శనగ రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని క్వింటాలుకు 300 రూపాయల సబ్సిడీని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, సంస్థ యం.డి. ఉదయ్ కుమార్ ప్రకటించారు. సబ్సిడీ రేపటి నుండే అమలు అవుతుందని తెలిపారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్, ఐఏఎస్, ఈ రోజు హైదరాబాద్ హాకాభవన్‌లో గల తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రాంతీయ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ యాసంగి సీజన్‌లో రైతులకు కావాల్సిన శనగ జేజి 11, జాకీ రకాల విత్తనాలను 20000 క్వింటాళ్లు అందుబాటులో ఉంచినట్లు తెలియజేశారు. రాష్ట్ర రైతాంగం ప్రయోజనాల దృష్ట్యా శనగ విత్తనాలపై క్వింటాల్‌కి రూ.300 చొప్పున తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ తరపున రాయితీ ప్రకటించినట్లు తెలియజేశారు. క్వింటాల్‌కి రూ.9000/- ధర ఉండగా, రూ.300 రాయితీతో, రైతులు రూ.8700/- చెల్లించాల్సి ఉంటుంది.
ఇంకా ఈ రబీలో రైతులకు కావాల్సిన వరి విత్తనాలు, 50000 క్వింటాళ్ల వరి కెఎన్‌ఎం1638, ఆర్‌ఎన్‌ఆర్ 15048, జెజిఎల్ 27356, యంటియు 1010, కెఎన్‌ఎం 118, జెజిఎల్ 24423 రకాల విత్తనాలను సకాలంలో రైతులకు అందుబాటులో ఉండే విధంగా వీలైనంత త్వరగా గ్రామాలకు చేర్చాలని ఆదేశించారు. ఈ సీజన్‌లో 3 లక్షల ఎకరాలకు పైగా తెలంగాణ విత్తనాలు ఇవ్వాలని, వచ్చే వానాకాలం సీజన్‌కి 15 లక్షల ఎకరాలకు విత్తనాలు అందించే విధంగా పని చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని ఆదేశించారు. పాత, మూస పద్ధతులు మానుకొని, కొత్త తరహాలో పద్ధతులు ఉపయోగించి తెలంగాణ సీడ్స్‌ని రైతులకు చేరవేయాలని, ఒకప్పటి బ్రాండ్ ఇమేజ్‌ను పునరుద్ధరించే విధంగా పని చేయాలని కోరారు. విత్తనోత్పత్తిలో రైతులను భాగస్వాములను చేస్తూ, సహకార సంఘాల ద్వారా అధిక విత్తనోత్పత్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంస్థ రాష్ట్ర మేనేజర్లు మరియు ప్రాంతీయ అధికారులు పాల్గొన్నారు.

8 Nov, 2024
