మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఎక్కువగా వర్షంపై ఆధారపడి ఉంటుంది. అందువలన రైతులు ఖరీఫ్‌లో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేస్తారు. ఖరీఫ్‌లో సాగు చేసినప్పుడు, వివిధ చీడ పురుగులు పంటలని ఆశించి నష్టం కలుగచేస్తాయి. వీటి నివారణకి కేవలం పంటకాలంలో రసాయనిక మందులపైనే ఆధారపడకుండా, ముందు జాగ్రత్తగా కొన్ని సస్యరక్షణ చర్యలు వేసవిలో చేపట్టినట్లయితే ఖరీఫ్‌లో వచ్చే చీడపురుగులు కొంతవరకు అదుపులో ఉంచవచ్చు.
పంటల అవశేషాలను తొలగించాలి: ఇంతకు ముందు సాగు చేసిన పంట అవశేషాలను పూర్తిగా తొలగించడం వలన కొన్ని పురుగులు కోశస్థథలను నాశనం చేసి, తర్వాత సాగు చేసే పంటకి ఈ పురుగులు ఆశించకుండా చేయవచ్చు. ప్రత్తిలో చివరిసారి ప్రత్తిని ఏరిన తర్వాత మిగిలిపోయిన, గులాబిరంగు కాయతొలుచు పురుగు ఆశించిన పచ్చికాయలను తినడానికి మేకలను / గొర్రెలను చేలల్లో మేపాలి.
ఉదా: వరిలో ప్రధానమైన కాండము తొలిచే పురుగును, ప్రత్తిలో గులాబిరంగు కాయతొలచు పురుగును పంటల అవశేషాలను తొలగించడం వలన నియంత్రించవచ్చు.
వేసవి దుక్కులు: పంటలను కోసిన తర్వాత మే నెలలో వర్షాలు పడగానే లేదా జూన్‌లో తొలకరి వర్షాలు పడగానే లోతుగా పొలాన్ని దున్నాలి. లోతుగా దుక్కులు చేసుకున్నట్లయితే ముఖ్యంగా భూమిలోపల ఉండే పురుగుల కోశస్థథలు, కొన్నింటి పిల్లపురుగు థలు బయటపడి ఎండతాకిడికి/పకక్షులతాకిడికి గురై చనిపోతాయి. దీనివలన తర్వాత పంట కాలంలో వీటి ఉధృతి తక్కువగా ఉండేటట్లు చేయవచ్చు.
ఉదా:
- వరిలో కాండంతొలుచు, రెల్ల రాల్చు, లద్దె పురుగులు
- ప్రత్తిలో పొగాకు లద్దె, శనగపచ్చ, మచ్చల కాయ తొలుచు పురుగులు
- మిరప, టమాట, బెండలో కాయతొలుచు పురుగులు
- వేరుశనగ పంటలో ఎర్రగొంగళి, శనగపచ్చ, పొగాకు లద్దె పురుగులు
- గుమ్మడి, బీర, దొండ, కాకర, పొట్లకాయ పంటలలో పండు ఈగ
కలుపు మొక్కలను తొలగించుట: చాలా రకాల పురుగులు ఒకే పంటపైనే కాకుండా ఇతర మొక్కలపైన (కలుపు మొక్కలు) కూడా ఉంటూ వాటి మనుగడ సాగిస్తాయి. ముఖ్యంగా కలుపు మొక్కలను ఆశించి, పురుగులు పంటలు విత్తుకోగానే వాటిని ఆశించి తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. అందువలన వేసవిలో ముఖ్యంగా పంటలు విత్తుకునే ముందే కలుపు మొక్కలు లేకుండా చూడాలి.
ఉదా:
- వరి పంటను సాగు చేసే ముందు గరిక, తుంగ మొదలగు కలుపు మొక్కలను లేకుండా చేయడం ద్వారా వరిలో ప్రధానమైన ఉల్లికోడు, ఆకు ముడత, కంకినల్లి మొదలగు పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు.
- ప్రత్తిలో వయ్యారిభామ, తుత్తురు బెండ లాంటి కలుపు మొక్కలు లేకుండా చేయడం ద్వారా పిండినల్లి సమస్యను తగ్గించవచ్చు.
- పొలం గట్ల మీద, గట్ల ప్రక్కన కలుపు మొక్కలు లేకుండా చేయడం ద్వారా ఎలుకల సమస్యను తగ్గించవచ్చు. ఎలుకల నివారణకి రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు చేపట్టినట్లయితే ఫలితం ఉంటుంది.
పంటకాలాన్ని పొడిగించుట: నీటివసతి సౌకర్యం ఉన్నప్పటికీ, కొన్ని రకాల పంటలను కాలపరిమితికి మించి సాగు చేయకూడదు. ఉదాహరణకి ప్రత్తిలో పంటకాలాన్ని పొడిగించినట్లయితే లేదా కార్శి పంటగా సాగు చేసినట్లయితే, ప్రత్తిలో ప్రధానమైన గులాబిరంగు, కాయతొలిచే పురుగు సమస్య తర్వాత పంటలో చాలా తీవ్రంగా ఉండి నష్టం ఎక్కువగా ఉంటుంది.
పంట విత్తే సమయము – ప్రణాళిక తయారీ: చాలా పంటలలో, పంటను ఆలస్యంగా విత్తినట్లయితే పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. కావున పంటలను నిర్ధేశించిన సమయంలోనే విత్తుకొనే విధంగా ప్రణాళికను ముందుగానే తయారు చేసుకోవాలి.
పైన చెప్పిన పద్ధతులను రైతులు ముందస్తు చర్యగా వేసవిలో పాటించినట్లయితే, రాబోవు ఖరీఫ్ సాగు కాలంలో వివిధ చీడపురుగుల ఉధృతి నష్టపరిమితి స్థాయిలోపు ఉండి, ఉధృతి మరింత పెరగకుండా చేయవచ్చును. తద్వారా రసాయన పురుగు మందుల పిచికారి ఖర్చు తగ్గించి అధిక నికరాదాయం పొందటానికి ఆస్కారం ఉంటుంది.
వేపగింజల కషాయం తయారీ

వర్షాకాలంలో సాగు చేసే పంటలపై ఆశించే చీడ పురుగుల నివారణకి వాడుకొనుటకు గాను, వేపగింజలను ముందుగానే సమీకరించుకొని ఎండబెట్టుకోవాలి. వీటి నుంచి వేపగింజల కషాయం తయారు చేసుకొని పురుగులు ఆశించిన తొలిథలో పిచికారి చేసుకోవచ్చు. ఆఖరి దుక్కిలో వేప చెక్కను వేసినట్లయితే పసుపులో దుంపఈగ, మిరపలో నులిపురుగులను నియంత్రించవచ్చు.
గుమ్ముడాల యశస్విని,
డి. సాయిచరణ్,
కూసరి సుప్రియ,
ఈర్ల స్రవంతి,
బి. మాధురి,
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం,
రాజేంద్రనగర్, ఫోన్: 8463976019, 8790392212
