జంతు సంబంధిత ఉత్పత్తులన్నింటిలో ధరలు అత్యంత వేగంగా, స్థిరంగా పెరిగేవి గొర్రెలు-మేకల మాంసాలు మాత్రమే. గత నాలుగు థాబ్దాల కాలంలో మాంసం ధరలు సుమారు 80 రెట్లు పెరిగాయి. ఇందుకు జీవాల పెంపకంలో పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు మరియు అనేక సమస్యలతో పాటు పెరుగుతున్న వినియోగదారుల అభిరుచులు, వారి కొనుగోలు శక్తి కూడా కారణాలుగా భావించవచ్చును.

ఇప్పుడిప్పుడే సాంప్రదాయక జీవాల పెంపకదారుల సామాజిక వర్గాలతో పాటు, అనేక ఇతర అగ్రకులాలవారు, విద్యాధికులే కాక, ఐ.టి. రంగంలో పనిచేస్తూ ఈ రంగంలోకి ప్రవేశిస్తున్న విద్యాధికులు కూడా ఈ రంగంపట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లైవ్‌ స్టాక్‌ డెవలప్‌మెంట్‌ మిషన్‌ క్రింద మేతల పెంపకానికి తగినంత భూమి మరియు ఇతర వసతులు కల్గిన యువతకు సబ్సిడీగా 50 శాతం, మరో 50 శాతం బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయాలు, పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న మార్కెట్‌ ఒడిదుడుకులు, పాడి రంగంలో ఆలస్యంగా మాత్రమే కనిపించే రాబడులవంటి ప్రతికూలతలు జీవాల పెంపకం ముఖ్యంగా గొర్రెల పెంపకంలో లేకపోవటం, పెట్టిన పెట్టుబడికి కొన్ని నెలలోనే ఆదాయాలు కనిపించటం వంటి సానుకూలతలు గొర్రెల పెంపకంలో ఆసక్తిని పెంచుతున్నాయి. 

నెల్లూరు జొడిపి, మాచర్ల, నాగావళి మరియు డక్కన్‌ జాతులు మరికొన్ని గుర్తింపు లేని జీవాలు మన తెలుగు రాష్ట్రాలలో అనాదిగా మాంసం ఉత్పత్తికి దోహదపడుతూ ఉన్నాయి.

ప్రస్తుతం అనూహ్యంగా పెరిగిన నిర్వహణ ఖర్చులు, కూలీలు, ఇతర సమస్యల వల్ల అంతగా లాభదాయకం కాని సాంప్రదాయ నాటు జీవాల మీద ఆధారపడుట కంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొందుతూ వున్న డార్పర్‌ జాతి గొర్రెల పెంపకాన్ని చేపట్టుట వల్ల లాభాలు గణనీయంగా పెరుగుతాయనటంలో అతిశయోక్తి లేదు.

ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా తదితర దేశాలలో అత్యంత లాభదాయక జీవంగా గుర్తింపు పొందిన డార్పర్‌ జాతి గొర్రెలు – వాటి విశిష్టత, పెంపకంలో మెళకువలను గురించి చర్చిద్దాము. పుట్టినప్పుడు 3.5 నుండి 4.00 కిలోల బరువుతో నాలుగు నెలల వయస్సుకు 36 కిలోల శరీర తూకం, అందులో 50 నుండి 55 శాతం మాంసాన్ని ఇవ్వగల డార్పర్‌ జాతికి సాటి జాతి ఇప్పటి వరకు మన దేశంలో లేదనే చెప్పవచ్చును. అంతేకాక డార్పర్‌ జాతి ఆడగొర్రెలు 5 నెలలు వయస్సుకు పొట్టేళ్లు 9 నెలలకు ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి. సగటున రోజుకు 200-250 గ్రాముల వరకు శరీర బరువును పెంచుకోగల్గిన ఈ గొర్రెలు, మగవి 9 నెలల్లో 100 కిలోలు శరీర తూకాన్ని అందుకోగలవు. ఆడవి ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సార్లు ఈని మంచి పాల ఉత్పత్తితో పిల్లలను ప్రేమగా పెంచుకోగలవు. కాబట్టి పిల్ల థలో మరణాల శాతం కూడా తక్కువే. ఈనిన తర్వాత 90-100 రోజులలో ఎదకు వచ్చి చూడి కట్టగలవు. మందలో సగటున ప్రతి మూడు ఈతలలో ఒకసారి కవల పిల్లలకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటి జీవిత కాలం 10-12 సంవత్సరాలలో 7 సంవత్సరాలు సమర్ధవంతమైన ప్రత్యుత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

దక్షిణ ఆఫ్రికాకు చెందిన డార్సెట్‌హార్న్‌, పర్షియాకు చెందిన పర్షియన్‌ బ్లాక్‌హెడ్‌ గొర్రె జాతుల కలయికగా డార్పర్‌ జాతి ఉద్భవించి, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల మాంసం అవసరాలను చాలావరకు తీరుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ జాతి గొర్రెలు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కూడా లభ్యమౌతున్నాయి. ఇవి మేసే ప్రతి నాలుగు కిలోల మేత (పొడి) ఒక కిలో మాంసంగా మారుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

మగవి 60 సెంటిమీటర్లు, ఆడవి 50 సెంటీమీటర్ల ఎత్తు కలిగి, తెలుపు శరీరం, నల్లని తల, మెడ, కాళ్ల మీద నలుపు మచ్చలు కలిగిన ఈ జాతిలో పూర్తిగా తెలుపు, పూర్తి నలుపు వర్ణాలు కలిగినవి కూడా ఉండవచ్చును. ఆడ-మగ రెండింటిలోనూ కొమ్ములు వుండవు. తోక 6-8 అంగుళాల వరకు వుండవచ్చు. ఇది ఉన్ని జాతి కాదు. వీటి ఉన్ని సులువుగా రాలిపోతుంది. చర్మం కొంత మందమైనప్పటికీ మార్కెట్‌లో ఇతర జాతి గొర్రెల చర్మాలకంటే నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. మాంసం పోగుల మధ్య సమానంగా విస్తరించిన క్రొవ్వు వల్ల ఈ మాంసాన్ని వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆడగొర్రెలు, వయసుమీరిన గొర్రెల మాంసం కూడా ఇంచుమించు పొట్టేళ్ల మాంసంతో సమాన రుచి, నాణ్యత కలిగి ఉంటుంది. 

డార్పర్‌ గొర్రెలలో వ్యాధి నిరోధక శక్తితో పాటు ఈగలు, దోమలు, పిడుదులు, గోమార్లు తదితర బాహ్య కీటకాలను, అంతర్గత పరాన్న జీవుల ధాటిని తట్టుకోగల శక్తి, నాసిరకం గ్రాసాలు, ఆకుల్ని సైతం సమర్ధవంతంగా జీర్ణించుకోగల శక్తి కూడా ఎక్కువే. అన్ని రుతువుల ప్రతికూలతల వత్తిడిని సమర్ధవంతంగా ఈ జాతి గొర్రెలు తట్టుకోగలవు.

డార్పర్‌ గొర్రెల మేపు: 15 శాతం మాంసకృత్తులు, 75 శాతం ఇతర పోషకాలు కలిగిన గ్రాసాలు-మేతలను శరీర బరువులో తేమలేని రూపం ఆధారంగా 2 నుండి 3 శాతం అందిస్తే సరిపోతుంది. సూపర్‌ నేపియర్‌, లూసర్న్‌, మొక్కజొన్న, జొన్న, పిల్లిపెసర వంటి గ్రాసాలను మరియు విధిగా కొంత ఎండుమేతతో పాటు మినరల్‌ మిక్చర్‌తో పాటు తవుడు, మొక్కజొన్న, నూనెచెక్కలు కలిగిన సమీకృత దాణాలను రోజుకు 75-80 గ్రాములు అందిస్తే సరిపోతుంది. మంచి పచ్చిక బీళ్లు ఉంటే సమీకృత దాణాల అవసరం కూడా అంతగా ఉండదు. ఉడికించిన ఉలవలు, చిలకడ దుంపల్ని మేపుట ద్వారా కూడా పెరుగుదల వేగవంతం కాగలదు. ఎల్లవేళలా శుభ్రమైన త్రాగునీటిని అందుబాటులో ఉంచాలి. మేపుల మధ్య 4-5 గంటలు మేపులేకుండా, నెమరు వేయుటకు అవకాశం ఇస్తే జీర్ణసామర్థ్యం పెరుగుతుంది.

గొర్రెల పెంపకం ద్వారా పేదల అభ్యున్నతికి పాటు పడుతున్న మన ప్రభుత్వాలు కృత్రిమ గర్భోత్పత్తి మరియు శ్రేష్టమైన పిండదానాల ద్వారా ఈ డార్పర్‌ జాతి గొర్రెల సంఖ్యను వేగంగా పెంచి మన గ్రామీణ పెంపకందారులందరికీ ఆర్థిక పరిపుష్టిని కలిగించవచ్చును.         

డా. యం.వి.జి. అహోబలరావు, హైదరాబాద్‌. 93930 55611