును తట్టుకునే అధిక దిగుబడినిచ్చే మినుము పాలిష్ రకాలు: టి.బి.జి-104, జి.బి.జి-1 దిగుబడి 8-9 క్వి/ఎ. మినుము మద్దతు ధర రూ. 6950/- మంచి దిగుబడికి అక్టోబరులో విత్తవచ్చు. వర్షాకాలపు మినుము పంటకోతలు అక్టోబరులో ఉంటాయి. మార్కెట్ ధర, మద్దతు ధర కంటే అధికంగా ఉన్నాయి.

ఉలవ: ఈ పంట సెప్టెంబరు-అక్టోబరు నెలల్లో విత్తుటకనుకూలం. అత్యధిక దిగుబడినిచ్చే రకాలు. క్రీడ హర్ష (సి.ఆర్.హెచ్.జి-19) 6.0-7.7 క్వి/ఎ. గింజ దిగుబడినిస్తుంది. గోధుమ రంగు గింజ. 80-85 రోజుల పంట. ఆంత్రాక్నోస్ మరియు బూడిద తెగుళ్ళను తట్టుకుంటుంది. 85-95 రోజుల పంట. క్రీడవర్ధన్ (సి.ఆర్.హెచ్.జి-22): నలుపు గింజ. గింజ దిగుబడి: 6.0-7.5 క్వి/ఎ. బూడిద, పల్లాకు, ఆంత్రాక్నోస్ తెగుళ్ళను తట్టుకుంటుంది. 85-90 రోజుల పంట.

కుసుమ: అత్యధిక దిగుబడులకు యాసంగిలో అక్టోబరు రెండవ పక్షం నుండి నవంబరు మొదటి పక్షం వరకు విత్తుట మేలు. అధిక దిగుబడి రకాలు: జె.ఎస్.ఎఫ్-414 (పూలె కుసుమ): 135 రోజులు, 8 క్వి/ఎ. నీటి పారదుల క్రింద అనుకూలమైన రకం. డి.ఎస్.హెచ్-185: 135 రోజులు, 7-8 క్వి/ఎ, ఎండుతెగులును తట్టుకునే హైబ్రిడ్. ఐ.ఎస్.ఎఫ్-764: 125-128 రోజులు, 6-8 క్వి/ఎ, బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది.

సోయాచిక్కుడు: రబీ పంటగా అక్టోబరులో దీనిని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విత్తవచ్చు. తెలంగాణలో విత్తితే దిగుబడి బాగా తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలమైన, అధిక దిగుబడి రకాలు. భీమ్ (ఎల్.ఎస్.బి.-18): దిగుబడి: 10-12 క్వి/ఎ. 105-110 రోజుల పంట. లేత పసుపు రంగు గుండ్రని గింజలు. మధ్యస్థ సైజు గింజ. భాసర్ (ఎల్.ఎస్.బి-22): దిగుబడి: 10-11 క్వి/ఎ. 105-110 రోజుల పంట. కోత ఆలస్యమైనా కాయ చిట్లదు. లేత పసుపు రంగు గుండ్రని గింజలు.

గోధుమ: చలి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పండించవచ్చు. అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తవచ్చు. అనుకూలమైన రకాలు: ఎం.ఏ.సి.ఎస్-2496: చపాతీకి అనుకూలం. 110-125 రోజుల పంట. దిగుబడి 15 క్వి/ఎ. బ్రెడ్ రకాలు: డి.డబ్ల్యు.ఆర్-162: 126-134 రోజుల పంట. దిగుబడి: 15 క్వి/ఎ. సోనాలిక: 120-134 రోజుల పంట. దిగుబడి 15 క్వి/ఎ. కొద్దిగా నీటి సౌకర్యముంటే కొద్దిగా ఆలస్యంగా కూడా విత్తవచ్చు. రవ్వ రకం: ఎం.ఏ.సి.ఎస్-2846: 120-130 రోజులు, దిగుబడి: 12 క్వి/ఎ.

సిరిధాన్యాలు: నీటి ఆధారముంటే అక్టోబరులో కూడా విత్తవచ్చు. సొంతంగా బియ్యం పట్టించి మార్కెటింగ్ చేసుకోగల్గితే ఆదాయం పెరుగుతుంది. మిక్సీలో బుచ్చి విధానం ద్వారా బియ్యం చేసుకోవచ్చు. ఆర్గానిక్ పద్ధతిలో పెంచి ప్రచారం చేసుకుంటే నమ్మకం పెరిగి, ఇంటి దగ్గరే లేక పొలం దగ్గరే వచ్చి కొనేందుకు వినియోగదారులు వస్తారు.

కొత్తిమీర / ధనియాలు: కొత్తిమీర వినియోగం అన్ని కాలాలలోనూ పెరుగుతున్నది. ధరలు కూడా ఆశాజనకంగా ఉంటున్నాయి. వానలు తగ్గి, చలివాతావరణం ఏర్పడితే, ధనియాల పంట కొరకు అక్టోబరులో విత్తడం మొదలు పెడతారు. చలివాతావరణంలో కొత్తిమీర ఎదుగుదల బాగుంటుంది. ధనియాల కొరకు పండించిన పంట నుండి ఒత్తుగా ఉన్న మొలకలను పెరికి కొత్తిమీరగా అమ్మడం మొదలైనాక కొత్తిమీర ధరలు తగ్గే అవకాశాలున్నాయి. అధిక విత్తన మరియు కొత్తిమీర దిగుబడులకు అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు విత్తుట అనుకూలం. అధిక గింజ దిగుబడి రకాలు: గుజరాత్ ధనియా, హిస్సార్ సురభి, సింపోస్-33. ధనియాల ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉన్నాయి.

ప్రత్తి: మీడియమ్ స్టేపుల్ ప్రత్తి మద్దతు ధర రూ. 6620/క్వి. లాంగ్ స్టేపుల్ రూ. 7020/క్వి.గా ఉంది. ప్రత్తి పంటలో ఖర్చు పెరుగుతున్నందున, ఈ రేటుతో రైతులు తృప్తి పొందడం లేదు. అందువలన ప్రత్తి విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారు. ఈ నెలలో ప్రత్తి మార్కెట్‌కు రావడం మొదలవుతుంది. ధరలు బాగుంటే ప్రత్తి పంట రాబోయే కాలంలో పండిస్తారు. లేకపోతే దిగుమతులే శరణ్యం కావచ్చు. బయటి దేశాల రైతులకిచ్చే దానికంటే, మన రైతులకు లాభమొచ్చేటట్లు చేయండి. మొదటి దఫా ప్రత్తి తీత తర్వాత గులాబీ రంగు పురుగు నివారణకు అవసరమైతే తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి. తెల్లదోమకు పసుపు రంగు కార్డులు అమర్చుట, ఆకుమచ్చ, బాక్టీరియా నల్లమచ్చ, కాయకుళ్ళు తెగుళ్ళకు తగిన నివారణ చర్యలు అవసరమైతే చేపట్టాల్సి ఉంటుంది.

కంది: కంది పెరిగే థలో శనగపచ్చ పురుగు, ఆకుగూడు పురుగు, ఈకరెక్క పురుగు, ఎండుతెగుళ్ళు చవ్చే అవకాశముంది. ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

రైతులకు మేలు జరిగేటట్లు రాజకీయ నిర్ణయాలుంటే రైతులు పల్లె ప్రజలు బాగుపడే అవకాశాలుంటాయి. అలాంటి పార్టీలకు ప్రజాదరణ బాగుంటుంది. ఓట్లొస్తాయి. సన్నబియ్యానికి ప్రపంచమంతా మంచి గిరాకీ ఉంది. కర్ణాటకలో ప్రజలకు పంచుదామంటే బియ్యం లేక దానికి బదులు డబ్బులిస్తున్నారు. తెలంగాణలో బియ్యం దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ధరలంతగా పెరగలేదు. రైతులు వినియోగదారులు బాగుపడాలంటే వరి పంట మీద కంట్రోల్స్ చాలావరకు తీసేస్తే రైతులకు ప్రభుత్వాలకు మంచిదనిపిస్తున్నది.
సలహాలు, సూచనలకు ప్రొఫెసర్ సల్లా నారాయణ స్వామి, ఫోను నెంబరు 9494408619 చైర్మన్, నారాయణ ఫౌండేషన్, హైదరాబాదు. ఇ-మెయిల్: profsnswamy@gmail.com, ఫేస్‌బుక్: SALLA Narayana Swamy


Pavan
October 13, 2024Anapa a month lo pettali sir