పశువులు, కోళ్ళ వైద్యానికి సంబంధించి సరికొత్త ప్రామాణిక మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. యాంటిబయాటిక్ తదితర ఔషధాల వినియోగాన్ని తగ్గించడం, దుర్వినియోగాన్ని అరికట్టే ప్రత్యామ్నాయ వైద్య చికిత్సలపై దృష్టి పెట్టి, సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతులకు పెద్దపీట వేసింది. నిర్హేతుకంగా యాంటీబయాటిక్స్ తదితర అల్లోపతి ఔషధాల వినియోగాన్ని కట్టడి చేయడంతో పాటు.. ఆరోగ్యదాయకమైన ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతులను విస్తృతంగా వ్యాప్తిలోకి తెచ్చే లక్ష్యంతో కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పాడి పశువుల చికిత్సలో చీటికిమాటికి యాంటిబయోటిక్స్ను అతిగా వాడటం, దుర్వినియోగం చేయడం వలన పాలు, పాల ఉత్పత్తులు, మాంసం, గుడ్లు తదితర ఆహారోత్పత్తుల్లో మోతాదుకు మించి మిగిలిపోతున్నాయి. సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతులలో రైతులే స్వయంగా తయారు చేసుకుని వాడుకునేందుకు వీలుగా ఉండే చికిత్సా పద్ధతులకు పెద్ద పీట వేశారు. ఈ రంగంలో 20 ఏళ్లు కృషి చేసిన తమిళనాడుకు చెందిన ప్రొఫెసర్ ఎన్. పుణ్యస్వామి 22 రకాల పశువ్యాధులకు రూపొందించిన సంప్రదాయ ఆయుర్వేద చికిత్సా పద్ధతులకు చోటు కల్పించారు. ముఖ్యమైన ఈ 22 రకాల జబ్బులకు (అల్లోపతి మందులు, యాంటీబయాటిక్స్ వాడనవసరం లేకుండా) రైతుల ఇళ్ళలో పోపు డబ్బాల్లో ఉండే మసాలా దినుసులు, పెరట్లో ఉండే మొక్కలతో ఆయుర్వేద మందులను రైతులే స్వయంగా తయారు చేసుకుని వాడుకోగలిగే పద్ధతులనుపొందుపరచిన ఒక చిరు పుస్తకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా తెలుగు మరియు ఇతర ప్రాంతీయ భాషలలో రూపొందించి ఎన్డిడిబి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచారు.

5 Nov, 2024
