ఇటీవల కాలంలో అధిక పాల దిగుబడులు, అధిక వెన్న శాతం పొందడానికి దాణాలు, బైపాస్ ప్రోటీన్లు, బైపాస్ ఫ్యాట్లు వాడకం పట్ల రైతుల ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
అధిక పాల దిగుబడి నిచ్చే ఆవులు, గేదెలలో ఎక్కువగా పాల దిగుబడికి ఎక్కువ పరిమాణంలో నాణ్యత గల ఎక్కువ మాంసకృతులను కొవ్వు పదార్థాలను అందించవలసి ఉంటుంది. వీటిలో బైపాస్ ఫ్యాట్ల గురించి చూస్తే ఇది పామ్ ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, వరి తవుడు, ప్రొద్దుతిరుగుడు గింజల ద్వారా సుమారు 8500 కిలో క్యాలరీల శక్తి లభ్యమవుతుంది. వీటిలో జీర్ణం అయ్యే పదార్థాలు 90% వరకు ఉంటాయి. పశువుకి బైపాస్ ప్రోటీన్లు అందించినప్పుడు రూమెన్‌లో జీర్ణం అవ్వకుండా వృధా కాకుండా నేరుగా చిన్న ప్రేగులోకి చేరి శక్తిగా మారి పాల దిగుబడికి పూర్తిగా సద్వినియోగపడుతుంది.

ఇది రుచికరంగా ఉండటం వలన పశువులు ఎంతో ఇష్టంగా తింటాయి. బైపాస్ ఫ్యాట్స్‌ని దాణాలో కలిపి పశువులకు అందించినట్లయితే పాల దిగుబడి పెరగడంతో పాటు పాలలోని వెన్న శాతం 0.2 నుండి 1% వరకు పెరిగే అవకాశాలుంటాయి, పాలలో మాంసకృత్తులు 0.07% పెరుగుతాయి, చూడి కట్టే శాతం కూడా పెరుగుతుంది శరీర బరువు వృద్ధి చెందటం గమనించవచ్చు. బైపాస్ ఫ్యాట్స్‌తో కూడిన ఫీడ్ సప్లిమెంట్స్‌ని దాణాతో కలిపి పెట్టాలి. ప్రతిరోజు 100 నుండి 150 గ్రాముల దాకా ఇవ్వవచ్చు. బైపాస్ ప్రోటీన్ల విషయానికి వస్తే మాంసకృత్తుల లభ్యత శరీరానికి పెరిగి పాల దిగుబడులు పెరుగుతాయి. ప్రత్తి గింజల చెక్క, వేరుశనగ చెక్క, పొద్దుతిరుగుడు విత్తనాల చెక్క, మొదలగు పదార్థాలలో మాంసకృత్తులు, బైపాస్ ప్రోటీన్ల లక్షణం కలిగి ఉంటాయి అందువలన పై పదార్థాలను నేరుగా లేదా సమీకృత దాణాలో కలిపి పశువులకు అందించినట్లయితే పాల దిగుబడి పెరుగుతుంది. కొన్ని కంపెనీలు బైపాస్ ప్రోటీన్ దాణాలు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు ఇటువంటి దాణాలు వాడటం వలన పాల ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. పడ్డలు, పెయ్యలు త్వరగా పెరుగుతాయి సమీకృత దాణా అవసరం 40% వరకు తగ్గి, ఎండు పదార్థాలు వినియోగం 30% వరకు పెరుగుతుంది. పశువుకి ఎండు పదార్థాల అవసరం 20% వరకు తగ్గుతుంది. బైపాస్ ప్రోటీన్లు, బైపాస్ ఫాట్స్‌తో కూడిన ఫీడ్ సప్లిమెంట్ వాడటం వలన పాడి పశువుల నుండి సుఖంగా, వేగంగా, అత్యధికంగా, ఉత్పాదక శక్తి సామర్థ్యం పొందే అవకాశాలు నిండుగా ఉంటాయి.
డా. కె. అర్చన, పశుసంవర్ధక శాస్త్రవేత్త, కేవీకే – రామగిరి ఖిల్లా. ఫోన్: 80968 71067

