తెలంగాణాలో చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజనను (పీఎంఎంకేఎస్‌ఎస్‌వై) 2025-26 నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మత్స్యకారులు, రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పించనుంది. ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.250 కోట్లు వస్తాయి.
*చేపల పెంపకం ఇలా…*
ఎకరం నుంచి నాలుగెకరాల్లో చేపలు పెంచాలి. చెరువులు, కుంటల తవ్వకం, చేపపిల్లల కొనుగోలు, పెంపకానికి కేంద్రం సాయం అందిస్తుంది.
*సబ్సిడీలు…*
వ్యక్తిగతంగా చేపల పెంపకం యూనిట్‌కు జనరల్ కేటగిరీలో రూ.35 లక్షల గరిష్ఠ పరిమితితో 35 శాతం సబ్సిడీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రూ. 45 లక్షల పరిమితితో 35 శాతం సబ్సిడీని ఇస్తారు. రైతు ఉత్పత్తి సంఘాలు, స్వయంసహాయక సంఘాలు, సమాఖ్యలకు రూ.2 కోట్ల పరిమితితో 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఏదైనా సంస్థ పేరిట యూనిట్‌ను స్థాపిస్తే రూ.75 లక్షల పరిమితితో 25 శాతం సబ్సిడీ అందుతుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళల యాజమాన్యంలోని చిన్న సంస్థలకు రూ. కోటి పరిమితితో 35% సబ్సిడీ ఇస్తారు. కిసాన్ కార్డులున్న వారికి పీఎంఎంకేఎస్‌ఎస్‌వై కింద బ్యాంకులు రుణాలిస్తాయి. లబ్ధిదారులకు రుణ సాయంలో సంవత్సరానికి 3% వరకు వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. పీఎంఎంకేఎస్‌ఎస్‌వై కోసం నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్‌ఫాం వెబ్‌సైట్‌లో విధిగా నమోదు చేసుకోవాలి. తర్వాత రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ఆరా తీసి కేంద్రానికి నివేదిస్తారని మత్స్యశాఖ సంచాలకురాలు ప్రియాంక అభిప్రాయపడ్డారు. పథకానికి విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు.
ఇటీవల కాలం వరకు దేశ వ్యవసాయ రంగంలో కాస్త లాభాలనిచ్చే రంగంగా ఆక్వా పరిశ్రమ పేరుగాంచింది. అంతర్జాతీయ మార్కెట్‌లో రొయ్యలకు గిరాకీ ఉండటం, దేశీయ మార్కెట్‌లో చేపల వినియోగం పెరగటం వల్ల వాటిని సాగు చేసే రైతులకు ఆకర్షణీయమైన ప్రతిఫలం లభించింది. చేపల చెరువులకు కౌలు ఎకరాకు 50 వేల రూపాయలకు, రొయ్యల చెరువులకు కౌలు ఎకరాకు లక్ష రూపాయల వరకు చేరింది. దాదాపు 30 శాతం చెరువుల్ని కౌలు రైతులు సాగు చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా చేపలు, రొయ్యల్ని సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు తమకు లభిస్తున్న ధరల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల ఎగుమతులు మందగించడంతో రైతులకు లభిస్తున్న ధరలు ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువగా ఉంటున్నాయని వారు వాపోతున్నారు. దాణా ధరలు, కూలీల రేట్లు, విద్యుచ్ఛక్తి ఛార్జీలు పెరగటం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగటం, ఉత్పత్తులకు లభిస్తున్న ధరలు మాత్రం పదేళ్ళ కింద స్థాయిలోనే ఉండటం వల్ల తమకు గిట్టుబాటు కాకపోవడం వల్ల ‘పంటవిరామం’ ప్రకటించే అవకాశముందని ఉత్పత్తిదార్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. రొయ్య, చేపపిల్లల్ని సరఫరా హేచరీలు తమ కార్యకలాపాలను తగ్గిస్తున్నాయి. దాణాను సరఫరా చేసే కంపెనీలు ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. రైతులు కొంతమంది రెండవ, మూడవ పంటలను మానివేయటము, వేసే పిల్లల సంఖ్యను తగ్గించడం చేస్తున్నారు. ఎగుమతిదార్లు కొనుగోళ్ళు ఆపు చేయడం వల్ల ధరలు తగ్గాయి. కొనుగోలు చేసే వ్యాపారులు ఒక ‘సిండికేట్’గా ఏర్పడి ధరల్ని తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన చేస్తున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి సంక్షోభాలేర్పడటం ఆక్వా పరిశ్రమకు కొత్తకాదు. కరోనా ప్రబలినప్పుడు ఎగుమతులు తగ్గటం, ధరలు పడిపోవటం జరిగింది. కాని దాని ప్రభావం తగ్గగానే మళ్ళీ ఎగుమతులు పెరిగాయి. రైతులు సాగుని పెంచారు. 2022తో పోలిస్తే 2023లో ప్రపంచ రొయ్యల ఉత్పత్తి కొంత తగ్గింది. 2024లో అది మళ్ళీ పుంజుకుంటుందనే ఆశాభావం వ్యక్తమయింది. అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వినిమయదారులు తమ నెలవారీ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో రొయ్యలు వంటి అధిక ధర ఉన్న ఉత్పత్తులను తక్కువగా కొంటున్నారు. రొయ్యల్లో ‘కొలెస్ట్రాల్’ ఎక్కువగా ఉంటుందనే ప్రచారం కూడా గిరాకీ తగ్గటానికి కారణం కావచ్చు.
వేగంగా పెరిగిన గిరాకీ, ఉత్పత్తి
సాంప్రదాయంగా, సహజంగా సముద్ర జలాల్లో రొయ్యలు, చేపలు లభ్యమౌతుంటాయి. ఇప్పుడు వాటిని చెరువుల్లో పెంచటం మొదలైన తార్వత కూడా వాటిని ‘సముద్ర ఉత్పత్తులు’గా, ‘సముద్ర ఆహారం’గానే పరిగణిస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1950-51లో దేశంలో చేపల ఉత్పత్తి 7.5 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేయబడింది. 2021-22లో దేశంలో చేపల ఉత్పత్తి 162.5 లక్షలకు పెరిగింది. 71 సంవత్సరాల్లో దేశంలో చేపల ఉత్పత్తి 22 రెట్లు పెరగటం విశేషం. 1970లో దేశంలో రొయ్యల ఉత్పత్తి కేవలం 20 టన్నులుగా నయోదైంది. తాజా అంచనాల ప్రకారం దేశంలో దాదాపు 9 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తయ్యాయి. చేపలు, రొయ్యల ఉత్పత్తిలో సాధించిన అద్భుత ప్రగతి వల్ల దేశంలో హరిత, శ్వేత విప్లవాలతో పాటు నీలి విప్లవం కూడా సంభవించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దేశంలో చేపల తలసరి లభ్యత 8.9 కిలోలకు పెరిగింది. దేశంలో ఉత్పత్తయ్యే చేపల్లో కొద్ది భాగమే ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. కాని దేశంలో ఉత్పత్తయ్యే రొయ్యల్లో 90 శాతానికి పైగా ఎగుమతి అవుతున్నాయి. అందువల్ల తలసరి రొయ్యల వినియోగం దేశంలో కొన్ని గ్రాములకే పరిమితమైంది. 2022-23లో దేశం నుండి 17,35,286 మెట్రిక్ టన్నుల సముద్ర ఆహార ఉత్పత్తులు దేశం నుండి ఎగుమతయ్యాయి. వాటి విలువ 63,969.14 కోట్ల రూపాయలు (8.09 బిలియన్ల అమెరికన్ డాలర్లు)గా ఉంది. 2023-24లో సముద్ర ఆహార ఉత్పత్తుల విలువ 9.25 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరాలనే లక్ష్యాన్ని ప్రకటించారు. కాని 2023 ఏప్రిల్ నుండి 2024 జనవరి వరకు జరిగిన సముద్ర ఆహారోత్పత్తుల ఎగుమతి విలువ అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జరిగిన ఎగుమతుల విలువ 7.5 శాతం తగ్గినట్లు అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. ఐతే ఎగుమతుల పరిమాణం మాత్రం తగ్గలేదు. ‘వనామీ’ రకం రొయ్యల ధర అంతర్జాతీయ మార్కెట్‌లో తగ్గటం వల్ల ఎగుమతుల విలువ తగ్గింది. దక్షిణ అమెరికాలోని ఈక్వడార్ దేశంలో వాణిజ్య స్థాయిలో రొయ్యల సాగు జరుగుతున్నది. 11 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తితో భారతదేశాన్ని రెండవ స్థానానికి నెట్టి వేసింది. భారత దేశంలో రొయ్యల ఉత్పత్తి చిన్న చిన్న కమతాల్లో జరుగుతుండగా ఈక్వడార్‌లో పెద్దపెద్ద కంపెనీలు సగటున 250 హెక్టార్ల విస్తీర్ణంలో రొయ్యల ఉత్పత్తిని చేపట్టాయి. ఈక్వడార్ పోటీలో ఉండి అధిక మొత్తంలో వనామీ రొయ్యల్ని ఎగుమతి చేయడం వల్ల ధరలు తగ్గాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
పెరిగిన చేపలు, రొయ్యల సాగు
2023లో ప్రపంచంలో 186.6 మిలియన్ మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగినట్లు అంచనా వేశారు. సాంప్రదాయంగా సముద్రాలు, నదులు, జలాశయాలు, వాగులు వంటి జలవనరుల నుండి వలలు, బోట్లు, మరబోట్లు వంటి సాధనాల సాయంతో పట్టినవి 90.6 మిలియన్ మెట్రిక్ టన్నులుండగా, కృత్రిమంగా తవ్విన చెరువుల్లో పిల్లలను వేసి, మంచి నిర్వహణతో ఉత్పత్తి చేసిన చేపలు96.6 మిలియన్ మెట్రిక్ టన్నులుగా లెక్కించారు. 2022లో ప్రపంచంలో రొయ్యల ఉత్పత్తి 94 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేశారు. అందులో 38 లక్షల టన్నుల రొయ్యలను సహజ వనరుల నుండి పట్టుకోగా, 56 లక్షల టన్నుల రొయ్యలను కృత్రిమంగా నిర్మించిన చెరువుల్లో సాగు చేసి ఉత్పత్తి చేశారు. 2023లో ప్రపంచ సాగర ఆహార ఉత్పత్తుల విలువను 155.32 బిలియన్ డాలర్లుగా అంచనా కట్టారు. ఇలా చేపలు, రొయ్యల ఉత్పత్తిలో సాగు ద్వారా ఉత్పత్తి చేసినవి సహజ వనరుల నుండి పట్టిన వాటికంటే ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తున్నది. భారతదేశంలో కూడా ఇదే ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. 1980-81లో భారతదేశంలో సముద్ర వనరుల నుండి 15.55 లక్షల టన్నుల చేపల్ని పట్టగా కేవలం 8.87 లక్షల టన్నులు మాత్రమే అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి లభించాయి. 2000-01లో సముద్ర వనరుల నుండి 28.11 లక్షల టన్నుల చేపల్ని పట్టగా అందుకు సమానంగా 28.45 లక్షల టన్నుల చేపలు అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి లభించాయి. 2021-22లో సముద్ర వనరుల నుండి 41.27 లక్షల టన్నుల చేపల్ని పట్టగా, 121.21 లక్షల టన్నుల చేపలు అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి లభించాయి. సముద్ర వనరుల నుండి ఒక వంతు చేపలు లభించగా, అంతర్గత వనరుల నుండి, ముఖ్యంగా కృత్రిమ చెరువుల ద్వారా మూడొంతులు ఉత్పత్తయ్యాయి. సహజ వనరుల్లో పట్టే చేపల కన్నా, కృత్రిమ చెరువుల్లోనే ఎక్కువగా చేపలు ఉత్పత్తవుతున్నాయి. మొత్తం చేపల ఉత్పత్తిలో దాదాపు 30 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. 11.4 శాతం వాటాతో పశ్చిమ బెంగాల్ రెండవ స్థానంలోనూ, 6.4 శాతం వాటాతో కర్నాటక మూడవ స్థానంలోనూ, 6.1 శాతం వాటాతో ఒడిస్సా నాల్గవ స్థానంలోనూ చేపల ఉత్పత్తిలో ప్రముఖంగా ఉన్నాయి. 5.4 శాతం వాటాతో గుజరాత్, 5.1 శాతం వాటాతో కేరళ, 5 శాతం వాటాతో తమిళనాడు రాష్ట్రాలు కూడా ముఖ్యమైన చేపల ఉత్పత్తి కేంద్రాలుగా ఉన్నాయి. గుజరాత్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలకు సముద్ర వనరుల నుండి చేపలు లభిస్తుండగా ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, కర్నాటక రాష్ట్రాల్లో అంతర్గత జలవనరుల నుండి, కృత్రిమ సాగు నుండి ఎక్కువగా చేపలు ఉత్పత్తవుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో అంతర్గత జల వనరుల నుండి, కృత్రిమ సాగు నుండి 3.9 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తయ్యాయి. రొయ్యల ఉత్పత్తిలో కృత్రిమ సాగుదే ప్రధాన పాత్రగా ఉన్నది. మొదట్లో చైనా, థాయ్‌లాండ్‌లలో ప్రారంభమైన రొయ్యల సాగు భారతదేశానికి పాకింది. ముందుగా నల్లటైగర్ రొయ్యలతో ప్రారంభైన సాగు ఆ రకం రొయ్యలకు వైరస్ తెగుళ్ళు ఎక్కువగా సోకటం వల్ల వనామీ రొయ్యల సాగు ప్రాచుర్యంలోకి వచ్చిందిప్పుడు. దేశంలో 108,526 హెక్టార్లలో వనామీ రొయ్యల సాగు జరుగుతుంది. 20-21లో 815,745 టన్నుల వనామీ రొయ్యలు ఉత్పత్తయ్యాయి. చేపల సాగులాగానే వనామీ రొయ్యల సాగులోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం వనామీ సాగు విస్తీర్ణంలో 66.3 శాతం వనామీ రొయ్యల ఉత్పత్తిలో 77.8 శాతం వాటాలు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నాయి. గుజరాత్, తమిళనాడు, ఒడిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కూడా కొంతమేరకు వనామీ రొయ్యల ఉత్పత్తి జరుగుతున్నది. భారతదేశంలో నల్ల టైగర్ రొయ్యల్ని 58,196 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. 27,616 టన్నుల నల్లటైగర్ రొయ్యలు ఉత్పత్తవుతున్నాయి. పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటక, ఒడిస్సా రాష్ట్రాల్లో ఈ నల్లటైగర్ రొయ్యలు సాగవుతున్నాయి.
సంక్షోభ సూచికలు
రొయ్యలు, చేపల సాగులో సమస్యలు కొత్తకాదు. అనేక వైరస్ జబ్బులు వాటిని ఆశిస్తాయి. తెగుళ్ళ బెడద, మార్కెట్ ఒడిదుడుకుల వల్ల రొయ్యల సాగులో నాలుగైదేళ్ళకోసారి నష్టాలొస్తుంటాయి. ఐతే మిగిలిన సంవత్సరాల్లో ఆకర్షణీయమైన లాభాలుంటాయి. ఉప్పు కయ్యలకు సమీపంలోని చేలల్లోకి కావలసినప్పుడు ఉప్పు నీటిని పంపే అవకాశముండి, మురుగు నీటిని బయటకి పంపే సౌకర్యం ఉన్న చేలను చెరువులుగా మార్చి, హేచరీల నుండి పిల్లల్ని, కంపెనీల నుండి దాణాను, మందులను కొని, శ్రామికుల సాయంతో రైతులు, కౌలుదార్లు రొయ్యల సాగుని చేస్తున్నారు. కిలో రొయ్యల ఉత్పత్తికి దాణా ఖర్చు రూ. 90 నుండి 100 వరకు అవుతున్నది. పిల్లల ఖర్చు, విద్యుచ్ఛక్తి బిల్లు, కూలీల ఖర్చు, మందులు వగైరా ఇతర ఖర్చులన్నీ కలిపి దాదాపు రెండువందల వరకు ఉత్పత్తి వ్యయం అవుతున్నది. ఇక కౌలు, వడ్డీ, ఇన్సూరెన్స్ వంటి వాటిని లెక్కిస్తే ఉత్పత్తి వ్యయం కిలోకి రూ. 250 లకు చేరుతుంది. ప్రపంచ మార్కెట్‌లో ధరలు తగ్గటం, ఎగుమతిదార్లు కొనుగోలు చేయకపోవటం, ప్రాసెసర్లు క్రియాశీలకంగా లేకపోవటం వల్ల వ్యాపారలు చాలా తక్కువ ధరలకు మాత్రమే రైతులు, కౌలుదార్లు కొనుగోళ్ళు చేసారు. ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువ ధరకు అమ్మవలసి రావటంతో చాలామంది రైతులు, కౌలుదార్లు నష్టపోయారు. కొత్త పంట వేయటానికి ఆసక్తి, పెట్టుబడి లేక ఉత్పత్తి తగ్గటానికి చర్యలు తీసుకుంటున్నారు. కొందరు పంట వేయడం మానివేస్తే మరి కొందరు పిల్లల్ని తక్కువ సంఖ్యలో వేస్తున్నారు.
ఎగుమతులపై ఆధారపడ్డ రొయ్యల సాగు పరిస్థితి అలా ఉంటే దేశీయ మార్కెట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతున్న చేపల సాగు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. చేపల దాణా కూడా కిలోకి 50 రూపాయల వరకు చేరింది. ఒక కిలో బరువు పెరగటానికి చేపలకు 1.1 కిలోల దాణా అవసరమౌతుంది. ఇక విద్యుత్ ఛార్జీలు, కూలీల ఖర్చులు, మందుల ఖర్చు, పెట్టుబడిపై వడ్డీ వంటి ఇతర ఖర్చులన్నీ కలిపితే కిలో చేపల ఉత్పత్తి వ్యయం రూ. 100లు దాటుతున్నది. శీలావతి రకం చేపలకు కిలోకి వంద రూపాయలు మాత్రమే లభిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కిలోకి రూ. 120 ల ధర లభిస్తే తప్ప తమకు గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. రొయ్యల చెరువుల కన్నా చేపల చెరువుల్ని ఎక్కువ లోతు తవ్వాలి. మంచి నీరు రావటానికి, మురుగు నీరు బయటకు పోవటానికి ఏర్పాట్లు ఉండాలి. చేపలకు ఆక్సిజన్ లభించటానికి ఏరేటర్లు వంటి యంత్రాలను వాడాలి. వీటికయ్యే పెట్టుబడిపై వడ్డీ కూడా గణనీయంగా ఉంటుంది. ఆక్వాపరిశ్రమవల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయి. సముద్ర తీరానికి చేరువలో ఉండే మడ అడవులు తగ్గిపోతున్నాయి. ఈ దీర్ఘకాలిక సమస్యలు ఇలా ఉండగా చేపల రైతులకు గిట్టుబాటు కాని పరిస్థితులేర్పడటం వల్ల చేపల సాగు కూడా తగ్గవచ్చు. పది ఎకరాల లోపు సాగు చేసే రైతులకు యూనిట్‌కు రూ. 1.50 చొప్పున విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆ పరిమితిని మించితే యూనిట్‌కు నాలుగు రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రభుత్వం మరికొంత రాయితీని ఇవ్వాలని చేపలు, రొయ్యలను సాగు చేసే రైతులు కోరుతున్నారు.
సమస్యలు తాత్కాలికమే
ఆక్వారంగంలో ప్రస్తుతమున్న సమస్యలు దీర్ఘకాలం ఉండే అవకాశాలు లేవు. జంతువులన్నిటిలోనూ చేపలే అత్యంత సమర్ధవంతమైనవిగా దాణాను తమ శరీర బరువుగా మార్చుకుంటాయి. ఒక కిలో బరువు తమ శరీరంలో పెరగటానికి 1.1 కిలోల దాణా సరిపోతుంది. మాంసానికి పెంచే కోళ్ళు ఒక కిలో శరీర బరువు పెరగటానికి 1.7 కిలోల దాణా అవసరమౌతుంది. అదే పశువులు ఒక కిలో బరువు పెరగటానికి 6.6 కిలోల దాణా అవసరమౌతుంది. అత్యంత సమర్ధవంతంగా దాణాను వినియోగించుకొని బరువు పెరగగలిగిన చేపలకు గిరాకీ పెరుగుతున్నది. 2005 నుండి 2021 మధ్య దేశంలో చేపల తలసరి వినియోగం 81 శాతం పెరిగింది. ప్రస్తుతం 8.9 కిలోల తలసరి చేపల వినియోగం 2030 నాటికి 19.8 కిలోలకు పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాంసాహారాలన్నిటిలోనూ పోషక విలువలు అత్యధికంగా చేపల్లో ఉన్నాయని పరిశోధనలు తెలుపుతున్నాయి. వాటి ధరలు కోడి మాంసం ధరలకు సమానంగా ఉన్నాయి. అలాగే రొయ్యల ధరలు వేటమాంసం ధరల స్థాయిలో ఉన్నాయి. దేశంలో ప్రజల సగటు ఆదాయాలు పెరిగేకొద్దీ మాంసాహారానికి గిరాకీ పెరుగుతుంది. ఇప్పుడు ఎగుమతులకే పరిమితమయిన రొయ్యలకు దేశీయ మార్కెట్లో కూడా గిరాకీ ఏర్పడే అవకాశాలున్నాయి. రొయ్యల ధరలు గత 30 సంవత్సరాల్లో తగ్గాయి. 1994 ఏప్రిల్‌లో కిలో రొయ్యల ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 12.73 డాలర్లుగా ఉంది. నవంబరు 2009లో అత్యల్పంగా కిలోకి 7.5 డాలర్లకు తగ్గింది. ఆగస్టు 2014లో గరిష్టంగా కిలోకి 19.25 డాలర్లకు పెరిగింది. అక్టోబరు 2023లో వాటి ధర కిలోకి 8.6 డాలర్లకు తగ్గింది. ఇలా రొయ్యల ధరల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆటుపోట్లు సాధారణమే. అప్పుడే ధరలు కొంత పెరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం తగ్గి, వడ్డీ రేట్లు తగ్గి, పెరుగుదల నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.1 శాతం పెరుగుదలను 2024లో నమోదు చేస్తుందనీ, 2025లో అది 3.2 శాతంగా ఉంటుందని ప్రపంచంలో ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత దేశంలో ఆర్థిక ప్రగతి 6.5 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ జోస్యం చెప్పింది. 2023లో సముద్ర ఆహార ఉత్పత్తులు 20.7 మిలియన్ టన్నులుగా ఉన్నాయనీ అవి ఏటా 7.8 శాతం వృద్ధిరేటుతో 2032 నాటికల్లా 41.4 మిలియన్ టన్నులకు చేరతాయని ప్రభుత్వ మత్స్య శాఖ అంచనా వేసింది. వాటి విలువ 2024లో 21.04 బిలియన్ డాలర్లుగా ఉందనీ, 2028 నాటికల్లా వాటి విలువ 29.37 బిలియన్ డాలర్లకు చేరుతుందనీ ఆశిస్తున్నారు. స్థానిక, ప్రపంచ మార్కెట్లలో చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహార ఉత్పత్తులకు గిరాకీ పెరగటం ద్వారానే సాధ్యపడుతుంది. ప్రస్తుతం తాత్కాలిక సంక్షోభంలో ఉన్న ఆక్వా పరిశ్రమ త్వరలో బయటపడి రైతులకు లాభాలను, వినిమయ దారులకు ఆరోగ్యాన్నీ అందిస్తుందని ఆశిద్దాము.