తెలంగాణాలో చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి మత్స్య కిసాన్‌ సమృద్ధి సహ యోజనను (పీఎంఎంకేఎస్‌ఎస్‌వై) 2025-26 నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. మత్స్యకారులు, రైతులు, రైతు ఉత్పత్తి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు అవకాశం కల్పించనుంది. ఈ పథకం కింద రాష్ట్రానికి రూ.250 కోట్లు వస్తాయి.

*చేపల పెంపకం ఇలా…*

ఎకరం నుంచి నాలుగెకరాల్లో చేపలు పెంచాలి. చెరువులు, కుంటల తవ్వకం, చేపపిల్లల కొనుగోలు, పెంపకానికి కేంద్రం సాయం అందిస్తుంది.

*సబ్సిడీలు…*

వ్యక్తిగతంగా చేపల పెంపకం యూనిట్‌కు జనరల్‌ కేటగిరీలో రూ.35 లక్షల గరిష్ఠ పరిమితితో 35 శాతం సబ్సిడీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రూ. 45 లక్షల పరిమితితో 35 శాతం సబ్సిడీని ఇస్తారు. రైతు ఉత్పత్తి సంఘాలు, స్వయంసహాయక సంఘాలు, సమాఖ్యలకు రూ.2 కోట్ల పరిమితితో 35 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఏదైనా సంస్థ పేరిట యూనిట్‌ను స్థాపిస్తే రూ.75 లక్షల పరిమితితో 25 శాతం సబ్సిడీ అందుతుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళల యాజమాన్యంలోని చిన్న సంస్థలకు రూ. కోటి పరిమితితో 35% సబ్సిడీ ఇస్తారు. కిసాన్‌ కార్డులున్న వారికి పీఎంఎంకేఎస్‌ఎస్‌వై కింద బ్యాంకులు రుణాలిస్తాయి. లబ్ధిదారులకు రుణ సాయంలో సంవత్సరానికి 3% వరకు వడ్డీ రాయితీని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. పీఎంఎంకేఎస్‌ఎస్‌వై కోసం నేషనల్‌ ఫిషరీస్‌ డిజిటల్‌ ప్లాట్‌ఫాం వెబ్‌సైట్‌లో విధిగా నమోదు చేసుకోవాలి. తర్వాత రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు ఆరా తీసి కేంద్రానికి నివేదిస్తారని మత్స్యశాఖ సంచాలకురాలు ప్రియాంక అభిప్రాయపడ్డారు. పథకానికి విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు.