2023 అక్టోబరు 16వ తేదీన జరుపుకునే ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ సందర్భంగా ఎంపికైన ప్రచారాంశం ‘నీరే ప్రాణం, నీరే ఆహారం, నీటి లభ్యత అందరికీ అందాలి’. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఆవిర్భవించిన అక్టోబరు 16వ తేదీన ఆనవాయితీగా ఆహారోత్పత్తి, సరఫరా, పంపిణీ, వ్యాపారం వంటి అంశాలతో పాటు ఆకలి, దారిద్య్రం, ఆదాయ పంపిణీలో అసమానతలు, పేదరిక నిర్మూలన ప్రయత్నాలను కూడా చర్చించి, కార్యాచరణను తయారు చేసుకోవటం, ఆహారదినోత్సవ కార్యక్రమం లక్ష్యాలు. మానవాళి సమిష్టిగా సాధిస్తున్న పురోగతి, సాంకేతికాభివృద్ధి, సంపద, ఆదాయాల్లో వ్యత్యాసాలు తీవ్రమౌతున్నాయి. సంపన్నదేశాలు, పేదదేశాల మధ్య పెరుగుతున్న అంతరాలతోపాటు ప్రతిదేశంలోనూ వివిధ వర్గాల మధ్యతేడాలు కూడా నానాటికీ ప్రస్ఫుటమౌతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలను కూడా ప్రపంచ కుబేరులు, అగ్రరాజ్యాలే శాసిస్తున్నా కూడా కొంత మానవీయ కోణాన్ని అవి నిత్యం ప్రకటిస్తుంటాయి. మానవ జాతి పరిణామ క్రమంలో నాగరికత నేర్వకముందు తమ మనుగడ కోసం ఒకరినొకర్ని చంపటం, బానిసలుగా మార్చుకోవటం, క్రూరమైన శ్రమదోపిడీ చేయటం జరిగాయి. కాని వనరుల అభివృద్ధి, వినియోగంలో సామర్థ్యం పెరిగేకొద్దీ వాటి అవసరం తగ్గింది. తాము అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలనే ప్రయత్నంతో పాటు ఇతరులు కూడా ఆకలి బాధలు పడకూడదనీ, ప్రతి ఒక్కరికీ కనీస జీవన ప్రమాణాలు లభించాలనే తపన కూడా కొంతమేరకు కనిపిస్తున్నది.
ప్రపంచాభివృద్ధి లక్ష్యాలు
ఇరవై ఒకటవ శతాబ్ద ప్రారంభంలో ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఆకలిని, దారిద్య్రాన్ని పారదోలాలని సంకల్పించింది. 2015 వరకు కొంతమేరకు ఈ లక్ష్యాల దిశగా పయనించింది. రెట్టించిన ఉత్సాహంతో 2030 వరకు ప్రపంచంలో ఆకలి, పేదరికం వంటి రుగ్మతలను రూపుమాపి, పర్యావరణాన్ని మెరుగుపరచుకొని, వాతావరణ మార్పులను నిలవరించాలని మరింత బృహత్తర లక్ష్యాలతో ప్రపంచ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. కాని గత ఎనిమిదేళ్ళలో ఆశించిన ప్రగతి దూరంగా జరుగుతున్నది. స్వార్ధం, స్వప్రయోజనాలు పెచ్చరిల్లి, ఇతరుల గురించి ఆలోచించటం, సాయపడటం తగ్గుతున్నది. దేశాలమధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు, మతాలు, తెగలు మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. తమ దేశ, వర్గ ప్రయోజనాలే తప్ప మానవాళి సమిష్టి లక్ష్యాల్ని పట్టించుకోవటం తగ్గింది. వాతావరణం వేడెక్కటాన్ని ఆపలేక, వర్షపాతాల్లో హెచ్చు తగ్గులు పెరగటంతో పేదదేశాలు, పేద ప్రజలు కనీస అవసరాల కోసం అల్లాడుతున్నారు. ఆకలి, దారిద్య్రం, నిరక్షరాస్యత, అనారోగ్యం విలయ తాండవం చేస్తున్న ప్రపంచంలో సమత, మమత, కరుణ, ఆర్థ్రతలను పెంచాలనే ప్రయత్నాలు సఫలమౌతాయా అనే ప్రశ్న ఉత్పన్నమౌతున్నది.
తగ్గని అన్నార్తుల సంఖ్య
ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ 2022 ప్రారంభంలో 82.8 కోట్ల మంది ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్నట్లు అంచనా వేసింది. కోవిడ్-19 కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఆకలితో బాధపడేవారి సంఖ్య 15 కోట్లు పెరిగినట్లు లెక్కకట్టింది. 2022లో ‘ప్రపంచ ఆహార కార్యక్రమం’ 82.8 కోట్ల మంది అన్నార్తుల్లో 34.3 కోట్ల మంది తీవ్రమైన ఆకలి సమస్యను ఎదుర్కుంటున్నట్లుగా హెచ్చరించింది. రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన కొద్ది నెలల్లోనే తీవ్రమైన ఆకలిని ఎదుర్కుంటున్న వారి సంఖ్య 25 శాతం పెరిగినట్లు లెక్క గట్టింది. ఆహారపు ధరలు పెరగటం ఇందుకు కారణంగా చెప్పింది. ప్రపంచ జనాభాలో నాలుగు శాతం తీవ్రమైన ఆకలితో బాధపడుతుంటే, పదిశాతం ప్రజలు అర్ధాకలితో సతమతమౌతున్నారు. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అధ్యయనాల ప్రకారం ప్రపంచ జనాభాలో 29 శాతం ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొనలేని స్థితిలో ఉన్నారని తేలింది. ప్రపంచంలోని పురుషుల్లో 27 శాతం ఆకలిని అనుభవిస్తుంటే, మహిళల్లో 31 శాతం దానికి బలవుతున్నారని గుర్తించింది. ఐదేళ్ళలోపు పిల్లల్లో 14.9 కోట్ల మంది ఆహారంలో తగిన పోషకాలు లేక సరిగా ఎదగలేక పోతున్నారు. 4.5 కోట్ల మంది చిన్నారులు బక్కచిక్కి పోతున్నారు. ఇందువల్ల ఐదేళ్ళలోపు చిన్నారులు మరణించే ప్రమాదం పెరుగుతున్నది. ఇప్పటి నుంచీ ఆకలి నిర్మూలన కార్యక్రమాలను ఉదృతం చేసినా, 2030 నాటికి 67 కోట్ల మంది అన్నార్తులుగా ఉంటారని జోస్యం చెప్పింది. 2030 నాటికి పూర్తిగా ఆకలిని నిర్మూలన అనే ప్రపంచ లక్ష్యం నెరవేరదని చెప్పింది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది ఆకలి వల్ల మరణిస్తున్నారని అంచనా వేసింది. ప్రపంచ జనాభాకి అవసరమైన ఆహారం కన్నా 50 శాతం అదనంగా ఉత్పత్తవుతున్నా, ఎంతో వృథా అవుతున్నది. కొనుగోలు శక్తి లేక, పంపిణీలో అవకతవకల వల్ల 29 శాతం ప్రజలు వివిధ స్థాయిల్లో ఆకలిని ఎదుర్కోవటం వాంఛనీయం కాదు. పంపిణీని మెరుగుపరచడం, ఉదారంగా సాయాన్నందించడంతో పాటు సరఫరాని పెంచాల్సిన అవసరం ఉంది. పంటలు పండాలన్నా, జీవులు జీవించాలన్నా నీటి అవసరాన్ని అందరూ గుర్తిస్తారు. జీవరాశుల కోసం పరిశుభ్రమైన, కాలుష్యం లేని నీరు కావాలి. పంటల ఉత్పత్తికి ప్రపంచంలోని పలుప్రాంతాల్లో నీరు కీలకంగా మారింది. నీటి వనరుల్ని పెంచడం, దానిని సమర్ధవంతంగా వినియోగించడం రెండూ కీలకంగా మారాయి. అందుకే ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ 2023 ప్రపంచ ఆహార దినోత్సవానికి ‘నీరే జీవం, నీరే ఆహారం, దానిని అందరికీ అందుబాటులోకి తేవాలనే’ నినాదాన్ని ప్రచారాంశంగా ఎంచుకుంది.
దేశంలోనూ పెరుగుతున్న అన్నార్తులు
2017లో దేశ ప్రజల్లో 13.2 శాతం మంది ఆకలితో బాధపడినట్లు అంచనా వేశారు. 2018లో అన్నార్తుల శాతం 13.3 శాతంకి పెరిగింది. 2019లో అన్నార్తుల శాతం 14.6 కి చేరింది. 2020లో అది మరింత పెరిగి 16.3 శాతంగా నామోదైంది. 2022లో ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ ‘ఆహార భద్రత, పోషక విలువలపై విడుదల చేసిన నివేదికలో భారత దేశంలో 22.43 కోట్ల మందికి సరైన ఆహారం లభించటంలేదని పేర్కొంది. ప్రపంచంలో అర్ధాకలితో బాధపడుతున్న వారిలో నాల్గవ వంతు భారతదేశంలోనే ఉన్నారని తెలిపింది. దేశ జనాభాలో 16 శాతం మంది అర్ధాకలితో ఉండటం ఆహార స్వయం సమృద్ధిని సాధించిన భారతదేశానికి ఒక మచ్చగా మిగిలింది. వయసులో ఉన్న స్త్రీలలో 53 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొన్నది. రోజుకి 7,000 మంది చొప్పున సంవత్సరానికి 25 లక్షల మంది ఆకలి వల్ల మరణిస్తున్నారని అంచనా కట్టింది.
యూరోప్‌లోని కొన్ని స్వచ్ఛంద సంస్థలు ‘ప్రపంచ ఆకలి సూచీ’ని రూపొందించి, ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నాయి. 2021 నివేదిక ప్రకారం అత్యంత ఆకలిగొన్న 116 దేశాల్లో భారతదేశానికి 101వ స్థానం లభించింది. 2022 నివేదిక ప్రకారం 121 దేశాల్లో 107వ స్థానంలో భారత్ ఉంది. ఐదేళ్ళ లోపు పిల్లల్లో 19.3 శాతం మంది పోషకాహారం లభించక బలహీనంగా ఉన్నట్లు ఆ నివేదిక తెలిపింది. ఇది ప్రపంచ దేశాలన్నిటిలోనూ అత్యధికం. ఐతే వయసుకి తగ్గ ఎత్తులేని వారి శాతంలో కొంత మెరుగుదల కనిపించింది. 2012-16 మధ్య వయసుకి తగ్గ ఎత్తులేని పిల్లల శాతం 38.7గా ఉంటే 2017-21 సంవత్సరాల మధ్య వారి శాతం 35.5కి తగ్గింది. శిశుమరణాల విషయంలో కూడా కొంత ప్రగతిని భారత్ సాధించింది. 2014 వ సంవత్సరంలో ఐదేళ్ళలోపు పిల్లల్లో 4.6 శాతం శిశు మరణాలుండగా 2020 సంవత్సరంలో శిశుమరణాల శాతం 3.3 శాతానికి తగ్గింది. శిశుమరణాల విషయంలోనూ, వయసుకి తగ్గ ఎత్తు విషయంలోనూ, కొంత అభివృద్ధి ఉన్నా, ఎత్తుకి తగ్గ బరువు విషయంలో సమస్య తీవ్రమౌతున్నందువల్ల భారతదేశం అట్టడుగు దేశాల్లోనే ‘ఆహార సూచీవిషయం’లో లెక్కించబడుతున్నది. ప్రపంచ ఆహార సూచీ తయారీలో నాలుగు అంశాలుండగా, అందులో మూడు ఐదేళ్ళలోపు పిల్లల ఆరోగ్యానికీ, పోషక విలువలకు సంబంధించడం వల్ల ‘ఆకలి సూచీ’ హేతుబద్ధమైనది కాదని భారత ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. 2022లో రూపొందించిన ‘ఆకలి సూచీ’ ప్రకారం దక్షిణాసియా దేశాల్లో ఒక్క ఆఫ్గనిస్తాన్ మాత్రమే భారతదేశం కన్నా వెనకబడి ఉన్నది. శ్రీలంకకు 64వ స్థానం, నేపాల్‌కు 81వ స్థానం, బంగ్లాదేశ్‌కు 84వ స్థానం, పాకిస్తాన్‌కు 99వ స్థానం లభించడం వల్ల ఆదేశాల్లో ఆకలి సమస్య భారత్‌లో కన్నా తక్కువగా ఉన్నట్లు ఆకలి సూచీ తెలిపింది. ఈ విధంగా భారతదేశాన్ని అభాసుపాలు చేయడానికి యూరోపియన్ స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయని భారత ప్రభుత్వం విమర్శించింది. అయితే ఈ సూచీల తయారీని భారత గణాంకాలతోనే రూపొందిచినట్లు ఆ సంస్థలు బదులిచ్చాయి. 2020 నవంబరులో దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్పించిన గణాంకాలను క్రోడీకరించగా దేశంలో 9.27 లక్షల మంది చిన్నారులు తీవ్రమైన అర్ధాకలితో ఉన్నారని తేలింది. 2021 అక్టోబరులో దేశంలోని అంగన్వాడీ కార్యకర్తలు పొందుపరచిన కొలతల ఆధారంగా దేశంలో 17.76 లక్షల మంది చిన్నారులు తీవ్రమైన ఆకలితో ఉన్నారని, మరో 15.24 లక్షల మంది ఒక మోస్తరు ఆకలి సమస్యతో బాధపడుతున్నారని తేలింది. ఐదేళ్ళలోపు పిల్లల చేయి పైభాగంలో ఉన్న కండరపు కొలత 11.5 మిల్లీమీటర్ల కంటే తక్కువుంటే వారు తీవ్రమైన ఆకలి సమస్యను ఎదుర్కుంటున్నారనీ, ఆ కొలత 11.5 మిల్లీమీటర్ల నుండి 25 మిల్లీమీటర్ల మధ్యలో ఉంటే వారు ఒక మోస్తరు ఆహార కొరతను ఎదుర్కుంటున్నారని గుర్తిస్తారు. 25 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ కొలత ఉంటే వారికి ఆకలి సమస్య లేదని లెక్కిస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ పథకం ‘పోషణ్ అభియాణన్’లో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల కండను కొలిచి, సమాచారాన్నిస్తున్నందు వల్ల విశ్వసించతగ్గవే. సమస్యను గుర్తించినప్పుడే పరిష్కారం వెతకగలము.
ఆశించిన పలితాలివ్వని పథకాలు
1975లో ప్రారంభించిన ‘ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్మెంట్ పథకం (ఐ.సి.డి.ఎస్)’ ద్వారా ఆరేళ్ళలోపు పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు పోషకాహారాన్నందించే పథకం అమల్లో ఉంది. ‘మిషన్ ఇంద్ర ధనుష్’ ద్వారా రెండేళ్ళలోపు పిల్లలకు 12 రకాల వేక్సిన్ల నిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం దేశవ్యాపితంగా ప్రవేశపెట్టినందువల్ల చిన్న పిల్లల బడి హాజరు, విద్యా ప్రమాణాలు మెరుగవుతాయని ఆశించారు. 2013లో ప్రవేశపెట్టిన ‘జాతీయ ఆహార భద్రతా చట్టం’ అమలు ద్వారా గ్రామీణ ప్రజల్లో నాల్గింట మూడొంతుల మందికి, పట్టణ ప్రజల్లో సగం మందికీ అతి తక్కువ ధరకే ఆహార ధాన్యాలను సరఫరా చేస్తున్నారు. 2017లో ప్రారంభించిన ప్రధానమంత్రి మాతృవందన పథకం ప్రసవించే తల్లులకు లాభాలను చేకూరుస్తున్నది. ఆహారాన్ని బలవర్ధకం చేసే పథకం ద్వారా కీలకమైన విటమిన్లు, ఇనుము, అయోడిన్, జింక్ వంటి ఖనిజలవణాలను బియ్యం, పాలు, ఉప్పులకు జోడించి, పోషక విలువల్ని పెంచుతున్నారు. 2018లో ప్రారంభించిన ‘పోషణ్ అభియాన్’ ద్వారా చిన్న పిల్లలు ఎత్తు పెరగటానికీ, బలాన్నందించడానికీ, మహిళల్లో రక్తహీనతను తగ్గించటానికి ప్రయత్నిస్తున్నది. ‘సరైన ఆహారం’ తీసుకునేలా ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ కూడా ప్రయత్నిస్తున్నది. కోవిడ్-19 సంక్షోభం తర్వాత ప్రధానమంత్రి ఉచిత ధాన్య పథకం కూడా మ్మురంగా అమలవుతున్నది. ఇన్ని బహుముఖ కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నా ఇంకా 16 శాతం ప్రజలు అర్ధాకలితో ఉండటం పిల్లల్లో బలహీనత తీవ్రంగా ఉండటం చూస్తే, దేశంలో ఆకలిని రూపుమాపటానికి మరిన్ని ప్రభావశీలమైన పథకాలు తేవాల్సిన అవసరం ఉంది. మానవులకు, ఇతర జంతుజాలానికీ, వృక్షాలకు నీటి అవసరం కీలకం. ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘నీతి ఆయోగ్’ అంచనా ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది మంచి నీరు లభించక మరణిస్తున్నారు. సురక్షితమైన తాగునీరు సరఫరా విషయంలో ప్రపంచ దేశాల్లో భారతదేశానికి 133వ స్థానం ఉంది. సురక్షిత మంచినీరు సరఫరా చేయడంలో ప్రభుత్వాల వైఫల్యం వల్ల దేశంలో మంచినీరు సరఫరా చేసే కంపెనీలకు లాభాలు దండిగా లభిస్తున్నాయి. పేద ప్రజలకు నీరుని కొనుగోలు చేసే శక్తి లేక కలుషిత జలాలను వాడటం వల్ల రోగాల బారిన పడి, మరణిస్తున్నారు. దేశంలో లభ్యమైతున్న నీటి వనరుల్లో 80 శాతం వ్యవసాయానికే వినియోగిస్తున్నా, సాగునీరు కొరత తీవ్రంగా ఉంది. నదుల అనుసంధాన కార్యక్రమానికి విద్యుచ్ఛక్తి కొరత అడ్డంకిగా ఉంది. ఆహార భద్రతకు నీటి సరఫరా కీలకంగానూ, నీటి సరఫరాకి విద్యుత్ ఉత్పత్తి అడ్డంకిగా నిలుస్తున్నాయి. దేశంలో నీటి వనరుల అభివృద్ధికీ, సద్వినియోగానికీ నిధుల్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. నదుల అనుసంధాన కార్యక్రమానికీ, విద్యుత్ ఉత్పత్తికీ ప్రాధాన్యత లభించాలి. పేదవర్గాల ప్రజలకు నీరు, ఆహారం సరఫరాపై కూడా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఉపాధి అవకాశాలు పెంచడం ద్వారా పేదల ఆదాయాలు పెరిగి, ఆహారాన్ని కొనుగోలు చేసే శక్తి సమకూరేలా కృషి చేయాలి. ఆహార భద్రత కన్నా మరే ఇతర సమస్య ముఖ్యం కాదు.
డా|| కిలారు పూర్ణచంద్రరావు, ప్రముఖ వ్యవసాయార్థిక శాస్త్రవేత్త, (రిటైర్డ్ & కన్సల్టెంట్ ఇక్రిసాట్), ఫోన్: 83098 59517, 70328 11608

