మనది వ్యవసాయక దేశం. వ్యవసాయంలో కష్టం (శారీరక శ్రమ) ఉంటుంది. వ్యవసాయేతర రంగాలు అంటే ఉదాహరణకు వ్యాపార, ఉద్యోగ రంగాలలో వ్యవసాయరంగంతో పోల్చుకుంటే శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. మరియు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువగా ఉండవు కాబట్టి సౌకర్యాలు ఏర్పాటు చేసుకుని సుఖాన్ని అనుభవించటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. సుఖం…. సంతోషం… ఆనందం… ఆరోగ్యం…. వీటన్నింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. సకల సౌకర్యాలతో సుఖపడితే ఆరోగ్యంగా ఉండటానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఆరోగ్యం లేని జీవితాలలో సంతోషం, ఆనందం ఉండదు. శరీరాన్ని కష్టపెడితేనే ఆరోగ్యంగా ఉండటానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్యం పదిలంగా ఉంటేనే ఆనందంగా ఉండగలము అనే విషయం తెలిసిందే. ఈ విషయాలను గ్రహించి తమకు సుఖం కంటే ఆనందం ముఖ్యం అని చేస్తున్న, అనుభవిస్తున్న సుఖమైన ఉద్యోగాలను, సౌకర్యాలను కాదనుకొని ఆనందం కోసం పంటల సాగులో అడుగుపెట్టారు కడప జిల్లా రామాపురం మండలం, గోపగుడిపల్లికి చెందిన దంపతులు అశోక్‌రాజు, అపర్ణ.
వీరిది వ్యవసాయ నేపథ్యం. ఇద్దరూ కూడా బి.టెక్ చదివి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేస్తూ తాము పుట్టిన గ్రామాలకు దూరంగా పట్టణాలలో జీవితాలను కొనసాగిస్తూ వస్తున్నారు. భార్యభర్తలు ఇద్దరూ కూడా మంచి జీతాలు లభించే సాఫ్ట్‌వేర్ రంగంలోనే ఉన్నారు కాబట్టి మంచి ఆదాయం పొందుతూ కార్లు, ఎ.సి.లు, బంగ్లాలు లాంటి సౌకర్యాలతో విలాసవంతమైన, సుఖమైన జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. కానీ వీరి జీవితంలో ఆనందం కొరవడింది. ఇద్దరికి ఉద్యోగాలలో వుండే పని ఒత్తిడిలు, నగరాలలో ఉండే ఉరుకుల పరుగుల జీవితం లాంటి పరిస్థితుల వలన ఏదో తెలియని ఇబ్బంది ఎదుర్కొంటూ ఆ ఇబ్బంది ఏమిటని వారికి వారు ప్రశ్నించుకోగా తాము సుఖంగా ఉంటున్నాం గాని ఆనందంగా ఉండాలేకపోతున్నాం అని అర్థం చేసుకోగలిగారు. ఇలాంటి పరిస్థితులకు కారణాలు ఆలోచించగా… మన పెద్దలు, పూర్వీకులు తమ జీవితాలను ఆనందంగా గడిపారు కాబట్టి వారి పెద్దల జీవనశైలిని గుర్తు చేసుకున్నారు. వారి పెద్దలు వ్యవసాయ రంగంలో వున్నారు కాబట్టి సుఖంగా లేకపోయిన ఆనందంగా ఉండగలిగారు. కానీ మనం సుఖం కోసం ఆనందాన్ని వదులుకోని వచ్చాం కాబట్టి మనం జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాం అని గ్రహించి వారంతపు శెలవు దినాలలో చుట్టు ప్రక్కల అందుబాటులో వుండే పంట పొలాలకు వెళ్ళి వారాంతపు సెలవు దినాలను ఆ పంట పొలాలలో గడుపుతూ వస్తున్నారు. పంట పొలాలలో గడిపిన రోజులు వీరికి ఆనందంగా గడిచాయి. కానీ సుఖాన్ని వదులుకొని కష్టపడవలసి వచ్చేది. ఈ విషయాలు వీరు ప్రత్యక్షంగా అనుభవించారు. మనిషి జీవితానికి సుఖం కంటే ఆనందం ముఖ్యం అని గ్రహించి చేస్తున్న ఉద్యోగాలను వదిలి పొలంబాట పట్టారు. వీరి నిర్ణయాన్ని వీరి పెద్దలు మొదటలో అంగీకరించలేదు. కానీ వ్యవసాయంలో అడుగుపెట్టి కొంత కాలం గడిచిన తరువాత వీరి పెద్దలు కూడా వీరి నిర్ణయానికి ఆనందిస్తూ వీరి వ్యవసాయంలో తమవంతు పాత్రను పోషిస్తున్నారు.
వ్యవసాయంలో అడుగుపెట్టి మొత్తం 27 ఎకరాలలో వివిధ రకాల పంటలు పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేస్తూ వస్తున్నారు. వీరి ప్రాంతం నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇలాంటి ప్రాంతం ఏ పంటలకు అనుకూలంగా ఉంటుందని తెలుసుకోవడం గురించి విచారించి నీరు తక్కువగా ఉన్న ప్రాంతాలలో డ్రాగన్ ఫ్రూట్ సాగు అనుకూలంగా తెలుసుకుని ఆ సాగు వైపు అడుగులు వేశారు. డ్రాగన్ ఫ్రూట్ సాగుకి పెట్టుబడి ఎక్కువవుతుంది. అయినా కానీ వెనుకంజ వేయకుండా ఎకరానికి సుమారు 7 లక్షల రూపాయల ఖర్చు పెట్టి డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అవసరమైన స్థంభాలు, టైర్లు, మొక్కలు లాంటివి ఏర్పాటు చేసుకున్నారు.

మొదట్లో అర ఎకరానికి అవసరమైన మొక్కలను తైవాన్ దేశం నుంచి ఎక్కువ ధరపెట్టి తెప్పించి నాటుకున్నారు. తరువాత తమ మిగతా పంటకు అవసరమైన మొక్కలను తామే అభివృద్ధి పరచుకుని మొత్తం ఒక ఎకరం పొలాంలో డ్రాగన్ ఫ్రూట్ సాగు కొనసాగిస్తున్నారు. మొదటి సంవత్సరం ఎకారానికి 800 కిలోల దిగుబడి పొంది, ప్రతి సంవత్సరానికి దిగుబడి పెరుగుతూ వస్తుంటే మూడవ సంవత్సరం ఎకరానికి 2 టన్నుల దిగుబడి సాధించారు. వచ్చిన దిగుబడిని సొంతంగా మార్కెట్ చేసుకుంటూ మంచి ఆదాయం గడిస్తున్నారు. పంట దిగుబడితోపాటు తోటి రైతులకు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను కూడా అమ్మి అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ పంటకి చీడపీడల సమస్య పెద్దగా ఉండదు కాబట్టి ఈ పంట ప్రకృతి సేద్య విధానానికి బాగా అనుకూలంగా వుంటుంది. క్రమం తప్పకుండా భూమికి పశువుల ఎరువును అందిస్తూ వస్తున్నారు. మొదట్లో డ్రాగన్ ఫ్రూట్‌లో అంతరపంటగా వేరుశనగ వేసి మంచి దిగబడి సాధించారు.
చెఱకు: చెరకు పంటను కూడా సాగు చేస్తూ వస్తున్నారు. మామూలు పద్ధతిలో చెరకు నాటితే అధిక వర్షాలకు పంట దెబ్బతింటుంది కాబట్టి రింగ్‌పిట్ పద్ధతిలో చెరకును సాగు చేస్తున్నారు. ఈ పద్ధతిలో చెరకు సాగు ఖర్చు కొద్దిగా పెరుగుతుంది. అయిన కానీ దిగుబడి కూడా పెరుగుతుంది కాబట్టి ఈ పద్ధతిలో చెరకును సాగు చేస్తూ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. వచ్చిన దిగుబడిని బెల్లం చేసి, బెల్లాన్ని నేరుగా వినియోగదారులకు మంచి ధరకు అమ్మి తమ చెరకు సాగుని లాభాలబాటలో సాగిస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్, వేరుశనగ, వరి, చెరకు లాంటి పంటలకు పూర్తి సేంద్రీయ పద్ధతులతో పండిస్తూ తమ పంటల సాగును లాభాలబాటలో నడిపిస్తూ ఉద్యోగాలలో పొందిన ఆదాయాన్ని పంటల సాగులో కూడా పొందుతూ ఆనందంగా ముందుకు సాగుతూ ఆనందం కావాలంటే తప్పనిసరిగా కష్టపడాలి… సుఖపడితే ఆనందం దొరకదని అంటున్నారు. మరిన్ని వివరాలకు అశోక్‌రాజును 95028 26931 ఫోన్ ద్వారా సంప్రదించగలరు.
ప్రస్తుత వ్యవసాయంలో చదువు తప్పనిసరి

గతంలో అంటే వ్యవసాయంలో రసాయనాలు రాకముందు రైతులందరూ పశువులను పోషిస్తూ పశువ్యర్థాలు పంటలకు అందిస్తూ పంట వ్యర్థాలను పశువులకు అందిస్తూ వ్యవసాయాన్ని కొనసాగించేవారు. అప్పట్లో భూములలో పోషకాలు సమృద్ధిగా ఉండేవి కాబట్టి చీడపీడల సమస్య పెద్దగా ఉండేది కాదు. దిగుబడులు కొంచం అటో… ఇటో… అయినా కానీ పంటల సాగుకి పెద్దగా ఆలోచించవలసిన అవసరం ఉండేది కాదు. అప్పట్లో ఉపయోగించిన విత్తనాలు కూడా నాణ్యతగలవి. కాబట్టి చీడపీడలను తట్టుకోగలిగి పంటలు పెరిగేవి. కానీ రానురాను వ్యవసాయంలో రసాయనాలు, హైబ్రిడ్ విత్తనాలు ప్రవేశించిన తరువాత తెలిసో… తెలియకో… రైతులు పశుపోషణకు దూరం జరిగి భూమికి సేంద్రీయ పదార్థాలను అందించకుండా పూర్తిగా రసానాయనాల మీద ఆధారపడి పంటలసాగు చేయడానికి అలవాటు పడ్డారు. దీనివలన పంటలపై చీడపీడల ప్రభావం పెరిగి వీటి నివారణకు ఖర్చులు పెరిగి రైతులకు పెట్టుబడులు పెరిగి పంటల సాగు నష్టాలను మిగులుస్తూంది. ఇటువంటి విపత్కర పరిస్థితులలో గుడ్డిగా వెళ్ళకుండా అన్నింటినీ అంటే నేలను, నేలలో వుండే పోషకాలను, విత్తనాలను, విత్తనాలలోని రోగనిరోధక వ్యవస్థను, వాతావారణాన్ని… ఈ విధంగా అన్ని విషయాలను అవగాహన చేసుకుంటూ ప్రతినిత్యం వచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని, కొత్త పంటలను, కొత్త విధానాలను, కొత్త యంత్ర పరికరాలను కక్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ పంటల సాగు కొనసాగించాలి. ఇవన్నీ చేయాలంటే రైతులకు తప్పనిసరిగా చదువు ఉండాలంటున్నారు వీరు. చదువుకొన్నవారు వ్యవసాయంలో అడుగుపెట్టాలి. ప్రతి ఇంట్లో ఒక చదువుకున్న రైతు ఉండాలి. అప్పుడే మనం, మన దేశం, మన రైతు, మన ఆరోగ్యం సక్రమంగా ఉండి ఆనందమైన జీవితాలను గడపగలము అని అంటున్నారు.
