————————– కథ———————————
”వాడిని ఇంటర్మీడియట్‌లో ఎమ్‌పిసి గ్రూప్‌లో చేర్చింది, బి.టెక్‌లో కంప్యూటర్ సైన్సు చదువుతాడని. సాఫ్ట్‌వేర్ ఇంజనీరు అయితే ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉంటూ అమెరికా దేశంలో స్థిరపడతాడని. వీడేమో నా మాట వినకుండా అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సు చేరినాడు. హాయిగా జీవితాన్ని గడపకుండా మట్టి పిసుక్కునే వారికి సేవ చేయాలని ఎందుకు కోరుకుంటున్నాడో? వేళా పాళా ఉండదు,కయ్యిలమ్మిటా కాల్వలమ్మిటా తిరగాలి, పెద్దగా చదవని రైతులతో, మామూలు జనంతో కలిసి పనిచేయాలి. అదే సాఫ్ట్ వేర్ అయితే జీవితాన్ని అనుభవించ వచ్చు. విమానాల్లో ఎగురవచ్చు. మేధావులతో, బాగా డబ్బున్న వారితో కలిసి పని చేయవచ్చు” నిష్టూరపోయినాడు నారాయణరెడ్డి.
”మనకు నచ్చిన చదువు వాడు చదవాలని లేదు కదా. వాడికి నచ్చిన చదువు చదవనివ్వండి. అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ఎవరి నుదిటిన ఏమి రాసి పెట్టి ఉందో…”అని ఈశ్వరమ్మ భర్తను ఓదార్చింది.
* * * * *
చిత్తూరు జిల్లా, పలమనేరు పట్టణానికి పాతిక మైళ్ళ దూరంలో ఉన్న చిన్న గ్రామమది. ఆ గ్రామం పక్కనే దండిగా పల్లెలున్నాయి. అక్కడి రైతులు కూరగాయ తోటలు పండిస్తారు. పది చదివిన తరువాత ఐ టి ఐ చదివిన నారాయణరెడ్డి బావి మోటార్లు రిపేరు చేస్తూ ఉంటాడు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు చదివిన ఈశ్వరమ్మ టైలరింగ్ చేస్తూ ఉంది. వీరి ఒక్కగానొక్క కొడుకు చిరంజీవి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
* * * * *
అప్పుడప్పుడే తెల్లారుతోంది. ఇంటి ముందరి గులాబీ తోటలోని గులాబీలు కోస్తూ ఉన్నాడు చిరంజీవి.
తక్కెడాయన, వాడి పెళ్ళాంతో కలిసి గంపలు, గోతాలు ఎత్తుకుని పరుగులు తీస్తున్నాడు.
”ఏమయ్యింది” అని అడిగినాడు.
”కూరగాయ పంటలు పండించే రైతులకు కొత్త కష్టం వచ్చి పడింది. రాత్రిళ్ళలో మాత్రమే దాడి చేసే దండు…. నత్తల దండు, రైతుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది”
ఆశ్చర్యంగా వారి వైపు చూశాడు చిరంజీవి.
”పగులు కనబడవు, రాత్రిళ్ళలో పొలాల్లోకి వస్తున్నాయి. చేతికి అందాల్సిన పంటలు ధ్వంసం చేస్తున్నాయి.
ఊరికి ఉత్తరాన వుండే గుట్ట కింద మాకు నేల ఉంది. పది రూపాయలు సంపాదించుకుందామని టమోటా తోట వేసినాను. ఇప్పుడు ఈ నత్తల దయ్యాలు వచ్చి నోటికాడి కూడు లాగేస్తా ఉన్నాయి.
మా పంటే కాదు, ఊర్లో వాళ్ళ ఉర్లగడ్డ, మిరప, చిక్కుడు, బీర తోటలు కూడా నాశనం చేస్తున్నాయి”
చిన్నగా తక్కెడాయనతో కలిసి టమోటా తోట కాడికి బయలుదేరినాడు. పొలాల్లో నత్తల దాడి జరుగుతూ ఉందని తెలుసుకున్నాయేమో ఊరి కుక్కలు, భౌభౌమని అరుస్తూ ఉన్నాయి.
దబ దబా పరుగెత్తుకుంటూ వచ్చిన ఆడంగిలాయన ”ఏందబ్బా, నత్త నడక నడస్తా వుండారే, కొంపలు కొల్లేరు అయిపోతావుంటే…. పరిగెత్తండి… పరిగెత్తండి” అంటూ తోసుకుంటూ వెళ్ళినాడు.
పరుగులు తీస్తూ మబ్బులో గణేష్ బీడీ కట్టపై పేపరును తొక్కినాడు. ”అయ్యో..అయ్యో…దేముడి బొమ్మ తొక్కేసినానే ….” అంటూ ఆ పేపరుకు పడీపడీ మొక్కి, మళ్ళీ టమోటా తోటలోకి పరుగులు తీసినాడు.
చిన్నగా మంచు కురుస్తోంది.అప్పటికే కొంత మంది రైతులు పొలాల్లో చేరి ఉన్నారు. వాటిని ఏరి గంపల్లో, తట్టల్లో, గోతాములలో వేసుకుని దూరంగా పారేస్తున్నారు.
తోటలలో వున్న డ్రిప్ పైపుల్లో నుంచి నీరు సరిగా రాక పోవడం గమనించి కారణం అడిగాడు.
”నత్తలు కూరగాయలను తినడమే కాదు, డ్రిప్ పైపుల్లో కూడా దూరి నీళ్లను సరిగ్గా రానివ్వడం లేదు” అని బదులిచ్చినాడు తక్కెడాయన. చిరంజీవి బాధగా తలెత్తి చూశాడు.
వందలాది నత్తగుల్లలు గెనుమలపైన, పొలాల్లో కనిపించాయి. శత్రు సేనపై దాడి చేసే సిపాయిల్లాగా అవి టమోటా మొక్కలన్నిటినీ చుట్టుముట్టి ఉన్నాయి. తేమ వాతావరణం నత్తల మనుగడకు అనువుగా ఉందని గుర్తించాడు.
నత్తలు నడిచే దారిలో అవి విడిచిపెట్టిన జిగురు తివాచీ పరిచినట్లుగా ఉంది. ఊర్లోని పిల్లలు కొందరు జిగురు వెంబడే, కారులో పోయినట్లు ‘రుయ్ రుయ్’ మని శబ్దం చేసుకుంటూ ఆడుకుంటున్నారు.
”నత్తా నత్తా
ఎక్కడి కెళతావ్?
మెత్త మెత్త నడకతో
ఎంత దూరం పోతావ్?
నిన్ను పట్టి అత్తకి ఇస్తా!
కూర వండించి దుత్తలో పెడతా!!” అని పాడుతున్నాడు ఆడంగిలాయన.
నత్తలు పంటల్ని ఎలా నాశనం చేస్తున్నాయని అక్కడి రైతులను అడిగాడు.
వారు టమోటా చెట్లను చూపిస్తూ ఇలా చెప్పారు ”మొక్కల మొదళ్లలోని మృదువైన భాగాన్ని తినేస్తున్నాయి. మొక్కకు అందాల్సిన సూక్ష్మ పోషకాలు తగ్గి పంట ఎగబడి రావడం లేదు. మొక్కలకు రోగ నిరోధక శక్తి తగ్గి ఫంగస్ కారణంగా తెగుళ్లు సోకుతున్నాయి”
‘నత్తల వల్ల పంటకు నష్టం,రైతులకు కష్టం వచ్చింది కదబ్బా’ అని కొద్దిసేపు అక్కడే గెనుమ మీద కూర్చుని ఆలోచనలలో పడినాడు. తన చేతిలోని మొబైల్‌లోని నెట్ ద్వారా వాటిని ఎలా తరిమేయాలో చూశాడు. పరిచయమున్న అగ్రికల్చరల్ బి.ఎస్సీ చదువుతున్న సీనియర్లతో మాట్లాడినాడు. పలమనేరులోని వ్యవసాయ అధికారులతో మాట్లాడాడు. వాటిని ఎలా తరిమికొట్టాలో కొన్ని సలహాలు తీసుకున్నాడు.
రెండు మూడు వారాలు రైతులతో పాటే పొలాల్లోకి వెళ్ళాడు. కొన్ని మందులను డ్రిప్పుల ద్వారా, కొన్ని మందులను నేరుగా చల్లించినాడు.
కొద్దికొద్దిగా నత్త గుల్లల తాకిడి తగ్గింది. రైతులు చిన్నగా ఊపిరి పీల్చుకోగలిగినారు.
* * * * *
కొడుకు, రోజూ రైతులమ్మిట తిరగడం చూసిన నారాయణ రెడ్డి, భార్యతో ఇలా అన్నాడు ”చదువుకునే వాడు బుద్ధిగా చదువుకోకుండా, వాడికి ఊర్లో వాళ్ళతో ఏమి పని? ఎవరు ఎట్లపోతే మనకేమి? దారిన పడి వున్న చెత్తను నెత్తిపైన వేసుకుంటాడెందుకు?
సుఖ పడే లక్షణాలు లేవు వీడికి …జల్సాగా కాలు మీద కాలు వేసుకుని ఉద్యోగాలు చేసే చదువులు చదవకుండా కూలీ లెక్కన పొలాల్లో కష్టపడే చదువు చదువుతున్నాడు. రేపు పెండ్లి చేయాలన్నా కష్టం. అమెరికా అబ్బాయిలకే అమ్మాయిలు దొరకడం లేదు. మట్టిలో దొర్లా డాలకునే వీడికి పిల్లను ఎవరు ఇస్తారు”
”ఎందుకండీ అలా శాపనార్థాలు పెడతారు. మట్టిని నమ్ముకున్నవాళ్ళెప్పుడూ చెడిపోరు లెండి. అమెరికాలో ఉద్యోగం చేస్తేనే చేసినట్లా? మన ఊర్లల్లో చేస్తే ఉద్యోగాలు కావా”
”మా పెద్ద నాయన కొడుకు జర్మనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా లక్షలు సంపాదిస్తున్నాడు. మా మేనమామ అల్లుడు అమెరికాలో ఏకంగా పెద్ద బిల్డింగ్ కొనేసాడు. సింగపూర్‌లో వుండే మా పిన్ని మనుమడికి నెలకు నలభై లక్షల జీతమంట. కొడితే అలాంటి జాక్‌పాట్‌లు కొట్టాలి. రవిక గుడ్డల వ్యాపారం చేసేవాడికి, పట్టు చీరల వ్యాపారం చేసేవాడికి ఉన్నంత తేడా ఉంది”
”వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా సంపాదిస్తున్నారు అని ఆలోచిస్తూ కూర్చుంటే మనకి కడుపు మంట, కడుపులో మంట తప్పితే లాభమేముందండీ… ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది. ఫారిన్‌లో వున్నా ఇండియాలో వున్నా ప్రతి మనిషీ కుడిచేత్తోనే కదా తింటాడు. అవీఇవీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి”
* * * * *
అప్పుడప్పుడే తెల్లారుతోంది. చల్లటి గాలులు మెల్లమెల్లగా వీస్తున్నాయి. ఇంటి దూలాల సందుల్లో, వాసాల ఇరుకుల్లో దాక్కుని వున్న ఊర పిచ్చుకలు కిచకిచ శబ్దాలు చేస్తున్నాయి.
దడదడమని ట్రాక్టర్లు ఇంటి ముందర వచ్చి నిలిచిన శబ్దం. అంతా గోలగోలగా ఉంది.
నిద్రబోతున్న నారాయణరెడ్డి ‘ఏమయ్యిందబ్బా’ అని ముఖానికున్న దుప్పటి తీసి చూసాడు. చిరంజీవి కంప్యూటర్ ముందర కూర్చుని మామిడి తోటల్లో అంతర పంటల సాగు గురించి వెదుకుతున్నాడు. ఈశ్వరమ్మ గాఢంగా గురకపెట్టి నిద్రపోతోంది.
బయట ఏమి జరుగుతోందో చూద్దామని ముఖం మీద నీళ్లు చల్లుకుని ఇంటి బయటికి వచ్చాడు.
ఇంటి ముందర పది ట్రాక్టర్లు నిలబడి ఉన్నాయి. ట్రాక్టర్ల నిండా ఎర్రెర్రని టమోటాలు కళకళ లాడుతూ కనిపించాయి. పండిన టమోటాలను పలమనేరు, బెంగుళూరు పట్టణాలకు తీసుకెళ్లి అమ్మడానికి వెళ్తున్నారు. ముప్పై మంది దాకా మగవారు ట్రాక్టర్ల నుండి దిగినారు.
ఎందుకొచ్చారని అడిగే లోగానే కొందరు ఇంటిలోకి వెళ్లి చిరంజీవిని ఎత్తుకొచ్చారు.
”జై చిరంజీవి… జైజై చిరంజీవి” అని అరుస్తూ ఉన్నారు.
టమోటాలతో చేసిన మాలను చిరంజీవి మేడలో వేసినారు. పలకలు కొట్టినారు, పాటలు పాడినారు, పులి అడుగులు వేసినారు, పూలు విసిరినారు, రంగురంగుల నీళ్లు చల్లినారు.
చిరంజీవిని పెద్ద బండ పైన నిలబెట్టినారు. ఆడంగిలాయన ఈలలు వేసింది వేసిందే ….
తక్కెడాయన గట్టిగా ”ఊరికి ఉపకారి బాబూ నువ్వు. ఎప్పుడూ లేనిది ఈసారి నత్తలతో యుద్ధం చేయాల్సి వచ్చింది. నత్తలవల్ల నష్టపోతున్నామని నీతో చెప్పినప్పుడు మాకు దైర్యం చెప్పినావు. ఎలా ఎదుర్కోవాలో నేర్పినావు. ఏ ఏ మందులు పిచికారీ చేయించాలో చెప్పినావు. దగ్గరుండి మందులను వాడించినావు. పొలాల చుట్టూ సున్నం వేస్తే నత్తల బాధ తగ్గుతుందని చిట్టి చిట్కాలు చెప్పినావు. ఆరుగాలం కష్ట పడిన మాకు ఖాళీ జేబులు మిగులుతాయని అనుకుంటే, మా జేబులు నిండుగా నింపుతున్నావు. ఈసారి టమోటా పంట మాకు దక్కిందంటే, ఇది అంతా నీ దయ బాబూ…. నీ పనులు కూడా పక్కన పెట్టి మా కోసం కష్టపడినావు” అంటూ పూలమాల వేసినాడు. ఎవరో దూరంగా టపాకాయలు పేల్చినారు.
చిరంజీవిని ఊరేగిస్తూ ప్రతి ట్రాక్టరు వద్దకూ ఎత్తుకెళ్ళి జేజేలు పలుకుతున్నారు. ఈ మధ్యనే పైటలేసిన ఆడపిల్లలు ఇండ్లనుంచి బయటికి వచ్చి చిరంజీవి వైపు మెచ్చుకోలుగా చూశారు.
అక్కడ గుమికూడిన ఆడవారిని చూస్తూ ఆడంగిలాయన పాట పాడినాడు.
”పట్టు చీర కట్టినావు అత్తా అత్తా
మల్లె చెండు చుట్టినావు అత్తా అత్తా
నల్ల కాటుక పెట్టినావు అత్తా అత్తా
నత్త పులుసు చేస్తావా అత్తా అత్తా”
ఆడంగిలాయన పాటకి అక్కడున్న ఆడా మగా, పిల్లాజెల్లా పడీపడీ నవ్వినారు.
ఇంతలో నారాయణరెడ్డి పక్కన వచ్చి నిలబడిన ఈశ్వరమ్మ ”ఏమండీ, మనవాడు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించి స్థిర పడి ఉంటే మనం, మన ఇంట్లో వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉండే వాళ్ళమేమో… ఇప్పుడు చూడండి…మన ఊర్లోని రైతుల ముఖాల్లో వెలుగులు….ఈ వెలుగులు మన ఊరి రైతులలోనే కాదు, వేలాది రైతులలో కూడా మన బిడ్డ వెలుగులు నింపుతాడండీ. ఎక్కడో దూరదేశాల్లో ఉద్యోగం చేస్తూ, అప్పుడప్పుడు సెల్‌లో హాయ్ హాయ్‌లు చెప్పడం కన్నా మన బిడ్డ మన దగ్గరలో ఉంటూ పదిమందికీ ఉపయోగపడితే దానికి మించిన సంతోషం మనకి ఇంకేమి ఉంటుందండీ?” అని సంతోషంగా చెప్పింది.
నారాయణరెడ్డి కన్నార్పకుండా ఊరేగింపునే చూస్తున్నాడు. ఊర్లోని అమ్మలక్కలు కంచు తట్టలో ఎర్ర నీళ్లు పోసి అందులో కర్పూరం వెలిగించి చిరంజీవికి దిష్టి తీస్తున్నారు. ఆ కర్పూరం వెలుగులో చిరంజీవి ముఖం మిలమిలా మెరుస్తోంది.
నారాయణరెడ్డి చేయి అతడికి తెలియకనే ఇంటి ముందరి గులాబీ చెట్టుకున్న పువ్వును కోసింది. కొడుకు మీదకి విసిరివేయడానికే పువ్వును కోసాడని అర్థం చేసుకున్న ఈశ్వరమ్మ ముసిముసినవ్వులు నవ్వుకొంది.
ఆర్. సి. కృష్ణ స్వామి రాజు, 93936 62821
‘స్వాతి’ వార పత్రిక 10-09-2021 సౌజన్యంతో

